కొత్త మార్పులతో రీ.. స్టార్ట్‌

17 May, 2020 08:15 IST|Sakshi

ఊహలెప్పుడూ వింతలే. అనుభవంలోకి వచ్చేవరకూ అవి అసాధ్యాలు.. కష్టసాధ్యాలే!. కానీ ఒకసారి సాధ్యమై.. సాకారమైతే...  ఆ వింతదనం పోతుంది. ఓ కొత్త యదార్థంగా సాక్షాత్కరిస్తుంది. ఇక కాలం వాటిని మెల్లగా అలవాట్లుగా మార్చేస్తుంది. మనం చూస్తున్న ఈ కాలానుగత మార్పులు.. ఆధునికత..  సాంకేతికత.. అన్నీ ఇంతే!. ఊహల్లోంచి పుట్టుకొచ్చి వింతలుగా మారి అలవాట్లయినవే. కోవిడ్‌–19 కూడా ఎన్నెన్నో అనూహ్యాల్ని అలవాట్లుగా పరిచయం చేయబోతోంది. 

ఓ ముప్పై రూపాయల కూరగాయలు కొంటే చిల్లరుండాల్సిందే!!. పెద్దనోటున్నా ఫలితం లేదు.  అలాంటిది రూపాయి లేకున్నా ఇబ్బందిలేదిపుడు!. ఫోన్‌తో చెల్లించేయొచ్చు!!. మరి ఈ డిజిటల్‌ చెల్లింపుల్ని నాలుగేళ్ల కిందట కనీసం కలలోనైనా ఊహించామా?  2016 నవంబర్లో పెద్దనోట్లను రద్దు చేశాక... అనూహ్యాలన్నీ కొత్త యదార్థాలయ్యాయి. ఇపుడా కొత్తదనం కనుమరుగై జీవితంలో భాగమైపోయాయి. 

యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్‌కు ఇంకా నిర్దిష్టమైన మందేమీ రాలేదు. ఆ వ్యాధి రాకుండా నివారించే టీకా కూడా లేదు. అవి రావటానికి కొన్నాళ్లు పడుతుంది. మరి అప్పటిదాకా..? గడియారం తిరుగుతున్నా ప్రపంచం మాత్రం ఆగిపోయింది. ‘లాక్‌డౌన్‌’ అంటూ మానవాళి కాలు బయటపెట్టకుండా తాను కట్టుకున్న ఇళ్లకే పరిమితమైపోయింది. కానీ ఎన్నాళ్లీ హాలిడే..? కదలకపోతే ప్రాణాలు కాపాడుకోగలమేమో కానీ కడుపు నిండుతుందా? అదిగో... కాలంతో పాటు కదలటమూ మళ్లీ ఆరంభించింది..  మెల్లిగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ... మార్పులు చేసుకుంటూ!.  అనూహ్యమైన  ఈ మార్పుల్ని కొన్నాళ్లయినా అంగీకరించి తీరాలి. అలవాటు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ విద్య.. జూమ్‌!!
ఆన్‌లైన్లో పాఠాలు చెప్పటం కొన్నాళ్లుగా ఊపందుకుంటోంది. అంతర్జాతీయంగా కోర్సెరా, ఉడెమి, ఎడెక్స్‌ వంటివి ఆన్‌లైన్‌ యూనివర్సిటీల స్థాయిని ఎప్పుడో దాటేశాయి. దేశీయంగా కూడా బైజూస్, అన్‌ అకాడెమీ, వేదాంతు వంటి పలు సంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. విద్యార్థులు ఇప్పుడిప్పుడే వీటిని ఆశ్రయించటం మొదలెట్టారు. కాకపోతే తాజా లాక్‌డౌన్‌ ఈ రంగంలో ఊహించని మార్పులు తెచ్చింది. చిన్నా చితకా స్కూళ్లతో సహా అన్నీ తమ విద్యార్థులకు పాఠాలు చెప్పటానికి ‘జూమ్‌’లోకి వచ్చేస్తున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సిన తరుణంలో పాత విద్యా సంవత్సరమే పూర్తికాకపోవటంతో విద్యార్థులూ వీటికి త్వరగానే అలవాటుపడుతున్నారు. మునుపటిలా ఉండటం కష్టమని స్పష్టంగా తెలిసినా... భవిష్యత్తు క్లాస్‌రూమ్‌లు ఎలా ఉంటాయో తెలియదు. క్లాసుకు ఎందరు ఉండాలి? శానిటైజేషన్‌ ఏ స్థాయిలో ఉండాలి? మాస్కులు ధరించాలా? ఇవన్నీ స్కూళ్ల ముందున్న ప్రశ్నలు. వాటికి ఇప్పటికైతే ఆన్‌లైనే కొన్నాళ్లు బెటరనిపిస్తోంది. పరిస్థితులు సద్దుమణిగినా కూడా క్లాస్‌ రూమ్‌ సమయం తగ్గించి... ఆన్‌లైన్‌ క్లాసుల సమయం పెంచవచ్చనేది ఓ అంచనా. ఇవన్నీ మున్ముందు అలవాట్లుగా మారిపోయే అవకాశమూ స్పష్టంగానే కనిపిస్తోంది!!.

