ఔట్ అనుకుంటే ఔటు అయ్యింది

29 Mar, 2015 00:05 IST|Sakshi
ఔట్ అనుకుంటే ఔటు అయ్యింది

శ్రీకారాలు - శ్రీమిరియాలు
ఒకసారి రాజకీయాల్లో ఒక స్థాయికి వెళ్లి ఆగినవాడితో జాగ్రత్తగా ఉండాలి. అయిపోయాడులే, కొడిగట్టిన దీపం అనుకోకూడదు. నివురు కప్పిన నిప్పు ఆరిపోయినట్టే కనిపిస్తుంది. వత్తి మాత్రం కాలి ఆగిపోయిన ఔటుతో జరభద్రం. గోడమీది రావిచెట్టు ఒకందాన పోదు. కలుపుగడ్డి, సెలవేసిన కురుపు ఇందుకు మరికొన్ని ఉదాహరణలు.
 
 నీలం సంజీవరెడ్డి అత్యున్నత పదవులు అలంకరించి హాయిగా సొంతవూరు వెళ్లిపోయి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఆయన పవర్‌లో ఉండగా పైకొచ్చిన వారు కొందరున్నారు కాని, ఎప్పుడైనా పిలిస్తే పలికేవారు కాదు. ఆరిపోయిన లక్ష్మీ ఔటుగా భావించి పక్కన పెట్టేశారు. ఒకరోజు వచ్చింది. ఒక్కసారి దేశాధ్యక్షపదవి సంజీవరెడ్డిని వరించింది. చింతనిప్పు కణకణమంది. దీపం మళ్లీ వెలిగింది. ఔటు పేలింది. పాతమిత్రులు నాలికలు కరుచుకున్నారు. గురువుగారు చిన్న పనికోసం ఫోన్ చేసినా దొరికేవారు కాదు. ఆయన ఎప్పుడు ఏ వేళలో ఫోను చేసినా బాత్రూంలో ఉన్నానని చెప్పించారు. రాజకీయాల్లో ఇలాంటి ఒడిదుడుకులు తప్పవని ఎంచి, ఒక శిష్యుడు అనకొండలాంటి గజమాలని బలగంతో పట్టించుకుని శ్రీవారిని దర్శించడానికి వెళ్లారు. అతి వినయాన్ని వొలకబోస్తూ నిలబడ్డారు. సంజీవరెడ్డి పెద్ద నవ్వుతో పులకరించి ‘‘...రండి... రండి... అన్నట్టు బాత్రూంలోంచి ఎప్పుడు బయటకు వచ్చారు’’ అంటూ పలకరించారు. హన్నా! హనుమంతుడి ముందా కుప్పిగంతులు!
 - శ్రీరమణ

 మన అమ్మాయే!
 హారిపోటర్ తెలుగింటి ఆడపడుచనీ, మూడుతరాల క్రితం పెద్దలు వలస వెళ్లారనీ కొందరు చరిత్రకారులు అంటున్నారు. అసలు పేరు హరిపోటర్  అనీ క్రమంగా యాసలో అది హారి అయిందని వాదిస్తున్నారు. అందుకే ఫాంటసీ బాగా రాస్తోందనీ, దాని వెనక హరికటాక్షం ఉందనీ తీర్మానించారు.  
 
రావి శాస్త్రీయం
 పది పదిహేనేళ్ల క్రితం ప్రసిద్ధ రచయిత రావిశాస్త్రి ప్రత్యేక అతిథిగా నల్లగొండ వెళ్లారు. ఆ పక్కనే ‘‘రాచకొండ’’  ఉందని విని, మిత్రులతో కలిసి అక్కడికి వెళ్లారు. కొంతసేపు అక్కడ తిరిగాక, వచ్చేటప్పుడు చేతిరుమాలులో దోసెడు మట్టిని మూటకట్టుకు తెచ్చుకున్నారట. ‘‘ఇక్కడ మా పూర్వీకులు చాలా ఏళ్లు వున్నారు, ఇది నా స్వస్థలం’’ అంటూ ఎంతో ఆనందించారట! విప్లవకవి రాచకొండ విశ్వనాథ శాస్త్రికి ఎన్నో సెంటిమెంట్లు. జ్యోతిష్యం మీద ఆయనకు నమ్మకం. కాదు, నిజం చెప్పాలంటే పిచ్చి. నమ్మినంత మాత్రాన విప్లవకవి కాకుండా పోతాడా?
 
 అడిదము సూరకవి (1750-1830) పూసపాటి సీతారామరాజుని శ్లాఘిస్తూ పద్యం చెప్పాడు. కాని పద్యంలో రాజుని ఏకవచనంలో సంబోధించేసరికి రాజాగ్రహానికి గురయ్యాడు. సూరకవి వెంటనే కవితామర్యాదల్ని వివరిస్తూ ఈ పద్యం చెప్పాడు-
 
 చిన్నప్పుడు, రతికేళిని నున్నప్పుడు, కవితలోన, యుద్ధములోనన్ వన్నెసుమీ రా కొట్టుట
 చెన్నగునో పూసపాటి సీతారామా!
 
 ఇలాగ కందపద్యం విసిరి, ఏకవచన ప్రయోగమే కాదు, ‘ఏరా’ సైతం అనతగునని సమర్థించుకున్నాడు. ఆ రోజుల్లో కవి బతుకులు పులిమీద సవారీ. ఇప్పుడసలు అదే ‘‘కల్చర్’’ అయిపోయింది. ఆడామగా పరస్పరం రా కొట్టుకుంటున్నారు. కలిసి ‘‘రా’’ కొడుతున్నారు.
 
