ఉభయ భారతి

8 Dec, 2019 03:14 IST|Sakshi

నేతి సూర్యనారాయణ శర్మ

కలియుగం ప్రవేశించి 2609 (క్రీ.పూ. 492) సంవత్సరాలు గడిచాయి. అది శ్రీకీలక నామ సంవత్సరం ఆషాఢ గుప్తనవరాత్ర పర్వదినాలలోని దుర్గాష్టమి. ఆనాడు మండనమిశ్రుని ఓటమి సమాచారం ఉభయ భారతి చెవిన పడింది. కొద్దిపాటి వ్యవధానంతో ఆమె తిరిగి సభాప్రవేశం చేసింది. ఆకుపచ్చని చీరను ధరించి మాతంగీ మహావిద్యలా ప్రకాశిస్తోందామె. మెల్లగా నడిచి వస్తున్నప్పుడు ఆమె కాలిమెట్టెల నుంచి ప్రసరించిన మెరుపుకాంతులు కాళిదాసు మానసంలో అల్లుకుంటున్న దండకాలకు పదాలను సమకూర్చిపెడుతున్నాయి. ఆమె తన పీఠాన్ని అలంకరించింది. ఆమె పాపట సిందూరం సూర్యకాంతులీనుతోంది. ఆ వెలుగు చతుర్ముఖ బ్రహ్మ ఉపాసించిన వనదుర్గా మంత్ర స్వరూపంగా మండనమిశ్రునికి తోచింది.

వాడిన పూలదండతో వసివాడివున్న భర్త వంక ఒకసారి పరికించి చూసిందామె. శంకరుని మెడలోని పూవులు తామింకా తల్లికొమ్మ మీదనే ఉన్నట్లు చెక్కుచెదరక ఉన్నాయి.  ఇది సర్వమూ పరిత్యజించిన వైరాగ్య ప్రభావమా... తనను వరించి వచ్చిన ప్రతిదీ తరించిపోయే మార్గాన్ని ఉపదేశించే కారుణ్యమా?  పరిశోధించి తెలుసుకోవాలి అనిపించిందామెకు. కానీ ముందుగా శంకరవిజయాన్ని ప్రకటించవలసి ఉంది. ‘‘శంకరాచార్యా! విజయోస్తు. కర్మమార్గం కంటే జ్ఞానమార్గమే గొప్పది అని నిరూపించారు. భక్తిరేవ గరీయసీ అని మీరు వివరించి చెప్పిన విధానం బాగున్నది. మీ వివేక చూడామణి మానవాళికి శిరోధార్యమవుతుంది. ఈ వాదంలో మీరు నెగ్గారు’’ అన్నది ఉభయభారతి. అప్పటివరకూ అక్కడే ఉన్న చిలుకలు రెండూ ఆహార సంపాదన కోసం కాబోలు  తేలిగ్గా ఎగిరి వెళ్లిపోయాయి.

మండనమిశ్రుడు తన మెడలోని పుష్పమాలికను తీసివేసి శంకరుని ముందు మోకరిల్లాడు. ఒక శిష్యుడు నిజగురువును చేరినప్పుడు ఎలా స్తోత్రం చేయాలో అలా శంకరుని గుణవైభవాలను స్తోత్రం చేయసాగాడు. విదితో2సి సంప్రతి భవాన్‌ జగతః ప్రకృతిః నిరస్తసమతాతిశయః అవబోధమాత్ర వపుః అప్య బుధోద్ధరణాయ కేవలముపాత్తతనుః – ‘‘ఓ జగద్గురూ! నేటికి మిమ్మల్ని తెలుసుకోగలిగాను. సమతావాదమే మీకు సహజ ప్రకృతి. అతిశయాలు లేని మీ నిరాడంబర వర్తనతో సన్మార్గులను ఉద్ధరించడానికే జ్ఞానావతారం దాల్చిన కారుణ్యమూర్తి మీరు.

