మీ ఇల్లు బంగారం కానూ..!

19 Nov, 2017 00:36 IST|Sakshi

 హావ్‌ ఫన్‌

ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల బంగారం కావాలి. అదేంటో... ఆ బంగారమే బరువైపోతోంది! పుట్టింటికేనా? మెట్టినింటికీ బరువే! ఈ ఇంటి బంగారాన్ని తీసుకెళ్లిన ఆ ఇంటి వాళ్లు కూడా.. అదేదో ‘మీ బరువు తగ్గించడానికే’ అన్నట్లు ఫీలైపోతారు. ఆడపిల్లంటే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా భారమేనా? అందుకేనా ఆడపిల్లపై ఇంత హింస!అసలు.. కడుపులో ఉన్నప్పుడే ఆడపిల్లను భారం అనుకునేవాళ్లూ ఉన్నారు. తల్లి మోయడానికి సిద్ధంగా ఉన్నా, మిగతా వాళ్లకు ఆయాసం వచ్చేస్తుంది. నేరమనీ, పాపమనీ తెలుసు. అయినా కడుపులోనే బరువును ఆవిరి చేసేస్తారు. కుదరకపోతే, పుట్టాక చెత్తకుండీలో పడేస్తారు. కసి తీరకపోతే ముళ్లపొదల్లో విసిరేస్తారు. మానవత్వానికే ముళ్ల కిరీటం పెట్టేస్తారు! ముళ్లబాట పరిచేస్తారు.పుట్టడానికే గతిలేని బంగారానికి ఇక బతికే భాగ్యం ఎక్కడిది?బతికి బట్టకట్టినా... డొమెస్టిక్‌ వయలెన్స్‌ నుంచి బయటపడే దారెక్కడిదీ?!

‘ఏం మాట్లాడుతున్నారు! సమాజం మారింది. ఇప్పుడు మరీ అంత క్రూరంగా ఏం లేదు’ అని ఎన్ని వాదనలు వినిపించినా, వినిపించనివి.. కడుపులో దాచిపెట్టుకున్న ఆడపిల్లల బాధలు, ఆవేదనలే! గర్భంలో బిడ్డ చనిపోయిన ట్లే.. కాలగర్భంలో ‘సమాజం మారిందనే’ వాదనలూ కలిసి పోతున్నాయి. గృహహింసకు గురైన అమ్మాయికి మాట్లాడే హక్కు ఉంది. మనమే ధైర్యం కలిగించాలి. ఇంటా బయటా చాకిరీ చేస్తూ, దుర్భాషలకు, దుర్మార్గాలకు గురవుతున్న ఆడపిల్లకు మనమే అండ కావాలి. మనమే భరోసా ఇవ్వాలి.   సమాజం మారిందని చెప్పుకోగల మార్పుకు మన ఇల్లు మాత్రమే వేదిక అయిపోతే సరిపోదు. మన ఇంటి బిడ్డలాగే ప్రతి ఇంటి కోడలికి, తల్లికి, భార్యకు, చెల్లికి గృహహింస లేకుండా చూడాలి. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల సుఖంగా ఉంటే.. మెట్టినింట్లో మన బిడ్డా సుఖంగా ఉంటుంది.అప్పుడు కొత్త బంగారు లోకం... బరువనిపించని బంగారు లోకం.. పుడుతుంది.
 - మర్ర రామ్ ఎడిటర్, ఫన్‌డే – ఫ్యామిలీ

మరిన్ని వార్తలు