కలియుగ భీముడు

29 Apr, 2018 00:23 IST|Sakshi

ధ్రువతారలు

‘సాధు పథవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతర కీర్తి శ్రీ కోడి రామమూర్తి’ చింతామణి, వరవిక్రయం, మధుసేవ వంటి ప్రఖ్యాత నాటకాలు రాసిన కాళ్లకూరి నారాయణరావు అన్న మాటలివి. రామమూర్తిగారికి కాళ్లకూరి ఆప్తమిత్రులు. నిజమే, రామమూర్తి గారి కీర్తి రమ్యతరమే కాదు, విశ్వ విఖ్యాతం కూడా. కొకు గారి నవలల్లో ఒక చోట సుందరం అనే పాత్ర కోడి రామమూర్తిగారి సర్కస్‌ ప్రదర్శన గురించీ అందులో ఒళ్లు గగుర్పొడిచేటట్టు ఉండే ఆయన ప్రదర్శనల గురించీ తన్మయంగా వర్ణించి చెబుతుంది. ‘కండగలవాడే మనిషోయ్‌’ అన్న గురజాడవారి భావనకి నిలువెత్తు రూపం కోడి రామమూర్తి నాయుడు. పరతంత్ర భారతంలో బాగా వెనుకబడిన ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో పుట్టిన వ్యక్తి జాతీయ, అంతర్జాతీయ స్థాయి కీర్తి శిఖరాలకు చేరడం గమనించదగిన ప్రయాణం. కండగలిగిన మనిషి అన్న మాటకు, బలం అనే విశేషణానికి పర్యాయపదాలుగా మారిపోయారాయన. ఈ బలాఢ్యుడిని చూసి బకింగ్‌హ్యామ్‌ ప్యాలెస్‌ కూడా సంబరపడింది.గురజాడ వారు తిరగాడిన ఉత్తరాంధ్రలోనే కోడి రామమూర్తి (ఏప్రిల్‌ 1882–ఫిబ్రవరి 2,1942) పుట్టారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ఆయన స్వస్థలం. ఊరి పేరే కాదు, ఆయన ఇంటి పేరుకు కూడా ఒక ఘనత ఉంది. కోడి వంశం మల్లయోధులకు ప్రసిద్ధి. తండ్రి వెంకన్ననాయుడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు రామమూర్తి. బాల్యంలోనే కొడుకుని వెంకన్న వీరఘట్టం నుంచి విజయనగరం పంపించేశారు. కారణం చదువు.

రామమూర్తికి చదువు అబ్బలేదు. పైగా తోటి పిల్లలతో తగాదాలు ఎక్కువ. తండ్రికి చదివించాలని ఉండేది. చదువు బాధ పడలేకో, లేకపోతే తండ్రి కోప్పడడం వల్లనో మరి, ఒకసారి ఆయన వీరఘట్టం నుంచి సమీపంలోని అడవులలోకి పారిపోయారు. మళ్లీ వారానికి తిరిగి వచ్చారు. చంకలో ఓ పులిపిల్ల. పైగా ఆ పిల్లని పట్టుకుని వెళ్లి ఊరందరికీ చూపించాడు. వీధులన్నీ తిప్పాడు. ఇవన్నీ చూసే వెంకన్న విజయనగరంలో ఉన్న తన తమ్ముడు నారాయణస్వామి నాయుడు దగ్గరకి చదువు నిమిత్తం కొడుకును పంపించేశారు. నారాయణస్వామి పోలీసు శాఖలో పనిచేసేవారు. విజయనగరంలో ఉండగానే రామమూర్తికి వ్యాయామం మీద ఆసక్తి ఏర్పడింది. మల్లవిద్యలో తొలి పాఠాలు అక్కడే నేర్చుకున్నారు. అప్పుడే భారత స్వాతంత్య్ర సమర వీచికలు విజయనగరం చేరుతున్నాయి. బి. చంద్రయ్యనాయుడు అనే ఒక స్వాతంత్య్ర సమరయోధుడు గిరిజనులను సమీకరించి పోరాటానికి సిద్ధం చేస్తున్న సమయం. రామమూర్తి కూడా ఆ దశలో స్వాతంత్య్ర పోరాటం వైపు మొగ్గు చూపారు. కానీ ఆయన దృష్టి దేహ దార్ఢ్యం వైపే ఉండిపోయింది. 

