చీమా! చీమా! ఎందుకేడ్చావ్‌?

24 Nov, 2019 06:05 IST|Sakshi

ఆ చిట్టడవిలో ఒకానొక రోజున ఒక చిన్న చీమ భోరున ఏడుస్తుండటం రావి చెట్టుమీదున్న పావురం కంటపడింది. వెంటనే చీమ ముందు వాలి ‘చీమా!చీమా! ఎందుకేడుస్తున్నావ్‌?’ అని జాలి చూపుతూ అడిగింది.
‘మరేమో! మా చీమలను అనరాని మాటలంటే ఏడుపు కాక మరేమొస్తుంది?’ అని వెక్కుతూనే జావాబిచ్చింది చీమ.
‘ఐనా మీరు చేసిన అపకారమేంటి కనుక? మిమ్మల్ని నిందించటానికి నోరెలా వచ్చింది వాళ్లకి?’ సానుభూతి చూపిస్తూ అన్నది పావురం.
‘ఎక్కడైనా బెల్లం కనిపించటమేంటి తిండికి వాచిపోయినవాళ్లలాగ పరుగుపరుగున వెళ్లి మేము తినేందుకు ఎగబడతామట! ఎవరైనా కనిపిస్తే చాలు కర్కశంగా కుట్టిపారేస్తామట! అంతేకాదు మేమేమో భయంకొద్దీ పిరికిççసన్నాసుల్లాగ ఎక్కడికి వెళ్లినా దండులా బైల్దేరతామట! విషం చిమ్మే పాములకు పుట్టలు నిర్మించి వాటి చేత జనాన్ని కుట్టిస్తున్నామట! శరీరంలో బుర్ర పెద్దదైనా మాకు జ్ఞానం శూన్యమంట! మా అంత కష్టపడేవాళ్లు మరెవరూ లేరని మాకు పొగరు అని దెప్పి పొడిచారు. మా వంశాన్ని నాశనం చేస్తారట!’ అని మళ్లా వెక్కి వెక్కి ఏడ్చేసింది.
’అయ్యో.. అదేంటి? మీలాంటివాళ్లని నోరు కడుక్కుని తిట్టింది ఎవరట? చెప్పు? తాట తీస్తా! నీకు తోడు నేనుంటా! అని నమ్మకంగా పలికింది పావురం.
‘ఎవరో తర్వాత చెబుతా! ఈ సంగతి ముందుగా మృగరాజు సింహానికి చెప్పిరా! తర్వాత అందరికీ చేరవేయి’ అనడంతోనే రివ్వుమంటూ ఎగిరివెళ్లి సింహం ముందు  వాలి..‘రాజా! మన అడవిలో చీమలకి కష్టకాలం వచ్చినట్టుంది. ఓ చిట్టిచీమ భోరుమంటూ ఏడుస్తోంది. ఎవరో ఏదో వాగారంట! ఈ విషయం మీకు చెప్పమన్నది’ అని వివరంగా చెప్పింది పావురం.
‘ఏం తమాషాగా ఉందా? చిన్న జీవులపై జాలిలేకుండా పెత్తనం చలాయిస్తున్నదెవరు? ఉండు నేనిప్పుడే అక్కడికి వస్తా!’ అని కళ్లు చింతనిప్పుల్లా సిద్ధమైంది సింహం.
తర్వాత పావురం ఎగురుతూ వెళ్లి.. ‘ఎలుగుమావా! మన చిట్టి చీమలకు ఆపదొచ్చింది. వాళ్లని ఎవరో ఆడిపోసుకుంటున్నారట! అంతా ఇంతా ఏడుపు కాదు. వాళ్లకి నీ సాయం కావాలని ఇలా వచ్చా!’ అని అదుర్దాగా చెప్పింది.
ఎలుగుబంటి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ‘జాలిపడాల్సిన చీమలపైన కటువుగా ప్రవర్తిస్తున్న దెవరో తేల్చుకుని వాళ్లను ఉతికి ఆరేస్తా! ఉండు ఇప్పుడే బైల్దేరతా!’ అని ఉన్నపళంగా అక్కడ్నుంచి చీమ దగ్గరకు నడిచింది.
‘ఏమిటీ! ఎన్నడూ వరి ఊసు ఎత్తని చీమలను నాశనం చేయడానికి చూస్తున్నారా? ఎవరు వాళ్లు? నరికి పోగులెడతా! పద ఇప్పుడే అక్కడికి చేరుకుంటా! పావురం రాకలోని ఆంతర్యం తెలుసుకుని ఆగ్రహంతో ఘీంకరించింది ఏనుగు.
అలా ఎగురుతూ వెళ్లిన పావురానికి కొంగలగుంపు కనిపిస్తే ఆగింది. విషయం చెబితే అది వెంటనే స్పందిస్తూ ’తమ కాయకష్టంతో కలిసికట్టుగా బతుకుతున్న జీవులని. వాళ్లని కూడా పొట్టనబెట్టుకుందామని చూస్తున్న దుర్మార్గులెవరో చెబితే మా ముక్కులతో పొడిచి పారేస్తాం’ అని చీమలకు తమ మద్దతు ప్రకటించి అటువైపు పయనమయ్యాయి.
చీమ ఏడుస్తున్న సంగతిని పావురం తనకెదురైన వాటికన్నింటికీ తెలియపరిచింది. అడవిలోని జంతువులు, పక్షులన్నింటికీ, ఒకరినుంచి ఒకరికి ఆ వార్త అలా అలా పాకింది.
అన్నీ కలిసి చీమ ఉన్న ప్రదేశానికి చేరుకున్నాయి. అప్పటికీ చీమ ఇంకా ఏడుస్తున్న శబ్దం అందరి చెవుల్లో పడింది.
‘చిట్టి చీమా! అసలు మిమ్మల్ని హింసిస్తూ అన్నేసి మాటలన్నదెవరు? ఆ పొగరుబోతుల ఆటకట్టించడానికే మేమంతా ఇక్కడ పొగయ్యాం. చెప్పు ఎవరో?’ అన్నది సింహం.
‘కష్టజీవులైన మీమీద నిందలేసిన నీచులెవరో చెబితే కుమ్మి పారేస్తాం!’ అని తన సహకారాన్ని తెలియపరచింది ఏనుగు.
‘మీలో ఐకమత్యం చూసి ఓర్వలేకనే ఎవరో మీ మీద కక్షకట్టారు. నీకేం భయం లేదు. చెప్పు? అందరం దండెత్తి ఎదుక్కొంటాం. ఊ’ అని చిందులేసింది ఎలుగు బంటి. అప్పుడే వచ్చిన చిరుతపులి చెండాడేస్తానంటూ తాండవమాడింది.
అలాగే అక్కడికి చేరుకున్న మిగతా జంతు, పక్షుల సమూహం తమ మద్దతును ప్రకటించాయి.
అందరినీ చూసిన చిట్టి చీమ ఏడుపు ఆపి.. ‘ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ అడవిలో ఉన్న మీ అందరికంటే అల్పజాతి మాది. అటువంటి మాకు నిజంగా ఏ క్షణమైనా ఆపద వస్తే.. మాకు రక్షణగా ఎవరైనా ఉంటారా అనే సందేహం ఎప్పుడూ బుర్రలో దొలుస్తూ ఉండేది. మాపై మీ అందరికీ సానుభూతి, జాలి వంటివి ఉన్నాయో లేదో అనే మీమాంస మనసులో ఉండేది.  మీ మనసులో మాకు స్థానముందో లేదో కూడా తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువైంది. అందుకే నేను ఏడ్చాను. పావురం చేత కబురుపెట్టగానే మీరంతా ఇక్కడకొచ్చార. మీరంతా మా చీమలకు ఎల్లవేళలా తోడుగా నిలుస్తారన్న విషయం మీ రాకతో అర్థమైంది. నిజానికి మమ్మల్ని ఎవరూ ఆడిపొయ్యలేదు. ఆపద కూడా వాటిల్లలేదు. అలా నిజంగానే జరిగితే మీ అందరి మద్దతు మాకు ఉంటుందో లేదోనని చిన్న పరీక్ష చేశానంతే! ఇలా చేసినందుకు మీరంతా నన్ను క్షమించాలి. మీ వ్యాపకాలన్నీ పక్కన పెట్టి మరీ హాజరైనందుకు మా చీమలన్నింటి తరపున ధన్యవాదాలు!’ అని సంతృప్తి వ్యక్తపరిచింది.
‘ఓహ్‌! చిట్టి చీమా! గట్టిదానివే! మా అందరి నైజం కనుక్కోవడానికి భలే ఎత్తు వేశావే! నిజంగా మీకు ఎప్పుడు అవసరమైనాసరే మేమంతా మీకు సహకారం అందిస్తాం సరేనా!’ అని మృగరాజు హామీ ఇవ్వడంతోనే మిగతా అన్నీ కూడా తలలూపి తమ తమ గూళ్లకు బయలుదేరాయి.

మరిన్ని వార్తలు