 విశ్వబాపు
 దిగ్దర్శకులు విశ్వనాథ్ బాపులకు ఒకరంటే ఒకరికి ఇష్టం, గౌరవం. విశ్వనాథ్‌కి బాగా పేరొచ్చాక కూడా బాపు వద్ద సహాయకుడిగా ఒక్క సినిమాకి అయినా పని చెయ్యాలని అనుకునేవారట. కాని ఆ కోరిక తీరనే లేదని ఇప్పటికీ విశ్వనాథ్ వాపోతుంటారు. అలాగే బాపుకి విశ్వనాథ్ అంటే చాలా అభిమానం. ఈ కార్టూన్ ద్వారా బాపు తన ఇష్టాన్ని ప్రకటించుకున్నారు. ఇది చూసి విశ్వనాథ్ కూడా హాయిగా నవ్వుకున్నారు. సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్య ‘‘కళాతపస్వి’’ బిరుదుని సమర్థించి, దాన్ని ధరించమని చెబుతూ ఉంటారు. ఈ చిత్రంలో ఉన్నది ఇంద్రుడు, రంభ మరియు కళాతపస్వి.
 
 నయా కాన్సెప్ట్స్!
 కావాలంటే వాడుకోండి.
 ‘‘మీ టూత్‌పేస్ట్‌లో కర్వేపాకుందా?’’
 తెల్లమొహం వేయును.
 ‘‘మీ టూత్‌పేస్ట్‌లో జీలకర్రుందా?’’
 పిచ్చిమొహం వేయును.
 ‘‘అయితే ఈ టూత్‌పేస్ట్ వాడండి. మీ అవగుణాలకు అనువైన టూత్‌పేస్ట్!’’
 పీకాక్ సబ్బు! నాట్య, సౌందర్యాల సమ్మేళనం! మీ జీవితాన్ని సంగీతభరితం చేస్తుంది! ప్రతి రుద్దు ఒక ముద్దు!
 ‘‘ఆధ్యాత్మిక పరిమళాల టీ! ప్రపంచంలోనే మొదటిసారి’’
 ‘‘అదెలాగ’’
 ‘‘హిమాలయ సానువుల్లో, కేదార్‌నాథ్‌కి అతి చేరువలో పెరిగిన తేయాకు తోటల నుంచి తయారించబడింది!’’
***
 ధోవతులు! ధోవతులు! చేతి నేతల ధోవతులు! ఇవి మానసంరక్షణకే కాదు, మనసు సంరక్షణకు కూడా మేలైనవి!
 
 హెచ్చరికో! హెచ్చెరిక!
 శ్రీ ఏడుకొండల శ్రీ వేంకటేశ్వర్లుని శ్రీ దివ్య అపాదారవిందములకు కోటి దణ్ణములు సేసి, శాయంగల విన్నపములు - దేవరా! తూకమైన బంగారు సాలిగ్రామ దండయున్నూ, అయిదు పేటల పచ్చహారమున్నూ అప్పనంగా వచ్చిందని మురిసిపోకు. ముందుంటది ముసళ్ల పండగ. రేపు ఎల్లుండి నీళ్లు కరెంటు పవరుకి సంబంధించి ఏ చీకు వచ్చినా, తమరు సిరికింజెప్పక వచ్చి రంగప్రవేశం చేయకపోతే... ఇంతే సంగతులు ‘‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు...’’ అంటూ పాత ట్యూన్లు వినిపిస్తాయి. ఇది మా నేల గుణం, మా జాతి లక్షణం. అన్నిటికీ సిద్ధపడి మరీ ఆ బంగారు బరువులేసుకో సామీ!ననుగన్న తల్లులాలా! ముక్కెరకి మురిసిపోతా చెవులు పక్కన పెట్టద్దు. పిలవగానే పలకండి. క్షణం జాగైతే, ‘‘నీ యబ్బ ఆకాశరాజు చేయించెనా, నీయన్న పోతరాజు చదివించెనా’’ అంటూ ఉగ్గుపాలతో సహా కక్కించే అవకాశం ఉంది. అమ్మలాలా! నా మాట నమ్మండి.
 
చిత్తగించవలెను మీ భక్త రేణువు
 పెన్ డ్రాప్స్:
*  కొండమీదా పప్పన్నం, కొండకిందా పప్పన్నం అన్నట్టుగావుంది మన గవర్నర్ స్థితి. ఏ రాష్ట్రంలో గడప పచ్చన చేసుకున్నా హిజ్‌ఎక్స్‌లెన్సీకి రెండు తాంబూలాలు ముడుతున్నాయి. రేపు ఉభయసభల్లో, ఉభయ రాష్ట్రాల్లో దంచుతారు కాబోలు!
*    బడ్జెట్ పంచాంగ శ్రవణం లాంటిది. ఆ రోజు వినడానికి, మర్నాడు చదువుకోవడానికి మాత్రమే. తర్వాత ఏ పద్దులో ఏ తేడా పడ్డా ఎవరూ పట్టించుకోరు. ఈసారి సంకురుమయ్య నల్లధనం మీద వచ్చాడు.
*    పాపం, ఉద్యమంలో చెయ్యి విరగ్గొట్టుకున్నారు. నాల్రోజులు కట్లు ధరించి తిరిగారు. అయినా పొన్నాల శక్తియుక్తులను పైవాళ్లు గుర్తించలేదు.
*   ప్రపంచీకరణ తర్వాత జాతి జామకాయలు మానేసి యాపిల్స్ తింటోంది. పేలాల బదులు పాప్‌కార్న్ తింటోంది.
 
 ఇప్పుడే అందిన ఎస్‌ఎంఎస్
 కేంద్రం వైఖరితో చంద్రబాబుకి పచ్చివెలక్కాయ గొంతున పడ్డట్టుందిట. కడుపు చించుకోడానికీ లేదుట!

మరిన్ని వార్తలు