పోలీసు శాఖలో ఉండడం, ఆ బాలుడి అభిరుచిని గమనించగలగడం నారాయణస్వామి చేసిన మేలు. స్థానికంగా పహిల్వాన్‌ అన్న బిరుదును సాధించిన తరువాత రామమూర్తిని పినతండ్రి మద్రాసు పంపించారు. అక్కడ సైదాపేటలోని ఒక వ్యాయామ కళాశాలలో సంవత్సరం పాటు ఆయన తర్ఫీదు పొందారు. వ్యాయామోపాధ్యాయుని సర్టిఫికెట్‌తో విజయనగరం చేరుకున్నారు. తరువాత విజయనగరం కళాశాలలో వ్యాయామోపాధ్యానిగా చేరారు. అక్కడే ఆయన ‘ప్రొఫెసర్‌ రామమూర్తినాయుడు’ అయ్యారు. పైగా అది ఆయన చదవిన విద్యా సంస్థే. ఎంతో చరిత్ర కలిగినది. రామమూర్తిగారు వ్యాయామ విద్య బోధిస్తూనే వాయు స్తంభన, జల స్తంభన విద్యను ప్రదర్శించేవారు. ఇలా వ్యాయామం, దేహ దార్ఢ్యం, యోగ విద్యలకు రామమూర్తి పరిమితమై ఉంటే ఆయన చరిత్ర ఇన్ని మలుపులు తీసుకుని ఉండేది కాదు. ఆయన తరువాతి కాలాలలో విజయనగరంలో ఒక సర్కస్‌ కంపెనీ స్థాపించారు. ఇదే ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. విజయనగరంలోనే పొట్టిపంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్‌ కంపెనీకి రామమూర్తి రూపకల్పన చేశారు. దీనికి తుని సంస్థానాధీశుని సహకారం పూర్తిగా ఉంది. 1911లో మొదటిసారి ఈ సర్కస్‌ కంపెనీ తన ప్రదర్శనలను ప్రారంభించింది. తెలుగు ప్రాంతాలలో, నిజాం రాష్ట్రంలో కొన్ని ప్రదర్శనలు ఇచ్చిన తరువాత రామమూర్తి 1912లో మద్రాసులో సర్కస్‌ను ప్రదర్శించారు. చైనా, జపాన్‌ సర్కస్‌ కళాకారులు, జంతువులతో పూర్తిస్థాయి సర్కస్‌ నడిచేది. కానీ రామమూర్తి పాత్ర దేహ దార్ఢ్యం ప్రాతిపదికగా ఉండేది. ఆయన విన్యాసాలు ప్రధానంగా బలప్రదర్శనకు సంబంధించినవే. ఊపిరి బిగపట్టి వీక్షకులు చూసేటట్టు ఉండేవి. 

రామమూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో విన్యాసాలు మరింత కఠినమైనవి. ఆయనను ఉక్కు గొలుసులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను వేగంగా నడిపించేవారు. అయినప్పటికీ అవి కదిలేవి కావు. ఏనుగును ఛాతి మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. నాటి కాలంలో పూనా నగరం విద్యకీ, కళలకీ కేంద్రంగా ఉండేది. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ ఆహ్వానం మేరకు రామమూర్తి అక్కడకు వెళ్లి సర్కస్‌ ప్రదర్శన నిర్వహించారు. రామమూర్తి ప్రతిభను చూసి విస్తుపోయిన తిలక్‌ ఆయనకు ‘మల్ల మార్తాండ’ అనే బిరుదును ఇచ్చి సత్కరించారు. ‘మల్ల రాజతిలక’ అన్న బిరుదు కూడా బాలగంగాధర తిలక్‌ ఇచ్చినదే. విదేశాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేయవలసిందని రామమూర్తిగారికి సలహా ఇచ్చినది కూడా తిలక్‌ మహరాజే. నిజాం రాజ్య రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర భాషా నిలయం నిర్వాహకులు కూడా ఆయన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఘనంగా సత్కరించి ‘జగదేకవీర’ బిరుదుతో సత్కరించారు. వైస్రాయ్‌ లార్డ్‌ మింటో కారణంగానే రామమూర్తి ఖ్యాతి దేశవ్యాప్తమైందని చెబుతారు. అంటే 1919–1920 ప్రాంతమన్నమాట. కారును ముందుకు వెళ్లకుండా గొలుసులతో పట్టి ఆపుతూ రామమూర్తినాయుడు చేసే ప్రదర్శనను మింటో చూశాడు. వైస్రాయ్‌ స్వయంగా కితాబిస్తే ఇంకేముంది? తరువాత అలహాబాద్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలో కూడా రామమూర్తి ప్రదర్శన ఇచ్చారు. అక్కడ పండిట్‌ మదన్‌మోహన మాలవ్యా ప్రశంసలు అందుకున్నారు. తిలక్‌ వలెనే మాలవ్యా కూడా విదేశాలకు వెళ్లమని సలహా ఇచ్చారు. మాలవ్యాకీ, రామమూర్తి నాయుడుగారికీ ఎందుకో గొప్ప సాన్నిహిత్యం ఏర్పడింది. తరువాతి కాలాలలో కాశీలో మాలవ్యా దగ్గర రామమూర్తిగారు సంవత్సరం పాటు అతిథిగా ఉన్నారు.

