ఆత్మాభిమానం ఒక వైపు ఆత్మవంచన మరొకవైపు...

16 Dec, 2018 11:20 IST|Sakshi

కవి సామ్రాట్‌ నవలకు వెండితెర రూపం ఈ చిత్రం.పాటలే కాదు మాటలు కూడా రాసి దృశ్యాలకు కవిత్వం చిలికారు సినారె. ఈ  చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...

శోభనపు గదిలో పూలు గుబాళిస్తున్నాయి. తమలో తాము గుసగుసలు పోతున్నాయి. చిన్నగా నవ్వుకుంటున్నాయి.అందాలభరిణె నవవధువు ఆ గదిలోకి వచ్చేసింది.ఏదో చప్పుడైంది.‘‘ఎవరది?’’ అన్నాడు వరుడు.‘‘నేను’’ అన్నది ఆమె సిగ్గుగా.మాటలు శృంగారాభరణాలు ధరించాల్సిన ఆ పూట వరుడి పెదాలపై వేదాంతం ప్రతిధ్వనిస్తోంది.‘‘నిన్నటి వరకు నీ వెవరో నేనెవరో’’ అన్నాడు అతడు.‘‘బతుకు బాటలో ఇద్దరినీ కలసిపొమ్మన్నది ఒక బంధం’’ అంటూ తమ వివాహబంధాన్ని గుర్తుచేయబోయే ప్రయత్నం చేయబోయింది ఆమె.‘‘అది బంధం మాత్రమే’’ తీసిపారేసినట్లుగా అన్నాడు అతడు.‘‘అనుబంధం కాదా?’’ అని అడిగింది ఆమె. అంతేకాదు కొంగులు ముడివడిన తరువాత ఏమవుతుంది ఇలా చెప్పింది.

‘‘కొందరికి మనసులు కలిసిన తరువాత మనువులు కుదురుతాయి. మరి కొందరికి కొంగులు ముడివడిన తరువాత గుండెలు కలుసుకుంటాయి. ఏమంటారు?’’‘‘ఏమంటాను. పడిన ముడి విడిపోనిదని తెలుసంటాను’’ శూన్యంలోకి చూస్తూ అన్నాడు అతడు.‘‘పోనీలెండి. ఇంటి తలుపు తెరిచి లోనికి రానిచ్చారు మీరు. ఇక మీ ఎద తలుపు తెరిచి అనురాగం అందుకోవాల్సింది నేను’’... ఆమె మాటల్లో అంతులేని ఆశాభావం!∙ చెలికత్తె చంపమాల  ఆ తోటలో అదేపనిగా ఏడుస్తోంది.‘‘అదేమిటి! ఏడుస్తున్నావెందుకు? పొద్దున్నే పూలను చూస్తూ ఏడుస్తావెందుకు?’’ అని ఆరాతీశాడు భటుడు.‘‘ఏడ్వక ఏంచేయమంటారు? అమ్మగారి పడగ్గదిలోని ఈ పూలు ఉన్నవి ఉన్నట్లే ఉన్నాయి!’’ ఏడుస్తూనే సమాధానం చెప్పింది ఆమె.‘‘ఉంటే మాత్రం’’ ఆశ్చర్యపోయాడు భటుడు.‘‘ఏడ్వక ఏంచేయమంటారు’’ పాతపాటే అందుకుంది చంపకమాల.‘‘అది కాదు బాలా...’’ ఏదో చెప్పబోయాడు భటుడు.‘‘నా పేరు బాలా కాదు చంపకమాల’’ అన్నది ఆ చిన్నది.‘‘చంపకమాల ఇలా చంపకు మాల...ఇంతకీ మీ అమ్మగారికి ఈ పెళ్లంటే ఇష్టం ఉందా?’’ సూటిగా అడిగాడు భటుడు.‘‘ఎవరన్నారు? ఇష్టం లేనిది మీ అయ్యగారికే’’ కోపం అన్నది ఆమె.
∙∙ 
‘‘విధి నిర్ణయమైపోయింది. ఆనాడే అయిపోయింది. ఇప్పుడు గతానికి వగచి ప్రయోజనం లేదు’’ కుమారుడితో అన్నాడు మహారాజు.‘‘అది నాకూ తెలుసు. అయినా మరొకరికి అర్పించిన మనసు నా ఆధీనంలో ఉంటుందా నాన్నా?’’ నిస్సహాయంగా అన్నాడు వీర.‘‘ఉండాలని చెబుతున్నాను. కోరికలు మచ్చిక చేయని గుర్రాల్లాంటివి. అదుపులో పెట్టుకోకపోతే రౌతుకు అపాయం బాబూ’’ జీవితసత్యాన్ని గుర్తు చేశాడు మహారాజు.కానీ వీరాది కోరిక కాదు...ప్రేమ!స్వచ్ఛమైన ప్రేమ... అంతస్తులను పట్టించుకోని అచ్చమైన ప్రేమ!
‘‘వలచిన హృదయం కోటి ముక్కలైనా కొట్టుకుంటూనే ఉంటుంది’’ బాధగా అన్నాడు వీర.
కొడుకు మాటలు మహారాజులో ఆందోళన రేపాయి.

‘‘ఆ మాటలు అనకు బాబు. ఒక్కగానొక్క కొడుకువి. నీ మీదే పంచప్రాణాలు పెట్టుకున్నాను. నీ మనసు కుదుటపడితేనే ఈ వృద్ధుడికి మనశ్శాంతి’’ దీనంగా అన్నాడు మహారాజు.
‘‘నన్ను అర్థం చేసుకోండి నాన్నా. నా మనసు కుదుట పడే మార్గం ఒక్కటే. అది నా ప్రాణమిత్రుడు సేతుపతి చల్లని నీడ’’ అంటూ మిత్రుడిని వెదుక్కుంటూ వెళ్లాడు వీర. ∙ 
‘‘నేను లేకుండా పెళ్లి చేసుకుందామనుకున్నావా? కళ్యాణపత్రిక అటుంచి కనీసం కాకితోనైనా కబురు పంపిచకపోయావా!’’ మిత్రుడిని నిలదీస్తున్నాట్లుగా అన్నాడు వీర.
‘‘కబురు! ఏంచూస్తావని కబురంపాలి మిత్రమా’’ నిర్వేదంగా అన్నాడు సేతు.
‘‘ఏం కళ్యాణం కన్నులపండగగా జరగలేదా?’’ అడిగాడు వీర.

‘‘ఆ కళ్యాణం లోకానికి మాత్రమే’’ మనసులో మాట ప్రియమిత్రుడికి చెప్పాడు సేతు.‘‘నీకు కాదా?! ఇంతకీ నీకు కలిగిన కొరత ఏమిటి సేతు? అడగకూడనిది అడుగుతున్నాను...ఆమె రూపవతి కాదా?’’ అడిగాడు వీర.‘‘ఆమె అందాన్ని పెళ్లిపందిట్లోనే కాదు శోభనపుగదిలో కూడా చూడలేదంటే బహుశా నువ్వు నమ్మవు వీరా’’ అని గుండెల మాటున బాధను బయటపెట్టాడు సేతు.‘‘సేతు...నీ హృదయం ద్రవించలేదా? ఆవిడ నీ అర్ధాంగి అని ఆమెకు ఆశలు ఉంటాయని, పది కాలాల పాటు పచ్చగా కాపురం చేయాలని పసిడి కలలు పెంచకుంటుందని అవి తీర్చవలసిన బాధ్యత నీదేనని విస్మరించావా?’’ బాధ్యత గుర్తు చేశాడు వీర.

‘‘చాలు వీరా చాలు. నీవు ఎవరినైనా ప్రేమిస్తే తెలిసేది...పోగొట్టుకున్న నా మనసు పొందే వేదన. వీరా! నీకు ప్రేయసి ఉండి, హృదయగవాక్షాలు విప్పి ఆమె నీకై ఎదురు చూస్తూ వసంతసుందరిలా నీ బతుకుతోటలో అడుగిడుతుంటే నీ వొడి లోపల తన నీలాల కళ్లలో నీ బొమ్మ గీస్తు ఉంటే పరవశించిన పెదవులతో నీ నుదుట ఒక చక్కని ముద్దు ముద్రిస్తుంటే తన మనసుని నీ చేతుల్లో పెట్టి తన వలపును నీ కళ్లలో నింపి తన సర్వస్వాన్ని నీ పాదాల ముందు సమర్పిస్తుంటే అప్పుడు తెలిసేది వీరా! వలచిన గుండెలో చెలరేగిన అలజడి’’

సేతు మాటలు విని తట్టుకోలేకపోయాడు వీర.‘‘చాలు సేతు చాలు!’’ అని అరిచాడు.‘‘ఆత్మాభిమానం ఒకవైపు ఆత్మవంచన మరోవైపు. తనువు ఒకచోట మనసొకచోట. ఈ విషాన్ని ఎలా దిగమింగాలి వీరా?’’ మిత్రుడి భజం మీద చేయివేసి తల్లిడిల్లిపోయాడు సేతు.‘‘అచ్చమైన ప్రేమ అలల మీద ప్రతిబింబింబే చుక్కల కాంతిలా ఉండాలి. జ్వలిస్తున్న హృదయానికి శాంతినివ్వాలి. పువ్వు వాడుతుంది. తావి వీడుతుంది’’ జీవితసత్యాన్ని చెప్పాడు వీర.‘‘కాదు వీరా! ప్రణయకుసుమం వాడదు. పరిమళం వీడదు’’ ప్రేమ గొప్పదనాన్ని చెప్పాడు సేతు.

మరిన్ని వార్తలు