బతుకు విలువ

1 Dec, 2019 01:17 IST|Sakshi

కౌలూరి ప్రసాదరావు

మాతంగ మహర్షి సంధ్యావందనం చేస్తుండగా పక్కనున్న బండ మీదికి ఒక యువకుడు ఎక్కి కళ్లు మూసుకుని, చేతులు జోడించి దైవప్రార్ధన చేయసాగాడు. అతడి వాలకం చూసిన మునికి అది భక్తి కాదు, విరక్తి అని  క్షణంలో అర్థమైంది. బతుకు చాలించటం కోసమే చివరిసారిగా దేవుడిని తలుకుంటున్నాడని గ్రహించి, నదిలో దూకబోతున్న వాడిని చటుక్కున చేయిపట్టి, వెనక్కి గుంజాడు. 
కళ్ళు తెరచిన ఆయువకుడు ’నేనింకా చావలేదా?’ అని ఆశాభంగం చెంది, రుషివైపు నిరసనగా చూశాడు.
‘‘ఎందుకు ఆపారు స్వామీ! ఈపాటికి ఈ తుచ్ఛమైన జీవితం నుండి విముక్తి పొందేవాడిని’’ అన్నాడు. మహర్షి తల అడ్డంగా ఊపి ‘‘తప్పునాయనా! దేవుడిచ్చిన జీవితాన్ని ఇలా అర్ధంతరంగా ముగించటం సరికాదు. అసలు నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు?’’ అన్నాడు ఆదరంగా.
ఆ యువకుడు కాస్త ఊరడిల్లి, కళ్ళు తుడుచుకుంటూ ‘‘నేను ఒక అమ్మాయిని ప్రేమించాను స్వామీ! ఆమెపేరు మల్లిక. కానీ ఆమె నా ప్రేమని తిరస్కరించింది. ఎన్ని ప్రయత్నాలుచేసినా, ఎంతగా ప్రాధేయపడినా ఫలితం దొరకలేదు. ఆమె ప్రేమ పొందని నా జీవితం వ్యర్ధం. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను’’ అన్నాడు.
మాతంగ మహర్షి దీర్ఘంగా నిశ్వసించి ‘‘సరే నాయనా! నీ ఇష్టప్రకారమే జరుగుతుంది. కాకపోతే నీ ప్రయత్నాన్ని సంవత్సరంపాటు వాయిదా వెయ్యి. ఎలాగూ నీ మిగిలిన జీవితాన్ని మృత్యువుకి ఊరికే ఇవ్వటానికి సిద్ధ పడ్డావు కనుక ఈ ఏడాది కాలాన్ని ఉచితంగా నాకు ఇవ్వు. అంటే నేను చెప్పినట్టు నడుచుకో. తర్వాత నీ కోరిక నెరవేర్చుకో’’ అన్నాడు.
‘‘అలాగే స్వామీ! నా లెక్క ప్రకారం నేనివాళే మరణించినట్టు. ఇక నుంచి జీవచ్ఛవంతో సమానం. మీ ఇష్టప్రకారం కానీయండి’’అన్నాడు. 
అతడి పేరూ ఊరూ వివరాలు తెలుసుకుని, అతడిని తన వెంట ఒక ఆటవిక గూడేనికి తీసుకు వెళ్ళాడు. మహర్షిని ఆటవికులు సాదరంగా ఆహ్వానించి, సకల సపర్యలూ చేశారు. వారిని దీవించిన ముని, ఆ యువకుడిని వారికి అప్పగించి, ‘‘ఇతడి పేరు ఆనందుడు. ఒక ఏడాదిపాటు మీతో కలిసి జీవిస్తాడు, నన్ను గౌరవించినట్టే ఇతడిని కూడా ఆదరించండి’’ అని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు.
మహర్షి ఆజ్ఞను శిరసావహించిన ఆటవికులు ఆనందుడిని కాలు కింద పెట్టనీకుండా, సకల సౌకర్యాలతో సేవించ సాగారు. కొన్ని రోజులు హాయిగా గడిచినా, రానురాను ఆనందుడికి తన నిష్క్రియాపరత్వం పట్ల అసంతృప్తి కలుగసాగింది. ఖాళీగా పొద్దుపుచ్చే కంటే ఏదైనా పని చేయాలనిపించింది. గూడెం పరిసరాలను, వారి దైనందిన జీవితాన్ని నిశితంగా పరిశీలించాడు. ఆటవికులు ఎక్కువగా వేటలోనూ, నిద్రలోనూ, అప్పుడప్పుడూ కొండదేవర పూజా, నాట్యాలలోనూ కాలం గడుపుతున్నారు. వారంతా అజ్ఞానంలోనూ, అభివృద్ధికి ఆమడ దూరంలోనూ ఉన్నారని గ్రహించాడు.
ఒకరాత్రి గూడెం వాసులను సమావేశపరచి ఆనందుడు ఇలా అన్నాడు: ‘‘మీ శక్తీ, సమయమూ చాలావరకు వృథాగా పోతున్నాయి. నేను చెప్పినట్టు చేస్తే మీ గూడేన్ని, మిమ్మల్ని సమూలంగా మార్చేస్తాను’’ అన్నాడు. ఆటవికులు ముక్త కంఠంతో ‘‘మాకు మాతంగ మహర్షీ, మీరూ వేరు కాదు. మీ మాట చొప్పున చేస్తాము’’ అన్నారు. వారి మాటలకు ఆనందుడు సంతృప్తి చెంది వెంటనే కార్యరంగంలోకి దిగాడు.
మొదటగా గూడెంలోని ఊహ తెలిసిన పిల్లలందరినీ కొండదేవర విగ్రహం దగ్గరున్న వేపచెట్టు కిందకి చేర్చి పాఠశాల ప్రారంభించాడు. వృద్ధులకి బుట్టలు, చాపలు అల్లే పని పురమాయించాడు. వేటకు వెళ్లే యోధులను మినహాయించి మిగిలిన మగవారిని కూరగాయలు, ఆకు కూరలు, చిరుధాన్యాలు పండించే సేద్యగాళ్లుగా మార్చాడు. స్త్రీలకు ఔషధ మూలికలు, తేనె, వెదురు బియ్యం వంటి అటవీ ఉత్పత్తులు సేకరించే పని అప్పగించాడు. వాటన్నింటినీ తన స్వగ్రామానికి రవాణా చేయించాడు. తన తండ్రి, అన్నల సహకారంతో అక్కడ ఆటవికుల చేత అంగళ్ళు తెరిపించాడు. ఇప్పుడు ఆనందుడు, ఆటవికులు క్షణం తీరికలేకుండా ముమ్మరమైన పనిలో తల మునకలైపోయారు.
చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. మాతంగముని గూడేనికి వచ్చి ‘‘ఆనందా! నాకిచ్చిన మాట నిలబెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. గడువు దాటింది గనుక నీకు నేను అడ్డు రాను. స్వేచ్ఛగా పోయి ఆత్మహత్య చేసుకో’’ అన్నాడు. 
ఆనందుడు రుషి కాళ్ళ మీదపడి ‘‘నాకిçప్పుడు చావాలని లేదు స్వామీ! బతకాలని ఉంది’’ అని కన్నీరు కార్చాడు. మహర్షి అతడిని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. ‘‘నాయనా! నీ చొక్కా నీకు బిగువైనపుడు దాన్ని చింపి పారేయటమో, కాల్చేయటమో చేసే బదులు, అది సరిపోయే వారికి ఇస్తే ఉపయోగపడుతుంది. నీకు వ్యర్థంగా తోచిన నీ జీవితం ఇపుడు ఎంత అర్థవంతంగా మారిందో చూశావా ? ఈ సృష్టిలో నిరుపయోగమైనదేదీ లేదు’’ అన్నాడు.
‘‘నిజమే స్వామీ! నాకు పనికిరాని నా జీవితం ఈ ఆటవికులకి ఉపయోగపడి నాగరికులుగా మార్చింది. ఈ అడవిలో ఇంకా అనేక గూడేలున్నాయి. నా అవసరం అక్కడ ఉంది. నాకోసం వారు ఎదురు చూస్తున్నారు. తమ సెలవైతే బయలుదేరుతాను’’అన్నాడు ఆనందుడు వినయంగా.
‘‘అలాగే ఆనందా! వివాహం చేసుకుని వెళ్తే బాగుంటుందని మా అభిప్రాయం’’ అన్నాడు మునీశ్వరుడు మందహాసం చేస్తూ. ఆనందుడు తలవంచి ‘‘లేదు స్వామీ! భగ్నప్రేమికుడిని, జీవితాన్ని త్యజించాలను కున్న వాడిని, నాకే ఆశలూ లేవు’’ అన్నాడు. మాతంగముని సైగ చేయటంతో ఒక యువతి వచ్చి సిగ్గుపడుతూ అతడి ముందు నిలబడింది. ఆనందుడు తలెత్తి చూసి ‘మల్లికా!’ అన్నాడు ఆనందాశ్చర్యాలతో.

మరిన్ని వార్తలు