కొన్ని వందల మంది సభ్యులు ఉన్న తన సర్కస్‌ బృందంతో రామమూర్తి యూరప్‌ ఖండానికి వెళ్లారు. ఇంగ్లండ్‌ రాణి, అప్పటి రాజు ఐదో జార్జ్‌ చక్రవర్తి బకింగ్‌హ్యామ్‌ ప్యాలెస్‌ ప్రాంగణంలోనే ఈ భారతీయుడి చేత ప్రదర్శన ఏర్పాటు చేయించారు. ప్యాలెస్‌లో విందు చేసి, సత్కరించి ‘ఇండియన్‌ హెర్క్యులిస్‌’ అన్న బిరుదు ఇచ్చారు. అప్పటికే ఆయనకు కలియుగ భీమ అన్న బిరుదు ఉంది. గ్రీకు వీరుడు హెర్క్యులిస్‌ను, ప్రష్యన్‌ వీరుడు శాండోను కూడా ఆంగ్లేయులు ఆయనలో చూసుకున్నారు. ఆ బిరుదులు కూడా ఇచ్చారు. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీలలో కూడా ఆయన సర్కస్‌ ప్రదర్శనలు ఇచ్చారు. స్పెయిన్‌లో జరిగే బుల్‌ఫైట్‌లో కూడా రామమూర్తి గారికి చిన్న అనుభవం మిగిలింది. ఎద్దుతో పోరాడాలని ఆయనను కోరారు. అందులో ఆయనకు అనుభవం లేకున్నా, ఒప్పుకున్నారు. కొమ్ములు పట్టుకుని ఎద్దును నేలకు ఒంచారు. తరువాత ఆసియాలో జపాన్, చైనా, బర్మా దేశాలలో కూడా ఆయన సర్కస్‌ ప్రదర్శించారు. బర్మాలో ఆయన మీద హత్యాయత్నం జరగడంతో వెంటనే భారతదేశానికి వచ్చేశారు. బహుశా ఈర్ష్య వల్ల ఆయనను చంపాలని అక్కడి వాళ్లు అనుకుని ఉండవచ్చు. 

సర్కస్‌ ద్వారా ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు గడించారాయన. అందులో చాలా వరకు విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా భారత స్వాతంత్య్రోద్యమానికి తన వంతు ఆర్థిక సాయం చేశారు. ఒంటి నిండా శక్తి. దేశ విదేశాలలో కీర్తి. అయినా రామమూర్తినాయుడు అనే ఆ మల్లయోధుడు జీవిత చరమాంకంలో అనారోగ్యమనే సమస్యతో పోరాడాడు. బహుశా అందులో మాత్రం ఆయన అపజయం పాలయ్యారేమో! ఎందుకంటే ఆయన తుది ఘడియల గురించి పెద్దగా బయట ప్రపంచానికి తెలియలేదు. ఒరిస్సాలోని కొందరు సంస్థానాధీశుల దగ్గర ఆయన అంతిమ జీవితం గడిచింది. ఇంకా విషాదం– ఒక కాలి మీద పుండు లేచింది. అందుకు శస్త్ర చికిత్స అవసరమైంది. అప్పుడు కూడా ఆయన యోగాభ్యాసాన్ని నమ్ముకున్నారు. మత్తు మందు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. అందులో ఆయన విజయం సాధించారనే చెబుతారు. కొందరు రాసినదానిని బట్టి ఆయన కాలు తొలగించవలసి వచ్చింది. జనవరి 16, 1942లో ఆయన ఒరిస్సాలోని కలహండి సంస్థానాధీశుని పోషణలో ఉన్నప్పుడు దాదాపు అనామకంగా కన్నుమూశారు. ఆ కండల వీరుడి మిగిలిన కలల మాటేమో గానీ, భారతదేశంలోనే విశిష్టమైన వ్యాయామ విద్యాసంస్థను స్థాపించాలని కోరుకున్నారు. ఆ స్వప్నం సఫలం కాకుండానే తుది శ్వాస విడిచారు. ఆ కల నెరవేరి ఉంటే, రామమూర్తిగారి పేరు నిలిచి ఉండేది. దేశానికి క్రీడా నైపుణ్యం కలిగేది. గురజాడ అప్పారావు, ద్వారం వేంకటస్వామినాయుడు, శ్రీమజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు, సర్‌ విజ్జీ, గిడుగు రామమూర్తి పంతులు వంటివారు ఉత్తరాంధ్రకు వన్నె తెచ్చారు. ఎన్నో విశిష్టతలతో చరిత్రకెక్కిన రామమూర్తినాయుడు గారు ఉత్తరాంధ్రతో పాటు భారతదేశానికే గర్వకారణం. కలియుగ భీమ, ఇండియన్‌ హెర్క్యులిస్, శాండో, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులు సాధించుకున్న రామమూర్తిగారు పూర్తి శాకాహారి. 
∙డా. గోపరాజు నారాయణరావు 

మరిన్ని వార్తలు