ప్రేతసౌధం

9 Aug, 2015 00:54 IST|Sakshi
ప్రేతసౌధం

మిస్టరీ
 
*  అది ఓ ప్రఖ్యాతి చెందిన సౌథం
* అందులో అడుగడుగునా భయం
* ఆ భయానికి ఏమిటి కారణం?
వాషింగ్టన్ డీసీ...

కిటికీ దగ్గర నిలబడి తదేకంగా బయటకు చూస్తున్నాడా వ్యక్తి. వేసవి కావడంతో వెన్నెల విరబూసింది. చీకటిని దూరంగా తరిమి కొడుతోంది. ఆకాశమంతా అందంగా పరుచుకున్న నక్షత్రాలు, వాటి మధ్యలో హుందాగా నిలబడిన చందమామ...

చూడటానికే ఎంతో మనోహరంగా ఉందా దృశ్యం. అందుకే తదేకంగా చూసి పరవశిస్తున్నాడా వ్యక్తి.  అంతలో పనివాడు వచ్చాడు. ‘‘సర్... స్నానానికి నీళ్లు రెడీగా ఉన్నాయి’’ అని వినయంగా అన్నాడు. సరే అన్నట్టు తలూపి కిటికీ దగ్గర్నుంచి ఇవతలకు వచ్చాడాయన. పనివాడు అందించిన టవల్‌ను తీసుకుని బాత్రూమ్‌లోకి నడిచాడు. పది నిమిషాల్లో స్నానం ముగించి బయటకు వచ్చాడు. తడి ఒంటిని మెత్తని టర్కీ టవల్‌తో తుడుచుకుని నైట్ గౌన్ వేసుకున్నాడు. ఒంటికి పౌడర్ పూసుకున్నాడు. అద్దం ముందు నిలబడి దువ్వెనతో తల దువ్వుకుంటున్నాడు.
 
ఇంతలో వెనుక ఏదో అలికిడి అయినట్టనిపించింది. గదిలో తను తప్ప ఎవరో లేరే, మరి ఆ అలికిడి ఏమిటి అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. మంచం మీద కూర్చున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. చేతిలోని దువ్వెనను డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి ‘‘నమస్తే మిస్టర్ ప్రెసిడెంట్. మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నాడు సౌమ్యంగా.
 అవతలి వ్యక్తి మాట్లాడలేదు. హుందాగా తల పంకించాడు. అందంగా నవ్వాడు. మరుక్షణంలో అక్కడ్నుంచి మాయమయ్యాడు.
 
ఉలిక్కిపడ్డాడాయన. ఏదో ట్రాన్స్ లోంచి బయట పడినట్టుగా ఈ లోకంలోకి వచ్చాడు. గదంతా పరికించి చూశాడు. ఎక్కడా ఆయన లేడు. జరిగిందేమిటో అర్థమైంది. వెంటనే వెన్నులో వణుకు పుట్టింది. క్షణాల్లో ఆ వణుకు ఒళ్లంతా పాకింది. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుని గబగబా బయటకు పరుగుదీశాడు.
 
‘‘ఏం జరిగింది సర్... ఎందుకలా కంగారు పడుతున్నారు?’’... ఎదురు వచ్చిన మేనేజర్ అడిగాడు. ఆ వ్యక్తి కాసేపు మాట్లాడలేకపోయాడు. వణుకుతూ నిలబడిపోయాడు. తర్వాత ఎప్పటికో తడారిపోయిన గొంతును సవరించుకుని అన్నాడు... ‘‘నేను ఈ గదిలో పడుకోను. వేరే గది ఏర్పాటు చేయండి.’’
 
మేనేజర్‌కి అర్థం కాలేదు. ‘‘ఏం సర్. ఇక్కడ ఏర్పాట్లు బాలేదా? క్షమించండి. ఇప్పుడే అన్నీ సరి చేయిస్తాను’’ బతిమాలు తున్నట్టుగా అన్నాడు. ఆయన వద్దన్నట్టు తల అడ్డంగా ఊపాడు. ‘‘అవసరం లేదు. వేరే రూమ్ ఇవ్వండి’’ అంటూ వడివడిగా హాల్లోకి వెళ్లిపోయాడు.
 ఏం జరిగిందో, ఆయన ఎందుకలా వణుకుతున్నాడో ఎంతకీ అంతు పట్టలేదు మేనేజర్‌కి. కానీ గుచ్చిగుచ్చి అడగలేడు. ఎందుకంటే ఎదురుగా ఉన్నది మామూలు వ్యక్తి కాదు...

బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్. అతిగా ప్రశ్నలు వేస్తే అతిథిగా వచ్చిన ఆయన్ని అవమానించినట్టు అవుతుంది. అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఆయన కోసం వేరే గది ఏర్పాటు చేశాడు.  కానీ నిజానికి ఏం జరిగిందో అర్థమై ఉంటే అతడు కూడా అవాక్కయ్యేవాడు. భయంతో బిక్కచచ్చేవాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది? చర్చిల్ అంతగా ఎందుకు భయపడ్డారు? ఎందుకంటే... అక్కడ గదిలో, ఆయన మంచం మీద కూర్చుని ఉన్న వ్యక్తి ఎవరో కాదు... అబ్రహాం లింకన్. కాదు కాదు... ఆయన ఆత్మ.

లింకన్ చనిపోయి అప్పటికే చాలాకాలం అయ్యింది. కానీ ఆ విషయం చర్చిల్‌కి స్ఫురించలేదు. ఓ గొప్ప వ్యక్తిని చూసిన ఆనందంలో అనాలోచితంగా ఆయన్ని పలకరించారు. తర్వాతగానీ వాస్తవం బోధపడలేదు. లింకన్ మరణం గుర్తుకొచ్చాక ఇక కాలు నిలబడలేదు. గుండె దడ ఆగలేదు. నిజానికీ అనుభవం చర్చిల్‌కు మాత్రమే ఎదురు కాలేదు. అమెరికా అధ్యక్షుడి నివాసగృహంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వైట్ హౌస్... ఎంతోమందికి భయానక అనుభవాలను రుచి చూపించింది. ఎందరో ప్రముఖులకు నిద్రలేని రాతుల్ని మిగిల్చింది. కారణం... ఆ భవంతి నిండా ఉన్న ఆత్మలు. వ్యవహారిక భాషలో చెప్పాలంటే... దెయ్యాలు!
   
ధవళకాంతులతో, అత్యాధునిక సౌకర్యాలతో విలసిల్లుతుంది వైట్ హౌస్. అమెరికా అధ్యక్షుడు నివసించడానికని ఈ భవంతిని అత్యంత అందంగా తీర్చి దిద్దారు డిజైనర్లు. అధ్యక్షుడి హోదాలో ఇక్కడ యేళ్ల పాటు నివసించారు ఎంతో మంది ప్రముఖులు. అయితే ఎవరూ ఊహించిన విధంగా వైట్ హౌస్ కాస్తా ఘోస్ట్ హౌస్‌గా మారింది. ఆ భవంతి నిండా దెయ్యాలు తిరుగుతున్నాయంటూ పలువురు చెప్పసాగారు. చెప్పినవారు మామూలు వాళ్లయితే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో.

కానీ అతిథులుగా వచ్చిన ఇతర దేశాల నేతలు, ప్రముఖులు సైతం దెయ్యాల్ని చూసి జడుసుకున్నారు. కొందరు భయంతో వణికారు. కొందరైతే కళ్లు తిరిగి పడిపోయారు. దానికి తోడు అక్కడ నివసిస్తోన్న అధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులకు కూడా తరచూ దెయ్యాలు హాయ్ చెబుతూ ఉండటంతో వైట్ హౌస్ ఘోస్ట్ హౌస్ అయ్యిందన్న విషయం ప్రపంచానికి తెలిసింది. ఇంతకీ అక్కడ దెయ్యాలు నిజంగానే ఉన్నాయా???
   
వైట్ హౌస్‌లో అత్యంత ఫేమస్ దెయ్యం... అబ్రహాం లింకన్‌ది. ఆయన ఆత్మను తొలిసారి చూసింది... అమెరికా మాజీ అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ భార్య గ్రేస్. ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఒకసారి అతిథిగా వచ్చిన నెదర్లాండ్స్ రాణి కూడా లింకన్ ఆత్మను చూసి హడలిపోయింది. కళ్లు తిరిగి పడిపోయింది. రూజ్‌వెల్ట్ భార్యకి వ్యక్తిగత పరిచారిక అయిన మేరీ ఈబన్ అయితే లింకన్ ఆత్మను చూసి జడుసుకుని మంచం పట్టింది.

విన్‌స్టన్ చర్చిల్‌కి కూడా లింకన్ దర్శనమివ్వడంతో ఆయన ఆ విషయాన్ని అందరికీ తెలియజేశారు. ఇలా ఇంతమంది తమ అనుభవాలు చెప్పడంతో... లింకన్ దెయ్యమయ్యారన్న విషయం రూఢి అయిపోయింది. అది మాత్రమే కాదు. లింకన్ మృతదేహాన్ని ఊరేగించిన రైలు కూడా దెయ్యమైందని చాలామంది అంటుంటారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం లింకన్ శవయాత్ర జరిగిన రోజున ఆ రైలు కనిపిస్తూ ఉంటుందని, అది ఆ రోజులాగే అలంకరించి ఉంటుందని, యాత్ర మధ్యలో ఆగిన ఒక స్టేషన్‌లో కొద్ది క్షణాలు కనిపించి మాయమైపోతూ ఉంటుందని దాన్ని చూసిన ఎంతోమంది చెప్పారు.

దాంతో లింకన్ ఘోస్ట్ గురించి ప్రపంచమంతా తెలిసిపోయింది.
 నిజానికి లింకన్ మాత్రమే కాదు... టైఫాయిడ్‌తో చనిపోయిన లింకన్ పదకొండేళ్ల కొడుకు విల్లీ కూడా దెయ్యమయ్యాడని అంటుంటారు. అతని ఆత్మ కూడా వైట్ హౌస్‌లో చాలామందికి కనిపించిందట! ఇక తర్వాతి స్థానం అబిగలీ ఆడమ్స్‌ది. అమెరికా రెండో అధ్యక్షుడైన జాన్ ఆడమ్స్ భార్య అబిగలీ. ఆమెకు తూర్పువైపున ఉన్న గది అంటే చాలా ఇష్టం. ఆ గదిలో ఇప్పటికీ ఆమె ఆత్మ ఎంతోమందికి కనిపిస్తూనే ఉంటుందట. అప్పటిలాగే తలపై క్యాప్ పెట్టుకుని, లేస్ శాలువా కప్పుకుని ఉంటారట అబిగలీ. ఆమె ఇంట్లో తిరుగుతూ ఉండటం చాలామంది అధ్యక్షులు సైతం చూశారు.
 
అమెరికాను పాలించిన జేమ్స్ మ్యాడిసన్ భార్య డాలీ కూడా దెయ్యమై వైట్ హౌస్‌లో సంచరిస్తున్నారని ఎంతోమంది చెప్పారు. డాలీకి గులాబీలంటే చాలా ఇష్టం. దాంతో వైట్ హౌస్‌లో ఓ అందమైన గులాబీ తోటను నాటారామె. ఎక్కువగా దానిలోనే గడిపేవారు. చనిపోయాక కూడా అదే తోటలో తెల్లని గౌను వేసుకుని తిరగసాగారు. ఆమె చనిపోయిన వంద సంవత్సరాల తర్వాత నాటి అధ్యక్షుడి భార్య ఎలెన్ విల్సన్ పాడయిన గులాబీ తోటను తవ్వించేయా లని అనుకున్నారు. తీరా పనివాళ్లు తవ్వడం ప్రారంభించేసరికి డాలీ ఆత్మ అడ్డుపడింది.

తోట జోలికి రావొద్దని, దాన్ని తవ్వితే ఊరుకోనని భయ పెట్టడంతో పనివాళ్లు వణికిపోయి పారిపోయారట! అలాగే అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్, లింకన్ భార్య మేరీ టాడ్, మరో అధ్యక్షుడికి అత్తగారైన మేరీ తదితరుల ఆత్మలు కూడా తరచుగా వైట్ హౌస్‌లో కనిపిస్తుంటాయని వినికిడి.
 ఇవన్నీ నిజమేనా అంటే నిజమే అనేవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లంతా వైట్ హౌస్‌లో దెయ్యాలను చూశారు. భయానక అనుభవాలతో బెదిరిపోయారు.

అందుకే బల్ల గుద్ది చెప్తున్నారు అది నిజమేనని. కానీ ఆధునిక భావాలు కలవారు మాత్రం ఆ మాటల్ని కొట్టి పారేస్తున్నారు. ఎన్నో యేళ్ల ఘన చరిత్ర ఉన్న వైట్ హౌస్ ప్రతిష్టని దెయ్యాల పేరుతో దిగజార్చడం సబబు కాదు అని ఆగ్రహిస్తున్నారు. మరి ఈ రెండు వాదనల్లో ఏది వాస్తవం? వైట్ హౌస్‌లో దెయ్యాలు ఉన్నాయా? లేవా?? అది శ్వేత సౌధమా? ప్రేతసౌధమా??
- మీరా

మరిన్ని వార్తలు