నా షోలాపూరు చెప్పులు పెళ్లిలో పోయాయి

26 Jan, 2020 03:45 IST|Sakshi

1979లో కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో శంకరాభరణం సినిమా షూటింగ్‌ రాజమండ్రిలో జరుగుతోంది. ఒకరోజు అకస్మాత్తుగా వర్షం రావటంతో పక్కనే ఉన్న అప్సర హోటల్‌కి అందరం చేరుకుని, అందరం కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో, చంద్రమోహన్, ‘జిత్‌మోహన్‌ పాటలు పాడతాడు’ అని జంధ్యాలకు చెప్పారు. వెంటనే జంధ్యాల నన్ను పాడమన్నారు. నేను ‘హమ్‌ కాలే హై తో క్యా దిల్‌ వాలే హై’ అనే పాట పాడాను. ఆ తరవాత చాలా పాటలు పాడాను. ఆయనకు నా పాట నచ్చింది, తాను తియ్యబోయే మొదటి సినిమాలో ఒక పాట పాడిస్తాననని వాగ్దానం చేశారు. సినిమా వాళ్లు కబుర్లు చెబుతారులే, అనుకుని, నా ప్రోగ్రామ్స్‌ నేను చేసుకుంటున్నాను.

1981లో జంధ్యాల ‘ముద్ద మందారం’ సినిమా ప్లాన్‌ చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పాటడానికి రమ్మని కబురు చేశారు. ఆ రోజు నేను భీమవరంలో ప్రోగ్రామ్‌కు వెళ్లాలి. అది చాలాకాలం క్రితమే ఒప్పుకున్నా ను. రాకరాక వచ్చిన సినిమా అవకాశాన్ని వదులుకోవాలనిపించలేదు. భీమవరం ప్రోగ్రామ్‌ వాళ్లకి, ఒంట్లో బాగోలే ద చెప్పి, మద్రాసు వెళ్లిపోయాను. జంధ్యాలకు సుబ్బారావు, బాబన్న అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారు హిందీ పాట ‘హమ్‌ కాలే హై తో క్యా దిల్‌ వాలే హై’ కు తెలుగు పేరడీ రాస్తున్నారు. నేను కూడా వారితో కలిసి ఆ పాట పూర్తి చేశాను. ఆ పాట జంధ్యాల నన్ను పాడమన్నారు. సంగీత  దర్శకులు రమేశ్‌నాయుడు గాయకుడి గొంతు వింటేనే కాని అంగీకరించరు. కాని జంధ్యాల గారి మాటను గౌరవించి, నన్ను పాడమన్నారు.

నేను ఎక్కువ శృతిలో పాడతానన్నాను. ఎంత శృతి కావాలి అన్నారు నాయుడుగారు. నేను ఆరున్నర అని చెప్పాను. పైస్థాయి పాడటం కష్టం, అయినా ఒకసారి చూద్దాంలే అని, నన్ను పాడమన్నారు. నేను గట్టిగా ‘నా షోలాపూర్‌ చెప్పులు’ అనగానే, శభాష్‌ అన్నారు. నా అదృష్టం కొద్దీ ఆయనకు నా పాట నచ్చింది. జంధ్యాల ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ పాటకు హిందీలో శంకర్‌ జైకిషన్‌ స్వరపరిచారు. ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విజయా గార్డెన్స్‌లో రికార్డింగు. రాత్రి సరిగ్గా 7.10కి నన్ను పిలిచారు. పావు గంటసేపు రిహార్సల్స్‌ చేయించగానే, రికార్డింగు మొదలుపెట్టి, ఎనిమిదికల్లా పూర్తి చేసేశారు. 

ఈ పాటకు మంచి ప్రాచుర్యం వచ్చింది. బొంబాయిలో ప్రోగ్రామ్‌ చేస్తూ, ముందర హిందీలో పాడి అక్కడ నుంచి ‘నా షోలాపూరు చెప్పులు పెళ్లిలో పోయాయి/అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి ’ అంటూ పాడాను. ఈ ఒక్క పాటతోనే∙నాకు మంచి గుర్తింపు వచ్చింది. నేను జంధ్యాల గారికి ఋణపడి ఉంటాను.  – సంభాషణ: వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు