నక్షత్రాలను పూచిన క్షిపణులు

20 Dec, 2014 22:56 IST|Sakshi
నక్షత్రాలను పూచిన క్షిపణులు

‘‘యుద్ధంలో తుపాకీ పేల్చడం కంటే, ఒక క్రిస్మస్ చెట్టు దగ్గర కొవ్వొత్తి వెలిగించడమే ముఖ్యం’’.
 - కెప్టెన్ నిమానీ, సాగ్జన్
 (జర్మనీ పదాతిదళం)
 
 భూగోళం మీద ఎన్నో యుద్ధాలు జరిగాయి. కానీ మొదటి ప్రపంచయుద్ధం అన్ని యుద్ధాల వంటిది కాదు. క్రైస్తవం రూపుదిద్దుకున్న తరువాత ఎన్నో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. కానీ మహాయుద్ధం వేళ, రణభూమిలో జరిగిన ఆ  ఒక్క క్రిస్మస్ పండుగను చరిత్ర మరచిపోలేదు. అందుకే, డిసెంబర్ 25, 1914 న జరిగిన ఆ మహోన్నత ఉత్సవం గురించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచం మొత్తం స్మరించుకుంటోంది. ప్రభూ! ఇవాళయినా యుద్ధం లేకుండా చూడు! మనిషిని మనిషి చంపుకునే క్రూరత్వం నుంచి కొన్ని ఘడియలైనా ఈ మనుషుల్ని రక్షించు!’ అనుకున్నాడు స్కాట్ సోల్జర్ ఆల్ఫ్రెడ్ ఆండర్సన్.
 
 రక్తాన్ని గడ్డకట్టించే చలిలో, మసక వెన్నెట్లో పుప్పొడిలా కురుస్తోంది మంచు. క్రిస్మస్ రాత్రికి సరైన వాతావరణం. అంతటి యుద్ధంలోనూ బెల్జియం శివారు ప్రాంతంలో ధ్వంసం కాకుండా మిగిలిన ఆ చర్చి నుంచి హఠాత్తుగా గంటల మోత లీలగా వినిపించింది. దాని కోసమే ఎదురు చూస్తున్న ఆ చుట్టుపక్కల కందకాలలోని మిత్రరాజ్యాల (ఇంగ్లండ్, దాని మిత్రులు)సైనికులు ఒక్కసారిగా మోకాళ్ల మీద వంగి ప్రార్థించారు, ఆ చిమ్మ చీకట్లోనే.
 అప్పుడే, త్రిరాజ్య కూటమి కందకాలలో అంటే జర్మన్లు, వాళ్ల మద్దతుదారుల కందకాలలో ఏదో కలకలం. ఒళ్లు ఝల్లుమంది, ఇంగ్లిష్ వారి సేనలకీ మిత్ర దేశాల సేనలకీ. మనసు కీడును శంకిస్తున్నా ఆయుధం అందుకోవడానికి చేయి రావడం లేదు. ట్రెంచ్‌కోటు జేబులో ఉన్న ‘కొత్త నిబంధనలు’ పుస్తకం మీద చేయి వేసి, ప్రభూ! ఇవాళయినా యుద్ధం లేకుండా చూడు! మనిషిని మనిషి చంపుకునే క్రూరత్వం నుంచి కొన్ని ఘడియలైనా ఈ మనుషుల్ని రక్షించు!’ అనుకున్నాడు స్కాట్ సోల్జర్ ఆల్ఫ్రెడ్ ఆండర్సన్. యుద్ధానికి వస్తుంటే తల్లి ఆశీర్వదించి ఇచ్చిన బైబిల్ అది. ఆ తరువాత జరిగిన కథే చరిత్రలో ఓ అద్భుతం. అందుకే మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులు తమ ఉత్తరాలలో, డైరీలలో ఈ ఘట్టం గురించి ఇలాంటి వర్ణనలు ఎన్నో చేశారు.
 
 నో మ్యాన్స్‌ల్యాండ్‌లోనే
 వెస్ట్రన్ ఫ్రంట్‌లో ఫ్రిలింఘీన్ అండ్ హూప్‌లైన్స్ సెక్టర్‌లో అనేక చోట్ల క్రిస్మస్ పండుగ  జరిగింది. ఆ ప్రాంతాన్నే ఫ్లాండర్స్ అని పిలుస్తారు. ఇది ఫ్రాన్స్ సరిహద్దుకు కాస్త దూరంగా, బెల్జియంకు దగ్గరగా ఉంటుంది. అక్కడే సాగ్జన్ల కందకం, స్కాట్ల కందకం, కొన్ని గజాల దూరంలో జర్మన్లదీ, బ్రిటిష్ వాళ్ల కందకాలూ ఎదురెదురుగానే ఉండేవి. జర్మన్ల కాల్బలమే సాగ్జన్లు. ఇంగ్లిష్ సేనలో భాగం స్కాట్‌లు. వెస్ట్రన్ ఫ్రంట్ పోరాట రేఖ పొడవునా ఇదే పద్ధతి.
 
 బెల్జియం రేవు పట్టణం ఓస్టెండ్ నుంచి, పశ్చిమ ఫ్రాన్సు వరకు, అంటే ఇంగ్లిష్ చానల్ వరకు- చూస్తూ చూస్తూ ఉండగానే అలా ఏడు వందల కిలోమీటర్ల పోరాట రేఖ తయారయింది. దీనికే  పశ్చిమ రంగమని జర్మనీ పేరు పెట్టింది. రాయల్‌వెల్ష్, నార్త్‌ఫోక్  రెజిమెంట్, వార్‌విక్ రెజిమెంట్- లక్షా అరవై వేల బ్రిటిష్ సేన , లక్షా ముప్పయ్ ఎనిమిదివేల వలస భారత సేన ఫ్లాండర్స్‌లో ఉండి యుద్ధం చేశాయి. ఫ్రెంచ్ రష్యా, బెల్జియం, సెర్బియా, గ్రీస్, కెనడా, పోర్చుగీస్ సేనలు ఉన్నాయి. అవతలి వైపున జర్మనీతో పాటు, సాగ్జన్లు, ఆంగ్లో సాగ్జన్లు, బవేరియా, ఆస్ట్రియా సేనలు  మోహరించాయి. ఈ సేనల కందకాల మధ్య దూరం కొన్ని కొన్ని చోట్ల 60 గజాలు కూడా లేదు. కందకాల మధ్య ఖాళీ స్థలాన్నే న్యో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. దాదాపు పాతిక కిలోమీటర్ల మేర క్రిస్మస్ వేడుకలు జరిగాయి.
 
 చాలాకాలం రహస్యంగా
 ఇంత గొప్ప చారిత్రక ఘట్టం వెంటనే వెలుగు చూడలేదు. బ్రిటన్‌కు చెందిన రాయిటర్ వార్తా సంస్థ ప్రచురణను నిలిపివేసింది. కానీ న్యూయార్క్ టైమ్స్ అదే జనవరిలో ఈ సంచలన కథనం ప్రచురించింది. తరువాత సైనికులు ఇళ్లకు రాసిన ఉత్తరాల ద్వారా కొంత వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పుడు దీని గురించి తెలిసిన వారంతా నేటి ప్రపంచానికి ఈ ఘట్టం గొప్ప సందేశాన్ని ఇవ్వగలుగుతుందని చెబుతున్నారు.
 
 అంకురార్పణ
 మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918)లో పోరాడుతున్న దేశాలలో ఒకటి రెండు మినహా మిగిలినవి క్రైస్తవాన్ని పాటించేవే. కాబట్టి క్రిస్మస్‌కైనా (యుద్ధం ఆరంభమైన తరువాత వచ్చిన తొలి క్రిస్మస్) కాల్పుల విరమణ పాటించాలని డిసెంబర్ 7, 1914న నాటి పోప్ పదిహేనో బెనెడిక్ట్ పిలుపునిచ్చారు. ఆయనైనా ఆ ప్రకటన వరకే పరిమితమైనారు. యుద్ధ కండూతితో వేగిపోతున్న దేశాధినేతలు ఒక మతాధిపతి మాటను మన్నిస్తారని పోప్ భ్రమలు పెట్టుకోలేదని తెలుస్తూనే ఉంది. కానీ రెండు వైపుల సైనికులు, ముఖ్యంగా జర్మన్లు, బవేరియన్లు, సాగ్జన్లు పండుగ జరుపుకోవాలని పట్టుదలగా ఉన్నారు.
 
 దీనిని ముందే పసిగట్టిన బ్రిటిష్ ఎక్స్‌పెడిషనరీ సేనల అధిపతి ఫీల్డ్ మార్షల్ జాన్ డెంటన్ పింక్‌స్టోన్ ఫ్రెంచ్ (సర్ జాన్ ఫ్రెంచ్) తన సేనలకు పాల్గొనవద్దంటూ కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ కింది స్థాయిలో ప్రయత్నాలు చాలా తీవ్రంగానే జరిగాయి. పైగా క్రిస్మస్‌కల్లా యుద్ధం ముగిసిపోతుందనీ, తామంతా ఇళ్లకు చేరుకుంటామనీ సైనికులు నమ్మారు. సొంత కుటుంబాల నుంచి వచ్చి పడిన క్రిస్మస్ కానుకలు యుద్ధరంగంలో పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. బ్రిటిష్ సేనలో సెకండ్‌స్కాట్స్ దళానికి చెందిన లెఫ్టినెంట్ ఎడ్వర్ట్ హూల్సేకు జర్మనీ నాయకత్వంలోని త్రిరాజ్య కూటమికి చెందిన నిమానీ అనే కెప్టెన్ క్రిస్మస్‌కు నాలుగు రోజుల ముందు మర్కర్ అనే స్కౌట్ కుర్రాడి చేత రహస్యంగా చిన్న ఉత్తరం పంపాడు. మర్కర్ స్కాట్లాండ్‌వాడే. క్రిస్మస్ రోజు కాల్పుల విరమణ గురించి ఆలోచించమని నిమానీ కోరాడు అందులో.
 
 ఆ అద్భుత వేకువలో
బెల్జియం శివారు ప్రాంతంలోని ఆ చర్చి నుంచి గంటలు వినపడిన తరువాత చినుకుల్లా మొదలైన వర్షం ఆ లిప్తలోనే కుంభవృష్టిలా మారినట్టు ఆ కలకలారావం విస్తరించింది. కానీ కాస్త శ్రద్ధగా విన్న తరువాత అది కలకలం కాదని అనిపించింది. కొన్నివేల గొంతులు ఒకేసారి పలుకుతున్నట్టు ఉంది. దాడి కాబోలునని బ్రిటిష్ సైనికులు అనుమానించారు.  కానీ అది ఏదో పాటలాగా ఉంది.
 
 ‘సిల్లేనాట్, హిలీజ్ నాట్...’ జర్మన్ పాట, బాణీ మాత్రం ఐరోపా అంతటికీ చిరపరిచితం. అది క్రిస్మస్ నాడు పాడే ‘సెలైంట్ నైట్ ...’ బాణీ. మిత్రరాజ్యాల కందకాలలో ఎక్కడో ఏదో బృందం కూడా పాట అందుకుంది. పాట పూర్తయిందో లేదో, క్రిస్మస్ తాత వేషంలో ఉన్న జర్మనీ పదాతి దళ సభ్యుడు ఒకరు బ్రిటిష్ వాళ్ల ప్రధాన కందకానికి దగ్గరగా వచ్చి ‘మెర్రీ క్రిస్మస్’ అని అరిచాడు. కందకం నుంచి బ్రిటిష్ సైనికులు కూడా బయటకు వచ్చారు. అతడి చేతిలో ఒక బోర్డు గజిబిజి ఇంగ్లిష్‌లో -‘ఉయ్ నో షూట్’, యూ నో షూట్’ అనివుంది. అప్పుడు సైనికాధికారులు మాట్లాడుకున్నారు. నో మ్యాన్స్ ల్యాండ్ దగ్గర నుంచి జర్మన్ సైనికులు బ్రిటిష్ వారిని సాదరంగా స్వాగతించారు.
 
  పండుగ జరుపుకోవడానికి నిర్ణయమైపోయింది. చుట్టుపక్కల కందకాల నుంచి జర్మన్లు, ఇంగ్లిష్ వాళ్లు, సాగ్జన్లు, స్కాట్‌లు వచ్చి చేరారు. కొన్ని నిమిషాలలోనే నో మ్యాన్స్ ల్యాండ్ వేలమందితో నిండిపోయింది. చాలా మంది చేతిలో ధగధగలాడుతున్న చైనా లాంతర్లు, కొవ్వొత్తుల మాదిరిగా వారి మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. సైనికాధికారుల కరుకు శాసనాలను ధిక్కరించి వచ్చామన్న భయం ఏ కోశానా కనిపించలేదు. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కరచాలనాలు చేసుకున్నారు. నిజానికి యుద్ధరంగంలో శత్రువుతో చేయి కలిపితే శిక్ష మరణదండనే! అది ధిక్కారం. ఏ స్థాయి అధికారినైనా, సైనికుడినైనా ఇందుకు పాల్పడితే  వేకువ కాల్పులలో చంపుతారు. థామస్ హైగేట్ అనే ఒక సైనికుడిని ఆ సెప్టెంబర్‌లో అదే శిక్ష వేసి కాల్చి చంపారు కూడా!
 
 అప్పటికే సిద్ధం చేసి పెట్టిన పెద్ద కట్టెల గుట్టకు నిప్పు పెట్టాడొక సాగ్జన్ సోల్జరు. లాంతరు మూత తెరిచి కెనడా సైనికుడొకరు ఆముదం పోశాడు. కొద్దిసేపటికే మంటలు పైకి లేచాయి. ఒక జర్మనీ సోల్జరు పెద్ద పెట్టెతో కేకులు తెచ్చి అందరి నోటికి అందించాడు. మరో పక్క ఒక బెల్జియం సోల్జరు ఇంకో పెద్ద పెట్టెతో డ్రైఫ్రూట్స్ తెచ్చి అందరికీ పంచాడు. కొందరు బీరు సీసాలు తెచ్చారు. స్కాట్ సోల్జర్లు బ్యాగ్‌పైప్‌లు మోగిస్తూ అక్కడకి వచ్చారు. వెంటనే రెండువైపుల వారి మిలటరీ బ్యాండ్లు క్రైస్తవ గీతాలను మోగిస్తూ వచ్చాయి. కొందరు మౌతార్గన్‌లు మోగిస్తుంటే, ఇంకొందరు మంట చుట్టూ నిలబడి  క్రైస్తవగీతాలు అందుకున్నారు. పారిస్ ఒపేరా గాయకుడు విక్టర్ గ్రానీర్ మంట ఎదుట నిలబడి పాట అందుకున్నాడు- ‘ఓ హోలీ నైట్...’. ఆ ప్రాంతం మొత్తం గానంలో ఓలలాడిపోయింది.
 
 పెను వైరాగ్యం
 మంట నెమ్మదిగా శాంతించింది. కొద్దిగా వెలుగు వచ్చింది. వాద్యగోష్టి మౌనం దాల్చింది. అప్పుడు కనిపించిన దృశ్యాన్ని దగ్గర నుంచి ప్రతి సైనికుడు తనను తాను అసహ్యించుకున్నాడు. అడుక్కో శవం. కుళ్లి ఉబ్బిన శవాలు, కాళ్లు తెగినవి, షెల్  దెబ్బకు తెగి చెట్లకు వేలాడే అవయవాలు... నగ్నంగా వున్నవీ, ఎలుకలు కొరికేసినవీ,  పదిహేనేళ్ల బాల సైనికుల శవాలూ, పాతికేళ్ల యువకుల శవాలూ, నలభయ్‌లలో ఉన్న వాళ్ల శవాలూ! ముందు అనుకున్నట్టే జర్మనీ వైపు శవాలని వారి సైనికులు, ఇంగ్లండ్ వైపు యుద్ధం చేస్తూ కన్నుమూసిన వారి శవాలని వీరు బెల్జియం శివార్లలో ఒకచోటికి చేర్చారు. ఒక దాని పక్కన ఇంకొకటి - పద్ధతి ప్రకారం గోతులు తవ్వించారు. ప్రతీ గోతిలోను ఒక శవం ఉంచి, సామూహికంగా ప్రార్థించి పూడ్చి పెట్టారు.
 
 ఆ తరువాత ఎవరి కందకాలలో వాళ్లు ఆదరాబాదరా స్నానాలు ముగించారు. దుస్తులు మార్చుకున్నారు. పదిన్నర ప్రాంతంలో స్కాట్ల కందకంలో ఎవరో లేచి బైబిల్ నుంచి కొన్ని స్తోత్రాలు చదివారు. అప్పుడే జర్మన్లు పంపించిన మాంసం కూర వచ్చింది. ఇక్కడ నుంచి మద్యం అక్కడికి వెళ్లింది. అప్పటికి బాగా ఎండొచ్చింది. నేల కొంచెం ఆరింది. మిత్రుల, ఆప్తుల, సహోద్యోగుల అంత్యక్రియలతో బరువెక్కిన ఇరువైపు సైనికుల మనసులు తేలికపడ్డాయి. అనుకున్నట్టే గంటన్నర తరువాత అంతా నో మ్యాన్స్ ల్యాండ్‌కి వచ్చారు.
 
 శాంతి కపోతాల దర్శనం
 అప్పటి దాకా కొంచెం దూరం నుంచి నో మ్యాన్స్ ల్యాండ్ మీద కనిపించిన దృశ్యాన్ని చూసిన అందరి ముఖాల మీద చిరునవ్వు విరిసింది. తోటి సైనికుల మృతదేహాలను ఖననం చేసిన తరువాత ఆవహించిన వైరాగ్యం ఒక్కసారిగా బద్దలైంది. గడచిన ముప్పయ్, ముప్పయ్ అయిదు గంటల నుంచి అసలు పేలుడే లేదు. ఎక్కడ నుంచి వచ్చాయో వందల పావురాలు. వేకువన సైనికులు పడేసిన కే కు, చాక్లెట్ ముక్కలనీ, ఇతర తినుబండారాలనీ తాపీగా పొడుచుకుని తింటున్నాయి.
 
 కానుకలు, కళలు
 మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులలో రకరకాల రంగాలవారు, నిపుణులు, కళాకారులు, క్రీడాకారులు ఉన్నారు. మ్యాజిక్ బాగా తెలిసిన ఓ జర్మనీ సోల్జరు తన ప్రతిభను చూపితే, నిజ జీవితంలో బార్బర్ అయిన ఒక బ్రిటిష్ ఆ కాసేపు తాత్కాలిక సెలూన్ తెరిచి తల ఒక్కింటికి రెండు సిగరెట్ల రుసుం తీసుకుని వేణీసంహారం గావించాడు. ఎలా పట్టుకొచ్చారో కొందరు సైనికులు తాము కొట్టి తెచ్చుకున్న పందిని సరదాగా కాలుస్తున్నారు. అక్కడే కనిపించిన ఒక జర్మన్ సోల్జర్‌ని చూసి ‘నీవు లండన్‌లో  వెయిటర్‌గా పని చే శావ్ కదా’ అని అడిగాడు ఒక ఇంగ్లిష్ అధికారి. ‘ఔన’న్నాడతడు, జర్మన్ యాసతో ఇంగ్లిష్‌లో. ఈ వాస్తవాన్ని 2003లో తాను రాసిన పుస్తకం ‘పెద్ద యుద్ధంలో చిన్న ఘట్టం’ (క్రిస్మస్ శాంతి ఒప్పందమే ఇతివృత్తం) అనే పుస్తకంలో మైఖేల్ జ్యూర్గ్ అనే జర్మన్ నమోదు చేశాడు.
 
 యుద్ధం మొదలు కావడానికి ముందు ఇంగ్లండ్‌లో ఎనభయ్ వేల మంది జర్మన్లు ఉన్నారు. చాలామంది చక్రవర్తి విల్‌హెల్మ్ పిలుపు అందుకుని సైన్యంలో చేరినవాళ్లే. కానీ వాళ్ల కుటుంబాలు మాత్రం యుద్ధం తీవ్ర రూపం దాల్చిన సమయంలో కూడా అక్కడే ఉన్నాయి. నిజానికి ఇంగ్లిష్ మాట్లాడడం వచ్చిన కొందరు జర్మన్ల వల్లనే ఈ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. మధ్యాహ్నం వారందరికీ ఎంతో ఇష్టమైన ఫుట్‌బాల్ ఆడారు. వెదురుబొంగులను నిలిపి, తమ టోపీలతో గోల్‌పోస్ట్‌ను తయారు చేసుకుని, చిత్తడిగా ఉన్న ఆ నేలతోనే ఆట ఆడారు. ఇందులో 3:2 స్కోరుతో జర్మనీ విజయం సాధించింది. కానీ యుద్ధంలో అది ఓడిపోయింది. అలాగే యుద్ధరంగంలో పావురాలు ఎగిరే దృశ్యాన్ని చూసే అవకాశం సైనికాధికారులు మళ్లీ ఎప్పుడూ రానివ్వలేదు.

యువరాణి క్రిస్మస్ కానుక
 చరిత్ర ఎరుగని ‘గ్రేట్‌వార్’కు వెళ్లిన బ్రిటిష్ సేనలకీ, వలస దేశాల సైనికులకీ క్రిస్మస్ పర్వదినాన ప్రత్యేకమైన కానుకను అందించాలని యువరాణి మేరీ ఆలోచించింది. బ్రిటిష్ చక్రవర్తి ఐదో జార్జి, రాణి మేరీల కుమార్తె ఈమె. వెంటనే ఇంగ్లండ్ జాతీయ పత్రికలలో నవంబర్, 1914లో ఒక ప్రకటన వెలువడింది. ‘సెయిలర్స్ అండ్ సోల్జర్స్ క్రిస్మస్ ఫండ్’ పేరుతో వచ్చిన ఈ ప్రకటనలకి అనూహ్య స్పందన వచ్చింది. 1,62,591 పౌండ్లు వచ్చి పడ్డాయి. ‘సముద్రం మీద ఉన్న ప్రతి నావికుడికీ, సమరభూమిలో ఉన్న ప్రతి సైనికుడికీ’ ఈ కానుక అందాలని యువరాణి భావించింది. కుప్పతెప్పలుగా వచ్చిన నిధులను బట్టి ‘కింగ్స్ యూనిఫారమ్’ ధరించిన వారితో (సైనికులు, నావికులు) పాటు యుద్ధం పనులకు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ, డాక్టర్లకీ, నర్సులకీ, మరణించిన సైనికుల భార్యలకూ లేదా ఇతర కుటుంబ సభ్యులకూ కూడా ఈ కానుక అందించాలని నిర్ణయించారు. ఇలాంటి వారు - 2,62,019
 
 5 అంగుళాల పొడవు, 3 అంగుళాల వెడల్పు, 1.5 అంగుళాల ఎత్తు ఉన్న ఈ ఇత్తడి పెట్టెలను  యాడ్స్‌హెడ్ అండ్ రామ్సే సంస్థ  సుందరంగా రూపొందించింది. 4,26,000 పెట్టెలు తయారు చేయడానికి సన్నాహాలు చేశారు. అవసరమైన ఇత్తడిని అమెరికా నుంచి (అప్పటికి ఆ దేశం యుద్ధంలో దిగలేదు) దిగుమతి చేసుకున్నారు. మూత మీద యువరాణి మేరీ శిరస్సు బొమ్మను ఉబ్బెత్తుగా అచ్చువేశారు. బొమ్మకు అటు ఇటు ఆమె పేరుతో ఇంగ్లిష్ అక్షరం ‘ఎం’ అని ముద్రించారు. జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న బెల్జియం, జపాన్, మాంటెనీగ్రో, ఫ్రాన్స్, రష్యా పేర్లు కూడా నలుమూలలా అచ్చువేశారు. ‘జాతి అందిస్తున్న అపురూప కానుక’ అంటూ డిసెంబర్ 25, 1914 నాటికి దిగ్విజయంగా 3,55,000 పేటికలను అందించగలిగారు. మిగిలినవి సకాలంలో ఉత్పత్తి చేయలేకపోవడంతో 1915, 16 వరకు కూడా యుద్ధభూమికి వస్తూనే ఉన్నాయి. ఆఖరికి ఈ కానుక అందలేదని 1919లో కూడా వాపోయినవారు ఉన్నారు.
 
