దెయ్యం చెట్టు

10 Dec, 2017 00:14 IST|Sakshi

కిర్ర్‌..ర్‌..!

హైదరాబాద్‌ వరంగల్‌ హైవేలో సి.పి.ఆర్‌.ఐ. మలుపు దాటిన మూడు నిముషాలకు నారపల్లి క్రాస్‌ వస్తుంది. అక్కడి నుంచి కుడివైపు లోపలికి ఇరవై నిముషాలు నడుచుకుంటూ వెళ్తే ప్రహ్లాద్‌ ఇల్లు వస్తుంది. ప్రహ్లాద్‌ ఆఫీస్‌ జూబ్లీ హిల్స్‌లో. ఉంటున్నది ఇదిగో.. ఈ నారపల్లి క్రాస్‌ నుంచి కుడివైపు కొంత దూరం నడిచాక, కాలికి తగిలినట్లుగా వచ్చే కాలనీ లాంటి ప్రదేశంలో.
ఆఫీస్‌కి ప్రహ్లాద్‌ పగలు ఏ సమయంలో బయల్దేరినా రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి మాత్రం పన్నెండు దాటుతుంది. ఇంటికి వచ్చేటప్పటికి కాదు, ఇంటికి చేరుకోడానికి నారపల్లి క్రాస్‌కు వచ్చేటప్పటికి. ఇక అక్కడి నుంచి ఆ చీకట్లో ఒకటే నడక. ఒక్కడే నడక. దారికి రెండు పక్కల తుప్పలు, పొదలు. రెండు వైపులా అక్కడొక చెట్టు, ఇక్కడొక చెట్టు.. అలా కొన్ని చిన్న చెట్లు. వాటిల్లో ఒకే ఒక పెద్ద చెట్టు. దెయ్యంలా ఉంటుందది!

పదేళ్లు అవుతోంది ప్రహ్లాద్‌ ఫ్యామిలీ ఆ ఏరియాకు వచ్చి. ‘‘ఇంత దూరం ఎందుకండీ’’ అనలేదు ప్రహ్లాద్‌ భార్య. ప్రహ్లాద్‌కి చెట్లు, పుట్టలు అంటే ఇష్టం అని పెళ్లికి ముందే ఆమెకు తెలుసు. అరేంజ్డ్‌ మ్యారేజ్‌లో అభిరుచుల్ని షేర్‌ చేసుకుంటున్నప్పుడు ప్రహ్లాద్‌లోని పచ్చదనం బయటపడింది. ‘‘నాకూ ఇష్టమే’’ అంది. ప్రహ్లాద్‌ ఇష్టమయ్యాడు కాబట్టి, నాకూ ఇష్టమేనని ఆమె అంది కానీ, ప్రహ్లాద్‌ భార్యకు సిటీలో ఉండడమే ఇష్టం. సిటీలో పచ్చదనం ఉండకపోవచ్చు. మంచి అపార్ట్‌మెంట్‌ తీసుకుని, బాల్కనీలో రెండు మొక్కల్ని వేలాడదీసుకుంటే పచ్చదనం రావడానికి ఎంతసేపని?! ఆ మాటే ఆమె అంటే.. ‘‘అది పచ్చదనం కాదు. పాలకూర పప్పులో ఉండేది కూడా పచ్చదనమే కదా’’ అని నవ్వాడు ప్రహ్లాద్‌.సిటికీ అన్ని మైళ్ల దూరంలో ప్రహ్లాద్‌ నారపల్లినే ఎంచుకోడానికి కారణం పచ్చదనం అయితే, అతడు చెప్పే కారణం మాత్రం అక్కడ అద్దెలు తక్కువని. ఎవరో వెంచర్‌వాళ్లు ఆఫీసుకొచ్చి, సైట్‌ సీయింగ్‌కి ప్రహ్లాద్‌ని తీసుకెళ్లినప్పుడు నారపల్లి అనేదొకటి ఈ భూమ్మీద ఉందన్న సంగతి ప్రహ్లాద్‌కి మొదటిసారిగా తెలిసింది. ప్రహ్లాద్‌ని తీసుకెళ్లి చూపించినందువల్ల వెంచర్‌ వాళ్లకు ఒరిగిందేమీ లేదు. ప్రహ్లాద్‌కి మాత్రం పచ్చదనం దొరికింది. ఆల్రెడీ అక్కడ కట్టి ఉన్న ఇళ్లలో వెలుతురు బాగా వచ్చే ఒక ఇంట్లోకి వెంటనే అద్దెకు దిగేశాడు.భార్య, తను, ఇద్దరు చిన్న పిల్లలు, చుట్టు పక్కల పచ్చటి చెట్లు, వాటి మీదకు వచ్చి వాలి ఉదయాన్నే కువకువమనే పిట్టలు, డ్యూటీ అయ్యాక నడిరేయి చీకట్లో సుదీర్ఘంగా నడుచుకుంటూ ఇంటికి చేరుకోవడం.. ఇదీ పదేళ్లుగా ప్రహ్లాద్‌ పచ్చటి ప్రపంచం. ఆ నిశ్శబ్దపు  చీకట్లో దారి పక్కన పెద్ద భూతంలా కనిపించే ఆ  చెట్టును భయం భయంగానే అయినా ఒకసారి తలెత్తి చూడడం అతడి అలవాటు. మొక్కను పెంచుకున్నట్లుగా ఆ దెయ్యపు చెట్టుపై తనకు తెలియకుండానే ఇష్టం లాంటిదేదో పెంచుకున్నాడు ప్రహ్లాద్‌.  

‘‘సరే, జాగ్రత్తగా వెళ్లండి.
ఈ దారిలో దెయ్యం తిరుగుతోంది’’

దేవుడు ప్రతి మనిషికీ ఏదో ఒకటి ఇస్తాడు.. ‘ఇది నీది.. తీసుకుని సంతోషంగా’ ఉండు అని! అలా దేవుడు తనకు ఇచ్చింది.. చీకట్లో ప్రతి రాత్రీ ఒంటరిగా నడిచే ఆ ఇరవై నిముషాల నడక అని ప్రహ్లాద్‌ అనుకుంటూ ఉంటాడు. నడుస్తున్నప్పుడు ఒక్కోసారి ఏ బైకో వచ్చి, పక్కన ఆగుతుంది. ‘కాలనీ లోకే కదా.. ఎక్కు బాస్‌’ అని! నవ్వి థ్యాంక్స్‌ చెప్తాడు. అంతే కానీ బైక్‌ ఎక్కడు. నడుచుకుంటూనే వెళ్తాడు. ఓసారి బైక్‌ మీద ఇద్దరు పోలీసులు వచ్చి ప్రహ్లాద్‌ని ఆపారు. ఆ రోజైతే మరీ ఒంటి గంట దాటింది ప్రహ్లాద్‌కి అక్కడికి చేరుకోడానికి.‘‘ఎక్కడుంటారు మీరు’’ అని అడిగారు వాళ్లు. ‘‘ఇక్కడే.. ఆ కాలనీలో ఉంటాను’’ అని చెప్పాడు.‘‘ఈ టైమ్‌లో ఈ దారి వెంట వెళ్లడం మంచిది కాదు’’ అన్నాడు.. ఆ ఇద్దరిలో ఒక పోలీసు. అతడి చేతిలో టార్చ్‌లైట్‌ ఉంది.‘‘ఆఫీస్‌లో కొద్దిగా లేట్‌ అయింది’’.. చెప్పాడు ప్రహ్లాద్‌.‘‘సరే, జాగ్రత్తగా వెళ్లండి. దెయ్యం తిరుగుతోందట’’ అన్నాడు పక్కనే ఉన్న పోలీసు.ప్రహ్లాద్‌ ఆశ్చర్యపోయాడు. కానీ ఆశ్చర్యంగా చూడలేదు. అతడూ అప్పటికి కొన్నాళ్లుగా వింటూనే ఉన్నాడు. సి.పి.ఆర్‌.ఐ. మలుపులో ఆక్సిడెంట్‌ అయి చనిపోయినవాళ్లలో ఒకరు ఈ దారిలో దెయ్యమై తిరుగుతున్నారని. అతడు ఆశ్చర్యపోయింది ఎందుకంటే.. పోలీసులు దెయ్యాల గురించి మాట్లాడ్డం ఏంటని!  

ప్రహ్లాద్‌కు దేవుడిచ్చిన సంతోషాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఉదయాన్నే భార్య తన కన్నా ముందే లేచి, తను లేచిన వెంటనే కాఫీ అందివ్వడం అతడికి సంతోషాన్నిస్తుంది. కూతురు, కొడుకు స్కూల్‌కి చకచకా తయారై ‘బై.. డాడీ’ అని తన రెండు చెంపలకు అటొకరు, ఇటొకరు.. ముద్దు పెట్టి స్కూల్‌ వ్యాన్‌ దగ్గరికి పరుగులు తియ్యడం సంతోషాన్నిస్తుంది. ఆఫీస్‌లో తన పని తను త్వరగా పూర్తి చేసేయడం సంతోషాన్నిస్తుంది. అయితే అన్నిటికన్నా అతడికి ఎక్కువ సంతోషాన్నిచ్చేది మాత్రం.. రోజూ ఇంటికి వెళ్లే ఆ చీకటి దారిలో ఆ దెయ్యపు చెట్టును చూసీ చూడనట్లు చూసి దాటుకుని వెళ్లడం. దాటుకుని వెళ్లాక ప్రహ్లాద్‌ ఇక ఆ చెట్టును వెనక్కు తిరిగి చూడడు. తిరిగి చూస్తే, చెట్టు కొమ్మకు ఊగుతూ ఏ దెయ్యమో తనని చూస్తూ ఉంటుందేమోనని అతడి అనుమానం. అనుమానమే. భయం కాదు.

చాలాకాలం తర్వాత ఆఫీసులో మళ్లీ లేటయింది ప్రహ్లాద్‌కి. నారపల్లి క్రాస్‌ దగ్గరికి వచ్చేసరికి ఒంటి గంట అయింది. ఎప్పటిలా చీకట్లో ఒక్కడే నడక మొదలుపెట్టాడు. ఆ వేళ ఎందుకో ఆ దారి కొత్తగా ఉంది ప్రహ్లాద్‌కి! తనది కాని దారిలోకి వచ్చినట్లుగా ఉంది. నడుస్తున్నాడు. నడుస్తున్నాడు. నడుస్తున్నాడు. దెయ్యపు చెట్టు దగ్గరికి వచ్చేసరికి నడక వేగం తగ్గించాడు. చెట్టు ఉన్న వైపు చూశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కొన్ని క్షణాలు శిలలా స్తంభించిపోయాడు. ముందుకు మరికొంత దూరం నడిచి, ఎప్పుడూ చూడని వాడు, వెనక్కి తిరిగి చెట్టు వైపు చూశాడు. అంతే అతడి గుండె ఆగినంత పనైంది.ఆ రాత్రి బాగా జ్వరం వచ్చింది ప్రహ్లాద్‌కి. ‘చెట్టు.. చెట్టు..’ అని అతడు కలవరించడం అతడి భార్య వింది. చెట్టేమిటో ఆమెకు అర్థం కాలేదు. దెయ్యపు చెట్టు గురించి ప్రహ్లాద్‌ ఎప్పుడూ ఆమెకు చెప్పలేదు. భర్తను డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లింది. ‘జ్వరమే.. ఇంకేం లేదు’ అని మందులు రాసిచ్చాడు డాక్టర్‌. ఇద్దరూ వెళుతుంటే, మళ్లీ ఆమెను మాత్రమే వెనక్కి పిలిచి డాక్టర్‌ చెప్పాడు.. ‘ఎందుకో మీవారు బాగా భయపడినట్లున్నారు’ అని.ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రహ్లాద్‌ తన ఫ్యామిలీని సిటీలోకి షిఫ్ట్‌ చేశాడు. ఎందుకో.. ఆ దెయ్యపు చెట్టు లేని ఆ దారిని అతడు చూడలేకపోయాడు. ఇప్పటికీ ఎక్కడ రోడ్‌ వైడెనింగ్‌ అన్నా.. ఆ రోజు అకస్మాత్తుగా మాయం అయిపోయిన ఆ దెయ్యం చెట్టే గుర్తుకు వస్తుంటుంది ప్రహ్లాద్‌కి. అప్పుడు ఈ మనుషులంతా అతడికి చెట్టును పొట్టన పెట్టుకుంటున్న దెయ్యాల్లా కనిపిస్తుంటారు.

మరిన్ని వార్తలు