కపిలుడు, దత్తాత్రేయుడు, వేదవ్యాసుల వలె కలియుగంలో మీరు సంసార దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్న అజ్ఞానులను తరింప చేసేందుకే వచ్చారు. మీ రాకతో ఉపనిషత్తులు వెలువరించిన వేదాంతజ్ఞానం సుస్థిరమైంది. మీరు వర్షించే అద్వైతామృత సుధాధారలు యుగాంతాల వరకూ ఎడతెరిపి లేకుండా జీవులను ముక్తులను చేస్తూనే ఉంటాయి. వాద సందర్భంలో నేను చేసిన ప్రేలాపనలన్నింటినీ దయతో మన్నించండి. మీ దర్శనంతో నాలో తాపాలన్నీ చల్లారాయి. ఈ వాదనతో నాలోని స్వాభిమాన జాడ్యం నశించింది. మీ శిష్యత్వం పొందడమే బహుజన్మకృత పుణ్యఫలం. దయచేసి నన్ను అనుమతించండి. వేదవిజ్ఞానం నేటికాలం వారి కువ్యాఖ్యానాల వల్ల అపార్థాల పాలవుతోంది. ఈ అవ్యవస్థను సరిచేసేందుకు మీరు చేపట్టిన మహోద్యమంలో మీతోపాటు నడిచే అవకాశమివ్వండి. నా వాదప్రతిజ్ఞ నిలబెట్టుకుంటాను. నాకు సన్యాసమిప్పించండి’’ అని శరణాగతుడయ్యాడు.

‘‘ఆర్య మండనమిశ్రా! మిమ్మల్ని శిష్యునిగా పొందడం ఆనందమే. సన్యాసమిచ్చేందుకు అభ్యంతరం లేదు. కానీ ముందుగా మీ ధర్మపత్ని అనుమతి అత్యవసరం’’ చెప్పాడు శంకరుడు. మండన మిశ్రుడు తలతిప్పి ఉభయ భారతి వైపు చూశాడు కానీ, పెదవి కదిపి మాట్లాడనే లేకపోయాడు. ఆమె ఒక్కసారి దీర్ఘనిశ్వాస తీసుకుని, ‘‘నిజమైన వైరాగ్యం లేకుండా గురువులు సన్యాసం అనుగ్రహించరు. గృహస్థులు కావడమూ, సన్యాసులు కావడమూ వాదాల కోసమో, పంతాల కోసమో అయితే ధర్మార్థకామాలు మూడూ చెడతాయి. గుడ్డిగా అనుసరించిన మార్గంలో చతుర్థ పురుషార్థం ఉందో లేదో ఎవరికెరుక?’’ అన్నది.

సభలో ఉన్నవారిలో ఎవరూ మాట్లాడలేదు. కాళిదాసు, వరరుచి వంటి పెద్దలు అంతిమ ఫలితం ఏమవుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘‘శంకరాచార్యా! మీ గెలుపు సంపూర్ణమేనని భావిస్తే... సన్యాసం తీసుకుంటానని వాదప్రతిజ్ఞ చేయడం సమంజసమేనని అనుకుంటే వారిని మీ శిష్యునిగా మార్చుకోండి’’ అన్నది ఉభయ భారతి. శంకరుడు వెంటనే బదులు చెప్పలేకపోయాడు. మండన మిశ్రుడు తలదించుకుని ఉన్నాడు. కొద్దిసేపటి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఉభయ భారతి బరువైన గుండెతో తన మనోభావాన్ని ఇలా వెలిబుచ్చింది. ‘‘భర్త మాట చెల్లించడం భార్యగా నాకు అన్నింటికంటే ముఖ్య కర్తవ్యం. వారు నన్ను అనుమతి కోరనూ వద్దు. భర్త సన్యసించడానికి అనుమతించే అగత్యం నాకు పట్టనూ వద్దు. ఇప్పుడే నేనీ జన్మ చాలించుకుంటాను’’ అన్నది.

