స్వరాజ్య సమరం లోవెలుగు

30 Sep, 2018 01:04 IST|Sakshi

ధ్రువతారలు

‘భాష కేవలము మానవ కల్పితము కాదు. అచ్చటి వాయువుల సంచలనము, అచ్చటి కేదారముల రామణీయకము, అచ్చటి ఆకసము యొక్క దీప్తి, అచ్చటి శుక, సారికల ధ్వన్యనుకరణము, అచ్చటి భాషయందు ప్రతిబింబించి యుండును. అప్పుడే అది దేశభాష అగును... ఆ దేశములోని జనులెట్లు ఆ దేశ గర్భము నుండి పుట్టి పెరిగెదరో అటులనే ఆ దేశభాష కూడా ఆ దేశ గర్భము నుంచి పుట్టి పెరుగు భాషౖయె ఉండును... ఆంధ్ర మండలమున పరబాస మాట్లాడుడు. అప్పుడీ ప్రకృతి యంతయు మూకీ భావము వహించి స్తంభించును...’ (దేశ భాషలు–మత భేదములు, 1920, లోవెలుగులు)‘లోవెలుగులు’ పేరుతో కృష్ణాపత్రికలో ఒక శీర్షిక వెలువడేది. అది సాక్షాత్తు ఆ పత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావుగారే రాసేవారు. నిద్రాణమై ఉన్న జాతీయ భావనల మీదనే కాదు, వాటి పునాదుల మీద కూడా కృష్ణారావుగారి అక్షరాలు వెలుగులు ప్రసరించాయి. ఆ అక్షరాల వెనుక ఉన్న అంతరాత్మ ఒకతరం స్వాతంత్య్ర సమరయోధులకీ, కవులకీ, కళాకారులకీ, జాతీయవాదులకీ లోవెలుగై దీప్తించింది.  ముందుకు నడిపించింది. ఆ భాషలో తీవ్రత, అదే సమయంలో కనిపించే హుందాతనం ఇప్పటి తరాన్ని కూడా మంత్రముగ్ధులను చేస్తాయి. ‘శక్త్యుపాసన’ అన్న రచన కోసం కృష్ణారావుగారి(1879–1945) అంతరాత్మ ఎంతగా దహించుకుపోయి ఉంటుందో, మేధస్సులో ఎంత మథనం సాగి ఉంటుందో ఈ కొన్ని వాక్యాలు చూస్తే తెలుస్తుంది. ‘నీలో సంఘటనా శక్తి ఎక్కడ? స్వతంత్ర సంఘటన చేయలేక పోయినా, ప్రతిఘటన అయినా చేయలేవే. రాతిని కొట్టి చూడు, దానిలో నుంచి అగ్నికణాలు బయలుదేరతాయి. మందుగుండుకు చిచ్చు పెట్టామనుకో– అది ఎట్లా ప్రేలి, నీ గృహాన్ని మంటల్లో పడవేస్తుంది? ఒక ఎలక్ట్రిక్‌ బొత్తామును ఒత్తావనుకో– చూడు ఎన్ని బల్బులొక్కమారు వెలుగులు గ్రక్కుతాయో! నిన్ను ఒత్తినా, తన్నినా, చంపినా, ఒక అగ్నికణం గాని, ఒక్క ప్రేలుడు గాని, ఒక్క జ్యోతి గాని ప్రకాశించదే! మనం చచ్చుదద్దమ్మలమన్నమాట. మనలో రాతికున్న భౌతికశక్తి లేదు, పశువులకున్న ప్రాణశక్తి లేదు, మానవునకుండదగిన త్యాగశక్తి లేదు. శక్తి యొక్క అభావం మనలో గూడుకట్టుకొన్నది సోదరా. యంత్రాలను కొలుస్తావు, వాని హార్స్‌పవర్‌ యింత అని. నీటిని కొలుస్తావు, దాని ‘‘హైడ్రాలిక్‌ పవర్‌’’ ఇంత అని. నీ ‘పవర్‌’ కొలవడానికి ఏమైనా సాధనం ఉంటే బాగుండును. ఇప్పుడు యుద్ధాలు చేస్తున్నవారిని అడిగితే ఏమి చెబుతారు? ఇంగ్లాండుకు ‘‘నావల్‌ పవర్‌’’ ఉన్నదంటారు. అమెరికాకు ‘‘ఇండస్ట్రియల్‌ పవర్‌’’ ఉన్నదంటారు. రష్యాకూ, చీనాకూ ‘‘మేన్‌ పవర్‌’’ ఉన్నదంటారు. అయితే నీకూ, నీ దేశానికీ ఉన్న పవరేమిటి? మృత్యువంటే భయపడే పవర్‌– స్వాతంత్య్రమంటే వెనుకపడే పవర్‌– ఐకమత్యమంటే కళ్లు మూసుకునే పవర్‌. ఇంతేనా?’

 అందుకే కృష్ణాప్రతిక స్వాతంత్య్ర ఉద్యమకాలంలో, వలస పాలన తెచ్చిన చీకటియుగంలో ఒక కంచు కాగడా అయింది. కానీ చాలామంది భావిస్తున్నట్టు కృష్ణాపత్రిక కృష్ణారావుగారి పేరు మీద నెలకొల్పినది కాదు. అది ఆవిర్భవించే నాటికి కృష్ణారావుగారు ఆ పత్రికలో లేరు. ఇంకా చెప్పాలంటే కృష్ణానది పేరు మీద ఆ పత్రిక ఆవిర్భవించిందని చెప్పాలి. పత్రిక నెలకొల్పే సమయంలో ఉంటే తాను ‘కృష్ణవేణి’ అని నామకరణం చేయించి ఉండేవాడినని కృష్ణారావు అనేవారట. భారతదేశం పునరుజ్జీవనోద్యమం వైపు అడుగులు వేయడం నేరుస్తున్న సమయంలో, స్వాతంత్య్రోద్యమం రూపు కడుతున్న సమయంలో 20వ శతాబ్దానికి కాస్త ముందు, అంటే 1892లో మచిలీపట్నంలో కృష్ణా జిల్లా  సంఘం ఏర్పడింది. అయితే అది ఇప్పటి కృష్ణాజిల్లా కాదు. మొత్తం గుంటూరు ప్రాంతం కూడా కలసి ఉండేది. ఈ మొత్తం ప్రాంతం అభివృద్ధికీ, రాజకీయ చైతన్యానికీ పాటు పడడమే ఆ సంస్థ ఉద్దేశం. ఇందులో సభ్యులు కొండా వెంకటప్పయ్య తదితరులకు వచ్చిన ఆలోచనే కృష్ణాపత్రిక స్థాపన. వెంకటప్పయ్యగారు న్యాయవాది. మరొక న్యాయవాదీ, కవీ దాసు నారాయణరావుతో కలసి ఇలాంటి నిర్ణయానికి వచ్చారాయన. ఈ ప్రాంతంలో ఒక్క తెలుగు పత్రిక కూడా లేకపోవడం వారిని ఇలాంటి చరిత్రాత్మక నిర్ణయం తీసుకునేటట్టు చేసింది. పైగా రాజకీయ చైతన్యం రేకెత్తించే ధ్యేయంతో పత్రికలు ప్రారంభమవుతున్న కాలం కూడా అదే. వెంకటప్పయ్య, దాసు నారాయణరావు మొత్తానికి అనేక ఇక్కట్ల మధ్య ఆ పక్షపత్రికను ఫిబ్రవరి 1, 1902న ఆరంభించారు (తరువాత వారపత్రిక అయింది). అంతలోనే దాసు హఠాన్మరణం పాలయ్యారు. ఈ పత్రిక ఆనాడే తీవ్రవాద లక్షణాలు కలిగిన పత్రికగా ముద్ర పడిందని వెంకటప్పయ్య తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ఒక ఏడాది తరువాత కృష్ణారావుగారు సహాయ సంపాదకులుగా చేరారు. 

1905లో బెంగాల్‌ను విభజిస్తూ నాటి వైస్రాయ్‌ కర్జన్‌ నిర్ణయం తీసుకున్నాడు. దేశం భగ్గుమంది. తెలుగు ప్రాంతం కూడా ఆ నిరసనలో గళం కలిపింది. కృష్ణారావుగారు బెంగాల్‌ వెళ్లి విభజన వ్యతిరేకోద్యమ నేత బిపిన్‌చంద్రపాల్‌ను కలుసుకున్నారు. ఆయనతో కలసి బెంగాల్‌లో పర్యటించారు. పాల్, చిత్తరంజన్‌దాస్, సుబోధచంద్ర మల్లిక్‌లు ఆరంభించిన ‘బందేమాతరం’ పత్రిక పని తీరును పరిశీలించారు. దీనికి అరవింద్‌ఘోష్‌ సంపాదకుడు. ఘోష్‌ పేరుతో వెలువడుతున్న వ్యాసాలు నిజానికి కృష్ణారావుగారే రాస్తున్నారని చాలాకాలం ఎందరో విశ్వసించేవారని పొత్తూరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. 1907లో బెంగాల్‌ ఉద్యమం నుంచి తిరిగి వచ్చిన తరువాత కృష్ణారావు పత్రిక సంపాదక బాధ్యతలను తీసుకున్నారు. బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం బిపిన్‌పాల్‌ వంటి వారి నాయకత్వంలో జరిగితే, విభజనకు వ్యతిరేకంగా పాల్‌గారు జరిపిన దక్షిణ భారత యాత్ర ముట్నూరి వారి నాయకత్వంలో జరిగింది. బిపిన్‌పాల్‌ను వెంట తీసుకుని విజయనగరం నుంచి రాజమండ్రి, కాకినాడల నుంచి మద్రాస్‌ దాకా చేయించిన యాత్ర చరిత్రాత్మకమైనది. తరువాత కూడా కృష్ణాపత్రిక ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించేది. 1908లో కృష్ణాపత్రిక సంపాదకునిగా ముట్నూరి స్థిరపడుతున్నారు. అప్పుడే ‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ శీర్షికతో ఒక వ్యాసం అచ్చయింది. కానీ ఎవరి సలహాయో, ఈ సంచికను విడుదల చేయలేదు. మొత్తం ప్రతులన్నీ తగులబెట్టారు. అయినా ఎలాగో ప్రభుత్వానికి తెలిసిపోయింది. వీటి కారణంగానే  కృష్ణాజిల్లా కలెక్టర్‌ నాలుగేళ్ల పాటు ముట్నూరివారిని సంపాదకునిగా అనుమతించలేదు. 1912లో మళ్లీ కృష్ణారావు సంపాదకుడైనారు. ముట్నూరి వారు దూరంగా ఉన్న కాలంలో అవటపల్లి నారాయణరావు, భోగరాజు పట్టాభిసీతారామయ్య పత్రిక వ్యవహారాలను చూశారు. 1912 నుంచి 1945లో  తుది శ్వాస విడిచేవరకు కృష్ణారావుగారే సంపాదక బాధ్యతలను నిర్వర్తించారు.  ఆయన కలానికి పది పాళీలని అంటూ ఉండేవారు. ఆయన ప్రతి అంశాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. రాజకీయం, ఉద్యమం, జాతీయ భావాలు, కళలు, శాస్త్ర విజ్ఞానం, తత్వం, మార్మిక రచన అన్నింటిలోను ఆయన కలం విజయ విహారం చేసింది.  

కృష్ణారావు గొప్ప కళాహృదయుడు. మచిలీపట్నంలోని కృష్ణాపత్రిక కార్యాలయాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్నారని తెలిసినవారు చెబుతారు. ఆ కార్యాలయానికి చిన్న ఆవరణ ఉండేదట. అందులోనే అనేక రకాల మొక్కలను నాటారు. తోట మధ్యలో చిన్న జలాశయం. అందులో కార్యాలయం పక్కనే ఉన్న అమ్మవారి ఆలయం నీడ పడేదట. అలాగే ప్రతి మొక్క, లతలకు కుదుళ్ల దగ్గర గుండ్రంగా మట్టి అరుగులు కట్టించి, వాటికి రంగులు వేయించేవారట. కృష్ణారావుగారు అందరికంటే ముందు కార్యాలయానికి వచ్చి మొక్కల మధ్య విహరిస్తూ ఆనందించేవారట. అందుకే  ‘తోటానందులు’ అన్న బిరుదు సన్నిహితుల నుంచి అందుకోవలసి వచ్చింది. కృష్ణారావుగారు రాతలో ఎంతో తీవ్రంగా, లోతుగా తన భావాలను వ్యక్తం చేయడం కనిపిస్తుంది. తెల్లని తలపాగాలో గంభీరంగా ఉండేవారాయన. పొడవైన అంగీ, పంచె, తెల్లని దేహచ్ఛాయతో ఉండే కృష్ణారావుగారి ఆకృతిని అడవి బాపిరాజు వంటి కళా మర్మజ్ఞుడు ఎంతో తన్మయంగా వర్ణించారు.  కానీ ఆ మౌనం వెనుక సాగర ఘోష ఉండేదని తరువాత తెలిసింది. ఆయనను మౌనముద్రాలంకారుడు అనేవారు.  కానీ నోరు విప్పితే, ఆయనలోని గొప్ప హాస్యప్రియుడే దర్శనమిచ్చేవాడు. అందుకు నిదర్శనం– కృష్ణాపత్రిక కార్యాలయంలో అసంఖ్యాకంగా జరిగిన ‘దర్బార్లు’. దీనికి అసంఖ్యాకంగా మహనీయులు హాజరయ్యేవారు. నిజానికి అదొక చిన్న పర్ణశాల. దానికి జమ్ము గడ్డితో కప్పు ఉండేదట. అందుకే దానిని జమ్మా మసీదు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవారట. దర్బారుకు అధ్యక్షులు కృష్ణారావుగారే. ఆయన్ని ‘గురు గ్రంథసాహెబ్‌’ అని గౌరవించుకుంటూ ఉండేవారు. దర్బారు శాయరు పింగళి కాటూరి కవిద్వయంలోని కాటూరి వెంకటేశ్వరరావు. భోగరాజు పట్టాభి వక్తగా తన పాత్రను నిర్వహిస్తూ ఉండేవారు. అడవి బాపిరాజు, కోలవెన్ను రామకోటేశ్వరరావు, దామరాజు పుండరీకాక్షుడు, భావరాజు నరసింహారావు, బెజవాడ గోపాలరెడ్డి, గొట్టిపాటి బ్రహ్మయ్య వంటివారంతా వచ్చేవారు.  విశ్వకవి టాగోర్‌ రచన చిత్రాంగదకు గోపాలరెడ్డి చేసిన అనువాదాన్ని మొదట ఈ దర్బారులోనే చదివి వినిపించారు.  పింగళి లక్ష్మీకాంతం, మునిమాణిక్యం నరసింహారావు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, దేవులపల్లి, విశ్వనాథ వంటి వారంతా కూడా దర్బారీయులే.  

రావూరి వెంకటసత్యనారాయణరావు (వంద చందమామలు సంకలనకర్త, పత్రికా రచయిత, కృష్ణాపత్రికలో వడగళ్లు పేరుతో శీర్షిక నిర్వహించారు), నార్ల వెంకటేశ్వరరావు హాజరయ్యేవారు. టంగుటూరి ప్రకాశం గారికి బిరుదు ఇచ్చిన దర్బారు ఇదే. చెరుకువాడ నరసింహంపంతులు ‘ఆంధ్ర సింహ’ అని బిరుదు ఇవ్వాలని మొదట సూచించారట. కానీ కృష్ణారావు సింహం కంటే కేసరి అనే మాటే అందంగా అమరుతుందనీ, ఆంధ్రకేసరి అంటేనే బాగుంటుందనీ సవరించారట. అభినవాంధ్ర వాగనుశాసన (గిడుగు రామమూర్తి), పరిహాస పారిజాత (భమిడిపాటి కామేశ్వరరావు), ప్రతివాద భయంకర (పట్టాభి), శోకరస గంగాధర (దేవులపల్లి) వంటి బిరుదులన్నీ అక్కడే పురుడు పోసుకుని, బాలసారె కూడా జరుపుకున్నాయి. 

