ఆమె లేని అతడు లేడు

4 May, 2014 12:53 IST|Sakshi
ఆమె లేని అతడు లేడు

హృదయం
 
ఆ రోజు రాత్రే ఆమె చనిపోయింది. అంతలోనే ఆ ఇంట్లో ఇంకో ప్రాణం పోవడానికి సిద్ధమైపోయింది! నిజానికది పెద్ద విషాదం. అయితే క్షణక్షణానికీ అతను మృత్యువుకు చేరువవుతుంటే, వారికెంతో ఆనందం. అతని సన్నిహితులందరినీ పిలిచారు. ఇంట్లో సందడి వాతావరణం. సరిగ్గా ఆమె తుది శ్వాస విడిచిన పన్నెండు గంటలకు అతనూ మృత్యు ఒడిలోకి చేరిపోయాడు. ఒక్కరోజైనా గడవకముందే ఆ ఇంట్లో రెండు ప్రాణాలు పోవడం ఓవైపు మెలిపెడుతున్నా, వాళ్లిద్దరూ మృత్యువులోనూ విడిపోలేదన్న ఆనందం ఆ కుటుంబానిది.
 
అమెరికాలోని ఓహియోకు చెందిన కెనెత్, హెలెన్‌లది డెబ్భై ఏళ్ల బంధం. వీరి కలయికే చిత్రమైంది. కెనెత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ద్వారా ఆమె అతనికి పరిచయమైంది. అప్పుడామెకు పద్దెనిమిదేళ్లు. కెనెత్‌కు పందొమ్మిది. మూడేళ్ల పాటు ఇద్దరూ డేటింగ్ చేసుకున్నారు. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఓ రోజు కెనెత్ తన తండ్రి దగ్గరికెళ్లి, తాను హెలెన్‌తో కలిసి ఓ టూర్‌కు వెళ్తున్నట్లు చెప్పాడు. చేతిలో ఐదు డాలర్లతో ఇద్దరూ ఆ టూర్‌కు బయల్దేరారు.
 
మరుసటిరోజు... అంటే 1944 ఫిబ్రవరి 20న ఓహియో నది దగ్గర ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తోడుగా ఎవ్వరూ లేరు. ఇద్దరూ రింగులు మార్చుకుని పెళ్లి తంతు ముగించారు. అది అనుకోకుండా జరిగిన పెళ్లి కాదు. కెనెత్ పెళ్లికి అర్హత సాధించి అప్పటికి రెండు రోజులే దాటింది. తమ పెళ్లికి న్యాయపరమైన చిక్కులు అడ్డుపడకూడదనే ఆ మూడేళ్లు ఎదురుచూశారు వాళ్లిద్దరూ. పెళ్లి చేసుకున్న ఇద్దరూ ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు.
 
కొన్నాళ్ల తర్వాత తమ పెద్దలకు విషయం చెప్పి ఒక్కటయ్యారు కెనెత్, హెలెన్. అయితే, ఆ తర్వాత మొదలయ్యాయి కష్టాలు. హెలెన్ కొన్ని నెలలకే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు గడవడం కష్టమైంది. మొదట ఓ కంపెనీలో కార్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన కెనెత్ తర్వాత మెయిల్ క్యారియర్ ఉద్యోగంలో చేరాడు. దీంతో పాటు ఓ చర్చిలో ఆదివారం ఉపాధ్యాయుడిగానూ పనిచేశాడు.
 
మరోవైపు హెలెన్ కూడా రకరకాల పనులు చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా నిలిచింది. అయితే, సంతానం విషయంలో ఇద్దరూ ఏమాత్రం పరిమితులు పెట్టుకోలేదు. ఏకంగా ఎనిమిది మందికి జన్మనిచ్చారు. వీళ్లందరినీ పెంచి పెద్ద చేసేసరికి జీవితాలు అయిపోయాయి. కెనెత్ రిటైరయ్యే సరికి పిల్లలు సెటిలైపోయి, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.


 
చివరికి ఇంట్లో కెనెత్, హెలెన్ మాత్రమే మిగిలారు. ఇక్కడి నుంచే వారి జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. అన్నేళ్లూ కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయిన ఇద్దరూ... మళ్లీ కొత్తగా తమ ప్రేమకథకు శ్రీకారం చుట్టారు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా జీవితాన్ని గడిపారు. జీవిత చరమాంకంలో దేశం చుట్టే పనిలో పడ్డారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లోనూ పర్యటించి, మధురానుభూతుల్ని మిగుల్చుకున్నారు. అయితే, వయసు మీదపడటంతో కెనెత్‌కు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి.
 
రక్త ప్రసరణలో ఇబ్బందులు రావటంతో అతని కాలు తీసేయాల్సి వచ్చింది. ఇక అతనికి అన్నీ ఆమే. నిద్ర లేచినప్పటి నుంచీ పడుకునేదాకా... కాదు, కాదు, పడుకున్నాక కూడా అతనికన్నీ ఆమే. ఇలా అతణ్ని కంటికి రెప్పలా కాపాడుకునే క్రమంలో ఆమె కూడా అనారోగ్యం పాలైంది.
 
70 ఏళ్ల పాటు తనతో జీవనయానం సాగించిన హెలెన్ కళ్ల ముందే ఇటీవల ప్రాణాలు విడిచింది. అంతే కెనెత్ తట్టుకోలేకపోయాడు. ఆమె చనిపోయిన కొన్ని నిమిషాల నుంచే అతనూ అచేతనుడైపోయాడు. అప్పటికే ఇంటికి చేరిన అతని కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లకు విషయం అర్థమైపోయింది. కెనెత్ సన్నిహితులందరినీ పిలిచారు. తన ప్రేయసి దగ్గరికే వెళ్తున్న అతనికి అందరూ దగ్గరుండి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె రాత్రి ప్రాణాలు వదిలితే, మరుసటి రోజు ఉదయం అతను తుదిశ్వాస విడిచాడు. మృత్యువు 12 గంటలకు మించి వాళ్లిద్దరినీ వేరు చేయలేకపోయింది.

మరిన్ని వార్తలు