సభలోని వారంతా అప్రతిభులై మాటాపలుకు లేకుండా ఉండిపోయారు. ఉభయ భారతి పద్మాసనంలో కూర్చుంది. శ్వాసను కుంభించి కపాల భేదన సిద్ధితో శరీరత్యాగానికి సిద్ధపడింది. కాళిదాసు ముందుగా తెప్పరిల్లి, ‘‘ఒకప్పుడు దూర్వాసుడు సత్యలోకాన్ని సందర్శించాడు. ఆ సమయంలో శారదాంబ చేతిలోని వీణ ఎందుచేతనో అపశ్రుతిని పలికించింది. అది ఆ మహర్షికి కోపాన్ని రగిలించింది. నువ్వు భూలోకంలో పుట్టు అని పలుకుల తల్లిని శపించాడు. ఆ తర్వాత శాంతించిన మహర్షి, ‘శివుడే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఆయన దర్శనంతో నీకు శాపవిమోచనం కలుగుతుంది’ అని చెప్పాడు. నేటితో ఆ గడువు పూర్తయినట్లుంది’’ అని ఉభయ భారతి అవతార రహస్యాన్ని చెప్పసాగాడు.

దేవి వదనం కుంకుమ వర్ణంలోకి మారుతోంది. సభలోని కొందరు ఇటువంటి సన్నివేశాన్ని చూడవలసి వచ్చినందుకు బాధపడుతున్నారు. చాలా కొద్దిమంది అదృష్టవంతులకు మాత్రమే శక్తిదర్శనంతో తన్మయత్వం ఆవరిస్తోంది. ఆమె కూర్చుని ఉన్న పీఠం పద్మమై ఆమెయే ద్విభుజమూర్తి అయిన శాకంబరీ స్వరూపంగా గోచరిస్తోంది. దైవీశక్తి ప్రకటమవుతుండగానే శంకరుని పెదవులు దుం అనే దుర్గాబీజాన్ని స్వాహాశక్తితో కలిపి ఉచ్చరిస్తున్నాయి. ఉభయ భారతి క్రమంగా ఊర్ధ్వగామినియై మరో మెట్టుపైనున్న భూమికలో ప్రవేశిస్తోంది. ఆమె ద్విభుజాలు అష్టభుజాలయ్యాయి. ఆ ఎనిమిది చేతులలోనూ ఉన్న వివిధ ఆయుధాలతో ఆమె రక్షాశక్తిగా అవతరించింది. ఉద్యద్వికృతి భుజాఢ్యా మాహిషకే సజలజలద సంకాశా సింహస్థా వా2గ్నినిభా పద్మస్థా వాథ మరకత శ్యామా మరకత శ్యామ వర్ణంలో సాధకులకు పద్మంలోని నీలిమలా గోచరిస్తున్న నీవే, అగ్నిసమాన కాంతులు విరజిమ్ముతూ మహిషాసురుణ్ణి అష్టభుజాలతో పరాక్రమించి మట్టుబెడుతున్నావు. ఓ దుర్గా! నీవు మా పట్ల ప్రసన్నవు కమ్మని శంకరుడు ఆ మూర్తిని ధ్యానించాడు. ఆమె ఆసనమైన పద్మం సింహంగా మారింది. అష్టపీఠశక్తులు ఆమెను సేవించడానికి వచ్చాయి. పరివారంతో సహా ఆమె మరింత పైపైకి వెళ్లడానికి ఉద్యుక్తురాలైంది.

శంకరుడు పీఠన్యాసం చేశాడు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా, కామా, కామినీ, కామదాయినీ, రతిప్రియా, ఆనందా, మనోన్మనీ అనే తొమ్మిది శక్తులను శక్తిన్యాసం చేసి నిలిపివేశాడు. అటుపై నవచక్ర న్యాసం చేసి మరలా మంత్రోచ్చాటన ప్రారంభించాడు. దేవి తన ప్రయత్నం ఆపలేదు. తన మూడోరూపాన్ని ఆవిష్కరించింది. ఎనిమిది చేతులు పదహారు చేతులయ్యాయి. మహిషాసురునికి భయం గొలిపేలా రౌద్రరసోద్రిక్తమై ఉన్న ఆమె వదనం సాధకులకు చంద్రబింబ సమానమై ఆహ్లాదం గొలుపుతోంది. వ్యాఘ్రత్వక్‌ పరిధానా సర్వాభరణాన్వితా త్రినేత్రాచ అహికలిత నీలకుంచిత కుంతల విలసత్కిరీట శశిశకలా -మూడు నేత్రాలతో, అరుణిమ కలిగి ఉంగరాలు తిరిగిన నీలికురులతో, చంద్రకళను పోలిన కిరీటంతో సర్వాభరణాలూ కలిగి పులిని అధిరోహించిన ఓ దుర్గా! నీవు మా పట్ల ప్రసన్నవు కమ్మని శంకరుడు ఆ స్వరూపాన్ని ధ్యానించాడు. దేవి మళ్లీ తన పురోగమనాన్ని ప్రారంభించింది.

