బతుకాట

24 Nov, 2019 05:42 IST|Sakshi

జుజ్జూరి వేణు

కాలం మాయా స్వరూపం. అది నిరంతరం పరిణామక్రమం చెందుతూ తనతో అన్నిటినీ మార్చుతుంది. గతం వర్తమానానికి భిన్నంగా ఉంటుంది. వర్తమానం భవిష్యత్తు తిప్పే మలుపులో పరిచయాలు కలుపుతుంది. 
అయినా మనిషి గతం తాలూకు నీడల్నే వెతుక్కుంటుంటాడు.
వాస్తవానికి తల్లి గర్భం నుండే ఈ వెతుకులాట మొదలవుతుంది. ఆట నిరంతరం కొనసాగుతుంది. కొందరు ధనం కోసం, ఇంకొందరు సత్యం కోసం, ఇంకొందరు అన్నం కోసం, మరి కొందరు మరొక దానికోసం అన్వేషణ సాగిస్తారు. మంచులో బస్సు లైట్లు దారిని వెతుక్కుంటూ వస్తున్నట్లే.
శివుడి విభూదిలా మంచు కురుస్తోంది. ఆ గ్రామానికి జంగమదేవర వచ్చాడని అతడు ఇంటిముందు తొక్కిన ముగ్గులు చెబుతున్నాయి. ఏ ఇంటికీ రాకుండా వీధులెంట తన దారిన తాను తన్మయత్వంతో వెళ్ళిపోయే హరిదాసు రాలేదని మంచుసోనలకు అంటిపెట్టుకున్న గానమాలపించని గాలి చెబుతుంది.
అక్కడో ఇంటి ముందు భిక్ష స్వీకరిస్తూ పంచాక్షరీ మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ విభూతిని అందరి ముఖాలకు పెట్టి శంఖం ఊదిన శబ్దం వచ్చింది.
ఇంకా మంచాల మీద నిద్రపోతున్న వాళ్ళలో గడ్డకట్టుకుపోయిన బద్ధకం బద్దలయిపోయింది. పూజలో  కూర్చున్న వారికి ఆ ధ్వని దివ్యమంత్రం. ఆ ఇంటివారికి శుభం పలికి భోళాశంకరుడిలా బయటకొస్తున్నాడు.
 జంగాలాయన పై నుండి కిందికి అంగరఖాను తొడిగి తలకు తలగుడ్డ మెడకు పొడవాటి అంగవస్త్రాన్ని ధరించి, ముఖానికి విభూతి రేఖలు పూసుకుని ‘సాంబసదాశివ సాంబసదాశివ’ అని పాడుకుంటూ మరో ఇంటి ముంగిటకెళుతున్నాడు.
ఓరవాకిలిగా మూసిన తలుపు సందులోంచి సంతోషంలా వెలుతురు చొరబడుతోంది. ఊరంతా తిరిగాక చివరి ఇల్లు దగ్గరకొచ్చి అరుగు మీద కూర్చున్నాడు జంగాలాయన. గోడ పక్కన బావి దగ్గర వేపపుల్లతో పళ్ళు తోముకుని ముఖం కడుక్కుని వెనక్కి తిరిగి చూసిన నారాయణదాసుకు తన ఇంటి అరుగు మీద కూర్చున్న జంగాల నాగేశ్వరరావు కనబడ్డాడు.
‘‘ఏమోయ్‌ నాగేశ్వర్రావు ఇప్పుడేనా రావడం!’’ అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో నారాయణదాసు.
‘‘తమరు దంతాధావనం చేస్తున్నప్పుడే దిగబడ్డాను బావగారూ’’ అన్నాడు నవ్వుతూ జంగాల నాగేశ్వరరావు.
‘‘ఏమోవ్‌! మీ అన్నయ్యొచ్చాడు. రెండు టీ లు పట్టుకురా’’ అంటూ పక్కనే ఉన్న రాగి చెంబులోని నీరు గటగటా తాగాడు నారాయణ దాసు.
‘‘ఈ ఏడాది ఇక నువ్వు హరిదాసు వేషం కట్టనట్టేనా?’’ తనని ఒంటరి చేశాడన్నట్లు బాధని వ్యక్తం చేస్తూ అన్నాడు నాగేశ్వరరావు.
‘‘ఇక ఈ సంవత్సరమే కాదు. ఇక ఏ సంవత్సరమూ కుదరదురా’’ తన జీవితంలోంచి వసంతం వెళ్ళిపోయినట్టు గాద్గదికమైన గొంతుతో అన్నాడు నారాయణదాసు.
‘‘మందులేమైనా వాడుతున్నావా?’’ సంశయాత్మకంగా ప్రశ్నించాడు నాగేశ్వరరావు.
‘‘అల్లోపతి, హోమియోపతి వాడాను. ఫలితం కనిపించలేదు. ఇప్పుడు ఆయుర్వేదం మందు పుచ్చుకుంటున్నాను. పథ్యమే పరమౌషధం అన్నారని పథ్యమూ చేస్తున్నాను. తినే ప్రతి పదార్థంలోనూ ఏదో ఒక వాత గుణం ఉంటుంటే ఇంకేం గుణం కనిపిస్తుంది. నొప్పులు పదిలంగా ఉంటున్నాయి. ఏ విందు భోజనాల్లోనో పిఎల్‌ బియ్యం తిన్నప్పుడు నొప్పులు పోయి ప్రాణం లేచొస్తుందనుకో!
కీళ్ళవాతం కాటికి పోయేదాకా వదలదంటారు కదా. పైగా చలికాలం కావడం మూలాన పొద్దున లేవగానే కీళ్ళు బిగుసుకుపోతున్నాయి. దానికి తోడు వాపు. నాలుగడుగులు నడవడానికి నరకం చూస్తున్నాననుకో. అయినా మనసాగక హరిదాసు దీక్ష తీసుకుని వేషం కట్టినా బియ్యం భిక్షగా స్వీకరిస్తున్నప్పుడు కూర్చుని లేవాలి. అదిప్పుడు నావల్ల అయ్యే పనికాదు.
 హరికథలు చెబుదామన్నా జనం వాటికి రావడం మానేసి చాలా కాలం అయ్యింది. 
ఇన్నాళ్ళూ ఈ వృత్తిని కంచంలో కూడు పెడుతుందని చెయ్యలేదు. కళ బతకాలని, దానికి మరణం రానివ్వకూడదని చేశాను. కానీ ఇప్పుడా హరిదాసు వృత్తి  అంపశయ్య మీద ఉంది. అది మరణానికి భీష్ముడిలా మకర సంక్రాంతి కోసమే ఎదురు  చూస్తోంది’’ అన్నాడు నారాయణదాసు ఆర్ద్రత నిండిన గొంతుతో.
ఆ ఆర్ద్రతలో తనకి ప్రాణప్రదమైన వాటిని విడిచి పెడుతున్నప్పుడుండే ఆవేదన కనబడింది జంగాలాయనకు.
దాసు భార్య తీసుకొచ్చిన రెండు టీలు తాగుతూ నాగేశ్వరరావుకు నారాయణదాసు తన బాధ ఏకరువు పెట్టాడు.
‘‘ఇద్దరు కొడుకులదీ ఎవరి దారి వాళ్ళదయిపోయింది. పెద్దోడికి ఇద్దరూ ఆడపిల్లలే. ఇద్దరూ పుష్పవతులైతే బంతెయ్యకపోతే చుట్టు పక్కలోళ్ళు, చుట్టాలు వేగనిస్తారా! వాడెక్కడెక్కడో అప్పులు తెచ్చి కుటుంబాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నాడు.
మొన్నామధ్య పెద్దకోడలికి వాడికి మాటకు మాటొచ్చి ఆమెను కొడుతుంటే చూడలేక మీ అక్క అడ్డెళ్ళింది. పెద్దోడు విసురుగా తోసేసరికి డ్రైనేజీలో పడిపోయింది. కాలు విరిగింది. అప్పోసప్పో చేసి నాటు కట్టు వేయించాను. అసలే ఆవిడకు షుగరేమో! ఓ ఆర్నెల్లు వంటావార్పు కూడా నేనే చేసుకోవాల్సి వచ్చింది.
ఇక చిన్నాడేమో ఆర్థికంగా  కాస్త బాగానే ఉన్నా పెద్దోడి మీద వంతేసుకుని మమ్మల్ని పట్టించుకోడు. చిన్నకోడలయితే చుట్టపు చూపుగా కూడా ఎప్పుడూ రాదు. ఉపాధి హామీ పథకం పనిలో మస్తర్లు వేసేది మా మేనల్లుడే. నేను పనిచేసినా,చేయకపోయినా నాకు హాజరు వేసి పుణ్యం కట్టుకుంటున్నాడు. ఇప్పుడు వాడే నా బతుకుదెరువు’’ బరువెక్కిన కళ్ళతో తన బతుకు కథను చెప్పాడు నారాయణదాసు.
జంగాలాయన కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. నాగేశ్వరరావు ఎకరం పొలంలోంచి ఆర్‌బీ రోడ్డు పడింది. మిగిలిన పాతిక సెంట్ల పొలం కట్నంగా ఇచ్చి ఒక్కగానొక్క పిల్ల పెళ్ళి చేశాడు. అల్లుడు పట్నంలో కిరాణా షాపు నడుపుతుంటాడు. భూమి విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుందనే ఆర్థిక కోణంలో అల్లుడు దాన్ని అమ్మకుండా మామగారైన నాగేశ్వరరావుతోనే వ్యవసాయం చేయించి సగం బస్తాలు కౌలుగా జమ కట్టుకుంటాడు. మిగిలిన ఆ ఐదారు బస్తాలు నాగేశ్వరరావు దంపతులకు ఎక్కువైపోతాయి. కానీ ఏదో ఒక రోజు అల్లుడు ఆ పొలం అమ్మేసేదే అనే దిగులు ఎప్పుడూ శరీరంలో గూడుకట్టుకునే ఉంటుంది.
మూడురోజూల తరువాత....
ఉదయం బస్సు ఊరి మీదనుండి వెళుతుంటే రేగిన దుమ్మును బలిచక్రవర్తిని తొక్కిన వామనుడిలా మంచు నొక్కిపడుతోంది. రుద్రాక్ష ధారణతో వీపుకు వేలాడుతున్న గంట నడుస్తున్నప్పుడు ఆ కాలికి ఈ కాలికి తగులుతున్నప్పుడు పుట్టే లయ బద్ధమైన శబ్దానికి శంఖనాదాన్ని జత కలిపి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొస్తూ జంగాల నాగేశ్వరరావు నారాయణదాసు అరుగు మీద చేరాడు.
నెయ్యి వేసిన ముద్దపప్పుతో కూడిన అరిసెలు ఇంట్లోంచి వాళ్ళిద్దరి చేతుల్లోకి చేరాయి. అరిసెలు వాతమని తెలిసినా ఆ అమృతపు రుచి ముందు నారాయణదాసు జిహ్వ వశీకరణానికి గురయినట్టు ఆడుతుంది.
‘‘నువ్వెప్పుడొస్తావోనని ఎదురు చూసిన ఈ మూడ్రోజులు మూడు నెలలుగా గడిచాయి’’ అన్నాడు దవడలు దడదడలాడిస్తూ నారాయణదాసు.
‘‘అల్లుడు పొలం అమ్మేస్తానంటున్నాడు’’ బరువుగా పలికింది నాగేశ్వరరావు గొంతు.
కాసేపు నిశ్ళబ్దం.
అరిసె చేదుగా అనిపించింది నారాయణదాసుకి.
తింటున్న పళ్ళాన్ని గడప మీద పెట్టేశాడు.
‘‘మా నాన్న బతికున్నప్పుడు బాపనాయనలకు తప్ప అందరికీ కర్మలు చేసేవాడు. నాన్నతో నేను కూడా చెరువు దగ్గరకు వెళ్ళేవాడిని. అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులతో నాన్న పిండాలు పెట్టించేవాడు.
పిండం పెడుతుండగా గంట మోగిస్తూ నాన్న శంఖం ఊదుతుంటే జీవిత సత్యమేదో అర్థమయ్యేది. చాలా ఊళ్ళు నాన్న మీదే ఆధారపడేవి. మంచి,చెడు కార్యక్రమాలు ఏవైనా ఆయనెళ్ళకపోతే ఎక్కడివక్కడ ఆగిపోవాల్సిందే. 
జంగాల ప్రభతో పాటు ఆయన కళ్ళలో వెలుగు కూడా ఆరిపోయింది.
సంప్రదాయ వృత్తి పోయి ఎంచుకున్న ధర్మప్రచారానికి ఆదరణ సన్నగిల్లి, అర్చక వృత్తిలో స్థానం లభించక నాన్న నానా అగచాట్లు పడ్డాడు.
నాన్న చనిపోయేటప్పుడు మనేదితో మంచం పట్టాడు.
జంగాలను ఆదరించే వాళ్ళు లేకపోవడంతో ఆయన చిన్నప్పట్నుంచి జంగాలు ఎలాంటి వెలుగు వెలిగేవారో...ఊరంతా కలిసి పండుగలు ఎలా జరుపుకునేవారో చెప్పేవాడు. అవన్నీ ఇప్పుడు కళ్ళముందు కదులుతున్నాయి.
ఇప్పుడు అదే మనేది నాలో మొదలైంది.
ఆత్మ తృప్తి  అన్నిటికంటే ప్రధానం. అదిలేని నాడు మనిషి ఏది సాధించినా అసంపూర్తి జీవితాన్ని గడిపిన అనుభూతే కలుగుతుంది దాసు’’ జీరపోయిన గొంతుతో అన్నాడు జంగాల నాగేశ్వరరావు.
‘‘నిజమే నాగేశ్వరరావు హరికథలు చెప్పిన అనుభవంతో నాటకాలు వెయ్యడానికి వెళ్ళేవాడిని. ఇప్పుడు నాటకాలు చూసేవాళ్ళు కరువయిపోయారు. చూసేవాళ్ళు లేనప్పుడు నాటకాలతోనే కనుమరుగయ్యిపోయాయి నటుల జీవితాలు.
 కానీ స్టేజీపై ఉన్నంతసేపు ఎంత సంతృప్తి  ఉండేదనుకున్నావ్‌!’’
 ఓ రచయిత గారన్నట్టు ‘అవిగో వినరా చప్పట్లు ఆకలిగొన్న జీవికి అవే పంచభక్ష్య పరమాన్నాలు’ రోజుకొక్కసారైనా తిరిగి బాల్యంలోకి వెళ్ళిపోతే బాగుంటుందనిపిస్తుంది.
‘‘చిన్నప్పుడు నీకు గుర్తుందా నాగేశ్వర్రావ్‌! మునసబు గారు, కరణంగారి గొడవ. మునసబుగారేమో శైవమతాభిమాని. కరణంగారు వైష్ణవ పక్షపాతి. మునసబుగారు వీధిలో స్టేజీ కట్టించి బుడగ జంగాలతో బుర్రకథ చెప్పిస్తే ఊరు ఊరంతా వీధిలోనే ఉండేది. ఆ మరుసటిరోజు కరణంగారు రామాలయం అరుగు మీద మునసబుగారికి పోటీగా హరికథ వేయిస్తే ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేవారు.
ప్రతి ఊళ్ళోనూ ఇలాగే రెండు వర్గాల మధ్య పోటీ ఉండేది. అయితే అది ఆరోగ్యకరంగా ఉండేది. మైక్‌ సెట్టు సుబ్బారావుకు అప్పట్లో చేతినిండా పని...జేబు నిండా సంపాదనే. ఆ రోజులు వేరు బావా’’ జ్ఞాపకాలు కళ్ళనీళ్ళ రూపంలో జారిపోతుంటే వాటిని కండువాతో ఒడిసి పట్టి కళ్ళను అద్దుకున్నాడు దాసు.
‘‘అంతేనా! దాసు. ఊళ్ళో వానలు కురవడానికి గంగానమ్మకు నీళ్ళొయ్యడానికి జాతర బ్రహ్మాండంగా జరిగేది. ఊరంతా గరగలు ఊరేగిస్తూ కొట్టే డప్పుల శబ్దం నిజంగా ఆకాశానికి వినిపించేవేమో అన్నట్టు పిడుగుల్లా మోగేవి.
గంగానమ్మకు నీళ్ళొయ్యడానికి మునసబు కరణాలు కృష్ణార్జునుల్లా కలిసిపోయేవారు. వాళ్ళిద్దరు గరగల వెనుక నిలబడి ఊరంతా తిరుగుతుంటే జనం ఇళ్ళలో నుండి బయటకొచ్చి విరగబడి చూసేవారు. 
వాళ్ళిద్దరి పట్టువిడుపులు, పల్లె పచ్చదనంతో ఊరంతా నిత్యకళ్యాణం, పచ్చతోరణంలా ఉండేది. నువ్వు నేను అప్పట్లో చిన్నపిల్లలమైనా ఒకరితో ఒకరం మాట్లాడుకునే వాళ్ళం కాదు కదూ! పైగా ఒకరికొకరం ఎదురుపడితే ఆగర్భశత్రువుల్లా ఎడమొహం పెడమొహం పెట్టే వాళ్ళం.
మునసబు కరణాలని అనుకరించే వాళ్ళం. వాళ్ళు కలిస్తే మనం కలిసేవాళ్ళం. చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాళ్ళం. వీరశైవ జంగాలు వీరభద్రుని పళ్ళెం పట్టి గుండం ఏర్పాటు చేసేవారు. ఆ గుండంలో కణకణమండే నిప్పులుంటాయి. ఆ నిప్పుల గుండం దగ్గరకొచ్చిన బుడిగె జంగాలు వీరావేశంతో దక్షయజ్ఞ దండకం చదువుతూ, నారసాలను నాలుకలోకి గుచ్చుకుని ఆవేశంతో నిప్పుల్లో నడిచిపోయేవారు. అది చూసిన ఊళ్ళో పిల్లలు రెండు మూడ్రోజులు జ్వరంతో మంచం దిగేవారు కాదు.
దాసు, నాగేశ్వరావుల ఇద్దరి ముఖాలు బాల్యపు అనుభూతులతో నవ్వుల్తో మతాబుల్లా వెలిగిపోయాయి.
ఈలోగా రోడ్డుమీద ఎవరో కుర్రాడు కోడిపుంజుని సంకలో ఉంచి పట్టుకెళ్తుండడం చూసి దాసుకి కోపం నషాళానికెక్కింది.
‘‘పైత్యం కాకపోతే ఏమిటిది పిచ్చి వెధవలకి! ఎలా ఉండేది సంక్రాంతి! ఎలా చేశారు. హరిదాసులు, జంగాలు, పగటి వేషాలు, గంగిరెద్దులు, గాలిపటాలు, రంగుల ముగ్గులు, బొమ్మల కొలువులు, భోగి మంటలు, రేగి పళ్ళు ఇవేమీ లేవు. జూదాలూ, జుగుప్స కలిగించే సినిమాలూనూ. సంప్రదాయమైన కోడిపుంజు జూద వస్తువైంది.
 వీళ్ళ దృష్టిలొ  సంక్రాంతంటే ఇదే! సంక్రాంతి సంస్కృతి కాక సరదా అయిపోయింది. వీధి దారిలోంచి వెళుతున్న అతడిని చూస్తూ ఇంకా రుసరుసలాడిపోయాడు దాసు.
మార్పుకు లోనైన సమాజాన్ని, మట్టికొట్టుకుపోయిన సంప్రదాయాల గురించి దీర్ఘాలోచన చేస్తూ ఒకప్పుడు పండుగంటే ఊరొక ఉత్సవం. ఇప్పుడొక సెలవు దినం. కళలే కాదు ఆచారాలు అవసాన దశలో ఉన్నాయి. ఇక వీటిని మనమెవరం బతికించలేం బాధతో అన్నాడు దాసు.
బతికిద్దాం...మనం బతికున్నంత కాలం’’ అన్నాడు నాగేశ్వరరావు.
అర్ధం కానట్టు చూసాడు దాసు.
‘‘పేడ అలికిన వాకిళ్ళలో మనకోసం ఇత్తడి పళ్ళెంలో బియ్యం పెట్టుకుని సిద్ధంగా ఉన్నవాళ్ళున్నారు. మనం బయలుదేరాలి. వాళ్ళకోసం చలితిరిగే వీధుల్లోకి నువ్వూ–నేనూ తిరగాలి’’ ఆనందం కురుస్తున్న కళ్ళతో చెప్పాడు నాగేశ్వరరావు.
‘‘కానీ, ఈ కీళ్ళ నొప్పులతో నాకది జరిగే పనేనా’’ అంటున్న దాసు చేతిపై చెయ్యి వేసి రెండు కళ్ళు ఆర్పుతూ ఇది భగవంతుడిచ్చిన భరోసా అన్నట్లు తలాడించాడు నాగేశ్వరరావు.
జంగాల నాగేశ్వరరావు ఏదో చెప్పాక ఇదమిత్ధమని చెప్పగలిగే అశాంతి నారాయణ దాసు నుండి దూరమైంది.
ఆ తెల్లారుజామున మూసిన కిటికీలోంచి ముసుగుదొంగలా చలి చొచ్చుకొస్తుంది. హరిదాసు వస్త్రాలు, తంబురా, చిడతలు, అక్షయ పాత్ర పట్టుకుని వాకిట్లోని సైకిల్‌ తీసుకుని వీధి అరుగు మీద కూర్చుని మోకాళ్ళు మర్దన చేసుకుంటున్నాడు.
గడ్డకట్టే చలిలో గంగమ్మని నెత్తి మీద నుండి దిమ్మరించుకుని ‘హరహర మహాదేవ శంభోశంకర’ అనుకుంటూ, నంది మకుటంగా గల గంటను తీసుకుని, శంఖాన్ని సంచిలో వేసుకుని జంగాల నాగేశ్వరరావు సైకిలెక్కి దాసుని  కలుపుకున్నాడు.
గోదారి లంకలోని ఊళ్ళమీదుగా, గోదారి నది నుండి రైతుల కోసం కాలువగా మారిన గట్ల మీద నుండి ఆ రెండు సైకిళ్ళు రథాల్లాగా పరిగెడుతున్నాయి.
దాసు కీళ్ళనొప్పుల్ని ఉత్సాహం జయించింది. లంకలోని ఒక ఊరు చేరుకుని శివాలయం ముందు ఆగారు.
గుడి బయట వీధి లైటొకటి వెలుగుతుంది. చలికి మునగదీసుకుని పడుకుని ఉండడం వల్ల కోళ్ళ, కుక్కల శబ్దం వినబడడం లేదు. జరగబోతున్న అద్భుతాన్ని తిలకించడానికా అన్నట్లు అంతా నిశ్శబ్దంగా ఉంది.
నాగేశ్వరరావు తన గంటను, శంఖాన్ని, వస్త్రాల్ని నారాయణ దాసుకిచ్చాడు. దాసు తన హరిదాసు వస్త్రాల్ని, అక్షయ పాత్రను, చిడతల్ని, తంబురాను నాగేశ్వరరావుకిచ్చాడు. దాసు త్రిపుండ్రాలను నుదుటిపై ధరించాడు. నాగేశ్వరరావు తన నుదిటిపై నిలువు నామాన్ని దిద్దుకున్నాడు. ఒకరి వస్త్రాలను మరొకరు వేసుకుని, ఒకరి వస్తువుల్ని మరొకరు పట్టుకున్నారు.
ఇప్పుడు నారాయణదాసు జంగముడయ్యాడు. జంగాల నాగేశ్వరరావు హరిదాసయ్యాడు. వేషధారణ పూర్తయ్యాక ఇద్దరూ ఒకరికొకరు అబ్బురంగా చూసుకున్నారు. కాసేపు పలుకే బంగారమయ్యింది. మాటలకందని స్థితొకటి అక్కడ ఆవరించింది. ఆ దృశ్యాన్ని చూడడానికి గాలి కూడా మంత్రబద్ధమైన మహాసర్పంలా నెమ్మదించింది.
‘‘ఇక నీకు మోకాళ్ళ మీద వంగే బాధ ఉండదు దాసు...నీ బాధ నాది. నా సుఖం నీది.
ఇంటికెళ్ళాక నీకు దిష్టి తియ్యాలి ఇదంతా మాయా జంగముడి లీల’’ అన్నాడు జంగాలనాగేశ్వరరావు.
‘‘ఏ మాటకామాటే చెప్పుకోవాల్రా...నాకంటే నీకే ఈ వేషం బాగుందిరా. నన్ను మించి ఈ వేషంలో గొప్పగా ఒదిగిపోయావనుకో. కలయా వైష్ణవ మాయా’’ అన్నాడు నారాయణదాసు.
ఇద్దరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అవి కురుస్తున్న హిమం వల్లో, కరుగుతున్న హృదయం వల్లో నిర్దిష్టంగా చెప్పలేం. ఇద్దరూ శివాలయం వైపు తిరిగారు. నారాయణదాసు అక్కడున్న మారేడు చెట్టుకు నమస్కరించాడు. జంగాల నాగేశ్వరరావు రావిచెట్టుకు నమస్కరించాడు. తెల్లారుతోంది. ఇద్దరూ ఒకర్నొకరు నిమిషం కళ్ళార్పకుండా చూసుకుని బసవేశ్వరుడు, అపర నారదుల్లా కళ కోసమో, కడుపు కోసమో చెరో వీధివైపు నడిచారు.

మరిన్ని వార్తలు