ఇప్పటికీ లండన్‌ భామే!

10 Dec, 2017 01:11 IST|Sakshi

కత్రినా కైఫ్‌ ఇండియన్‌ కాదు. హిందీ రాదు.హిందీ సినిమా ఎలా ఉంటుందో కూడా తెలీదు.ఇలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌తో ఇంకెవరైనా ఇండస్ట్రీకి వచ్చి ఉంటే అసలు నిలబడేవారో.. కాదో.. కానీ కత్రినా మాత్రం దశాబ్దానికి పైగా టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఎలా? ఇలా..

ఇప్పటికీ లండన్‌ భామే!
కత్రినా కైఫ్‌ పుట్టింది హాంగ్‌కాంగ్‌లో! పెరిగిందంతా లండన్‌లో. కత్రినా తండ్రి మొహమ్మద్‌ కైఫ్‌ లండన్‌లో ఓ బిజినెస్‌మేన్‌. ఆయన మూలాలు భారతదేశంలోనే ఉన్నా, సిటిజన్‌షిప్‌ మాత్రం అక్కడిదే! కత్రినా సిటిజన్‌షిప్‌ కూడా ఇంగ్లండ్‌దే! కత్రినా ఇండియన్‌ సినిమాలో నటిగా స్థిరపడి దాదాపు 14 సంవత్సరాలైనా ఆమె
ఇప్పటికీ అక్కడి సిటిజనే! నేటికీ ఈ లండన్‌ భామ ఇండియాలో వర్కింగ్‌ వీసా మీదే పనిచేస్తోంది.

‘ఇదేం యాక్టింగ్‌?’
లండన్‌లో మోడల్‌గా పనిచేస్తున్న రోజుల్లో కత్రినా కైఫ్‌కు బాలీవుడ్‌లో నటిగా అవకాశం వచ్చింది. బూమ్‌ (2003) అనే సినిమా అది. రిలీజ్‌ తర్వాత డిజాస్టర్‌ అయింది. సినిమా ఫ్లాప్‌ అవ్వడం కంటే కూడా కత్రినా కైఫ్‌ నటనకు వచ్చిన రెస్పాన్స్‌ ఆమెను తీవ్రంగా నిరాశపరచింది. ‘ఇదేం యాక్టింగ్‌?’ అని అందరూ ట్రోల్‌ చేశారు. ఆ తర్వాత సినిమాలకూ అదే రెస్పాన్స్‌. సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించాక కూడా, కత్రినా ఈ విమర్శలను అలా ఎదుర్కొంటూనే వచ్చింది. 2010లో వచ్చిన ‘రాజ్‌నీతి’ సినిమాతో మాత్రం కత్రినా నటిగా ఒక పేరు తెచ్చుకుంది. ఇప్పుడిప్పుడే మొదట్లో తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్తోంది కత్రినా.

బాయ్‌ఫ్రెండ్స్‌ టు ఫ్రెండ్స్‌..
బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్, కత్రినా కైఫ్‌లకు కొన్నేళ్లపాటు సూపర్‌ జోడీ అన్న పేరుండేది. ఎక్కడ చూసినా ఈ ప్రేమ పక్షుల కథలే వినిపించేవి. వీరిద్దరూ కనిపిస్తే అది వార్తే! అలాంటి ప్రేమికులు ఏవోగొడవలొచ్చి విడిపోయారు. సల్మాన్‌ ఖాన్‌తో విడిపోయాక కూడా కత్రినా కైఫ్‌ ఆయనతో ఫ్రెండ్‌గా మాత్రం కొనసాగింది. ఇద్దరూ కలిసి సినిమాల్లో నటించారు కూడా! ఇక కొద్దికాలంగా రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమలో ఉన్న కత్రినా ఈ మధ్యే బ్రేకప్‌ చెప్పేసింది. రణ్‌బీర్‌తో కూడా విడిపోయాకా ఫ్రెండ్‌గానే కొనసాగుతోంది కత్రినా. తన పర్సనల్‌ విషయాలగురించి అడిగితే నవ్వి ఊరుకుంటుంది ఆమె. ‘ఇప్పటికైతే సింగిల్‌’ అని మాత్రం చెప్పింది మొన్నీమధ్య.

అమ్మే ధైర్యం!
కత్రినా కైఫ్‌ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. కత్రినా పెరిగిందంతా తల్లితోనే! ‘‘ఫ్రెండ్స్‌ అంతా వాళ్ల నాన్నల గురించి చెప్తూంటే నాకు ఎలాగో ఉండేది. అంతవరకే. జీవితంలో ఇది లేదని నేనెప్పుడూ బాధపడలేదు. అమ్మ నాకు అన్నీ ఇచ్చింది.’’ అంటుంది కత్రినా. తల్లి సుజాన్నె టుర్కొటెపై కత్రినాకు ఉన్న ప్రేమ అది. కత్రినా తల్లి తన జీవితాన్నంతా సమాజ సేవకే అంకితమిచ్చింది. ఆడపిల్లల చదువుకు, పుట్టగానే తల్లిదండ్రులు వదిలేసిన ఆడపిల్లలను ఆదుకోవడానికి ‘రిలీఫ్‌ ప్రాజెక్ట్స్‌ ఇండియా’ ట్రస్ట్‌ పేరుతో ఆమె సేవలు అందిస్తోంది. ‘‘నాకు ఇన్ని ఇచ్చిన అమ్మకు నేను ఇవ్వగలిగింది ఏదైనా ఉందంటే, తన ఆశయం కోసం పనిచేయడమే’’ అంటుంది కత్రినా. ఆ మాట ప్రకారమే వీలు
చిక్కినప్పుడల్లా రిలీఫ్‌ ప్రాజెక్ట్స్‌ ఇండియా కోసం కష్టపడుతోంది.

మన మల్లీశ్వరి..
బాలీవుడ్‌ ఎంట్రీతోనే ఫ్లాప్‌ తెచ్చుకున్న కత్రినా,తెలుగులో మాత్రం ఎంట్రీ ఇస్తూనే మల్లీశ్వరి (2004)అనే కామెడీ సినిమాతో హిట్‌ కొట్టింది. వెంకటేశ్‌ ఈ సినిమాకు హీరో. మల్లీశ్వరి తర్వాత ఆ వెంటనే బాలకృష్ణతో అల్లరి పిడుగు (2005) అనే సినిమాలో కనిపించిన కత్రినా, మళ్లీ తెలుగు సినిమా వైపు చూడలేదు. ఈ రెండు సినిమాల్లోనూ ఆమె నటనకు పెద్దగా పేరేం రాలేదు. 

మరిన్ని వార్తలు