జయహో బాపూ

30 Sep, 2018 01:45 IST|Sakshi

పాటతత్త్వం

చిత్రం: శంకర్‌దాదా జిందాబాద్‌
రచన: సుద్దాల అశోక్‌ తేజ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
గానం: దేవిశ్రీ ప్రసాద్, సాగర్‌

జెమినీ కిరణ్‌గారు నన్ను పిలిపించి ‘శంకర్‌దాదా జిందాబాద్‌’లో గాంధీ పైన పాట రాయమన్నారు. సరేనని చెప్పి ఇంటికి వచ్చి, నా ఆఫీసులో కూర్చుని గాంధీ గురించి విన్నది, చదివింది గుర్తు చేసుకుంటున్నాను. అనేక తరంగాలు ఆయన జీవన మహాసముద్రంలో లేచి పడుతున్నాయి. గాంధీ మద్రాసు వచ్చినప్పుడు రాజాజీ ఒక ప్రఖ్యాత సాముద్రికవేత్తకు గాంధీ చేయి చూపించి భవిష్యత్తు తెలుసుకుందామని చెబితే, గాంధీ సున్నితంగా తిరస్కరించి, ‘మై క్యారెక్టర్‌ ఈజ్‌ మై ఫేట్‌’ అన్నాడట.ఆయన ఆత్మకథ ఎన్నోసార్లు చదివిన నాకు ఎప్పుడూ గాంధీ పలికిన సహస్రానేక సుభాషితాల్లో పైమాటే నిరంతరం మంత్రంలా మోగుతుంటుంది.ఆయన జీవితాకాశాన్ని ఒక పల్లవి – రెండు చరణాల్లో చెప్పడమంటే కమండలంలో సముద్రాన్ని వడబోయడం కదా అనుకున్నాను. పెన్ను ఎత్తకుండా ఒకే రేఖా చిత్రంలో గాంధీని దించి సినీ నటులు గుమ్మడిగారికి ఇచ్చిన బాపు ‘గాంధీ’ చిత్రం మనసులో మెదలగానే పల్లవి పల్లవించింది.గాంధీ ఎంత నిరాడంబరుడో... పల్లవి అంతే నిరాడంబరంగా మొదలవ్వాలని ‘కళ్లజోడుతో – చేతికర్రతో కదిలిందో సత్యాగ్రహం’ అనే వాక్యం కాగితంపై సాక్షాత్కరించింది. ‘జయహో బాపూ’ అనుకున్నాను. ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే ‘‘వెండి కొండలా శిరసు పండిన యువకుల మించిన సాహసం’’ అనే వాక్యం రాలేదు. నేను రాసిన రెండో వాక్యం... ‘‘అతడంటె గడగడలాడింది ఆంగ్లేయుల సింహాసనం’’.అయితే పాట పూర్తయ్యాక నాకు సంబంధం లేకుండా జరిగిన మార్పు ‘వెండి కొండలా’ వాక్యం రెండో వాక్యమైంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ చేసిన మార్పని తెలిసి, ‘ఓహో’ అనుకుని సమన్వయం చెడనందుకు సంతోషించాను.

కళ్లజోడు – చేతికర్ర... అంటూ ఆయన వాడిన పరికరాలను పల్లవికి ఆధారంగా తీసుకున్న నేను తరవాత ఆయన ఆకారాన్ని కూడా చరణించుదామనుకుని ‘బక్క పలచని బాపు గుండెలో ఆసేతు హిమాచలం’ అని రాసి వెంటనే అతని ‘ఉక్కు నరాల్లో ఉప్పొంగే రక్తం స్వాతంత్య్ర రక్త గంగాజలం’ అన్నాను. స్వాతంత్రేచ్ఛతో ఉప్పొంగే రక్తం పవిత్ర గంగాజలం అనుకున్నాను. ఆయన పోరాటం సాయుధం కాదు, అహింసాయుధం కనుక ‘‘చాకు – పిస్టల్‌ – కొడవలి – గొడ్డలి ఎందుకు హింసా సాయుధం’’ గా కొనసాగింది. ‘‘భయం చెందని రక్తం చిందని స్వాతంత్య్రోద్యమ జ్వాలలు/ గాలి తరంగాలై వీచినవి దేశంలో నలుమూలలుగా’’ అని ముగించాను.దేశంలో వర్తమానంలో జరిగే ఘోరాలను ఆపడానికి ‘వందే మాతరం గాంధీ ఓంకారం/ఓ బాపూ నువ్వే రావాలి నీ సాయం మళ్లీ కావాలి/జరిగే దుర్మార్గం ఆపాలి నువ్వే ఓ మార్గం చూపాలి/కళ్ల జోడుతో చేతి కర్రతో కదిలే ఓ సత్యాగ్రహమా’ వాక్యాలు తర్వాత పల్లవిగా తలకెక్కాయి. ముందనుకున్న పల్లవి వాక్యాలు చరణాలు అయ్యాయి. ప్రతి అక్టోబర్‌ 2న టీవీలలో పాఠశాలల్లో జీవనదులై ప్రవహిస్తున్నాయి.
– ఇంటర్వ్యూ: వైజయంతి పురాణపండ 

మరిన్ని వార్తలు