అమ్మతనాన్ని ఆవహింపచేసుకున్నాను...

13 May, 2017 23:53 IST|Sakshi
అమ్మతనాన్ని ఆవహింపచేసుకున్నాను...

‘ఎన్నో సినిమాలకు పాటలు రాశాను. కానీ అమ్మ మీద పాట రాయలేకపోయాను. మన హృదయంలో పవిత్రము, శుద్ధము అయిన కోరిక పుట్టి మనం పడుకున్న వేళల్లో ఆ కోరిక తాలూకు శక్తి, విద్యుదయస్కాంత తరంగాల రూపంలో విశ్వంలోకి విడుదలవుతుంది. ఆ శక్తి విశ్వశక్తిని కూడగట్టుకుని, మనం మేలుకునే సమయంలో మళ్లీ మన శరీరంలోకి చేరుతుంది. ఆ శక్తి మన కోర్కెను తీర్చడానికి ఉపయోగపడుతుంది. అమ్మ గురించి రాయాలని, ఏఆర్‌ రెహమాన్‌ ట్యూన్‌కి రాయాలని రెండు కోరికలు బలంగా ఉండేవి.

తమాషాగా ఆ రెండు కోరికలు ఒకేసారి తీరే అదృష్టం ‘నాని’ చిత్రం ద్వారా కలిగింది. ఎ.ఆర్‌. రెహమాన్‌... ఒకరోజు రాత్రి 11.30కి ట్యూన్‌ ఇచ్చారు. మరుసటి రోజు 10.30కి లిరిక్స్‌ పూర్తి చేయాలి. తగినంత సమయం లేదు. అమ్మ మీద పాట రాయాలి. వెంటనే మా అమ్మని గుర్తు తెచ్చుకున్నాను. అమ్మ నన్ను ఎలా పెంచిందో, ఎన్ని త్యాగాలు చేసిందో... అనుకుంటూ అమ్మతనాన్ని ఆవహింపచేసుకున్నాను.. వెంటనే ‘పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ ...’ పల్లవి వచ్చింది. ప్రతిరోజూ మనం మాట్లాడే కోట్లాది మాటల్లో... తీయనైనది, గొప్పనైనది ‘అమ్మ’... అనే మధురమైన ఆలోచన నుంచి పల్లవి రాసుకున్నాను.

ఇంటిల్లిపాదికీ ‘తనలోని మమతే కలిపి పెడుతుంది ముద్దగా’. మమత తాలూకు జీవశక్తి వంటి ఆహారం తిని, మా శరీరాలు వృద్ధి చెందాయి. సంగీత రీతుల్లో లేకపోయినా ఆమె లాలిపాటలు పాడి మమ్మల్ని నిద్రపుచ్చింది. ఆమె పాటలో ప్రేమ, మధురిమ ఉంటాయి. అమ్మ గురించి చెప్పేటప్పుడు ఉత్కృష్టమైన పదాలు ఉపయోగించకూడదు. అమ్మ అనే భావానికి ‘స్వచ్ఛత’ అనేది అలంకారం. స్వచ్ఛంగా సహజంగా అనిపించడంలో గొప్పదనం ఉంటుందని నా అభిప్రాయం. ‘కరుణించే కోపం అమ్మ... వరమిచ్చే తీపి శాపం అమ్మ...’ వాక్యాలు అందరికీ బాగా నచ్చాయన్నారు.

అమ్మకు వచ్చే కోపం కరుణతో కూడినది, అమ్మ పెట్టే శాపాలు తీయటి వరాలు. ఏ తల్లికీ పిల్లల మీద ద్వేషంతో కూడిన కోపం ఉండదు. పిల్లలను వినాశనం కోరుతూ ఏ తల్లీ శపించదు. ఆమె తిట్లు పిల్లల పాలిట వరాలు. పాట విడుదల కాకముందే... ప్రముఖ చిత్రకారులు ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ ప్రశంసలు అందుకున్నాను. ఈ పాట అందరికీ చేరువవుతుంది అనుకున్నాను. పాట వినగానే అందరికీ వాళ్ల అమ్మ, బాల్యం, అమ్మ ప్రేమ భావించుకోవాలనుకున్నాను. సాధించగలిగాను. ఇన్నాళ్ల సాహిత్య ప్రస్థానంలో నేను ఇష్టపడిన పాట, నాకు సంతృప్తిని ఇచ్చిన పాట.
– సంభాషణ: డా. వైజయంతి

మరిన్ని వార్తలు