నోరు తెచ్చిన తంటా

26 Jan, 2020 03:13 IST|Sakshi

ఎండలు మండిపోతున్నాయి. కరువు తాండవం చేస్తోంది. పగలంతా పనికి వెళ్లిన మూడు పూటలూ గడిచేది కష్టం. అందులో పనులు దొరకడం లేదు, కొత్తగా పెళ్ళి చేసుకున్నాను. బోలెడు ఆస్తి  వుంది కదాని మామగారు పిలిచి మరీ పిల్లనిచ్చాడు. అమ్ముకోవడానికి తప్ప నమ్ముకొని కాసిన్ని కాయలు తినే అదృష్టం ఎలాగూ లేదు. చిన్నప్పటి స్నేహితుడు రాము బెంగళూరులో పనికి కుదిరి బాగా సంపాదించాడని నాన్న తెగ పొగుడుతుంటేను వాడికి ఫోన్‌ కలిపాను. 
‘‘నేను నిన్ననే ఇల్లు మారాను. ఇంటి ఓనర్‌ దగ్గరే పని దొరికింది. చాలా మంచివారు. పై పోర్షన్‌ ఖాళీగా వుంది. మీరు వస్తామంటే మాట్లాడుతాను. నాతో పాటు పని చేసుకుందురు’’  రాము మాటకు నా సంతోషం ఉట్టినెక్కింది. ఆలస్యం దేనికి అనుకొని..గడ్డి చాలక బక్కచిక్కిపోయిన రెండు ఆవులను అమ్మకానికి పెట్టి, కాస్త డబ్బులు అమ్మ నాన్న చేతిలో పెట్టి.. బ్యాగు నిండా బట్టలు సర్ది నేను మా ఆవిడ గోరంట్ల బస్టాండుకు చేరుకున్నాము. బస్సు ఎక్కేముందు.‘‘రేయ్‌..అక్కడ నీ నోరు అదుపులో పెట్టుకుని బాగా పని చేసుకో. ఎవరితోనూ కలుగజేసుకోకు జాగ్రత్త’’  అంటూ మమ్మల్ని సాగనంపాడు నాన్న. నాకు కాస్త ముక్కు మీద కోపం.
బస్సు గోరంట్ల దాటింది. చివరన రెండు సీట్లు మా కోసమే అన్నట్టుగా ఖాళీగా వున్నాయి. బ్యాగ్‌ పక్కనే పెట్టుకొని కూర్చున్నాము. బస్సు చాలా వేగంగా వెళుతోంది, బాగేపల్లి టౌను చేరేదాక ఎక్కడ ఆపలేదు. బెల్లం ముక్కకు ఈగలు ముసిరినట్టుగా బస్సు చుట్టూ జనాలు ముసురుకున్నారు. డోరు తెరవగానే ఎదురు నీళ్ళకు చేపలు ఎక్కినట్టుగా జోరుగా ఎక్కేశారు జనాలు. ‘‘ బాబు..ఆ బ్యాగ్‌ కాస్త పక్కన పెట్టండి’’  బాగా ఖరీదైన వస్త్రాలు ధరించిన ఒక పెద్దాయన నా భుజం తట్టి మరీ అన్నాడు,  ‘‘ ఎక్కడ పెట్టమంటావ్‌..నా నెత్తిన పెట్టుకోమంటావా?’’  కాస్త కసిరినట్టుగా అన్నాను.  ‘‘అలా ఎందుకు అంటానండీ, కాస్త పక్కకు లాగండి అన్నాను’’  పక్కనున్న కడ్డీని బలంగా పట్టుకుంటు అన్నాడా పెద్దాయన.  ‘‘బట్టలు నలిగిపోతాయి అనుకుంటే కార్లో వెళ్ళవచ్చు కదా మా మీద పడడం దేనికి’’  మాట రెట్టించాను.  ‘‘వయసులో పెద్దవాళ్ళని కాస్త చూసి మాట్లాడు’’ అతని భార్య కాబోలు.. పట్టుచీర నలిగిపోతుందేమో అని మాటి మాటికి సర్దుకుంటూ తిన్నగా అంది,  ‘‘పెద్దవాళ్లు కూడా పిల్లలకు గౌరవం ఇవ్వాలని తెలియదా’’   ‘‘అంటే నాకు గౌరవించడం రాదా!’’  కోపంగా అన్నాడు పెద్దాయన.  ‘‘చూడండి..బ్యాగ్‌ తీయాలనుకుంటే తీయండి లేదా ఊరుకోండి. అంతేగాని పెద్దవాళ్ళతో ఎందుకు గొడవ’’  పక్కనే వున్న ఒకతను అన్నాడు. 
గొడవ కాస్త సద్దుమణిగింది. ఐనా నాలో కోపం తగ్గలేదు.  ‘‘టికెట్‌ టికెట్‌’’  అంటూ కండక్టర్‌ అందర్ని తోచుకుంటు ముందుకొచ్చాడు. టికెట్‌ తీసుకున్నాక.. తడబాటులో పెద్దాయన నా కాలు తొక్కాడు. మరింత కోపం వచ్చింది.. నా భార్య వారిస్తున్నా వినలేదు  ‘‘కాలు తొక్కుతారెందుకు సరిగ్గా నిలబడలేరా’’  కటువుగా అన్నాను.  ‘‘ఈ జనాల్లో ఎక్కడ నిలుచుకోమంటావ్‌ కాళ్ళు తీసి నెత్తిన పెట్టుకోవాలా’’. పెద్దాయన మాటకు రక్తం ఉడికింది నాకు.  ‘‘మీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకోండి’’  అనేశాను. కొద్దిసేపట్లోనే గొడవ ఎక్కడికో వెళ్లిపోయింది,
అక్కడున్న వారంతా నాదే తప్పు అన్నట్టుగా వాదనలు చేసారు.  
‘‘బయటికి వచ్చినప్పుడు కొన్నింటిని సర్దుకుపోవాలి. చెబితే వినరు’’ భార్య తిన్నగా సముదాయించింది నన్ను.
‘‘నోరు పారేసుకోవడం పెద్దది కాదండీ. అదుపులో వుంచుకోవడం నేర్చుకోవాలి’’  అంటూ ప్రతి వారి నోళ్ళల్లోను తప్పు నావైపే చూపిస్తూ అనడం మొదలు పెట్టారు.  
‘‘ఛీ..ఇలాంటి వారి దగ్గర నిలుచుకోవడం కంటే దూరంగా వుండడమే మంచిది’’  అంటూ పెద్దాయన నా మొహం పైనే అనేసి..అంత రద్దీలో కూడా భార్యతో కలసి లోపలికి వెళ్ళాడు. 
బస్సు దేవనహళ్ళి దాటుకొని బెంగుళూరులోకి వేగంగా అడుగు పెట్టింది. ఒక్కొక్కరే దిగుతు వస్తున్నారు. బస్సు కాస్త పలచన బడింది. ఏ ఒక్కరో ఇద్దరో తప్ప మిగిలిన వారంతా సీట్లలో కూర్చున్నారు. బస్సు మెయిన్‌ బస్టాండుకు చేరింది. హడావుడిగా బ్యాగ్‌ తీసుకుని దిగేసాము. నాతో గొడవ పడిన పెద్దాయన కార్లో లగేజీ సర్దుతూ కనిపించాడు. బాగా వున్నవాళ్ళే అనుకుంటా..తను నా వైపు చూసీ  ‘‘బస్సులో మొరిగే కుక్కలు కూడా వస్తాయని తెలుసుంటే కార్లో వచ్చేవాళ్ళం’’  పరోక్షంగా నన్నే అంటూ కారెక్కి వెళ్ళిపోయాడు. 
నేను నా భార్య కలసి..పదిహేనవ నంబర్‌ ప్లాట్‌ఫాంలో నిలుచున్నాము. బొమ్మనహళ్ళి వెళ్ళే బస్సు కోసం వేచి చూస్తున్నాము, పది నిమిషాల తర్వాత బస్సు వచ్చి నిలబడగానే లోపల జనాలు క్షణాల్లో కిక్కిరిసి పోయారు. బ్యాగ్‌ చేతిలో పట్టుకుని నిలుచున్నాము. అక్కడక్కడా నిలిచి స్థానం చేరేపాటికి గంట పైనే పట్టింది. అతి కష్టంగా జనాలను తోచుకుంటూ కిందకి దిగేసాము. మా రాక కోసం రాము బస్టాపులోనే వేచి కూర్చున్నాడు. 
ఆటో తీసుకుని ముగ్గరం ఇంటికి వెళ్ళేపాటికి చీకటి పడింది. పై పోర్షన్‌లో రాము వుంటున్నాడు. మా గురించి మొత్తం చెప్పేసాడట. ఉదయాన్నే ఇంటి ఓనర్‌ని కలిసి పనికి వెళ్ళడమే తరువాయి..ఇంత తొందరగా బెంగుళూరులో పని కుదురుతుందని కలలో కూడా ఊహించలేదు. రాము వుంటున్న పక్క రూంలో ఉదయం చేరిపోవాలి. ఆ రాత్రి పల్లె కబుర్లు తోనే గడిపేసాం.
ఉదయం ఆరింటికే లేచి మొహం కడిగినాక..ఇంటి ఓనర్‌ని కలవడానికి నేను రాము కిందకు వచ్చాము. తలుపులు ఇంకా తీయనేలేదు వాళ్ళు.. కాలింగ్‌ బెల్‌ నొక్కగానే ఇంటి ఓనర్‌ తలుపులు తీశాడు...అంతే.. షాక్‌... కొట్టినట్టు అదిరిపోయి నిలబడిపోయాను. నిన్న బస్సులో గొడవపడ్డ పెద్దాయన నన్ను చూడగానే నిప్పులు చెరిగినట్టు గుడ్లురిమి చూసాడు. 
‘‘నువ్వు చెప్పింది ఇతనేనా..’’  ఆ స్వరంలో గాఢత వినిపించింది. అవును అన్నట్టు తలూపాడు రాము.  ‘‘తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి’’ అన్నాడు రాము వైపు చూసి, స్పీడుగా లోపలికి వెళ్ళి అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బు తెచ్చి విసిరి ముఖానికి కొట్టి..బస్సులో జరిగిన విషయమంతా కక్కేసాడు పెద్దాయన.. ‘‘నేను కావాలంటే వెళ్ళిపోతాను. రామును వుండనివ్వండి’’  అన్నాను. ‘‘ విత్తు ఒకటి చెట్టు ఒకటి వుండదు. ఇద్దరూ ఖాళీ చేయండి. చేయకపోతే నేనే చేయిస్తాను’’ అనేసి మొహంపైనే డోరు వేసేశాడు పెద్దాయన.
నా నోరు తెచ్చిన తంటాకు నాతో పాటు రాము కూడా రోడ్డున పడ్డాడు. మా నాన్న అంటుండేవాడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. పెద్దల మాట పెడ చెవిన పెట్టినందుకు బజారున పడాల్సి వచ్చింది నాకు. – నరెద్దుల రాజారెడ్డి గోరంట్ల, అనంతపురం జిల్లా

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు