వికాసం: ఆర్థికంగా ఎదగటానికి మెట్లు

17 Aug, 2013 23:40 IST|Sakshi
వికాసం: ఆర్థికంగా ఎదగటానికి మెట్లు

రోటరీ తరఫున ఇండియా వచ్చిన ఒక వియత్నాం మిత్రుడిని షాపింగ్‌కి తీసుకువెళ్లినప్పుడు, దాదాపు ప్రతి షాపు ముందూ ‘వాంటెడ్ సేల్స్‌బాయ్స్ - గర్ల్స్’ అన్న బోర్డు చూసి, ‘‘ఇన్ని ఉద్యోగాలుండగా మీ దేశంలో ఇంత నిరుద్యోగ సమస్య ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘మా వాళ్లంతా డిగ్నిఫైడ్‌గా చదువుకున్నవారు’’ అన్నాను. ‘‘ఇంట్లో ఉండటం డిగ్నిటీయా?’’ అన్నాడు. అతని మాటల్లో వెటకారం ఏమైనా ఉన్నదేమో అని చూశాను. కానీ అలాంటిదేమీ కనపడలేదు. ‘‘వాళ్లు ఇళ్లల్లో ఉండరు. సిటీలో కంప్యూటరో, సివిల్స్‌కో ట్రైనింగ్ పొందుతూ ఉంటారు’’ అన్నాను. అతడు సాలోచనగా ‘‘చిన్న ఉద్యోగం చేస్తూ కూడా ఆ ట్రైనింగ్ పొందవచ్చుగా’’ అన్నాడు. నా దగ్గర సమాధానం లేదు.
 
 ఒక దేశంలో ఉద్యోగం చేస్తున్నవారికి, నిరుద్యోగులకి మధ్య నిష్పత్తిని నిరుద్యోగ ఇండెక్స్ అంటారు. ప్రపంచంలోకెల్లా సౌభాగ్యవంతమైన ఖతర్ దేశంలో రెండొందల మందికి ఒక నిరుద్యోగి ఉంటే, బీద జింబాబ్వేలో నూటికి ఎనభై, భారతదేశంలో నూటికి ఏడుగురు నిరుద్యోగులు ఉన్నారు. నా గెస్ట్ తాలూకు దేశమైన వియత్నాం యుద్ధాల దేశం. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయినా అక్కడి అనెంప్లాయ్‌మెంట్ ఇండెక్స్ కేవలం మూడు శాతం మాత్రమే.
 
 బాల్యం నుంచే సమయం విలువ బాగా తెలుసుకున్నవాడు త్వరగా ధనవంతుడవుతాడు. ఖాళీగా ఉండటం కన్నా ఏదో ఒకటి చేయటమే గెలుపుకి మొదటి సోపానం. ఆ తర్వాత డబ్బు సంపాదించటానికి ఐదు మెట్లు ఎక్కాలి.
 
 మొదటి మెట్టు ‘కోరిక’: ఒకే ఒక్క  ప్రశ్న. నాకు నిజంగా డబ్బు కావాలా లేక డబ్బు సంపాదించటం చేతకాకపోవటం వల్ల, నక్కా-ద్రాక్ష పళ్ల వ్యవహారంగా నేను నా చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొని ఒక నిర్వికార వేదాంతిలాగ ఫోజు కొడుతున్నానా?
 
 రెండో మెట్టు ‘అవకాశం’: రెండే ప్రశ్నలు. అవకాశాలు లేకపోతే వాటిని నేనే విధంగా సృష్టించుకోవాలి? నేను పెద్ద తెలివైనవాడిని కాదు, చదువులో బ్రిలియెంట్ కాదు. కనీసం క్షవరం గాని, వడ్రంగి పని గాని చేయలేను. వ్యాపార మెళకువలు అస్సలు తెలియదు. అయినా నేను డబ్బు సంపాదించగలనా?
 
 మూడో మెట్టు ‘అవగాహన’: మూడు ప్రశ్నలు. నేనొక అవకాశం సృష్టించుకోవటానికి ఎంత డబ్బు, ఎంత సమయం వెచ్చించాలి? దీనిలో ఎంత శారీరక, మానసిక శ్రమ ఉన్నది? డబ్బు, సమయం, శక్తి... వీటిని నేను ఏ విధంగా సమకూర్చుకోగలను?
 
 నాలుగో మెట్టు ‘అంచనా’: నాలుగే నాలుగు ప్రశ్నలు. డబ్బు సంపాదించాలంటే నిశ్చయంగా తప్పు చేయాలా? ఈ ప్రపంచంలో ఎంతోమంది బీదవాళ్లు, మధ్యతరగతివాళ్లు డబ్బు సంపాదించి ధనవంతులైపోతూ ఉంటే, నేనింకా ఎందుకు వెనకబడి ఉన్నాను? డబ్బు సంపాదించటానికి ఏదైనా క్వాలిఫికేషన్ ఉండాలి అనుకుంటే అది ఏమిటి? ఒక డాక్టర్ అవటానికి గాని, ఇంజినీర్ అవటానికి గాని గొప్ప చదువు ఉండాలి సరే, కానీ ఎంతో మంది చదువులేనివాళ్లు కూడా డబ్బు సంపాదిస్తున్నారు కదా. అంటే, ధనవంతుడవ్వటానికి ఏ చదువూ అవసరం లేదన్న మాటేగా! వాళ్లకున్నది, నాకు లేనిది ఏమిటి? నాలో లోటుపాట్లు గురించి నేనెప్పుడైనా విమర్శ చేసుకున్నానా?
 
 అయిదో మెట్టు ‘పరిష్కారం’: దీనికి మాత్రం పది ప్రశ్నలు. గతంలో నేను కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు కానీ నాకన్నా పెద్ద తప్పులు చేసినవారు వాటిని సరిదిద్దుకొని సరైన మార్గంలోకి వచ్చేశారే? నేరస్తులు కూడా పరివర్తన చెంది డబ్బు సంపాదిస్తోండగా నేనెందుకు కేవలం నా తప్పుల గురించి, గతం గురించి, అనర్హతల గురించి బాధపడుతూ సమయం వృథా చేస్తున్నాను? నా జీవితాన్ని జీరో బేస్డ్ స్థాయి నుంచి పునర్నిర్మించుకోవాలంటే నేనేం చేయాలి? నాకు సలహా ఇవ్వటానికి సరైన వ్యక్తి ఎవరు? నిజంగా ఈ సమస్య అంత పెద్దదా? అనవసరంగా ఊహించుకుంటున్నానా? డబ్బు సంపాదించటానికి నేనిప్పుడు చెయ్యబోయే ప్రయత్నాల్లో పూర్తిగా ఫెయిల్ అయితే నేనేం నష్టపోతాను? ఎంత నాశనం అవుతాను? చచ్చిపోతానా? ఒకవేళ నేను చచ్చిపోవటానికి ఇష్టపడకపోతే మరింత బలంగా పైకి లేవటం కోసం నేనేం చెయ్యాలి?
 - యండమూరి వీరేంద్రనాథ్

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా