శ్రీరామ పట్టాభిషేకం

28 Jul, 2019 10:08 IST|Sakshi

పురానీతి

పద్నాలుగేళ్ల అరణ్యవాసం ముగించుకుని రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు. రాముడు పుష్పక విమానం నుంచి కిందకి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నగారి పాదాలకి పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణుల కన్నుల వెంట నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకొని ‘ఇంతకుముందు మేము నలుగురం, ఇవ్వాల్టి నుంచి మనం అయిదుగురం అన్నదమ్ములం సుగ్రీవా’ అన్నాడు. 
పుష్పకం నుంచి కిందకి దిగిన వానరకాంతలు వాళ్ళ ప్రేమలని, వాళ్ళ అలంకారాలని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయి, సుమిత్రలు ఆ వానర కాంతలందరికీ  తలస్నానం చేయించారు.

తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని ‘కుబేరుడి దగ్గరికి వెళ్ళిపో‘ అని ఆజ్ఞాపించాడు. అప్పుడా పుష్పకం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది.
అప్పుడు భరతుడు శిరస్సున అంజలి ఘటించి రాముడితో ‘మా అమ్మ అయిన కైకేయి ఆనాడు రెండు వరాలు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రి మాట నిలబెట్టడం కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి వెళ్లావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను.‘అన్నాడు.
భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు. రాముడు క్షురకర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత అందమైన పట్టు వస్త్రాలను ధరించి, మంచి అంగరాగాలను పూసుకొని, దివ్యాభరణాలు ధరించి బయటకి వచ్చాడు.

కౌసల్యాదేవి సీతమ్మకి అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి చక్కగా అలంకరించింది. సుగ్రీవుడితో సహా వానరులందరూ అయోధ్యకి బయలుదేరారు. సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు, ఆ రథం పగ్గాలను భరతుడు పట్టుకొని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగుని పట్టాడు. ఒకపక్క శత్రుఘ్నుడు, మరొకపక్క విభీషణుడు వింజామర వీస్తు్తన్నారు. అలా రథంలో అయోధ్యకి వెళుతున్న రాముడు కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి.

ఆ వెనకాల వేదపండితులు నడిచారు, తరువాత పెద్దలు, వాళ్ళ వెనకాల కన్నెపిల్లలు, ఆ తరువాత సువాసినులు చేత మంగళద్రవ్యాలతో వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు. రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలు, 500 నదుల జలాలని వానరాలు తీసుకొచ్చాయి. వానరాలు తీసుకొచ్చిన ఆ జలాలని రాముడి మీద పోసి కిరీటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సున అలంకరించారు. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహూకరించాడు.

ధర్మాత్ముడైన రాముడి పాలనలో ప్రజలకు దొంగల భయం, శత్రు భయం లేదు, నెలకి మూడు వానలు పడుతుండేవి, భూమి సస్యశ్యామలంగా పంటలని ఇచ్చింది, చెట్లన్నీ ఫలపుష్పాలతో నిండిపోయి ఉండేవి.  అందరూ సంతోషంగా ఉండేవారు. అందుకే ఇన్నేళ్లు గడిచినా ప్రజలు ఇప్పటికీ రామరాజ్యం కావాలని కోరుకుంటున్నాను.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

మరిన్ని వార్తలు