రైలు వెళ్లిపోయింది!

1 Dec, 2019 01:06 IST|Sakshi

అది 1965 సంవత్సరం. ఆలూరు హైయ్యర్‌ సెకండరీ స్కూలు విద్యార్థులం హంపీ విహారయాత్రకు బయలుదేరాం. ఆలూరు నుంచి బస్సులో బళ్ళారి చేరుకొని, అక్కడి నుంచి రైలులో హోస్పేటకు, అక్కడి నుంచి హంపీకు వెళ్లాలి అనేది ప్లాన్‌.
మా అల్లరితో రైలు బోగీ సందడి సందడిగా మారింది. నేనూ, లక్ష్మీనారాయణ అనే ఫ్రెండ్‌ డోర్‌ దగ్గర నిల్చొని బయటి దృశ్యాలను చూస్తున్నాం. ఇంతలో లక్ష్మీనారాయణ చేతికి ఉన్న గడియారం ఊడి రైల్వేట్రాక్‌పై పడింది.
ఏంచేయాలి?
రైలు ఆగాలంటే చైన్‌ లాగాలి,  ఇదే విషయాన్ని లక్ష్మీనారాయణకు చెప్పాను. వెంటనే అతను పరుగెత్తుకు వెళ్లి చైన్‌లాగడంతో కీచుమంటూ ఆగింది రైలు. నేను, లక్ష్మీనారాయణ రైలు దిగి పడిపోయిన గడియారాన్ని వెదకడం కోసం పరుగెత్తాం.
ఎట్టకేలకు ఒక చోట కనిపించింది!
కంకరరాళ్లపై పడడంతో నొక్కు పడింది. గ్లాస్‌ పగిలిపోయింది.
‘‘హమ్మయ్య గడియారం దొరికింది’’ అనుకునేలోపు రైలు వెళ్లిపోయింది
గడియారం దొరికినందుకు సంతోషించాలో, రైలు వెళ్లిపోయినందుకు బాధ పడాలో అర్థం కాలేదు. అన్నిటి కంటే భయం....మేము అడవి మధ్యలో చిక్కుకుపోయాం.
ఏంచేయాలో తోచలేదు.
ఆతరువాత...రైల్వేట్రాకుపై నడుచుకుంటూ  హోస్పెట  వైపు బయలుదేరాం. బోగీలోని విద్యార్థులు జరిగినదంతా పిచ్చయ్య సార్‌కు చెప్పడంతో విరూపాక్షçప్ప అనే విద్యార్థికి పది రూపాయలు ఇచ్చి మా కోసం పంపించారు.
మా అదృష్టం ఏమంటే, హోస్పేటకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో రైలు దిగాం. మేము రైల్వేట్రాక్‌పై హోస్పేట వైపుకు నడుచుకుంటూ వస్తున్నాం...ఈలోపు విరూపాక్షప్ప కనిపించడంతో ధైర్యం వచ్చింది.
మేము ముగ్గురం రోడ్డు పైకి వచ్చి హోస్పేటకు  వెళుతున్న లారీ ఎక్కాం.
రైల్వే స్టేషన్‌లో తోటి విద్యార్థులందరూ  మా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయం ఎలా ఉన్నా టీచర్ల తిట్ల వర్షంలో మాత్రం బాగానే తడిచాం!
రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇప్పటికీ  ఈ సంఘటన గుర్తుకు వస్తుంది. – యస్‌.సుధాకర్‌ బాబు, నంద్యాల, కర్నూలు జిల్లా

మరిన్ని వార్తలు