కృష్ణారావు రసహృదయానికి ఎల్లలు లేవు. మృత్యువులో కూడా ఆయన సౌందర్యాన్ని చూశారు. అందుకే ఎవరైనా మరణిస్తే ఊరికే సందేశాలు ఇవ్వడం జరిగేది కాదు. ఒకసారి ఒక పెద్దాయన కన్నుమూశారు. ఆ రోజుల్లో పత్రికలో ఫొటో పడాలంటే ‘బ్లాకు’ పద్ధతి ఉండేది. ఒక్కొక్క ఫొటో ఒక్కొక్క బ్లాకు. తీరా కన్నుమూసిన పెద్దాయన బ్లాకు (అంటే ఫొటో అన్నమాట) కార్యాలయంలో లేదని తేలింది. ‘ఇంతమంది బ్లాకులు ఉన్నవాళ్లు ఉన్నారు కదా, వాళ్లలో ఎవరో మరణించకుండా, బ్లాకు లేని ఈయనే పోవాలా! బ్లాకు ఉన్నవాళ్లు పోతే మూడంగుళాల స్థలం కలిసొచ్చేది!’ అన్నారట కృష్ణారావు. మరొకసారి ఇంకొక పెద్దాయన తుదిశ్వాస విడిచారు. ‘మీరు విచారిస్తే చాలునా! లేకపోతే నేను కూడా విచారించాలా!’ అన్నారట, కృష్ణారావు. అంటే, వార్తతో సరిపెట్టవచ్చా? లేకపోతే సంపాదకీయం రాయాలా? అన్నదే ఆయన ఉద్దేశం. కృష్ణారావుగారి జ్ఞాన సంపద అమోఘం.  గాంధీగారు ఒకసారి బందరు వచ్చినప్పుడు సభలో ప్రసంగిస్తున్నారు. ‘నూలు వడకడం ప్రతివ్యక్తికి ఒక మహా....’ అని మాట కోసం వెతుక్కుంటూ ఉంటే, అదే వేదిక మీద ఉన్న కృష్ణారావుగారు ట్చఛిట్చఝ్ఛn్ట (మతాదర్శం) అంటూ మాట అందించారు. గాంధీజీ ఆ పదాన్నే ప్రయోగించారు.

కృష్ణారావుగారు రాతలో విశ్వరూపం చూపేవారు. మాటలో మాత్రం విదూషకుడి విన్యాసాలు చూపేవారు. కానీ ఆ హాస్యం వెనుక చెప్పలేనంత విషాదం ఉంది. కృష్ణారావుగారు పుట్టిన కొన్ని రోజులకే తల్లి చనిపోయారు. అందుకే అడపా దడపా తాను మాతృహంతకుడినని అనుకుంటూ దీర్ఘ విచారంలో మునిగిపోయేవారు. ఆరో ఏట తండ్రి ఈ లోకాన్ని వీడారు. పినతండ్రి ఇంట పెరిగారాయన. పుట్టింది దివిసీమ ప్రాంతంలోని ముట్నూరు. కృష్ణారావుగారిపై బ్రహ్మసమాజం ప్రభావం ఉండేది. మచిలీపట్నంలో చదువుకునేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆయనకు గురువుగా ఉండేవారు. కృష్ణారావుగారికి ఇద్దరు కూతుళ్లు. ఒక కొడుకు. వారిలో ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు, అల్లుడు కూడా ఆయన కళ్ల ముందే తనువు చాలించారు. అయినా ఆయన స్వాతంత్య్రోద్యమానికి, పత్రికా రచనకు దూరం కాలేదు. చిత్రం, ఆ హాస్య ధోరణి కూడా తుదికంటా వెన్నంటే ఉంది. కృష్ణారావుగారి చివరి దశలో ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన ఆస్పత్రిలో చేరిన వెంటనే భార్య వచ్చారు. అంత్యకాలాన్ని ‘మౌన ముద్రాలంకారుడు’ ఎంతో మామూలు విషయంగా తీసుకున్నారు. పాపం, ఆ ఇల్లాలు దుఃఖం ఆపుకోలేక గొల్లుమన్నారు. అందుకు కృష్ణారావుగారు అన్నమాట, ‘అప్పుడే రిహార్సల్స్‌ మొదలు పెట్టేశావా!’
- డా. గోపరాజు నారాయణరావు 

మరిన్ని వార్తలు