బడికి వచ్చి... కథలు చెప్పే బామ్మలు

18 Jun, 2017 01:12 IST|Sakshi
బడికి వచ్చి... కథలు చెప్పే బామ్మలు

కథలు కాలక్షేపం మాత్రమే కాదు శాస్త్రీయంగా చెప్పాలంటే సృజన నుంచి మానసికసై్థర్యం వరకు ఎన్నో  ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఊపిరి సలపనివ్వని చదువుల్లో కథాదీపం కొడిగట్టిపోతోంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతి శనివారం ‘బాలసభలు నిర్వహిస్తుంది. ఈ బాలసభల్లో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కథాసదస్సులు కూడా నిర్వహిస్తుంది. విశేషమేమిటంటే ఈ కథలు వినిపించే వాళ్లు ఉపాధ్యాయులు కాదు... ఊళ్లోని బామ్మలు. రకరకాల కథలు.కొన్ని కథలు తెగ నవ్విస్తాయి. కొన్ని కథలు ఏడిపిస్తాయి.

ఏ కథ ఎలా ఉన్నా... అన్ని కథలూ  అనే తీయటి మిఠాయి పొట్లాన్ని పిల్లల చేతుల్లో పెడతాయి.మన సంస్కృతిలో ‘మౌఖిక కథాసంప్రదాయం అనేది విలువైనది. ఈ విలువైన సంప్రదాయం బామ్మల ద్వారా బలోపేతం అవుతుంది.‘‘నైతిక విలువలు, కుటుంబ విలువలు బలోపేతం కావడానికి పిల్లల్లోని ఊహాశక్తి మెరుగుపడడానికి... ఉత్తమమైన, దృఢమైన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడానికి ఈ కథాసదస్సులు ఉపకరిస్తాయి అంటున్నారు డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ అరుణ్‌ కుమార్‌.

అణువణువూ టెక్నాలజీ ఆక్రమించి, ఆ సాంకేతిక సదుపాయాలలో ఆలోచనకు స్థానం దొరకని ఈరోజుల్లో మౌఖిక కథా సంప్రదాయం ఎన్నో ద్వారాలు తెరుస్తుంది అని చెబుతున్నారు అరుణ్‌. ప్రతి ప్రాంతానికీ తనదైన విలువైన సంస్కృతి ఉంటుంది. ప్రతి భాషకు తనదైన విలువైన పదసంపద ఉంటుంది. అన్ని సందర్భాల్లోనూ ఈ ‘విలువ బహిర్గతం కాకపోవచ్చు. అంతర్వాహినిలాంటి ఈ సంపద కథల రూపంలో బామ్మల నోటి నుంచి పిల్లలకు అందుతుంది.

 దీని కోసం బామ్మలను ఎంచుకోవడానికి కారణం ఏమిటి?
రకరకాల సంస్కృతులు, మనస్తత్వాలను అర్థం చేసుకోవడం, కొత్తగా ఆలోచించడం మాత్రమే కాదు ఈతరం పిల్లలకు, వయోవృద్ధులకు మధ్య ఆత్మీయతను పెంచడానికి కూడా ఈ కథా సదస్సులు ఉపకరిస్తాయి. ఇప్పుడు బామ్మల ఒంటరి ప్రపంచంలోకి పిల్లలు వచ్చారు. పిల్లల ప్రపంచంలోకి బామ్మలు వచ్చారు. వాళ్లు వస్తూ రాజ్యాలను తెచ్చారు. రాజులను తెచ్చారు. సూర్యుడిని దివిటిగా వెలిగించి చేతికందించారు. చందమామను తెంచి చేతిలో పెట్టారు. రెండు ప్రపంచాలు మారాయి! ‘బామ్మకథలు ఇప్పుడు కొందరి జ్ఞాపకాల్లోనే మిగిలిపోలేదు. ఇప్పుడు సరికొత్తగా పిల్లలకు చేరువవుతున్నాయి.మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రయత్నమేదైనా మొదలైతే బాగుంటుంది.

మరిన్ని వార్తలు