శ్రీకారాలు - శ్రీమిరియాలు

8 Mar, 2015 01:01 IST|Sakshi
శ్రీకారాలు - శ్రీమిరియాలు

జగన్నాటకం అను వారసత్వ రాజకీయం
వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలని ప్రధాని తీర్మానించారు. పిల్లా మేకా ఉన్నవారు కూడా తలలూపారు. వారసత్వం అంటే...? కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఇంతవరకే. పినతండ్రి పిల్లలు, పెదతండ్రి పిల్లలు వారసులు కాజాలరు. మేనల్లుడు, మేనకోడలు వారసులు కాబోరు. ఆలి వైపు వారు అంటే ఆమె తోబుట్టువులు, ఆ బుట్టువుల సంతతి వారసులు కారు. ఎందుకంటే వారిది వేరే కుదురు. వేలు విడిచిన బంధుత్వాలు వారసత్వాలు కావు.

ఏం లేదు, ఆస్తులు సంక్రమించేవారికి పదవులు పరంపరగా సంక్రమించకూడదని అంతరార్థం. ఈ నేపథ్యంలో నడిచిన ఒక ఏకాంకిక-
 ‘‘మీ అబ్బాయికి టిక్కెట్ ఇవ్వలేం’’
 ‘‘అబ్బాయని ఎవరన్నారు?’’
 ‘‘రికార్డ్స్‌లో ఉంది కదా’’
 ‘‘రికార్డ్స్‌లో నేను దేశభక్తుణ్ణని ఉంది. నమ్మారా’’
 ‘‘అదేవిటండీ, ఉన్నట్టుండి ఇప్పుడు అడ్డం తిరిగారు’’
 ‘‘ఔనండీ ఈ మధ్యనే మా ఆవిడ బయటపెట్టింది’’
 ‘‘ఆ..- రాజకీయమా’’
 ‘‘కాదు, అరాచకీయం. ఇంతటి కఠోరసత్యాన్ని ఎలా జీర్ణించుకున్నాననే సానుభూతైనా లేకుండా...’’
 ‘‘ఇది సానుభూతి చూపాల్సిన ప్రాంతం కాదు’’
 ‘‘ఒక పతివ్రత తనకై తాను చెబుతున్నా నమ్మరా?’’
 ‘‘రాజకీయాల్లో పతివ్రతకి ప్రాతినిధ్యం లేదు. ఇది వ్యూహాత్మక సత్యం కావచ్చు’’
 ‘‘అయితే, అగ్నిపరీక్షకి నిలబెడతా’’
 ‘‘అంతొద్దు. డీఎన్‌ఏ పరీక్ష చాలు’’
 ‘‘దానికేం భాగ్యం అలాగే...’’
ఆగండాగండి. ఇంతదాకా వచ్చాక, ‘‘ఆ కాపరం కూలిపోలేదా? రాజకీయం ఎంత చిచ్చు పెట్టిందండీ’’ అని వాపోతుంటే చిచ్చూలేదు, కూలుడూ లేదు. వాళ్లావిడ ముందుచూపుకి గర్వపడ్డాడు. అంతా భగవదేచ్ఛగా మురిసిపోతున్నాడు. ఇంతకీ చెప్పడం మరిచాను, డీఎన్‌ఏలో ఆవిడ మాటే నెగ్గింది! నిజం, కొన్నిసార్లు రాజకీయాలు నిగ్గుతీస్తాయి.
 
అంతా భక్తిమయం!
భక్తి వినా సన్మార్గం లేదన్నారు త్యాగరాజస్వామి. అందుకని భక్తి చానల్ ‘‘వినా’’లని కొందరు తీర్మానించుకున్నారు. వినా అంటే వేరే అర్థం ఉందనిపించింది. అయినా మనకేల?
 ప్రవచనం ధారాళంగా సాగుతోంది... ‘‘ఏదైతే లోకహితం, లోపరహితం, లోహ రహితంగా శాస్త్రహితంగా జనహితంగా చరిస్తున్నదో, ఏదైతే మహాశయంగా మహాద్భుతంగా, మహోత్తరంగా సంచరిస్తున్నదో అదే పరమేశ్వరుని ఉనికి. అయితే, ఎవరా పరమేశ్వరుడు...’’ ట్రింగ్... ట్రింగ్... గంట మార్కు కోళ్ల మరియు చేపల దాణా. ఇవి సేవించిన వాటితో చేసుకునే చికెన్ పలావ్, చికెన్ టిక్కా, చేప ఇగురు, చేప పులుసు ఏదైనా ఎవరికైనా ఎప్పుడైనా రుచికరం! ఆరోగ్యకరం! ట్రింగ్... ట్రింగ్... మొదటిభాగం మిథ్య. రెండవ సగం సత్యం. స్వస్తి!
 
సమయానికి తగు...
‘‘పాండవ వనవాసం’’ సినిమా షూటింగ్ జరుగుతోంది. అది కీచకుడికి ద్రౌపదికి మధ్య నడుస్తున్న దృశ్యం. యస్వీరంగారావు తనదైన శైలిలో ‘‘సైరంధ్రీ! మేమడుగుటయూ నీవు కాదనుటయూనా? నీవేమైనా సీతవా, అనసూయవా...’’ అన్నారు. అనుకోకుండా అప్పుడు అక్కడే ఉన్న సంభాషణా రచయిత సముద్రాల చిన్న సవరణ చేశారట. ‘‘నీవేమైనా సీతవా, సావిత్రివా, అనసూయవా’’ అని మార్పించారట. సైరంధ్రి పాత్రలో ఉన్నది నటి సావిత్రి కాబట్టి సంభాషణ మరింత రక్తికట్టింది.
 
ఆచార్య దేవుడు
ఒక ప్రొఫెసర్ (మన తెలుగువాడే!) కప్ప మీద విస్తృత పరిశోధనలు చేశారు. మండూకాలతో మమేకమై మరీ చేశానని ఆయన నమ్మకం. మొదటగా కప్ప కాలుని ఒకదాన్ని కోసేశారు పరిశోధనలో తొలి అడుగుగా. అది బెకబెకమంటూ ముందుకు దూకింది. తర్వాత రెండో కాలుని తొలిగించాడు పరిశోధకుడు. బాధగా కాస్త ముందుకు గెంతింది. ఎప్పటికప్పుడు దశలవారీగా పరిశోధనా ఫలితాలను వీడియోలో కూడా రికార్డ్ చేస్తున్నారు. కప్ప మూడో కాలుని కత్తిరించి, కదిలించాడు ప్రొఫెసరు. అది అతి కష్టం మీద మూడు సెంటీమీటర్లు మాత్రమే ముందుకు కదిలింది.

ఉన్న నాలుగో కాలుని కూడా అధికారికంగా తొలగించారు. ప్రొఫెసర్ కప్పని ఎంత కదిలించినా, ఎన్ని చప్పుళ్ళు చేసినా అది కదల్లేదు. కళ్ల మీద సూటిగా టార్చిలైటు వేసినా కప్పలో చలనం లేదు. క్షుణ్ణంగా పరిశీలించాక ప్రొఫెసరు ఒక నిర్ణయానికి వచ్చారు. తెలుగు నేలమీద కప్పకి నాలుగు కాళ్ళూ తొలగిస్తే, అది స్పర్శజ్ఞానాన్నీ, చూపునీ, వినికిడి శక్తినీ కోల్పోతుందని రీసెర్చి రిపోర్ట్ తయారుచేసి, దానికి సాక్ష్యంగా వీడియో కూడా జత చేశారు. ఉన్నత కమిటీ నివేదికను సాకల్యంగా పరిశీలించి, ప్రొఫెసర్ సూక్ష్మదృష్టిని అభినందించింది. డాక్టరేట్‌ని ప్రదానం చేసి, రానున్న స్నాతకోత్సవంలో పట్టాని చాన్స్‌లర్ చేతులమీదుగా అందుకోవాలని తెలియజేసింది.
 
 నెహ్రూ - పటేల్
జవహర్‌లాల్ నెహ్రూ 1955లో రష్యా పర్యటనకు వెళ్లారు. వెళ్తూ కూతురు ఇందిరా ప్రియదర్శినిని కూడా వెంట తీసుకువెళ్లారు. ఆమె చక్కదనం, చలాకీతనం రష్యన్లను విపరీతంగా ఆకర్షించాయి. ఆ తరుణంలో పుట్టిన ఆడపిల్లలకు దాదాపు వెయ్యిమందికి ప్రియదర్శిని అని రష్యన్లు పేరు పెట్టుకున్నారట. ఇప్పుడా ప్రియదర్శినులంతా అరవైలోకి వచ్చిఉంటారు. నెహ్రూ పర్యటన నించి తిరిగి వచ్చాక భారత రాష్ట్రపతి ఆయనకు విందు ఏర్పాటు చేశారు. ఎందరో ప్రముఖులతో పాటు విదేశీ రాయబారులను కూడా ఆ డిన్నర్‌కి ఆహ్వానించారు.

రాష్ట్రపతి భవన్‌లో అర్ధరాత్రి జరగనున్న విందుకి ఏదో ప్రాముఖ్యత ఉండచ్చని పీటీఐలాంటి వార్తాసంస్థలు పసికట్టాయి. తమ సంపాదకవర్గానికి సూచనలు చేసి, మెలకువగా ఉండండని హెచ్చరించాయి. అనుకున్నట్టే అర్ధరాత్రి సమయాన సందర్భం ఒక్కసారిగా మారింది. రాజ్యాంగ విరుద్ధంగా భారత రాష్ట్రపతి భారత ప్రధానికి ‘‘భారతరత్న’’ ప్రదానం చేశారు. ఆ ప్రాంగణం ఆనంద సంద్రమైంది. నెహ్రూ ఆనంద బాష్పాలతో వినమ్రంగా స్వీకరించారు. దేశ ప్రథమపౌరుడు ఒక ప్రముఖపౌరునికి అందించిన గౌరవం ఇది.
 
పండిట్ నెహ్రూని అందరూ ప్రశంసించరు. అందరూ విమర్శించరు. ఇష్టులకు యిష్టుడు, కానివారికి కాదు. రాజకీయ దురంధరుడిగా పేరుబడ్డ రాజగోపాలచారి, ‘‘నెహ్రూ అంటే ప్రజలకు అభిమానం, పటేల్ పట్ల విశ్వాసం’’ అన్నారొకచోట. వారిద్దరూ సమున్నత పదవులలో ఉన్నారు కాబట్టి వారిని పోల్చి మాట్లాడుకునేవారు ఆ రోజుల్లో. స్వాతంత్య్ర సమరయోధుడు చెరుకువాడ నరసింహం పంతులు, ‘‘నెహ్రూ ఇడ్లీలాంటి వారు. వల్లభ్‌భాయ్ పటేల్ శుద్ధ పెసరట్. ఇడ్లీ రుచి అందులో కలిసిన రెండు మూడు దినుసులది. కాని పెసరట్టు రుచి కేవలం పెసరట్టుదే!’’ అన్నారు.
 
పెన్ డ్రాప్స్
' ‘అనురాగ్ శర్మ’’  పేరు పోలీసు అధికారికి తగినదిగా లేదు. అది ఒక పీఠాధిపతికి ఉండాల్సిన పేరు.
 
-  రాష్ట్రంలో రోడ్డులేని ఊరే ఉండకూడదు.
     - ఇది సర్కార్ ఆదేశం.
 ఉండవు సార్. అలాంటి ఊళ్లని రోడ్డుపక్కకి తరలిస్తున్నాం.
 - ఆచరణలో అధికారులు.
- దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటే ఇసుకోయ్!
 
 నిన్న: మా పోతుగడ్డమీది తెలుగు వేరు, వలసవాదుల తెలుగు వేరు.
 నేడు: తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతి మనది. మా నిఘంటువులో ‘‘వలస’’ శబ్దమే లేదు!
 వ్యాఖ్య: లేకపోతే యీసారి ఎడిషన్‌లో చేర్పించండి.
 
 ఇప్పుడే
 అందిన ఎస్‌ఎంఎస్ : స్వైన్‌ఫ్లూ పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ముదిరిన ఎండల కారణంగ

- శ్రీరమణ

మరిన్ని వార్తలు