బయో మెట్రిక్‌... బైబై?
ఆఫీసుకెళితే హాజరు వేయించుకోవాలి. మరి అక్కడ బయోమెట్రిక్‌ యంత్రాలుంటే..? కోవిడ్‌ నేపథ్యంలో మార్చి 6న ఢిల్లీ పలు ప్రభుత్వాఫీసులు బయోమెట్రిక్‌ యంత్రాల్ని తాత్కాలికంగా తీసేశాయి. ఆ తరవాత ఇతర కార్యాలయాలు, ప్రైవేటు ఆఫీసులు అన్నీ దీన్నే అనుసరించాయి. తాకకుండా అటెండెన్స్‌ తీసుకునే ఫేస్‌ డిటెక్షన్‌ మెషిన్లు మాత్రం యథాతథంగా పనిచేశాయి. ఇదిగో... మళ్లీ ఆఫీసులు తెరుచుకున్నా వేలితో తాకే బయోమెట్రిక్‌ యంత్రాల వాడకం మాత్రం అనుమానమే. కరోనా తగ్గినా కూడా... ఇతర రకాల అటెండెన్స్‌ మెషిన్లకు అలవాటు పడాల్సిందే. అలాగే ఆఫీసుల్లో కూర్చునే సీట్ల మధ్య దూరం పెరగవచ్చని, సీటింగ్‌ స్ట్రక్చర్‌ కూడా మారుతుందనే అంచనాలున్నాయి. దీనివల్ల ఎక్కువ మంది కూర్చునే స్థలంలో తక్కువ మంది వస్తారు కనక ఆఫీసు స్పేస్‌కు గిరాకీ పెరుగుందనేది కొందరి అంచనా. కాకపోతే ఎక్కువ మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూ తక్కువమందే ఆఫీసులకు వస్తారు కనక ఆ పరిస్థితి ఉండదనేది కొన్ని కంపెనీల మాట. బహుశా! ఈ కంపెనీల మాటే నిజం కావచ్చు.

సినిమా... రిమోట్‌ చేతుల్లోకి
వెండితెరను బుల్లితెర, బుజ్జి తెర (మొబైల్‌) ఆక్రమించటమనేది వింత కాదు. కాకపోతే ఇన్నాళ్లు థియేటర్లు మూతపడటం... ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియకపోవటం... తెరుచుకున్నా జనం మునుపటిలా వెళతారా లేదా అనే అనుమానాలుండటం... ఇవన్నీ వింతలే. థియేటర్లలో విడుదల కాకుండా పదులకొద్దీ సినిమాలు నేరుగా ఓటీటీ యాప్స్‌లో విడుదల కావటం అనూహ్యమే. దేశంలో కొన్నాళ్లుగా పెరుగుతూ వస్తున్న ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) కంటెంట్‌ వీక్షణం ఈ లాక్‌డౌన్‌ సమయంలో తారస్థాయికి చేరింది. పాతికేళ్ల కిందట తీసిన సీరియళ్లను కూడా మళ్లీ విరగబడి చూశారు జనం. విదేశాల్లో అయితే ఈ ఒత్తిడికి అక్కడి బ్రాడ్‌బ్యాండ్‌ తట్టుకోలేక నెట్‌ఫ్లిక్స్‌ వంటివి తమ కంటెంట్‌ క్వాలిటీని తగ్గించాల్సి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, స్టార్, జీ వంటి దిగ్గజాలు ఏలుతున్న ఈ రంగంలో పోటీ  ఇపుడిపుడే తీవ్రమవుతోంది. సినిమాలను తలదన్నేలా ఒరిజినల్స్‌ రూపుదిద్దుకుంటున్నాయి. ‘ఆహా’ వంటి ప్రాంతీయ భాషా యాప్‌లూ దూసుకొస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ వినోద రంగ భవిష్యత్తును కళ్లకు కడుతున్నాయనే చెప్పాలి. 

ఎన్ని చెప్పినా వినోదానికి సినిమా అంత శక్తిమంతమైన మాధ్యమం మరొకటి లేదు. పైపెచ్చు థియేటర్లో వచ్చే కిక్కు వేరు. అందుకే ఎన్ని ఆటుపోట్లనైనా తట్టుకుంటూ వస్తోంది సినీ పరిశ్రమ. ఇప్పుడు మాత్రం పరిస్థితి వేరు. కనీసం కరోనాకు మందు లేదా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేవరకైనా జనం భారీగా థియేటర్లకు వెళ్లటమనేది కష్టమే. థర్మల్‌ స్క్రీనింగ్‌ వంటివి చేయించుకుని, మాస్క్‌లు ధరించినా పూర్తిగా రిస్కుండదని చెప్పలేం. కాబట్టి వినోద పరిశ్రమ కొత్త మార్గాలు అన్వేషించాల్సిందే. రేటెక్కువైనా తక్కువ మందికి... భౌతిక దూరంతో సహా వీలు కల్పించే లగ్జరీ థియేటర్లు ఒక ప్రత్యామ్నాయమన్నది నిపుణుల మాట. ఓటీటీ ద్వారా విడుదల చేసి ‘పే పర్‌ వ్యూ’ లెక్కన ఛార్జీలు వసూలు చేయటమన్నది మరో ప్రత్యామ్నాయం. ఇంకా పలు ఆన్‌లైన్‌ ప్రత్యామ్నాయాలనూ అన్వేషించవచ్చు. కాకుంటే ఇక్కడ పైరసీ వంటి ప్రమాదాలను నివారించే మార్గాలు కావాలి. 

టెలీ మెడిసిన్‌... వీడియో కన్సల్టింగ్‌ 
విదేశాల్లో ఇప్పటికే కాస్త ఊపందుకున్నా... రకరకాల నియంత్రణలు, జనం వెనకడుగు కారణంగా వీడియో ద్వారా వైద్యుడిని సంప్రతించే ప్రక్రియ దేశంలో కొత్తకొత్తగానే ఉంది. టెలీ మెడిసిన్‌ కూడా. తెలిసిన డాక్టర్‌కు ఫోన్‌ చేయటం మామూలే. కానీ... డాక్టరెవరో తెలియకున్నా ఫోన్‌ ద్వారా ఫీజు చెల్లించి సలహా తీసుకోవటం (టెలీ మెడిసిన్‌) మనకు కొత్తే. కోవిడ్‌ ఈ కొత్తదనాన్ని పోగొట్టిందనే చెప్పాలి. ప్రభుత్వాలే నేరుగా వీడియో, టెలీ కన్సల్టింగ్‌ ప్రక్రియను ప్రారంభించాయి. అత్యవసరమైతేనే నేరుగా ఆసుపత్రులకు వెళుతున్నారు. కోవిడ్‌ పోయినా అది తెచ్చిన భయం అంత తేలిగ్గా పోయేది కాదు. దీంతో వీడియో కన్సల్టింగ్, టెలీ మెడిసిన్‌ మరింత పెరగొచ్చు. దీంతో లాభాలూ లేకపోలేదు. సుదూర నిపుణుల సేవల్ని సైతం తేలిగ్గా, చౌకగా పొందొచ్చు.

ప్రాక్టోతో సహా ఈ రంగంలో ఉన్న కంపెనీలు మరింత విస్తరించొచ్చు. మున్ముందు టెక్నాలజీ సంస్థలకు ఈ రంగం మరిన్ని అవకాశాలు చూపించవచ్చు కూడా. ఇవే కాదు. రాసుకుంటూ పోతే కోవిడ్‌ తేబోయే మార్పులు చాలానే కనిపిస్తాయి. వైరస్‌ల బారి నుంచి రక్షించుకోవటానికి ఇమ్యూనిటీ అత్యవసరం కనక దాన్ని పెంచే ఆహారానికి గిరాకీ పెరగొచ్చు. ఫిట్‌నెస్‌ పరిశ్రమ కూడా కొత్త టర్న్‌ తీసుకోవచ్చు. జిమ్‌లకు వెళ్లటానికి భయపడే పరిస్థితులుంటే... కాస్తంత అవకాశం ఉన్న వారి ప్రతి ఇల్లూ కొద్దిపాటి ఎక్విప్‌మెంట్‌తో జిమ్‌గా మారే అవకాశముంది. అప్పుడు ఫిట్‌నెస్‌ ట్రెయినర్ల లైవ్‌ ఆన్‌లైన్‌ క్లాసులు పెరుగుతాయి కూడా. 

ఇక్కడ మనం చెప్పుకున్నవన్నీ ప్రస్తుతానికి కొత్త యదార్థాలుగా సాక్షాత్కరిస్తూనే ఉన్నాయి. మెల్లిగా కొత్తదనాన్ని పోగొట్టుకుని అలవాటవుతున్నాయి. ఆ సంగతి తెలుస్తూనే ఉంది. కానీ ఎన్నాళ్లిలా...? వెదుక్కుంటే... వైరస్‌కు మందు లేదా వ్యాక్సిన్‌ వచ్చేదాకా అనే సమాధానం వస్తుంది. అది కరెక్టేనా? ఆ తరవాత మళ్లీ ‘మామూలు’ అయిపోతామా? కోవిడ్‌ రాక మునుపున్న పరిస్థితులు వచ్చేస్తాయా..? ఈ ప్రశ్నకు జవాబు మాత్రం కష్టమే. ఎందుకంటే ఇదో కొత్త పాఠం. బెత్తం దెబ్బలతో నేర్చుకున్న పాఠం. అంత తేలిగ్గా మరిచిపోలేం. అన్నీ కాకున్నా... వీలైనన్ని పాటిస్తూనే ఉంటాం. వాటిని జీవితంలో భాగం చేసుకుంటూ... ఆ కొత్త లోకంలోనే... మరింత ముందుకెళతాం. 

రిస్క్‌  వద్దనుకుంటూ... మాస్క్‌
‘మా ప్రపంచం మాక్కావాలి. మొహానికి ఈ మాస్క్‌లు తొడుక్కుని తిరగటమనేది మాకిష్టం లేదు’. అన్నది మార్చి నెలాఖర్లో కోవిడ్‌ కేసులు తక్కువగా ఉన్నపుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పిన మాట. నిజానికి మొహానికి మాస్క్‌ వేసుకోవటమనేది కొత్త కాదు. 1910లో ప్లేగు ప్రబలినపుడు మాస్క్‌ వేసుకోవటం ద్వారా దాన్ని నియంత్రించవచ్చని వైద్య నిపుణులు గుర్తించారు. తరవాత 1918 స్పానిష్‌ ఫ్లూ సమయంలో విరివిగా వాడారు. అదే ఏడాది జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో.. జనమంతా మాస్క్‌లు ధరించే ఓటేశారు. ట్రంప్‌కు ఇష్టం లేకపోయినా... వందేళ్లు దాటాక ఈ ఏడాది జరగనున్న అమెరికా ఎన్నికల్లోనూ ఇదే సీన్‌ రిపీట్‌ కానున్నదనే చెప్పాలి.  మాస్క్‌లు ధరించటంలో మిగతా దేశాలకన్నా ఆసియా దేశాలే కొంత బెటర్‌. రెండో ప్రపంచయుద్ధం, హిరోషిమా వంటి సంఘటనలు నేర్పిన పాఠం కావచ్చునేమో గానీ... జపాన్‌ వాసులు అందరూ.. అన్ని వేళల్లో మాస్క్‌లు వాడుతూనే ఉంటారు.

అక్కడి మహిళలు మేకప్‌ వేసుకోవటానికి సమయం లేనపుడు అందమైన మాస్క్‌లతో కవర్‌ చేసుకోవడం సాధారణమే. ఏడాదికి 23 కోట్ల డాలర్లు ఈ మాస్క్‌ల కోసమే వెచ్చిస్తారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాలుష్యం నుంచి కాపాడుకోవటానికి దక్షిణ కొరియా, చైనా, సింగపూర్‌లలోనూ వీటి వాడకం ఎక్కువే. ఓ అధ్యయనం ప్రకారం 2011లో ప్రపంచ వ్యాప్తంగా ఏటాS50 కోట్ల మాస్కులు ఉత్పత్తయితే... 2018 నాటికి అది 440 కోట్లకు చేరింది. అవసరం దృష్ట్యా భారీ సంఖ్యలో కంపెనీలు తయారీ మొదలెట్టాయి. ఇండియాలో ఇళ్లలోనూ ఇది మొదలైంది. ఏపీలో పొదుపు సంఘాల మహిళలూ తయారు చేశారు. మొత్తం ఉత్పత్తి వందలు దాటి వేల కోట్లలోకి చేరింది. చాలా దేశాలిపుడు మాస్క్‌లను తప్పనిసరి చేశాయి. ఇది మాత్రం ఎవ్వరూ ఊహించనిదే. కానీ ఈ యదార్థాన్ని జీర్ణించుకుంటూ మానవాళి మరో ప్రయాణం మొదలెట్టింది. ¿¶ విష్యత్తులో కోవిడ్‌ ఉపశమిస్తుంది. కానీ కాలుష్యం, ఇతర విష వాయువుల నుంచి కాపాడుకోవటానికి... అలవాటైన మాస్కుల్ని మనం వదలకపోవచ్చు కూడా..!!.

హ్యాండ్‌ శానిటైజర్‌.. జేబులో
చేతులపై క్రిముల్ని నిర్మూలించే హ్యాండ్‌ శానిటైజర్‌ అంటే... నిన్న మొన్నటిదాకా లగ్జరీనే. హోటళ్లకు, ధనికుల ఇళ్లకే పరిమితం. కోవిడ్‌ దీన్ని మార్చేసింది. ఎక్కడికెళ్లినా జేబులో ఓ శానిటైజర్‌ బాటిల్‌ను వెంట తీసుకెళ్లటమనే వింతను యదార్థంగా మార్చింది. ఈ కొత్త వాస్తవం ఇపుడిపుడే అలవాటుగా మారుతోంది కూడా!! కోవిడ్‌తో శానిటైజర్‌ మార్కెట్లో ఊహించని అవకాశాలొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 2018లో 110 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్‌... ఏటా 17% చొప్పున వృద్ధి చెందుతూ 2026 నాటికి 360 కోట్ల డాలర్లకు చేరుతుందన్నది తాజా అధ్యయనాల సారాంశం. దేశంలో గతేడాది మార్చిలో అమ్మకాలు రూ.10 కోట్లు కాగా... ఈ మార్చిలో ఏకంగా రూ.43 కోట్లకు ఎగిశాయి. 

యూనిలీవర్, హిమాలయ, పీ అండ్‌ జీ, రెకిట్‌ బెన్కిసర్‌ వంటి దిగ్గజాలు ఏలుతున్న ఈ మార్కెట్లోకి... తాజా అవకాశాలతో ఒక్క ఏప్రిల్లోనే 152 కొత్త కంపెనీలు ఎంట్రీ ఇచ్చాయి. 61 శాతం వాటా సొంతం చేసుకున్నాయి. దేశీయంగా ఐటీసీ, డాబర్, ఇమామీ, మారికో ఉత్పత్తిని పెంచాయి. హిమాచల్‌లోని తన అత్తరు తయారీ ప్లాంటును సావ్లాన్‌ శానిటైజర్‌ కర్మాగారంగా మార్చేసింది ఐటీసీ. మహారాష్ట్ర చక్కెర మిల్లులూ ఆరంగేట్రం చేశాయి. దేశంలో 2025 నాటికి ఈ మార్కెట్‌ రూ.2159 కోట్లకు చేరుతుందనేది నీల్సన్‌ అంచనా. నిజానికి తన శానిటైజర్‌ 99.9 శాతం క్రిముల్ని నిర్మూలిస్తుందని ప్రకటించే కంపెనీలకే మందుల తయారీ లైసెన్స్‌ కావాలి. లేకుంటే కాస్మొటిక్‌ లైసెన్స్‌ చాలు. సబ్బు, నీళ్లు కూడా కొందరికి అందని మానిపండైన ఈ దేశంలో... ఈ కొత్త అలవాటును జీవితంలో భాగం చేయడానికి... లాక్‌డౌన్‌ తొలగాక లోకల్‌ కంపెనీలెన్నో షురూ కావచ్చు!!.

భౌతిక దూరం.. కాదిక భారం
ఒకరినొకరు తోసుకుంటూ... అరుచుకుంటూ... చాంతాడు లైన్లలో నిల్చోవటం కొత్తేమీ కాదు. కానీ ఒక్క మాట లేకుండా.. మూడడుగుల దూరం పాటిస్తూ నిల్చోవటమనేది అనూహ్యం. ఇపుడందరికీ ఆ వింత  పరిచయమైంది. ఎదుటివారిని పలకరించేటపుడు షేక్‌హ్యాండ్‌ ఇవ్వకపోవటం... మాట్లాడేటపుడు కూడా కాస్త దూరంగా ఉండటం... ఇవన్నీ మున్ముందు అలవాట్లుగా మారబోతున్నాయన్నది లాక్‌డౌన్‌ చెప్పిన సత్యం. ఇక దేశంలో వైన్‌షాపులు సైతం భౌతిక దూరాన్ని కళ్లకు కట్టి చూపించాయి. కాసింత ఖర్చుగానీ, ఏమాత్రం నష్టంగానీ లేని ఈ అలవాట్లకు తొందరగా అలవాటు పడిపోతేనే బెటరేమో!!.

ఇంటి నుంచే పని.. ఆన్‌ స్క్రీన్‌ మీటింగ్‌
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వింతేమీ కాదు. పాతదే. కాకపోతే కంపెనీలకు కంపెనీలే మూసేసి... మొత్తం సిబ్బంది అంతా ఇంట్లో నుంచి పనిచేయటమనేది వింతే. ఇప్పటిదాకా ఐటీ, ఐటీఈఎస్, కన్సల్టెన్సీ, నాలెడ్జ్‌ వంటి కొన్ని రంగాలకే పరిమితమైన ‘ఇంటి నుంచి పని’.. లాక్‌డౌన్‌తో అన్ని రంగాలకూ పాకింది. జీవితం– పని పెనవేసుకుపోయి... రెండింటి మ«ధ్య తేడా చెరిగిపోతున్న తరుణంలో మున్ముందూ ఇది కొనసాగుతుందన్నది వాస్తవం. ఎందుకంటే కొన్ని నెలల పాటు 10–25 శాతం సిబ్బందిని మించి ఆఫీసులకు రప్పించకూడదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కంపెనీలు సైతం రిస్కు తీసుకోవటానికి సిద్ధంగా లేవు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఖర్చులు తగ్గించుకోవచ్చన్నది వాటి ఆలోచన. పని చేయటానికి ఇల్లు–ఆఫీసులో ఏది మెరుగనే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ట్రాఫిక్‌లో ఇరుక్కునే సమయం మిగులుతుందని, కాలుష్యాన్ని తప్పించుకోవచ్చని కొందరంటే... ఇంట్లో ఒత్తిడి నుంచి రక్షించేది ఆఫీసేనన్నది ఆనంద్‌ మహీంద్రా వంటి కార్పొరేట్ల మాట. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా... ఇంటి నుంచి పని చేయటమన్నది కంపెనీలిపుడు అందరికీ అలవాటు చేస్తున్నాయన్నది నిజం.

ఇపుడు మీటింగ్‌లూ తెరమీదికే వస్తున్నాయి. మొబైల్, లేదా కంప్యూటర్‌ ద్వారా చాలా ఈజీగా ఎవరెక్కడ ఉంటే అక్కడి నుంచే సమావేశమయ్యేందుకు వీలు కల్పిస్తున్న యాప్‌లు చాలానే వచ్చాయి. కాకపోతే ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అమెరికన్‌ చైనీస్‌ కంపెనీ జూమ్‌. 20 కోట్ల మంది రోజూ దీని ద్వారా సమావేశమవుతున్నారంటే దీని ప్రాధాన్యం అర్ధం చేసుకోవచ్చు. సిస్కో వెబెక్స్, స్కైప్‌మీటింగ్స్, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్, డిస్కార్డ్, గూగుల్‌ మీట్‌ వంటి యాప్‌లు దీనికి పోటీ ఇస్తున్నా... వాడకంలో ఉన్న సౌలభ్యం జూమ్‌ను ముందు నిలబెడుతోంది. ప్రస్తుత అవసరాలను ఇవి తీరుస్తున్నా... మున్ముందు వీటిలోనూ మరిన్ని ఆధునిక ఫీచర్లొచ్చి, మరింత మంది యూజర్లు జతచేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోటీ పెరిగి... మరిన్ని కంపెనీలకు ఈ రంగం అవకాశాలు తెచ్చిపెట్టొచ్చు కూడా.
 – రమణమూర్తి మంథా

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా