దిల్‌ దిల్‌ రమజాన్‌

10 Jun, 2018 01:33 IST|Sakshi

రమజాన్‌ చివరి పదిరోజులు ఎంతో కీలకం. ఖుర్‌ఆన్‌ గ్రంథ సందేశాలు దివి నుంచి భువికి వచ్చింది ఈ చివరి పదిరోజుల్లోని ఒక బేసి రాత్రిలోనేనన్నది ప్రవక్త సూచన. అందుకే ఆ రాత్రిని అన్వేషించడం, ఆ రాత్రిలో దైవచింతనలో గడపడం వెయ్యి నెలలపాటు చేసిన పుణ్యకార్యాలతో సమానంగా ముస్లిముల విశ్వాసం. 

నేల నేలంతా ఒక్కటే పాట..షానే రమజాన్‌... జానే రమజాన్‌... దిల్‌ దిల్‌ రమజాన్‌ప్రేమ, కరుణ, క్షమ, ఆరాధనల పవిత్ర నెల, ఒకరినొకరు క్షమించుకుని చూసుకునే ప్రేమపూర్వక చూపులు, ఆకలి బాధానుభూతులు, ఇఫ్తార్‌ ఆనందాలు సహెరీ శుభాలు, జకాత్, ఫిత్రా దానాలు, ఖుర్‌ఆన్‌ పారాయణ చైతన్యం, తరావీహ్‌ ఆరాధనలు, మది నిండా రమజాన్‌ వెలుగులే!మాటల్లో, చేతల్లో దైవాదేశాల పరిమళాలే. నలుదిశలా ప్రేమ పవనాల సుమగంధాలే. ఇదంతా అల్లాహ్‌ రాసిన వరాల వీలునామా. రమజాన్‌ వరాలు లెక్కకట్ట తరమా!

రమజాన్‌ అంటే కాల్చివేయడం, దహించి వేయడం అని నిఘంటువు అర్థం చెబుతుంది. మంటల్లో ఏమి వేసినా భస్మీపటలం కావాల్సిందే. ఉపవాసంతో కలిగే ఆకలి మంటలో రోజేదార్ల పాపాలు, చెడుగులన్నీ దహించుకుపోతాయి. ఇలా ముఫ్పై రోజులూ గత ఏడాదిపాటు చేసిన పాపాలన్నీ దగ్ధం అవుతాయి. పాపాలన్నీ కాల్చివేసి రోజేదార్‌ను పునీతుడిని చేస్తాడు అల్లాహ్‌. ఈద్‌ వరకూ రోజేదార్లు తమ పాపాల నుంచి విముక్తి పొంది పవిత్రంగా రూపు దాల్చుతారు. ఇలాంటి పునీతులకు అల్లాహ్‌ ఈద్‌ రోజు ప్రసన్నమవుతాడు. అదే ఈద్‌ కానుక. అల్లాహ్‌ పట్ల ఎనలేని ప్రేమతో ఆకలి బాధతో వచ్చే ‘యా అల్లాహ్‌’ అనే ఒక్క పిలుపు సప్తాకాశాలపైన కొలువుదీరిన అల్లాహ్‌ సింహాసనం వరకు వెళుతుంది. సప్తాకాశాలన్నీ రోజేదార్ల పిలుపుతో మార్మోగుతాయి. రమజాన్‌ నెల సాంతం సప్తాకాశాలల్లో ఉన్న దైవదూతలంతా రోజేదార్ల మేలు కోసం, యోగక్షేమాల కోసం అల్లాహ్‌ను వేడుకుంటారు. రోజేదార్ల వేడుకోళ్లకు తథాస్తు పలకండని అల్లాహ్‌ దైవదూతలను పురమాయిస్తాడు. ఇంతటి మహత్తరమైన రమజాన్‌ వసంతం ముప్ఫై రోజుల పండువలా జరుపుకుంటున్నారు ముస్లిములు. ఇఫ్తార్‌ ఆనందాలు, సహెరీ శుభాలు తనివితీరా ఆస్వాదిస్తున్నారు. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలు, ఒకరినొకరు క్షమించుకోవడం, క్షమ, దాతృత్వం వంటి శుభలక్షణాలు, సుగుణాలు పాలలా ప్రవహిస్తాయి. మది నిండా ప్రేమ, దయ, క్షమతో పొంగిపొర్లుతుంది. ఘడియ ఘడియను అల్లాహ్‌ను మెప్పించేందుకే ప్రయత్నాలన్నీ. ఆ పరమ ప్రభువును ప్రసన్నం చేసుకుంటే చాలు భూమ్యాకాశాల కంటే కూడా విశాలమైన స్వర్గలోకానికి అర్హత సాధించవచ్చన్నదే రోజేదార్ల ఆరాటం. దురలవాట్లకు దూరంగా ఉంటూ నిర్మల మనస్సుతో అల్లాహ్‌ మెప్పుపొందడమే రోజేదర్ల తపనంతా. ప్రతివారూ తమతమ మనసు తరచి చూసుకుంటారు. మానవాళి సన్మార్గాన్ని పొందడమే రమజాన్‌ ఉద్దేశం. ఐహిక సుఖాల పిపాసను ఉపవాసం అంతమొందిస్తుంది. ఆధ్యాత్మిక వికాసం సొంతమవుతుంది. అపరిమిత ధనార్జన మనిషిని వినాశనంపాలు చేస్తే జకాత్, దానాలు ప్రేమభావాన్ని జనింపచేస్తాయి.

మనసును జయించాలి..
మనసు చాలా విచిత్రమైనది. కోరికలు కళ్లెంలేని గుర్రాలు. మనసును జయించిన వారే ఆధ్యాత్మిక విజయాన్ని సాధిస్తారు. మనస్సును నిగ్రహించుకోవడంలో ఉపవాసం కీలకపాత్ర పోషిస్తుంది. లేవలేని సమయంలో లేచి అన్నపానీయాలు భుజించడం, తినే తాగే పగటి వేళలో పస్తులుండటం, హాయిగా పడుకునే వేళలో దైవం ముందు ఆరాధన చేయడం ఇవన్నీ మనోనిగ్రహానికి సాధనాలుగా పనిచేస్తాయి. ఈ నిగ్రహం లేకపోతే మనసు ప్రపంచ తళుకుబెళుకుల వెంట పరుగెడుతుంది. ఆకర్షణలకు బానిసవుతుంది. పతనానికి కారణమవుతుంది. అదే మనసును అదుపులో ఉంచుకుంటే ఎన్నో విజయాలు సాధించవచ్చు. ఆ పనే చేయిస్తుంది ఉపవాసదీక్ష.  దైవభీతిని, ధర్మనిష్ఠను పెంపొందించడమే ఉపవాసం ఉద్దేశం అంటోంది ఖుర్‌ఆన్‌. రోజంతా ఆకలి దప్పులతో ఇఫ్తార్‌ వేళలో తన ముందు ఉన్న రుచికరమైన అన్నపానీయాలను ఇఫ్తార్‌ ఘడియకు క్షణం ముందు కూడా నోట్లో వేసుకోకపోవడానికి కారణం రోజేదార్లలో కలిగే పాపభీతి, వివేకవిచక్షణలే. అందుకే ముస్లిముల హృదయాలు నెలసాంతం ధర్మనిష్ఠతో, మంచి పనులతో పులకించిపోతారు. ప్రేమ, కరుణ, క్షమ, దానగుణం అనే సుగుణాలను పెంపొందించుకుంటారు.ఇఫ్తార్‌ చేసి నమాజ్‌ చేసుకుని ఇంటికొచ్చిన సగటు ముస్లిమ్‌ కాస్సేపు మేను వాల్చాడో లేదో ఇషా నమాజ్‌ కోసం మస్జిదు నుంచి పిలుపు వస్తుంది. ఆపై తరావీహ్‌ నమాజులో ఖుర్‌ఆన్‌ వినడం జరుగుతుంది. సుమారు 2గంటల నిడివితో మస్జిదులో అల్లాహ్‌ ముందు నిలబడి దైవారాధన చేస్తాడు. నిద్ర ముంచుకొస్తున్నా అల్లాహ్‌ మెప్పు పొందేందుకు హాయి నిద్రను త్యాగం చేస్తాడు. ఈ వాతావరణం ఒక్క రమజాన్‌ లోనే మనకు కనిపిస్తుంది.

రాత్రి దైవారాధనలో గడిపి రాత్రి చాలా పొద్దుపోయాక నిద్రకు ఉపక్రమిస్తారు. తెల్లవారు జామున మూడున్నర గంటలవుతుంది. వేళకాని వేళ నిద్రమత్తు వదలదు. ఆ వేళలో మస్జిద్‌ నుంచి మోగే సైరన్‌కు ఠంచనుగా లేస్తాడు ఉపవాసి. పడుకునే వేళలో బ్రష్‌ చేసి భోజనం చేయాలి. కేవలం పరిమిత సమయంలోగా భోజనం ముగించాలి. ఇలా తెల్లవారు జామున భోజనం చేయడాన్నే సహెరీ అంటారు. సహెరీ తరువాత నిద్రపోదామంటే కుదరదు. వెంటనే పెందలకడ చదివే ఫజర్‌ నమాజ్‌ కోసం అజాన్‌ వాణి పిలుస్తుంటుంది. వేళకాని వేళలో లేవడం, సహెరీ భుజించడం, సహెరీ వంటలు ఇరుగు పొరుగు వారికి పంపడం, నమాజ్‌ కోసం వెళ్లడం ఈ దృశ్యాలు కేవలం మనకు రమజాన్‌ నెలలోనే ప్రత్యేకం. ఈ ఆధ్యాత్మిక వాతావరణం కేవలం మనకు రమజాన్‌ నెలలోనే కనపడుతుంది. సహెరీ, ఇఫ్తార్, నమాజులు, ఖుర్‌ఆన్‌ పారాయణం, జకాత్, సదకా దానాలతో ముస్లిముల మోములు మురిసిపోతుంటాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా పద్నాలుగు గంటల దాకా ఆకలిదప్పులతో గడుపుతాడు. మనిషిని మహోన్నతంగా తీర్చిదిద్దడమే రమజాన్‌ శిక్షణ ఉద్దేశం.

ఇఫ్తార్‌ లో త్యాగభావం...
ఇఫ్తార్‌లో నలువైపులా ప్రేమ, త్యాగభావం నిండిన వాతావరణమే కనిపిస్తుంది. స్వార్థం, ప్రలోభం అన్నీ ఇఫ్తార్లో చాప చుట్టేస్తాయి. ఉచ్ఛనీచాలు అస్సలే ఉండవు. పేదలు, ధనికులు ఇద్దరూ పక్కపక్కనే కూర్చునే ఆహ్లాదకరమైన వాతావరణం ఇఫ్తార్‌ వేళలో కనబడుతుంది. తమ పక్కన కూర్చున్న వ్యక్తి పరిచయస్తుడా కాదా అన్నది ఎవరూ పట్టించుకోరు. తన వద్ద ఉన్న తినుబండారాలు, ఆహార పదార్థాలను ఏమీలేని వ్యక్తికి ఎంతో ప్రేమతో అందించే అందమైన దృశ్యాలు రమజాన్‌లో కనపడతాయి. ఇఫ్తార్‌లో తినే ప్రతి వ్యక్తి మిగిలిన వారికి సరిపోతుందో లేదో అన్న ధ్యాసతోనే తింటారు. సామాజికంగా అందరం ఒక్కటే అనే అద్భుతమైన అందమైన భావన ఆచరణాత్మకంగా కనిపిస్తుంది. వీలయినంత ఎక్కువగా ఎదుటివారికి ప్రాధాన్యమివ్వాలనే త్యాగభావం జనిస్తుంది. దాదాపు పధ్నాలుగు గంటల పాటు అన్నపానీయాలకు దూరంగా ఉండడం వల్ల ఎంత సంపన్నుడైనా ఆకలి బాధ, దప్పిక బాధేమిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. పేదల కష్టాలను అర్థం చేసుకుని ఆదుకుంటాడు. ఆహారాన్ని పంచుకు తినే అద్భుతమైన అందమైన దృశ్యాలు రమజాన్‌ మాసంలో కనువిందు చేస్తాయి.

చివరి పదిరోజులు కీలకం
రమజాన్‌ చివరి పదిరోజులు ఎంతో కీలకం. ఖుర్‌ఆన్‌ గ్రంథ సందేశాలు దివి నుంచి భువికి వచ్చింది ఈ చివరి పదిరోజుల్లోని ఒక బేసి రాత్రిలోనేనన్నది ప్రవక్త సూచన. అందుకే ఆ రాత్రిని అన్వేషించడం, ఆ రాత్రిలో దైవచింతనలో గడపడం వెయ్యి నెలలపాటు చేసిన పుణ్యకార్యాలతో సమానంగా ముస్లిముల విశ్వాసం. చివరి పది రోజులూ ఏతేకాఫ్‌ అనే ప్రత్యేక ఆరాధనను పాటిస్తారు.

అల్‌ విదా రమజాన్‌..
రమజాన్‌ వసంతానికి బాధతో, ఆర్ద్రతతో వీడ్కోలు పలుకుతారు. దిల్‌ దిల్‌ రమజాన్‌ అని పాడుకున్న ముస్లిములు నెలరోజుల అతిథిని ఎంతో గౌరవ ప్రపత్తులతో చూసుకున్న ముస్లిములు 30 రోజుల ఉపవాసాలు ముగింపు దశకు చేరుకునే సరికి బాధతో వీడ్కోలు పలుకుతారు. అల్‌ విదా.. అల్‌ విదా.. కారుణ్యాన్ని కురిపించిన వసంతమా అల్‌ విదా అని ఆర్ద్రతతో పాడుకుంటారు. ప్రేమను కుండపోతలా కురిపింపచేసిన మాసమా నీకు మా వీడ్కోలు అని పాడుకుంటారు. షవ్వాల్‌ నెలవంక కనపడగానే ఈదుల్‌ ఫిత్ర్‌ రమజాన్‌ పండుగను ఆనందోహాత్సాహలతో జరుపుకుంటారు. ఈద్‌ రోజు ముస్లిముల çహృదయాల్లో, చేతల్లో కారుణ్య ఛాయలు రెట్టింపవుతాయి. అల్లాహ్‌ చూపిన కరుణా కటాక్షాలతో నెలరోజుల ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, ముప్ఫై రోజుల పాటు దేవుని సమక్షంలో తరావీహ్‌ నమాజు చేసినందుకుగాను పేదలకు ఫిత్రా దానం చేస్తారు. పండుగ నమాజ్‌కు వెళ్లేముందు ఫిత్రా దానం చేసి పేదలకు చేయూతనిస్తారు. ఈద్గాహ్‌కు వెళ్లి ఈద్‌ నమాజ్‌ చేస్తారు. అందరి ముఖాల్లో చిరునవ్వు తొణికిసలాడేలా చేయడమే ఈదుల్‌ ఫిత్ర్‌ ఉద్దేశం. ఈద్‌ రోజు చిన్నా పెద్దా, ఆడా మగా అందరిలోనూ అనంత సంతోషంతో  హృదయాలు ఓలలాడుతాయి. వచ్చే ఏడాది వరకూ ఇదే స్ఫూర్తిని కొనసాగించేవారే నిజమైన సౌభాగ్యవంతులు. అప్పుడే నెలరోజుల రమజాన్‌ శిక్షణకు సార్థకత.
–  ముహమ్మద్‌ ముజాహిద్‌ 

మరిన్ని వార్తలు