ఈమారు శంకరుడు చతుష్పీఠ న్యాసం పూర్తి చేసి తన శిరస్సుపై పాదుకా సప్తకన్యాసం చేశాడు. అయినా దేవి ఆగనే లేదు. మనోభవుడనే ఈశానుణ్ణి అంగుష్ఠంలోనూ, మకరధ్వజుడనే తత్పురుషుణ్ణి తర్జనిలోనూ, కుమారకందర్పుడనే అఘోరుణ్ణి మాధ్యమికలోనూ, మన్మథుడనే వామదేవుణ్ణి అనామికలోనూ, కామదేవుడనే సద్యోజాతుణ్ణి కనిష్ఠికలోనూ ఆవాహన చేస్తూ కరన్యాసం చేసి దేవిని ఆకర్షించాడు. శోషణ, మోహన, సందీపన, తాపన, మదనబాణాలను వేలికొనలలో ఉంచుతూ రెండు చూపుడు వేళ్లనూ ముడివేసి దిగ్బంధం చేశాడు శంకరుడు.

సువర్లోక పర్యంతమై వ్యాపించి వనదుర్గా స్వరూపాన్ని దాల్చిన ఉభయ భారతి మందహాసం చేసింది. ‘‘జగద్గురూ! మీరు శక్తిని కొత్తగా కల్పించలేరు. అది లేనిచోటంటూ లేదు కనుక అసలు లేకుండా నశింప చేయనూలేరు. దానిని పెంచి ప్రయోజనమూ పొందగలరు. తగ్గించి సాంత్వన పొందనూగలరు. దేవతలకైనా శక్తిని అదుపు చేయడం సాధ్యపడదు. దానికి వినియోగమే కానీ ఉపసంహారం లేదన్నది మీకు తెలుసా?’’ అన్నది. శంకరుడు అందుకు తన సమాధానంగా ప్రకృతిస్తోత్రం చేయడం ప్రారంభించాడు.
ప్రసీద ప్రపంచస్వరూపే ప్రధానే
ప్రకృత్యాత్మికే ప్రాణినాం ప్రాణసంజ్ఞే
ప్రణోతుం ప్రభోప్రారభే ప్రాంజలిస్త్వాం
ప్రకృత్యా 2ప్రతర్క్యే ప్రకామ ప్రవృత్తే
– ప్రకృతి స్వరూపిణివైన ఓ మాతా! మా పట్ల ప్రసీదవు కమ్ము. ఈ సమస్త విశ్వమూ నీలోనే ఉంది. ఇదంతా నీ ద్రవ్యమే. ప్రాణశక్తిగా జీవులందరిలోనూ ఉన్న ద్రవ్యరాశి నీవు కల్పిస్తున్నదే. రెండు చేతులూ జోడించి నీముందు శిరస్సు వంచుతున్నాను. తర్కాలకు అందని, నిత్యచైతన్యశీలమైన నీ ప్రవృత్తిని ధ్యానిస్తున్నాను. ఏవేవో పదాలను కూర్చి నీపై స్తుతులు రచిస్తూ ఉంటాం. ఈ స్తోత్ర వాక్యాలకు కొన్ని పరిమితులు ఉంటే ఉండవచ్చు. కానీ అక్షర సమామ్నాయమే నీవు, నిన్ను పాడిన పదం నీలాగే శాశ్వతమవుతుంది. అందుకే నిన్ను నా వాక్‌ పుష్పాలతో అర్చించకుండా ఉండలేను.

సృష్టిని నిర్వహిస్తున్న మాయవు నీవే. సృష్టి స్థితి కారకులైన త్రిమూర్తులు సైతం నీవు విధించే తిరోధాన, ఉపసంహారాలను అర్థం చేసుకోలేక తికమక పడుతుంటారు. నీ మాయాప్రభావం వల్ల తమ అధిష్ఠాతవైన నిన్ను తెలుసుకోలేక పోతున్నారు. అటువంటి వారికి కూడా అంతుపట్టని నీవు ఈ భక్తుడి పట్ల ప్రసన్నవు కమ్ము. నా స్మృతిపథంలో ఎల్లవేళలా బోధారూపంలో నిలిచివుండు. సమస్తమూ నీవే అయి నీనుంచి మరలిపోకుండా నా మనోవృత్తిని శాసించు. తప్పిదాలను మన్నించి ఆదరించు... అన్నాడు స్తోత్రంలో శంకరుడు.

దేవి ప్రసన్నమయింది. ‘‘జగద్గురూ! బరువైన బాధ్యత స్వీకరిస్తున్నారు. అడుగడుగునా పరీక్షలు ఎదురవుతాయి. సిద్ధపడండి’’ అన్నది. శంకరుడు మరోసారి చేతులు జోడించాడు. అతడి మెడలో అప్పటివరకూ వేలాడుతున్న జాజిపూల మాల అలవోకగా ఎగిరివెళ్లి దేవి పీఠం ముందు పడింది. అంతటితో ఆమె పూర్తిగా కట్టుబడింది. మహాతేజాన్ని ఉపసంహరించుకుని మునుపటి రూపాన్ని సంతరించుకుంది. ఇది దర్శించిన వారంతా తరించారు. ఏమరుపాటుతో కూర్చున్న వారికి మామూలు సంభాషణలాగనే తోచింది.

