చిరు కాపీ కాదు...

18 Oct, 2015 00:48 IST|Sakshi
చిరు కాపీ కాదు...

ఆ సీన్ - ఈ సీన్
దర్శకుల్లో వ్యక్తిగతంగా తమకంటూ ప్రత్యేక శైలి ఉన్నవాళ్లూ, సినిమాల్లోని పాత్రల ద్వారా తమ ప్రత్యేకతను చాటే డెరైక్టర్లూ కొంతమంది ఉంటారు. కథలు, కథనాల విషయంలోనే కాదు, పాత్రల చిత్రణలో కూడావీళ్లకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ఇది సినీ ప్రపంచంపై శాశ్వత ప్రభావాన్ని చూపగలదు. టాలీవుడ్‌లో అలాంటి ప్రత్యేకతను చూపిన, చూపుతున్న దర్శకుల్లో ఒకరు పూరి జగన్నాథ్. తన తొలి సినిమా నుంచే కథానాయకుడిని కొత్త హైట్స్‌కు తీసుకెళ్లిన ఈ దర్శకుడు క్రమంగా ఇండస్ట్రీలో తన హీరోని ప్రత్యేకంగా నిలబెట్టాడు.

అతడి ఆటిట్యూడ్ ప్రత్యేకమనిపించాడు. మరి ఈ ప్రత్యేకత అంతా పూరి ఓన్ క్రియేషనేనా అంటే... ఒక్కోసారి ఆలోచనలో పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ‘చిరుత’ హీరో క్యారెక్టరయిజేషన్ విషయంలో!
 పూరీ ‘హీరో’ ప్రత్యేకమైనవాడు. ఆ హీరో ఒక ‘ఇడియట్’, ఒక ‘పోకిరి’. మరి అదే హీరో ‘చిరుత’ దగ్గరికి వచ్చేసరికి తన ఒరిజినాలిటీని కోల్పోయాడు. హాలీవుడ్ సినిమాను గుర్తు చేశాడు. లోకల్ మేడ్ చంటిగాడిని తయారు చేసిన పూరీ, చిరుత హీరో కోసం హాలీవుడ్ వరకూ వెళ్లాడు. ‘స్వెప్ట్ అవే’ హీరో మాదిరిగా తన హీరోను మలిచాడు.

అంతేనా... ఏకంగా ఆ సినిమా నుంచి సీన్లను తెచ్చుకొన్నాడు. అందులోని పాత్రలను తన సినిమాకు అన్వయించుకున్నాడు. వాటి ఆటిట్యూడ్‌ను తన సినిమాలోని పాత్రలకు అలవాటు చేశాడు. అంతిమంగా మంచి ఔట్‌పుట్ వచ్చింది. అయితే మాత్రం... కాపీ అన్న నిజాన్ని కాదనగలమా?!
  చిరుత సినిమాలోని సీన్లను తనకు ఎంతో ఇష్టమైన ప్రాంతమైన బ్యాంకాక్ బాట పట్టించిన తర్వాత... పూరీని ‘స్వెప్ట్ అవే’ చిత్రంలోని పాత్రలు ఆవహించాయి. ప్రధాన పాత్రలు షిప్ ఎక్కడం దగ్గర నుంచి చిరుత సినిమాలో ‘స్వెప్ట్ అవే’ ఛాయలే కనిపిస్తాయి.హీరోయిన్ పాత్ర పొగరుమోతుతనం, హీరో మంచితనం... ఈ రెండు నైజాలూ ఎలివేట్ అయ్యే సీన్లు ‘స్వెప్ట్ అవే’ సినిమాలోనివి. నిజం చెప్పాలంటే హీరో, హీరోయిన్ పాత్రలకు ఉండే ఆ ఆటిట్యూడ్‌తో జనరేట్ అయ్యే సన్నివేశాలే ‘చిరుత’ను ప్రత్యేకంగా నిలిపాయి. అయితే అవన్నీ కాపీయే.
 షిప్ ఎక్కబోతూ అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకొంటూ సరదాగా షేక్‌హ్యాండ్ ఇచ్చుకునే సీన్‌లో హీరోయిన్ గర్వాన్ని ప్రదర్శించడం దగ్గర నుంచి తనకంటే గొప్పవాళ్లు ఎవరూ లేనట్టుగా ఆమె ప్రవర్తించే ప్రతి సన్నివేశం ‘స్వెప్ట్ అవే’లోనివే.

ఆ సినిమాలో మడోన్నా ధరించిన పాత్ర తీరులోనే  నేహా పాత్ర సాగిపోతుంది. ఆ తర్వాత హీరో, హీరోయిన్లు ఒక చిన్న దీవిలో ఆగి పోయాక వారిద్దరి మధ్య వచ్చే సీన్లన్నీ కాపీనే. హీరో చేపలు పట్టడానికి ఆయు ధాన్ని తయారు చేసుకోవడం, కొండ వాలు నుంచి జాలువారే నీళ్లను తెలివిగా బాటిల్‌లో పట్టుకొని తాగడం, హీరోయిన్ బుర్రకు అలా నీళ్లను తాగే నేర్పు తట్టక పోవడం... ఇవన్నీ కాపీనే!
 
చేపలు పట్టి ఆహారాన్ని తయారు చేసుకున్న హీరోని డబ్బుతో కొనాలని ప్రయత్నిస్తుంది హీరోయిన్. తన ఆకలిని తీర్చుకోవడానికి ఆమె అతడికి డబ్బును ఎరగా వేస్తుంది. అందుకోసం వంద డాలర్లతో బేరాన్ని మొదలుపెట్టి వెయ్యి డాలర్ల వరకూ వెళ్లి చివరకు కొనలేక పోతుంది. ఇక్కడ హీరోయిన్ అహంభావ పూర్వమైన తీరు, హీరో ఆత్మాభిమానం రెండూ హైలెట్ అవుతాయి. తన బట్టలు ఉతికి తెచ్చిస్తే ఆహారాన్ని ఇస్తానని హీరో చెప్పడం, తప్పని పరిస్థితుల్లో హీరోయిన్ అతడికి సేవలు చేయడం, సార్ అని సంబోధించడం... ఇలా ప్రతి బిట్‌లోనూ ‘స్వెప్ట్ అవే’నే కనిపిస్తుంది.

సిల్వర్ స్పూన్‌తో పుట్టిన హీరోయిన్ ఆ పరిస్థితుల మధ్య గర్వాన్ని వదులుకుని హీరో దగ్గర అణిగిమణిగి ఉంటూ.. చివరకు అతడి ప్రేమలో పడటం ఇక్కడి ఓవరాల్ కాన్సెప్ట్. ‘స్వెప్ట్ అవే’లోని ఈ కాన్సెప్ట్‌నే పూరీ ‘చిరుత’ సినిమాలోకి తీసుకొచ్చాడు. అంటే, క్యారెక్టర్ ఎలివేషనే కాదు, ట్రాన్స్‌ఫార్మేషన్ కూడా కాపీనే. ఏ మాత్రం తేడా లేకుండా లాగించేశాడు.
 
రెండు సినిమాలకూ ప్రాణం ఈ సీన్లే. ఈ సీన్‌‌సకి ముందు హీరోయిన్ క్యారెక్ట రైజేషన్ ఒకలా ఉంటే.. పూర్తయ్యేసరికి మరోలా మారుతుంది. హీరోకు అనుకూల వతిగా మారిపోతుంది. దానికోసమే పైన చెప్పుకున్న సీన్లన్నీ క్రియేట్ చేయడం జరిగింది. అయితే క్రియేట్ చేసింది మాత్రం హాలీవుడ్‌వాళ్లు. కాపీ కొట్టింది మనం. అంతులేని కాపీతో అడుగడుగునా ‘స్వెప్ట్ అవే’ చిత్రాన్ని దించేశారు. ఎంత సినిమా హిట్టయినా క్రియేటివిటీ మనది కాదన్న నిజాన్ని ఒప్పుకుని తీరాలిగా!
- బి.జీవన్‌రెడ్డి

మరిన్ని వార్తలు