తెల్లమబ్బుల చాటు చంద్రుడు

14 Oct, 2018 00:25 IST|Sakshi

ధ్రువతారలు

‘ఆయన నా ఆదర్శపురుషుడు. ఎందుకంటే, భారతదేశంలో విజ్ఞానశాస్త్రం దాదాపు అంతరించిపోయిందనుకుంటున్న కాలంలో ఆయన విజ్ఞానశాస్త్రాన్ని సృష్టించారు. పరికరాలను ఉపయోగించడమే తెలియని కాలంలో ఆయనే (సైన్స్‌) పరికరాలను నిర్మించారు. రేడియో అనేది ఉనికిలోకి రాని ఆ కాలంలోనే రేడియో తరంగాల ప్రయాణం గురించిన విషయాల మీద పరిశోధన చేశారు. వృ„ý జీవశాస్త్రం అంటే ఏమిటోఎరుగని కాలంలో ఆ అంశం మీద కృషి చేశారు. జగదీశ్‌చంద్ర బోస్‌ పరమాద్భుత సృజనాత్మక మేధస్సు కలిగినవారు.’భారతరత్న, ప్రధాని సలహాదారు ఆచార్య సీఎన్‌ఆర్‌ రావు మాటలివి. 2008 నవంబర్‌లో జగదీశ్‌బోస్‌ 150 జయంతిని  ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (బెంగళూరు) నిర్వహించింది. ఆ సందర్భంగా ప్రచురించిన పుస్తకానికి (రిమెంబరింగ్‌ సర్‌ జెసి బోస్‌) ముందుమాటలో ఆచార్య సీఎన్‌ఆర్‌ ఈ వాక్యాలు రాశారు. ‘అదిగో చందమామ!’ అంటూ చంటిపిల్లలకు నింగిని చూపించడంలో చూపుడు వేలు ఏ మేరకు ఉపయోగపడుతుందో, జగదీశ్‌చంద్రుడి జీవితం, కృషి, ఆధునిక విజ్ఞానశాస్త్రంలో ఆయన స్థానం, విశిష్టతలను తెలియచేయడంలో సీఎన్‌ఆర్‌ మాటలు కూడా అంతవరకే ఉపయోగపడతాయి. ఇప్పటి వాతావరణంలో కూడా జగదీశ్‌ బోస్‌ జీవితం వేనవేల వ్యక్తిత్వ వికాసాల ఆవాసం. కన్నుమూసిన తరువాత గాని వ్యక్తుల విశిష్టతను, ప్రతిభాపాటవాలను గుర్తించలేని బలహీనత భారతీయుల సహజ లక్షణమని అంటూ ఉంటారు. జగదీశ్‌ బోస్‌ విషయంలో ఇది పాశ్చాత్యులకూ వర్తిస్తుంది. ఆయన 150వ జయంతికి కేంబ్రిడ్జ్‌లోనే క్రైస్ట్స్‌ కళాశాలలో విగ్రహం ఏర్పాటు చేసి, ఒక సదస్సు నిర్వహించారు. కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలు ప్రసంగించారు. దీనికి మన ఎంఎస్‌ స్వామినాథన్‌ కూడా హాజరయ్యారు. శ్వేతజాతి శాస్త్రవేత్తలంతా జగదీశ్‌బోస్‌ నోబెల్‌ పురస్కారం అందుకోలేనందుకు విచారం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆయన నోబెల్‌ బహుమానం అందుకోలేకపోయారా? అందకుండా చేశారా? 
జగదీశ్‌బోస్‌ (నవంబర్‌ 30, 1858– నవంబర్‌ 23, 1937) అవిభక్త బెంగాల్‌లోని మైమెన్‌సింగ్‌ (ఇప్పుడు బంగ్లాలో ఉంది) అనేచోట పుట్టారు. తండ్రి భగవాన్‌చంద్ర బోస్‌. తల్లి భామాసుందరీదేవి. తండ్రి బ్రిటిష్‌ ప్రభుత్వోద్యోగి. కానీ ఆ కాలంలో చాలామంది విశ్వసించినట్టు అక్షరాభ్యాసం కూడా ఆంగ్లంలో జరిగితేనే భావి భారత పౌరుల బతుకులకు నిజమైన సార్థకత చేకూరుతుందని భగవాన్‌ చంద్ర మాత్రం విశ్వసించలేదు. మాతృభాషలోనే ప్రాథమిక విద్యను బోధించడం అవసరమని నమ్మారాయన. అలాగే కొడుకు చేత విద్యాభ్యాసం చేయించారు.

 మూడు అంశాలు జగదీశ్‌ భవిష్యత్తును నిర్దేశించాయని అనిపిస్తుంది. అవి– ఆయన కలకత్తాలోని సెయింట్‌ జేవియర్‌ కళాశాలలో చదివారు.  భౌతికశాస్త్రం చదవమని అక్కడే రీడర్‌గా పనిచేసిన ఫాదర్‌ లెఫాంట్‌ సలహా ఇచ్చారు. నా నగలు అమ్మయినా డబ్బు ఇస్తాను, ఇంగ్లండ్‌ వెళ్లి చదువుకోమని తల్లి ఇచ్చిన భరోసా. ఇంగ్లండ్‌ వెళ్లిన తరువాత కేంబ్రిడ్జ్‌లోని క్రైస్ట్స్‌ కళాశాలలో చదువుకునేందుకు విద్యార్థి వేతనం మంజూరు కావడం. ఐసీఎస్‌ పరీక్ష కోసమే ఆయన ఇంగ్లండ్‌ వెళ్లారు.  కానీ వైద్య విద్యలో చేరారు. ఇందుకు తండ్రి ఇచ్చిన సలహా కారణం కావచ్చు. నీ మీద అజమాయిషీ లేని వృత్తిని ఎంచుకోమని ఆయన కొడుక్కి చెప్పారు. అందుకే ఆంగ్ల సామ్రాజ్యంలో ఉద్యోగి కావడం ఎందుకని వైద్యవిద్యలో చేరారు జగదీశ్‌బోస్‌. కానీ  ఒక్క సంవత్సరంతోనే చదువు ఆగిపోయింది. కారణం– అనారోగ్యం. శవాలను కోసేటప్పుడు వచ్చే వాసన, ఆ గదిలో ఉండే వాతావరణం ఆయనకు సరిపడలేదు.  తరువాతనే క్రైస్ట్స్‌ కళాశాలలో జీవశాస్త్రం చదివారు. 1885లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత కలకత్తాలోనే ప్రెసిడెన్సీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. జగదీశ్‌ బోస్‌కు ఉద్యోగం ఇవ్వవలసిందంటూ వైస్రాయ్‌ నుంచి ఆ కళాశాలకు సిఫారసు వెళ్లింది. అప్పుడే పదవీ విరమణ చేస్తున్న రిప్ప¯Œ  ఆర్థిక సలహాదారు హెన్రీ ఫాసెట్‌ ద్వారా ఇది జరిగింది. ఇక తప్పక ఉద్యోగంలో చేర్చుకున్నారు.  కానీ అప్పుడు పనిచేస్తున్న శ్వేతజాతి బోధనా సిబ్బందికి ఇస్తున్న జీతం కాకుండా, అందులో సగమే ఇస్తానంది బెంగాల్‌ ప్రెసిడెన్సీ ప్రభుత్వం. అయినా ఉద్యోగంలో చేరారు జగదీశ్‌ బోస్‌. కానీ జీతం నిరాకరించారు. మూడేళ్ల తరువాత తప్పని పరిస్థితులలో ఆంగ్లజాతి బోధనా సిబ్బందితో సమానంగా వేతనం సవరించడమే కాకుండా, పాత బకాయి కూడా చెల్లించారు. అనంతర కాలాలలో భారతదేశ శాస్త్ర పరిశోధనకు ఎనలేని సేవలు అందించిన శాస్త్రవేత్తలు సత్యేంద్రనాథ్‌ బోస్, మేఘనాథ్‌షా ఇక్కడే జగదీశ్‌బోస్‌ శిష్యులు. 

తన పరిశోధనా వ్యాసంగాన్ని ఉద్ధృతం చేయాలని 1894లో జగదీశ్‌ బోస్‌ నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రెసిడెన్సీ కళాశాలలోనే ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ కళాశాలలో అప్పటికి ప్రయోగశాల లేదనుకుంటే పొరపాటు. ఉంది. కానీ అందులోని అన్ని విభాగాలలోకి భారతీయులకు ప్రవేశం మాత్రం ఉండేది కాదు. అందుకే తనకంటూ 24 చదరపు అడుగుల స్థలంలోనే అయినా ఆయన అక్కడే ప్రయోగశాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రయోగశాలను ఏర్పాటు చేయడానికి ఎంతమాత్రము చాలని స్థలమది. అది కూడా స్నానాల గది పక్కన. నిజం చెప్పాలంటే జగదీశ్‌ బోస్‌కు పరిశోధన, విజ్ఞానశాస్త్రం అంటే ఒక మత్తు. అందుకే ఇలాంటివేమీ ఆయన పట్టించుకోలేదు. ఒక పక్క బోధన సాగిస్తూనే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమేగ్నెటిక్‌ వేవ్స్‌ మీద దృఢ దీక్షతో పరిశోధనలు చే శారు.

అనుభూతులు, ఆనందం, బాధ, విచారం మనుషులకేæ కాదు... మొక్కలకీ, చెట్లకీ కూడా ఉంటాయి అని తేల్చారు జగదీశ్‌. అవి రాత్రివేళల్లో నిద్రపోతాయి. వేకువనే మేల్కొంటాయి. మన పరిసరాలలో ఉన్న మొక్కలు ఒకదానికొకటి సమాచారం అందించుకుంటాయి. ఎటొచ్చీ దానిని మనం సరిగ్గా కనిపెట్టలేం అంతే. ఇదీ జగదీశ్‌ బోస్‌ సిద్ధాంతం.  ‘చెట్లకి కూడా మనలాగే ప్రాణం ఉంటుందని మొదట్లో నాకూ తెలియదు. అవి కూడా ఆహారం తీసుకుంటాయి. ఎదుగుతాయి. లేమిని ఎదుర్కొంటాయి. బాధనీ, విచారాన్నీ అనుభవిస్తాయి. అవి కూడా పరస్పరం సహకరించుకుంటాయి. మైత్రిని పెంచుకుంటాయి. సంతానం కోసం త్యాగాలు చేస్తాయి కూడా.’ (‘రిసెర్చెస్‌ ఆ¯Œ  ఇరిటబిలిటీ ఆఫ్‌ ప్లాంట్స్‌’) అని రాశారు జగదీశ్‌. అలా విజ్ఞానశాస్త్రంలో ఒక కొత్త పరిశోధనా స్రవంతిని ఆవిష్కరించారాయన. మొక్కలకు ప్రాణం ఉంటుందన్న మహోన్నత సత్యాన్ని లోకానికి తెలియచేయడానికి ఆయన కనుగొన్న పరికరం క్రెస్కోగ్రాఫ్‌. విషపూరిత బ్రొమైడ్‌ ద్రావణంలో ఒక మొక్కను ఉంచి, దీపంతో చిన్న స్పాట్‌ను వేసి, పొగ నింపిన పళ్లెంలో (స్క్రీన్‌) ఆ మొక్క అనుభవిస్తున్న  మరణ బాధను ఆయన కలకత్తా టౌన్‌హాలులో ప్రయోగం ద్వారా ప్రదర్శించారు.  ఈ ప్రయోగంతో ఒక ఎలుక మరణబాధ దృశ్యం వీక్షకుల కళ్ల ముందు కదిలింది.  ప్లాంట్‌ ఎలక్ట్రోఫిజియాలజీ మీద కూడా ఆయన పరిశోధనలు చేశారు. 

ప్రెసిడెన్సీ కళాశాలలోని తన పరిమిత పరిశోధనాలయంలో చేసిన కృషితో జగదీశ్‌బోస్‌ ఒక పరికరాన్ని కనుగొన్నారు. దాని పేరే కొహెరర్‌. ఇది రేడియో తరంగాలను గుర్తిస్తుంది. అంటే ఇదొక డిటెక్టర్‌. మెర్క్యురీ కొహెరర్‌ అని పిలిచే ఈ పరికరాన్ని (టెలిఫోన్‌ రిసీవర్‌తో సహా) ఆయన కనుగొన్నారు. హెర్టిజియన్‌ తరంగాల మీద జగదీశ్‌ చేసిన పరిశోధన విజ్ఞానశాస్త్రంలో ఒక మలుపు. వైర్‌లెస్‌ వ్యవస్థ ద్వారా సమాచారాన్ని పంపిణీ చేసేందుకు ఈ తరంగాలను ఉపయోగించుకోవచ్చునని ఆయన ఆనాడు ఊహించారు. దాని ఫలితమే ఈ ప్రయోగం. హెర్టిజియన్‌ తరంగాలను కోహెరర్‌ పరికరం గుర్తిస్తుంది.  ఆ పరికరాన్ని కనుగొన్న 1895లోనే కలకత్తాలో గవర్నర్‌ సమక్షంలో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు జగదీశ్‌. తాను ప్రయోగం చేసిన చోటు నుంచి 75 అడుగుల అవతల ఉన్న మరొక గదిలో ఏర్పాటు చేసిన గంట మోగేటట్టు, తుపాకీ మందు  పేలేటట్టు ఆయన తరంగాలను పంపించారు. మధ్యలో గోడలు ఉన్నప్పటిMీ  తరంగాలతో చేసిన ఈ ప్రయోగం విజయవంతమైంది. తనకున్న పరిమిత వనరులతోనే ఆయన ఈ పరికరాన్ని కనుగొన్నారు. ‘సంకేతాలను ఒక మైలు దూరం వరకు జేసీ బోస్‌ పంపించారు’ అని 1896లో డైలీ టెలిగ్రాఫ్‌ రాసింది కూడా. 1897లో లండన్‌లోని రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా మరొక ప్రదర్శన జరిగింది. కానీ చాలామంది పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం పట్ల పెదవి విరిచారు. వివాదాలు లేవనెత్తారు. ఈ అంశంలో జగదీశ్‌ ఏకాకి అయ్యారు. అయినా వారిని ఎదిరించి పోరాడారు. ఈ విషయంలో ఆయనకు బాసటగా మళ్లీ ఒక ఆంగ్ల మహిళేæ నిలిచారు. ఆమె సిస్టర్‌ నివేదిత. జగదీశ్‌బోస్‌ను చూసైనా భారతీయులు తాము తక్కువ వారము కాదన్న వాస్తవాన్ని గ్రహించాలని, న్యూనతా భావాన్నీ, విదేశీ వ్యామోహాన్నీ వీడాలని ఆమె హెచ్చరించారు కూడా. ఈ సందర్భంగా ఆమె రాసిన వాక్యాలు అద్భుతమైనవి, ‘ఓ భారతదేశమా! ఓ భారతమాతా! నా జాతి మీకు చేస్తున్న అన్యాయాలను ఎవరు సరిచేస్తారు? ధైర్యవంతులు, అనంత మేధాసంపన్నులు అయిన నీ పుత్రులకు జరుగుతున్న ఈ వందల వేల అవమానాలకు ఎవరు ప్రాయశ్చిత్తం చేస్తారు?’

 తన పరిశోధనాంశాలను ప్రచురించడానికి పాశ్చాత్యులు నిరాకరిస్తున్నారన్న వాస్తవం కూడా ఆయనకు తెలిసింది. ఇంక ఒక్కటే దారి. తన పరిశోధనలను పుస్తకాల ద్వారా ప్రపంచానికి తెలియచేయాలి. ఈ కృషిలో ఆయనకు నివేదిత సహకరించారు. ‘లివింగ్‌ అండ్‌ నాన్‌ లివింగ్, ప్లాంట్‌ రెస్పాన్స్, కంపారిటివ్‌ ఎలక్ట్రో ఫిజియాలజీ అనే పుస్తకాలను రచించడంలో జగదీశ్‌ బోస్‌కు నివేదిత ఎంతో సహకరించారు. వ్రాతప్రతులను పరిశీలించి, అవసరమైతే సరిచేయించేవారు.  రాసిన పుస్తకాలను అచ్చు వేయడానికి అవసరమైన డబ్బును కూడా సమకూర్చేవారు. రేడియో తరంగాల ప్రసారం గురించిన ప్రయోగానికే 1909లో నోబెల్‌ పురస్కారం వచ్చింది. అయితే జేసీ బోస్‌కు కాదు, మార్కోనీకి. బోస్‌ 75 అడుగుల అవతల ఉన్న గదిలోకి ఈ తరంగాలను పంపించారు. మార్కోనీ ట్రాన్స్‌ అట్లాంటిక్‌ రేడియో కమ్యూనికేషన్‌ ద్వారా 2000 మైళ్లు (యూకే లోని పొల్ధు నుంచి, న్యూఫౌండ్‌ల్యాండ్‌ వరకు) రేడియో సంకేతాలను పంపించారు. 1901లో జరిగిన ఈ ప్రయోగానికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. మార్కోని పేటెంట్‌ హక్కులు తీసుకున్నాడు. నోబెల్‌ పురస్కారం మార్కోనీ అందుకున్నా, ఈ తరంగాలను కనుగొన్న ఘనత ముమ్మాటికీ బోస్‌దేనని పలువురి వాదన. ఇందులో జరిగిన మతలబును మొదట వెల్లడించినవారు ఇటలీకి చెందిన ప్రొఫెసర్‌ ఎ. బాంటి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్స్‌ సంస్థ ప్రచురించిన పత్రాల సంకలనంలో (వాల్యూమ్‌ 80, 1998) ఈ విషయాన్ని వెల్లడించారు. రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ అంశం మీద ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు ఆ సభలో మార్కోనీ కూడా ఉన్నాడన్నది మరొక వాదన. 

స్వామి వివేకానంద, రవీంద్రనాథ్‌ టాగూర్, సిస్టర్‌ నివేదితలతో జగదీశ్‌ బోస్‌ అనుబంధం అనిర్వచనీయమైనది. 1900 సంవత్సరంలో పారిస్‌లో అంతర్జాతీయ భౌతికశాస్త్ర కాంగ్రెస్‌ జరిగింది. దీనికి జగదీశ్‌కు ఆహ్వానం వచ్చింది. రెస్పాన్స్‌ ఆఫ్‌ ఇనార్గానిక్‌ అండ్‌ లివింగ్‌ మేటర్‌ అన్న అంశం మీద ఆయన పత్రం సమర్పించవలసి ఉంది. ఈ సమావేశానికి వివేకానంద, సిస్టర్‌ నివేదిత కూడా హాజరయ్యారు. ఆ తరువాతే ఎప్పుడో భౌతికశాస్త్రంలో  చేసిన ప్రయోగాల ఫలితాల మీద పేటెంట్‌ హక్కు తీసుకోమని వివేకానంద సలహా ఇచ్చారు. ఆ సలహాను జగదీశ్‌ పాటించలేదు. 1904లో అమెరికాలోని పేటెంట్‌ హక్కుల కార్యాలయం నుంచి కూడా ఇలాంటి సూచనే వచ్చింది. కానీ జగదీశ్, ‘మేధో సంపదను వ్యక్తుల సొంతం చేయకూడదు’ అని సమాధానం ఇచ్చారు. 1914 నాటికి మొత్తానికి మెయిదావేల్‌లో బోస్‌ సొంతంగా ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసుకున్నారు.   ‘నెర్వస్‌ మెకానిజం ఇన్‌ ప్లాంట్స్‌’ అన్న గ్రంథాన్ని జగదీశ్‌ ‘ఆజీవనకాల మిత్రుడు’ రవీంద్రుడుకి అంకితం ఇచ్చారు. టాగూర్‌ రెండో కుమార్తెకు శ్వాస కోశ సంబంధ వ్యాధి వచ్చింది. దీనితో ఆక్సిజన్‌ను ఓజోన్‌గా మార్చే ఒక పరికరాన్ని (ఎలక్ట్రిక్‌ స్పార్క్స్‌తో పనిచేస్తుంది) తయారు చేసి ఇచ్చారు. ‘కల్పన’ అనే పత్రికకు రాసిన ఒక కవితలో టాగూర్‌ ఇలా రాశారు, ‘ఓ నా మిత్రుడా! పశ్చిమంలోని విజ్ఞానశాస్త్రమనే దేవాలయం మొదలు, ఇండస్‌ వరకు నీవు విజయమనే మాలను గెలుచుకున్నావు. దానిని నీ పేద తల్లి శిరస్సున అలంకరించావు. ఇవాళ నీ తల్లి తన అశ్రువులనే మాటల రూపంలో ఆశీర్వచనాలుగా పంపించింది..... ఆ మాటలు నీ చెవికి మాత్రమే చేరతాయి....’ జగదీశ్‌చంద్ర కేవలం శాస్త్రవేత్తకాదు. వలస పాలన నాటి చీకటియుగంలో ఆయనొక వెలుగురేఖ. ఆత్మగౌరవానికి చిరునామా.  జగదీశ్‌బోస్‌ ప్రతిభ అమోఘం. ఆయన భౌతికశాస్త్రవేత్త. జీవశాస్త్ర నిపుణుడు. వృక్షశాస్త్రజ్ఞుడు. జీవభౌతిక శాస్త్రవేత్త. పురావస్తుశాస్త్రవేత్త. బెంగాలీ సాహిత్యంలో సైన్స్‌ ఫిక్షన్‌ రాసిన తొలి రచయిత. ‘పలాతక్‌ తుపాన్‌’ (పలాయనం చిత్తగించిన తుపాను) బెంగాలీలో వెలువడిన తొలి సైన్స్‌ ఫిక్షన్‌. దీని రచయిత జగదీశ్‌ బోస్‌. తమ పూర్వీకులు చేసిన పనికి కాబోలు, వలస పాలనా కాలంలో జగదీశ్‌ చంద్రుడిని మబ్బుల చాటున దాచేసిన శ్వేతజాతి చిన్నపాటి పరిహారం చేసుకోవాలని అనుకుంది కాబోలు. చంద్రమండలంలో 90 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఒక బిలానికి జగదీశ్‌చంద్ర బోస్‌ అని పెట్టారు. 
- డా. గోపరాజు నారాయణరావు 

మరిన్ని వార్తలు