బిడ్డ చాటు తల్లి

12 May, 2019 00:15 IST|Sakshi

అమ్మ మనల్ని తొమ్మిది నెలలు మోసింది.ఊపిరి బిగబట్టి మనకు ప్రాణం పోసింది.పంటి మధ్య ప్రాణాన్ని నొక్కిపట్టి ఊపిరిని ఉగ్గులా పట్టించింది.తను పునర్జన్మ పొందుతూ మనకు జన్మనిచ్చింది. కనురెప్పలు వాల్చకుండా జోలపాట పాడింది. పీడకల మనకొస్తే.. తను ఉలిక్కిపడి లేచింది. అక్షరం తెలిసినా, లేకున్నా... మనకు వీరగాథలు చెప్పింది. నీళ్లు తాగిందో, కష్టాల కన్నీళ్లు తాగిందో...అమ్మ తన రక్తమాంసాలను పాల చుక్కలుగా మనకు పట్టించింది. అమ్మను మనం చిన్నచూపు చూసినా...అమ్మ కళ్లల్లో మాత్రం మన గొప్పతనమే కనపడేది. ‘అమ్మా...’ అని విలవిల్లాడినప్పుడు...‘కన్నా...’ అని  వెక్కివెక్కి ఏడ్చింది. ఆనందంతో మనం నవ్వినప్పుడు... అమ్మ ఆకలి మరిచింది.ఓటమి మనల్ని కుంగదీస్తే ఒక్కసారి గాల్లో ఎగరేసి పట్టుకుంది.మనం గెలిచినప్పుడూ అమ్మ ప్రార్థించింది!మనది పసితనం.. అహంకారం కాదని దేవుడికి చెప్పింది. నిజమే. మనం తల్లి చాటు బిడ్డలం. ఎప్పటికీ తల్లిచాటు బిడ్డలం. చరిత్రలో ఎందరో బిడ్డలు. ఆ బిడ్డల్లో ఎందరెందరో ఘనులు... రాజులు... చక్రవర్తులు... మీరు... నేను... మనం...మరి మనం ఏ దేశానికి రాజులం?ఏ దేశానికి రాజులం కాలేకపోయినా అమ్మకు మనం ఎప్పుడూ మారాజులమే. ఇవాళ.. అమ్మని గుర్తుచేసుకుందాం. ఇంతకంటే గొప్ప పని కూడా చేయొచ్చు. ఇవాళ.. అమ్మని పలకరిద్దాం.  మన చాటున, మన మాటున కనపడకుండా పోయిన అమ్మ మనసు తెలుసుకుందాం.మనసారా అమ్మను ప్రేమిద్దాం. ప్రేమ ఇద్దాం.

మీ
రామ్ 
ఎడిటర్, ఫన్‌డే – ఫ్యామిలీ

మరిన్ని వార్తలు