‘‘శంకరాచార్యా! ఇప్పుడు మీకు నా భర్తతో పాటు నాతో కూడా వాదించవలసిన ఆవశ్యకత ఏర్పడినట్లుంది’’ అన్నది దరహాస వదనంతో ఉభయ భారతి.
‘‘అలాగే. ఇకనుంచి నీవు చెప్పినట్లే నడుచుకుంటాను. అమ్మా! నువ్వు మా అమ్మవు కావాలి’’ అన్నాడు శంకరుడు.
‘సన్యాసులు స్త్రీలతో వాదనకు దిగడం ఆశ్రమధర్మానికి విరుద్ధం’ అంటూ సభలోంచి కొందరు బయటకు వెళ్లిపోయారు. ముఖ్యులైన వారెవరికీ అది పట్టలేదు.
ఉభయ భారతి ప్రారంభించింది. ‘‘పుత్రుడు సర్వజ్ఞుడు కావాలనీ, అమాయకుడై మోసపోకూడదని తల్లి ఆరాటపడుతుంది. మీ గత స్తోత్రాలకు భిన్నంగా ఇప్పుడు చేసిన ప్రకృతి స్తోత్రం విన్నాను. జ్ఞానప్రధానమైన వేదాంతమార్గంలో నిగ్గుతేలిన మీరు క్రియాప్రధానమైన తంత్రశాస్త్రంలోనూ ప్రతిభ చాటుకున్నారు.  ఇది చెప్పండి మరి... కాలస్వరూపుడైన నారాయణునికి సైతం తెలియని ఆ ప్రకృతి ఎవరు? ఆమెకు తగిన పురుషుడెవరు?’’ అని ప్రశ్నించింది.
‘‘కాలానికి తెలియనివారంటూ ఎవరూ లేరు. అప్పుడింకా సృష్టి జరగనేలేదు’’ అన్నారు మధ్యలో బౌద్ధులు కల్పించుకుంటూ.
‘‘అసలు సృష్టి ఎప్పుడూ జరగనే లేదు. దానికొక ప్రారంభమంటూ ఏమీ లేదు. కాలం విసిరే ప్రహేళికలో వెనక్కు వెళ్లగలిగామని అనుకుంటూ మీరు దర్శిస్తున్న శూన్యం నిజానికి అశూన్యమే. పెంజీకటులకు అవ్వలి తీరంలో ఉన్నది వెలుగుల ముద్దే కానీ శూన్యం కాదు. అది తరిగిపోదు, కరిగిపోదు. కాల స్వరూపుడైన నారాయణుడు కూడా దాని అసలు స్వరూపమేమిటో నిర్వచించలేనన్నాడు. మూలప్రకృతి సత్త్వ రజస్తమో గుణాలు కలిగి షడ్విధ వికృతులను పొందినప్పుడు ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులుగా రూపుదాల్చుతాయి తప్ప... నిజానికి ఆద్యాలక్ష్మి అసలు స్వరూపం ఏదో తాను కూడా ఎరగనన్నాడు. కుండలో మట్టిలా, వస్త్రంలో పత్తిలా మూలపదార్థం ఎప్పుడూ చెక్కు చెదరక నిలిచే ఉంటుంది. మాయతో కలిసి సృష్టిని నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడో ఒకప్పుడు ప్రారంభం కానూ లేదు. ఎప్పటికీ ముగిసిపోనూ పోదు’’ అన్నాడు శంకరుడు.
‘‘అయ్యా శంకరా! ఎందుకిలా వృథాయాస పడతారు? మీరింకా పైకి ఎదగడానికి ఏమీ మిగల లేదు. కాస్త మీ విజ్ఞానాన్ని నేలబారుగా దించండి’’ అంటూ బౌద్ధులు కూడా అక్కడినుంచి లేచి వెళ్లిపోయారు.
కొద్దిసేపటి తరువాత ఉభయ భారతి మళ్లీ ప్రశ్నించింది. ‘‘జగద్గురూ! నా ప్రశ్నకు బదులివ్వండి. ప్రకృతి, పురుషులెవ్వరు?’’
‘‘సృష్టి కారణమైన కాంతి తొలుత చిన్మాత్రరూపంలో ఉంది. ఆమె తనను తాను వ్యక్తం చేసుకునే క్రమంలో ఘనీభవించి బిందువుగా మారింది. ఆ బిందువునుంచి అవ్యక్తమైన ధ్వని పుట్టింది. అప్పుడా బిందువు స్థూల, సూక్ష్మ, పరాబిందువులుగా పరివర్తన చెందింది. వీటిలో స్థూలబిందువు బీజం కాగా, సూక్ష్మబిందువు నాదమైంది. చిన్మాత్ర బిందువునే అంటిపెట్టుకుని ఉండే పరాబిందువు పచ్చని పసిమి వర్ణంలో ఉంటుంది. ఆ కళను పీతా అని పిలిచారు. మూడుగా విడివడుతున్న దశలో దానికి తెల్లనిదైన శ్వేత, ఎర్రనిదైన అరుణ, ఆ రెండూ కాని కృష్ణవర్ణంలోని అసితా కళలు ఏర్పడ్డాయి. బీజమే అక్షరమై చంద్రసూర్యాది మండలాలను సృష్టించింది. నాద, బిందువులు ఏకమైనప్పటికి అర్ధనారీశ్వరమే వాగర్థాలై జగత్తుకు మాతాపితరులయ్యారు’’ అన్నాడు శంకరుడు.
ఉభయభారతి సంతృప్తిని వ్యక్తం చేసింది. ‘‘నాదబిందువుల సంయోగమే సృష్టి. బిందువుకు కళలు ఉన్నట్లే, నాదానికి కూడా కళలు ఉన్నాయా?’’ ఉభయ భారతి తదుపరి ప్రశ్న వేసింది.
‘‘అవును. నాదానికి పదహారుకళలు ఉన్నాయి’’ అని సమాధానం ఇచ్చాడు శంకరుడు. – సశేషం

మరిన్ని వార్తలు