ఇట్లు.. నీ మరణం

25 Aug, 2019 11:42 IST|Sakshi

కొత్త కథలోళ్లు

ఉదయం మొబైల్‌ఫోన్‌లో ఆ మెసేజ్‌ చూసినప్పటి నుంచి పుణ్యమూర్తికి చాలా ఆందోళనగా ఉంది.
నెంబర్‌ చూసి ఎవరు పంపించారో తెలుసుకుందామని ప్రయత్నించాడు.
ఏదో అపరిచిత పేరు.
ఆఫీసులోకి అడుగు పెడుతూనే ఫోన్లో ప్రత్యక్షమైందా మెసేజ్‌.
అది చూసినప్పటి నుంచి భయం, ఆందోళన...తదితర వికారాల వల్ల ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోతున్నాడు పుణ్యమూర్తి.
‘‘కాఫీ సార్‌!’’ అంటూ ఆఫీసు బాయ్‌ కాఫీగ్లాసు టేబిల్‌ మీద పెట్టి వెళ్లిపోయాడు.
అన్యమనస్కంగా కాఫీగ్లాసు పట్టుకోబోయినవాడల్లా కరెంట్‌ షాక్‌ తగిలినట్లు అగిపోయాడు.
‘ఈ మెసేజ్‌ పంపినవాడు ఇందులో విషం అయితే కలిపి ఉండడు గదా!’ అన్న ఆలోచన పుణ్యమూర్తిని కాఫీ తాగనివ్వలేదు.
ఈ మెసేజ్‌ పంపించాల్సినంత కసి తనపై ఎవరికి ఉండుంటుంది?
అంతలా అతని వల్ల క్షోభకు గురైన వారెవరో అంతు చిక్కడం లేదు పుణ్యమూర్తికి.
ఆలోచనల నడుమ బుర్రలో ఆ మెసేజ్‌ మధ్య మధ్యలో భయానకంగా మెరుస్తోంది...
‘సాయంత్రం నిన్ను తప్పక కలుసుకుంటా...
ఇట్లు
నీ మరణం’  అన్న సందేశం ఇంగ్లీష్‌లో!

ఆ అక్షరాలు యముని మహిషపు లోహగంటలై ప్రతిధ్వనిస్తున్నాయి.
పదే పదే అతడి మెదడును పదునైన బాకుల్లా  పొడిచేస్తున్నాయి.
ఈ సంగతి పోలీసులకు ఫిర్యాదు చేసి దర్యాప్తు జరిపించేంత ధైర్యం అతనికి లేదు. ఎందుకంటే ‘తడి’ తగిలితేగానీ ఫైలు ముందుకు జరగని ఆ  ఆఫీసులో అతని సెక్షనేమీ ఈ ‘తడి’కి అతీతం కాదు. అలాగే పుణ్యమూర్తి సార్థకనామధేయుడు కాడు.
ఎన్నో ఏళ్లుగా ఆ ఆఫీసులో పనిచేస్తున్న పుణ్యమూర్తి కూడా ఈ ‘తడి’కి అలవాటు పడి, ఇప్పుడది నిత్యకృత్యమై, సర్వసామాన్య విషయంగా, అప్రకటిత హక్కుగా భావించే స్థితికి అతడు చేరుకున్నాడు.
అడపాదడపా అలా ముడుపులు చెల్లించుకోలేని వారు ముక్కుతూ, మూల్గుతూ బాధపడ్డా ఆ బాధని ముఖకవలికల వరకూ పరిమితం చేసుకొని అతి కష్టంగా ముడుపులు చెల్లించుకున్న సందర్భాలే అతనికి అనుభవంగానీ ఇలాంటి బెదిరింపులు ఎన్నడూ లేదు. అందుకే ఇప్పుడు పోలీసులకు రిపోర్ట్‌ చేసి తీగవారి చేతిలో పెడితే ఆఫీసులో డొంకంతా కదిలే ప్రమాదముంది కనుక అతను పోలీసులను ఆశ్రయించి తన ఆశ్రయం కోల్పోదల్చుకోలేదు.
సతమతమవుతున్న ఆలోచనలతోనే అతను గత నెలరోజుల్లో తన బారిన పడ్డవారి లిస్టు తయారుచేశాడు. లిస్టు చూస్తే అలాంటి మెసేజ్‌లు పంపి బెదిరించాల్సినంత రేంజ్‌లో ఎవరినీ పీడించలేదనే అతని మనసు ఘోషించసాగింది.

ఎదురుగా గోడ మీద దేవుడి పటాన్ని  చూస్తూ,
‘‘దేవుడా! ఈ గండం నించి ఎలాగయినా గట్టెక్కించు స్వామీ! సాయంత్రం గడిస్తే పొద్దున్నే నీకు అభిషేకం చేయిస్తా’ అని మనసులోనే దేవుడికి మొక్కి ఏకపక్ష డీల్‌ సెటిల్‌ చేసుకున్నాడు.
‘‘ఆ మెసేజ్‌ పంపినవాడు కూడా దేవుణ్ణి మొక్కితే...దేవుడు అతని పక్షానే నిలుస్తాడుగానీ, లంచగొండి అయిన తన సాయానికి వస్తాడా?’’ అన్న అనుమానం కలిగిన పుణ్యమూర్తిని నీరసం ఆవహించింది.
ఆలోచనల నడుమ లంచ్‌టైమ అయినా, కొంత నిర్లిప్తతా, ఇంకొంత విషప్రయోగ భయం వల్ల...ఏదయితేనేం పుణ్యమూర్తి భోజనం త్యజించాడు.
‘సాయంత్రం మరణం తనని కలుసుకుంటుందా? ఎలా కలుసుకోబోతుంది? స్కూటర్‌ మీద వెళ్తున్న తనని బస్సు రూపంలో వచ్చి ఢీ కొన్నప్పుడా...లేక లిఫ్ట్‌లో వెళుతున్నప్పుడు వాడు పవర్‌ కట్‌ చేస్తే మధ్యలోనే ఆగిన లిఫ్ట్‌లో ఊపిరాడక తను కొట్టుమిట్టాడుతున్నప్పుడు వచ్చి పలకరిస్తుందా? 
ఎలా? ఎలా? ఎలా? కలుసుకుంటుంది?
మరీ నలభై అయిదేళ్లకే మరణాన్ని కలుసుకోవాలని లేదు తనకి.

తనుపోతే ఇంట్లో వాళ్లు దండవేసి గోడకి వేలాడదీసేందుకు మంచి ఫోటో అయినా లేదు, ఇన్నాళ్లలో ఎప్పుడూ ఆలోచించలేదు...వీలు చూసుకుని మంచి ఫోటో ఒకటి అలాంటి సందర్భానికి పనికొచ్చేలాంటిది రెడీగా పెట్టుకుని ఉండాలి....ఛ...ఛ...ఏం ఆలోచిస్తున్నాడు తను.
ఆఫీసు క్లోజ్‌ అయ్యి ఇంటికి బయల్దేరే సమయం కావొస్తోంది. గుబులు గుండె తడో బయటపడ్డ పుణ్యమూర్తి స్కూటర్‌ తీయబోతూ ఆగి, స్కూటర్‌ అక్కడ ఆఫీసు కాంపౌండ్‌లోనే తాళ మేసి విడిచిపెట్టి సిటీ బస్సెక్కి ఇంటికి చేరాడు.
లిఫ్ట్‌ ఎక్కబోతూ ఆగి, మెట్ల దారిన ఇంటికి వెళ్లాడు.
మెసేజ్‌ పెట్టిన అపరిచితుడు తనకి వ్యతిరేకంగా మీడియాలో ఏమన్నా చెప్పాడేమోనన్న సందేహంతో ఛానల్స్‌ అన్ని గభాగభా ఒక్కసారి చూశాడు పుణ్యమూర్తి.
ఏమీ లేదు.
సమయం భారీగా గడుస్తోంది.
కథల్లో, సినిమాల్లోలాగా కాలచక్రం గిర్రున తిరిగితే బావుణ్ణు అనిపిస్తుంది అతనికి.
భార్య, బిడ్డలకి దూరంగా, ఏకాంతంగా తన గదిలోనే కూర్చున్నాడు.
ఆరు... ఏడు... ఎనిమిది గంటలైంది,
రోజంతా ఆలోచనతో గడిపిన పుణ్యమూర్తికి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. ఫోన్‌ మోత వినిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు.
లేస్తూనే నాడీ పట్టి చూసుకున్నాడు.

కొట్టుకుంటోంది...ఊపిరి కూడా  ఆడుతోంది.... గుండె కొట్టుకోవడమూ వినిపిస్తోంది. అంటే మరణం తన మాట తప్పిందా, లేక మర్చిపోయిందా?
బెడ్‌ పక్కనే ఫోన్‌ ఇంకా మోగుతూనే ఉంది.
రిసీవర్‌ ఎత్తి హీన స్వరంతో–
‘‘హలో’’ అని అనగలిగాడు.
‘‘పుణ్యం, సాయంత్రం మీ ఆఫీసు వైపు ఓ క్లయింట్‌తో అపాయింట్‌మెంట్‌ ఉండడంతో పన్లో పనిగా నిన్నూ కలుసుకుంటానని మెసేజ్‌ పెట్టాను...కానీ అపాయింట్‌మెంట్‌ క్యాన్సిల్‌ అవడంతో రాలేకపోయా...సారీ రా...నా కోసం వెయిట్‌ చేయలేదు కదా...’’ అంటూ నాన్‌స్టాఫ్‌గా వాగుతున్నాడు రమణం.
‘‘మెసేజ్‌ పెట్టింది నువ్వట్రా...నీ మొబైల్‌ నుండి పంపి చావొచ్చు గదరా...’’ అన్నాడు పుణ్యమూర్తి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ.
‘‘మొబైల్‌ ఇంట్లో మర్చిపోయాన్రా. అందుకే ఆఫీసులో కొలిగ్‌ సెల్‌ నుండి ఫ్రీ ఎస్సెమ్మెస్‌ పంపించా...’’ అంటూ నవ్వసాగాడు కాల్‌ చేయకుండా మెసేజ్‌ పెట్టిన పిసినారి రమణం.

‘‘ఏడిశావ్‌ వెధవా...రోజంతా నాకు మనశ్శాంతి లేకుండా చంపావు గదరా...’’ అంటూ తాను అప్పటి వరకూ అనుభవించిన నరాకాన్ని వివరించాడు పుణ్యమూర్తి.
‘‘ఓ అదా...నీకు తెలుసుగదరా ఆఫీసులో పని ఒత్తిడి బాగా ఉంటే టైప్‌ చేసినప్పుడు అక్షరాలు కొద్దిగా అటు ఇటూ టైప్‌ చేస్తుంటా. అలాంటి సమయంలోనే నీకు మెసేజ్‌ టైప్‌ చేశా. అందుకే ramanam అని టైప్‌ చేయబోయి maranam అని పొరబాటున టైప్‌ చేశా...సారీ రా...’’ అంటూ నవ్వి ఫోన్‌ పెట్టేశాడు ‘మరణం’గా మెసేజ్‌ పంపిన రమణం.
అప్పటికి పూర్తి స్థాయిలో ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టిన పుణ్యమూర్తి గోడ మీది దేవుడి పటాన్ని చూస్తూ, ‘దేవుడా, పొద్దున్న నీకు అభిషేకం చేయిస్తే ‘లంచం’ ఇచ్చినట్టవుతుంది. కనుక నన్ను క్షమించు...’’ అనుకుంటూ ఓ నమస్కారం పడేసి హాల్లోకి నడిచాడు.
- మల్లారెడ్డి మురళీమోహన్‌

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా