దేవర్షి నారదుడు

1 Dec, 2019 00:57 IST|Sakshi

మనందరికీ కూడా నారదుడు దేవర్షి అనీ, బ్రహ్మ మానస పుత్రుడనీ, నిరంతరం నారాయణ నామాన్నే జపిస్తూ, త్రిలోక సంచారం చేస్తూ ఉంటాడని తెలుసు. అయితే నారదుడు ఏ కృషీ లేకుండా దేవర్షి కాలేదు. అందుకు కఠోర తపస్సు చేశాడు. అదేంటో చూద్దాం. 
దేవర్షి కావడానికి ముందు ఒక దాసికి కొడుకై జన్మించాడు నారదుడు. ఆ దాసి ఒక భాగవతోత్తముడి ఇంట పని చేస్తుండేది. ఆ ఇంట సదా మునులు, జ్ఞానులు అతిథిసత్కారాలను పొందుతూండేవారు. పసివాడైన నారదుడు వారికి అవసరమైనప్పుడల్లా నీళ్ళు అందిస్తూ, సపర్యలు చేస్తూ, వారు మాట్లాడుకునే గొప్ప గొప్ప విషయాలను, విష్ణుమహిమలను శ్రద్ధగా ఆలకిస్తూండేవాడు.
తమకు ఎప్పుడూ నీరు ఇచ్చేవాడని ఆ మునిగణం ఆ పసివాడికి నారదుడు అని పేరు పెట్టి, ఎంతో ఆప్యాయంగా ‘‘నారదా!’’ అని పిలుస్తూండేవారు. అంతలో అతని తల్లి విధివశాత్తూ పాముకాటుతో మరణించింది. అంతవరకూ అతనికి తండ్రి ఎవరో, ఏమైనాడో తెలియదు. ఇప్పుడు తల్లి కూడా మరణించడంతో ఆ పసివాడు దిక్కులేనివాడయ్యాడు. ఇదిలా ఉండగా పులిమీద పుట్రలాగా కొద్ది రోజులకే ఇంటి యజమాని కూడా గతించాడు. దాంతో నారదుడు నిరాశ్రయుడై తిరుగుతూ, ఆకలితో ఏ ఇంటి ముందైనా నిలబడితే అతణ్ణి దొంగను చూసినట్టు చూసి తరిమేవారు. తండ్రి ఎవరో తెలీని పాపిష్టివాడని హీనంగా తిట్టేవారు. నారదుడు పరమసాధువు అవడం చూసి దుడుకుపిల్లలు రాళ్ళు రువ్వీ, కొట్టీ, ఏడిపించి ఆనందిస్తూండేవారు. ‘‘నేను ఈ మనుషుల్లో ఎందుకు పుట్టాను? నేనేం తప్పు చేశానని నన్నింత అన్యాయంగా చూస్తున్నారు? క్రిమి కీటకాలు, అడవులో మృగాలు హాయిగా బతుకుతున్నాయి!’’
అని అనుకుంటూ నారదుడు ఊరు విడిచి అడవి దారి పట్టాడు. అతనికి మునులు, జ్ఞానులు చెప్పుకొనే విషయాలు గుర్తుకొచ్చాయి. ‘‘నేనెందుకు తపస్సు చెయ్యకూడదు! గొప్ప పుట్టుక దేవతల్లో పుట్టాలి!’’ అని అనుకుంటూ తపస్సు మొదలు పెట్టాడు నారదుడు. ‘‘దిక్కులేనివాడికి ఎవడు దిక్కో, ఈ లోకానికంతకూ ఎవడు తండ్రో ఆయనే నాకు అన్నీ! నన్ను ఆయనేం చేసినా సరే, అంతా ఆ జగత్పిత ఇష్టం!’’ అంటూ కాల స్ఫురణ లేకుండా ఘోరమైన తపస్సు చేశాడు.
ఎన్నో పరీక్షలకు గురైన నారదుడి అచంచలమైన తపస్సు పరిపక్వమైంది. అతనిపై గొప్ప తేజస్సు పడి అతణ్ణి ఆవరించింది. జ్యోతిరూపంలో నారదుడికి సాక్షాత్కరించిన విష్ణువు, ‘‘వత్సా నారదా! నీ దృఢదీక్ష, తపస్సు నన్ను మెప్పించాయి. వీటి ఫలితంగా నీవు బ్రహ్మ మానసపుత్రుడవై జన్మిస్తావు. నీలో నా అంశ వుంటుంది. చిరంజీవిగా త్రికాలవేదివై ముల్లోకాలు తిరుగుతూ సదా నన్ను స్మరిస్తూ, నా లీలలను గానం చేస్తూ ఉంటావు. అయితే గతజన్మల కర్మ ప్రారబ్ధం కారణంగా నీకు కలహభోజనుడు అనే పేరు వస్తుంది. అయినా చింతించనక్కరలేదు. నీవు పెట్టే కలహాలన్నీ లోకకల్యాణానికే కారణాలవుతాయి’’ అని వరమిచ్చాడు. అన్నట్లుగానే నారదుడు విష్ణువులో లీనమైపోయి, అనంతరం విష్ణు అంశతో బ్రహ్మకు కుమారుడై, దేవమునిగా పూజలందుకున్నాడు. 
కష్టాలను చూసి కుంగిపోకూడదు. అవమానాలను, అవహేళనలను అసలే లెక్కచేయకూడదు. ఎన్నో సుత్తి దెబ్బలు తట్టుకున్న తర్వాత కదా, బంగారం ఆభరణంగా భాసించేది. – డి.వి.ఆర్‌. భాస్కర్‌

మరిన్ని వార్తలు