 ఇంతకీ ఈ పెట్టెలో ఏం ఉన్నాయి? మూడు, నాలుగు రకాల స్థాయిలుగా విభజించి, అందుకు తగ్గట్టు కొన్ని వస్తువులు పెట్టారు. ఆఫీసర్ హోదా కలిగిన వారికి అందించిన పెట్టెలలో ఒక పైప్, ఔన్స్ పొగాకు, 20 సిగరెట్లు, లైటర్ ఉన్నాయి. పొగతాగని వారి కోసం సిగరె ట్లు, పొగాకు స్థానంలో పెన్సిల్, స్వీట్ ప్యాకెట్ పెట్టారు. భారత సిపాయీలకి స్వీట్లు, సుగంధ ద్రవ్యాల పెట్టెలు అందాయి. నర్సులకి పూర్తిగా చాక్లెట్లు పెట్టిన పెట్టెలు ఇచ్చారు. రాచ కుటుంబం పేరు మీద క్రిస్మస్ శుభాకాంక్షలు, యుద్ధంలో విజయం సాధించాలంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసే గ్రీటింగ్ కార్డు మాత్రం అన్ని పెట్టెలలోనూ ఉంచారు.  
 
 వేదిక ఎక్కబోతున్న జ్ఞాపకం
మొదటి ప్రపంచ యుద్ధ ఘట్టాలను ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల గుర్తు చేసుకుంటున్నారు. స్ట్రాట్‌ఫోర్ట్ అపాన్ ఎవాన్‌లో జరగబోయే ప్రదర్శన అలాంటిదే. విలియం షేక్‌స్పియర్ పుట్టిన ఈ ప్రాంతంలో ఆయన పేరు మీదే ఏర్పాటు చేసిన షేక్‌స్పియర్ రాయల్ థియేటర్‌లో క్రిస్మస్ శాంతి ఒప్పందం ఇతివృత్తంగా ఒక నాటకం వేదిక ఎక్కబోతున్నది. మొదటి ప్రపంచంలో పాల్గొన్న వార్‌విక్ సైనికులే పాత్రలుగా ఈ నాటకం రూపొందుతోంది. ఈ ప్రాంతంలోనే పుట్టి ఆ యుద్ధంలో పాల్గొన్న కెప్టెన్ రాబర్ట్ హ్యామిల్టన్ అక్షరబద్ధం చేసిన కొన్ని అనుభవాల ఆధారంగా ఫిల్ పోర్టర్ అనే నాటకకర్త రాసిన నాటకమిది.  మొదటి ప్రపంచ యుద్ధం నూరేళ్ల సందర్భంగా జరప తలపెట్టిన కార్యక్రమాల గురించి చర్చించడానికి మొన్న మార్చిలో ఏర్పాటు చేసిన ఒక సమావేశమే ఫిల్‌కు ఈ నాటకం రాయడానికి ప్రేరణ ఇచ్చింది. మహాయుద్ధంలో పాల్గొన్న సైనికుల వారసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కుటుంబాలకు ఆ సైనికులు చెప్పిన జ్ఞాపకాలనూ, రాసిపెట్టిన కథనాలనూ ఈ సమావేశంలో వారంతా వినిపించారు.
 - డా. గోపరాజు నారాయణరావు

మరిన్ని వార్తలు