బెనకల చవితి

1 Sep, 2019 10:05 IST|Sakshi

కొత్త కథలోళ్లు

రెండో పీరియడ్‌ ఫైనలియర్‌ బీయస్సీ క్లాస్లోకి అడుగుపెట్టి ఆశ్చర్యపోయాను.
 సగం పైన బెంచీలు ఖాళీ.
 ‘‘ఏమయింది అందరికీ?’’ నా ప్రశ్నకు కోరస్లో సమాధానం... 
‘‘మన్నాడు బెనకప్పపండగ్గద మేడమ్‌. అంతా టవునుకుపొయినారు.’’
 ‘‘పండగ ఎల్లుండయితే ఇప్పుడే వినాయకుణ్ణి తెచ్చిపెడతారా?’’ నొసలు చిట్లించాను. 
‘‘పెట్టేకి కాదు మేడమ్, అమ్మేకి బొమ్మలు తెచ్చుకుంటారు.’’
సమాధానం నన్ను ఆశ్చర్యపరచలేదు. విత్తనాలప్పుడు, కోతలప్పుడు ఎగవేతలు మామూలే. కరువు తీవ్రమయ్యాక గైర్హాజరీ మరీ పెరిగిపోయింది. బెంగుళూరులో పనుల కోసం పోయి పరీక్షలప్పుడు వస్తారు. మిగిలినకొద్దిమంది కూడా సందర్భానుసారం కుటుంబ ఆర్థికపరిస్థితిని కాస్త ఎగదోయడానికి ఇలా కాలేజీకి నామం పెడుతుంటారు.

పిలవక పోయినా వచ్చి కూర్చునే అతిథిలాంటి కరువు అనంతపురం జిల్లా వాళ్ళకు, అందులోనూ ఇంకా వెనుకబడిన కళ్యాణదుర్గంలాంటి ప్రాంతాలకు ఇది మామూలే. వాళ్ళ గైర్హాజరీని ఏమీ అనలేని నిస్సహాయ పరిస్థితి నాలాంటి లెక్చరర్లది. ఓవైపు వీధుల్లో గణపతి విగ్రహాలప్రతిష్టాపన కోసం చందాలు వసూలు చేసి చిందులేసే కుర్రకారు, మరోవైపు బ్రతుకుపోరులో పండగలఆసరా పొందే యువతరం.
మనసు పొరల్లోబాధను అలాగేఅదిమిపట్టి, ‘‘ఇంతకూ మీరు తెచ్చే గణపతిబొమ్మలు దేనితో చేస్తారు?’’ అడిగాను.
‘‘ఇదేం ప్రశ్న?’’ అన్నట్టు‘‘పీవోపీ మేడమ్‌’’ మూకుమ్మడిగా అరిచారు.
‘‘అది పర్యావరణానికిహాని చేస్తుంది తెలుసా? మన ఆరోగ్యానికి కూడా మంచిదికాదు. ఈ చుట్టుపక్కల ఎక్కడా బంకమట్టి దొరకదా? మనం బంకమట్టితో గణపతి బొమ్మచేద్దాం.’’
‘‘వానలే లేవుగదా మేడమ్, శరువులన్నీఎండిపొయినాయి, బంకమన్ను యాడదొరుకుతాది?’’ పిల్లలు ఎదురుప్రశ్న వేశారు. 
‘‘చూడండ్రా నాయనా ఎక్కడన్నా దొరుకుతుందేమో! మనం ఎకో ఫ్రెండ్లీ వినాయకుణ్ని తయారుచేయాలి.’’ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌లో భాగంగా మా కెమిస్ట్రీడిపార్టుమెంటు తరఫున మేం పెట్టుకున్న యాక్టివిటీ అది.
 ‘‘మా ఊరి కాడ ఉంటాదిలే మేడమ్‌. రేపేసకస్తాం’’ కంబదూరు నుంచి వచ్చే పిల్లలు హామీ ఇచ్చారు. ‘‘ఎట్లన్న గానీ ఒక గంపకు తీసుకురాండ్రా. తెచ్చినవాళ్ళకు మంచి బహుమతికూడా.’’ ఆశ పెట్టాను.

నా మాట వృథాపోలేదు.
మరుసటిదినం ఓ పెద్దగోనెసంచికి బంకమట్టి మోసుకొచ్చారు కంబదూరు పిల్లలు. వాళ్ళ ఉత్సాహాన్ని మెచ్చుకొని మంచి పెన్నులు బహుమతిగా ఇచ్చాను. ఆఖరి రెండు పీరియడ్లు బంకమన్నుతో గణపతి విగ్రహాలు చేసేపని పెట్టాము. 
మొదట రెండు వీడియోలు స్క్రీన్‌ పైన చూపించాము ఒక ఐడియా కోసం. పిల్లలు గ్రూపులుగా, జంటలుగా, ఒక్కొక్కరుగా ఎవరికీ తోచినట్లు వాళ్ళు ప్రతిమలు చేయడం మొదలు పెట్టారు. వీడియోలో చూపించినట్లు యథాతథంగా చేసేవాళ్ళు కొద్దిమంది, ఎక్కువ మంది వాళ్ళ స్వంత తెలివితో, నైపుణ్యంతో భిన్న రకాలుగా ప్రతిమలు చేశారు. భిన్న ఆకారాల్లో, వేర్వేరు పరిమాణాల్లో 30 ప్రతిమలు తయారయ్యాయి గంటలో. కొలువుతీరిన బొమ్మలు రంగుల్లేకపోయినా ముచ్చట గొలుపుతున్నాయి. ప్రిన్సిపాల్‌ మేడమ్, ఇతర స్టాఫ్‌ ఈ పర్యావరణ మిత్ర వినాయకుడి గొప్పతనాన్ని వివరిస్తూ మాట్లాడారు. 
ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసిన ప్రతిమలను నిమజ్జనం చేసినపుడు నీటి కాలుష్యానికి కారణమవుతాయని, రసాయన రంగులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని వివరించి చెప్పారు.

‘‘ఇప్పుడీ వినాయకులను ఏం చేద్దాం?’’ అడిగాను.
 ‘‘మేడమోళ్ళకు, సారోల్లకు ఇస్తాం మేడమ్‌.’’ అందరినీ పిలిచి తలో ప్రతిమను అందజేశారు.
 ‘‘మేడమ్, నా గణపతి బొమ్మను మీరే తీసుకోవల్ల.’’ ఫస్టియర్‌ దేవేంద్ర ఇచ్చాడు. అన్నిటి కంటే చిన్నగా ముద్దుగా ఉంది బొమ్మ. కాదనలేక తీసుకున్నాను గానీ ఏం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. చిన్నప్పట్నుంచీ ఎప్పుడూ వినాయక చవితికి ఇంట్లో విగ్రహం పెట్టిన ఆనవాయితీ లేదు.
 ‘‘దేవుడి పటాల్లో వినాయకుడి పటం కూడా ఉంది కదా, విగ్రహం అక్కర్లేద’’ నేది అమ్మ. బొద్దుగా ఉన్న మా తమ్ముణ్ణి చూసి, ‘‘వీడికే ఓ తొండం పెడితే సారి, అచ్చు వినాయకుడి లాగానే ఉంటాడు.’’ జోకేవాళ్ళు చుట్టుపక్కల జనం. పెరిగేకొద్దీ పెద్ద కోరికలేమీ లేకపోవటం మూలాన దేవుడితో పనిబడలేదు నాకు, కనుక ఏ దేవుడికీ ఇంట్లో అవకాశం లేకపోయింది.
‘‘ఇప్పుడీ బొమ్మను నేనేం చేసుకోవాలి?’’ నా గురించి తెలిసిన సీనియర్‌ లెక్చరర్‌ పార్వతి మేడమ్‌తో అన్నాను.
‘‘ఉండనివ్వమ్మా, పిల్లలంత ప్రేమగా ఇచ్చారు కదా, ఇంట్లో షోకేస్‌లో పెట్టుకో.’’ ఆమె మాటలతో ఖాళీ చాక్‌ పీస్‌ డబ్బాలో ప్రతిమ జాగ్రత్తగా పెట్టి, లంచ్‌ బ్యాగ్‌ లో పెట్టుకున్నాను.
‘‘మీ ఇంట్లో కూచో బెట్టినాక ఫోటోలు తీసి వాట్సప్‌లో పెట్టండి మేడమ్‌.’’ దేవేంద్ర రిక్వెస్ట్‌గా అన్నాడో, కమాండింగా అన్నాడో అర్థం కాలేదు. పంటల్లేక పోయినా ప్రతివాళ్ళ దగ్గర సెకండ్‌ హ్యాండుదో, చీప్‌గా దొరికే చైనాదో  స్మార్ట్‌ ఫోన్‌ మాత్రం తప్పకుండా ఉంటుంది.

‘‘ఈ గణపతి విగ్రహాన్ని ఎలా కూర్చోబెడతారో ఏమీ తెలీదు మేడమ్‌ నాకు.’’ బస్సులో పక్కనే కూర్చున్న పార్వతి మేడమ్‌ నా ప్రశ్నతో నవ్వేశారు.
 ‘‘పద్ధతిగా కూర్చోబెట్టి పూజ చేసే భక్తులెవరూ లేరు. వాళ్ళకు తోచిన ఆకులు, పూవులేవో పెడతారు. నువ్వూ అలాగే నీకు తోచిన పద్ధతిలో డెకరేట్‌ చేయి. మరీ పర్ఫెక్ట్‌గా కావాలనుకుంటే క్లాక్‌ టవర్‌ దగ్గర దిగు, రకరకాల పత్రాలు, కాయలు, పూలు అమ్ముతుంటారు కొనుక్కెళ్ళు.’’ సలహా ఇచ్చారు.
 అనంతపురం బైపాస్‌ దగ్గరికి చేరేసరికి సాయంత్రం నాలుగున్నరయింది. కళ్యాణదుర్గం నుంచి అనంతపురం రావడానికి గంటన్నర పడితే, బైపాస్‌ నుంచి టవున్లోకి వెళ్ళడానికి ట్రాఫిక్‌ పుణ్యమా అని గంట పట్టింది.
 క్లాక్‌ టవర్‌ చుట్టూ రోడ్ల మీద గణపతి విగ్రహాలు, పూజా సామాగ్రి, పండ్లూ, పూలూ అమ్మే వాళ్ళతో మూడొంతులు రోడ్డు మూసుకుపోయింది.
 ‘‘పండగొచ్చిందంటే చాలు, జనమంతా రోడ్ల మీదే, కరువెక్కడికి పోతుందో నాకర్థం కాదు.’’ చిరాగ్గా అన్నాను.
 ‘‘కరువు రోడ్డు మీదికొచ్చింది. సరిగ్గా చూడు, ఆ పత్రీ, పూలూ అమ్మేవాళ్ళంతా పేద రైతులు. కొనేవాళ్ళు మనబోటి ఉద్యోగులు. ఎక్కడెక్కడో కొండల్లో, గుట్టల్లో పత్రీ, ఆకులు ఏరుకొచ్చి, కొనుక్కొచ్చి, అవేవీ దొరకని మన కాంక్రీట్‌ వనాల్లో భక్తాగ్రేసరులకు అమ్మి పుణ్యం సంపాదించి పెడతారు.’’ పార్వతి మేడమ్‌ మాటలతో నా కళ్ళు తెరుచుకున్నాయి.

‘‘వీళ్ళు పాపం రోడ్డుకు పక్కగా కింద కూచునే అమ్ముతున్నారు. ఒక్కసారి డిసెంబరు 31 గుర్తు చేసుకో, ఈ క్లాక్‌ టవర్‌ చుట్టూ ఎలా ఉంటుందో...!’’ ఆవిడ మాటలు పూర్తికాకనే పెద్ద పెద్ద బేకరీలు, స్వీట్‌ షాపులు రోడ్డు మొత్తం ఆక్రమించి, షామియానా వేసి, టేబుళ్లు వేసి, రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణతో, ఆఫర్లతో హోరెత్తించే నా కళ్ళముందు దృశ్యం మెదిలింది.
‘‘ఆర్ట్స్‌ కాలేజ్‌ దిగండి.’’ కండక్టర్‌ అరుపుతో బస్సు దిగాము ఇద్దరమూ. మళ్ళీ వెనక్కి క్లాక్‌ టవర్‌ దగ్గరికొచ్చి అన్నీ చూస్తూ నెమ్మదిగా నడవసాగాము.
 ‘‘గరిక గావాల్నామ్మా?’’
 ‘‘గరిక, పత్రి అన్ని రకాలూ ఉండాయి రామ్మా.’’ అంతా కేకలేసి పిలుస్తున్నారు. కార్పొరేట్‌ స్టైల్లో నీటుగా ప్యాక్‌ చేసి బిజినెస్‌ చేసే టెక్నిక్‌ తెలియక, నోటిని మాత్రమే నమ్ముకున్నవాళ్ళు పాపం. ఓ పెద్దావిడ దగ్గరికెళ్ళాము.
 ‘‘ఇదేమాకు? ఇదేంది? అదేంది?’’ నా ప్రశ్నలతో నా అజ్ఞానాన్ని కనిపెట్టేసింది ఆమె. 
‘‘ఇది గరిక. ఇది ఉత్రేనాకు. అదేమో బిల్లిబిత్తిరాకు.’’ 
‘‘బిల్లిబిత్తిరాకా? అదేంటి మేడమ్, తమాషాగా ఉంది పేరు.’’ నవ్వాను.
 ‘‘బిల్వపత్రం తల్లీ. అంటే మారేడు ఆకులు. ఇది బదరీ పత్రం అంటే రేగు చెట్టు ఆకులు. ఇంకా గన్నేరు, తులసి నీకు తెలుసు కదా.’’ 
‘‘ఇవి మా ఇంటి దగ్గర ఉన్నాయి మేడం. ఇది ఉమ్మెత్త కదా. ఇదేమో జిల్లేడు. అంతేనా?’’ నాక్కూడా తెలుసన్నట్లు గర్వంగా చూశా.
 ‘‘హమ్మయ్య బతికించావు. సరేలేమ్మా, ఇవన్నీ ఎంతకిస్తావు?’’ పెద్దావిడను అడిగారు.

‘‘అన్ని రకాలూ కలిపి నూట యాబై రూపాయలమ్మా.’’ 
‘‘డెబ్భై ఇస్తాం, ఇస్తావా లేదా చెప్పు.’’ మేడమ్‌ బేరంతో దిమ్మ తిరిగింది నాకు. నేనయితే నూటా నలభై, నూటా ముప్పయి కి అడిగి ఉండేదాన్ని. 
‘‘నూటా ఇరవై కిస్తా, ఇష్టమైతే కొనుక్కో లేకపోతే లేదు.’’ కరాఖండిగా చెప్పిందామె. ‘‘ఇంకో చోట చూద్దాం రా.’’ పార్వతి మేడమ్‌ పక్కకు లాక్కెళ్ళారు. 
‘‘నూర్రూపాయలిస్తారా?’’ ఆమె మాట వినిపించుకోలేదు. ఇంతలోనే అక్కడేదో గలాటా. ఒకాయన గణపతి విగ్రహాలు చూస్తూ ఓ విగ్రహం జారవిడిచాడు. అది కాస్త పగిలిపోయిందని బండి మీది కుర్రాడి ఏడుపు. ‘‘డబ్బులియ్యి సార్‌. పడేసింది నువ్వే కదా.’’ అంటూ అతని చెయ్యి పట్టుకొని అరుస్తున్నాడు. 
‘‘నువ్వే సరిగ్గా పెట్టుకోలేదు. నేనేంటికిస్తా.’’ బలవంతంగా చెయ్యి విడిపించుకొని పరుగులాంటి నడకతో పారిపోయాడు. కుర్రాడు పట్టుకోవాలని చూశాడు, కానీ వెంటపడదామంటే ఇక్కడ ఇన్ని విగ్రహాలనొదిలి పోలేక తిట్టుకుంటూ వెనక్కి వచ్చాడు. 
వాడి ముఖంలో మా కాలేజీ పిల్లలు కనిపించారు నాకు.
ఇంటిముందు  అలకడానికి పసుపుపచ్చ రంగుపొడి ప్యాకెట్లు, ముగ్గుల్లోకి రంగులు బండ్ల మీద అమ్ముతున్నారు. పేడ దొరకడం గగనమైపోవడంతో పాటు, వాసనంటూ కొందరు ముట్టుకోవడం మానేశారు. మంచిదే కదా, నవ్వుకున్నాను.

‘‘ఎలక్కాయలు... ఎలక్కాయలు.’’ మరోబండి మీద వెలగపండ్లు అమ్ముతున్నారు.
‘‘వెలగపండ్లంటే నాకు చాలా ఇష్టం. కొనుక్కుందామా మేడమ్‌?’’
‘‘వినాయకుడి కోసమొద్దు నీకోసం కావాలన్నమాట.’’ 
‘‘దేవుడి పేరు చెప్పినా, తినేది మనుషులే కదా మేడమ్, వెలగపండుకు చిన్నగా రంధ్రం చేసి బెల్లం కూర్చి కలిపి తింటే భలేగా ఉంటుంది.’’ నా నోట్లో అప్పుడే నీళ్లూరుతున్నాయి.
‘‘అబ్బో నీక్కూడా బాగానే తెలుసే. సరే పద, నీ సరదా ఎందుక్కాదనాలి?’’ అంటూ ‘‘ఎంత కిస్తావు బాబూ వెలగపండ్లు?’’
‘‘జత ఎనవయ్యమ్మా.’’
‘‘అయ్యబాబోయ్‌ ఎనభయ్యా? పదండి మేడమ్‌ వెళదాం.’’ 
‘‘ఎంతిస్తారో సెప్పండమ్మా’’
‘‘వద్దులే నాయనా, బేరమాడేటట్లు చెప్పావా?’’ అంటూ కదిలాం.
‘‘పండగరోజు ధరలు ఇలాగే ఉంటాయి. తినడం వరకే కావాలంటే రెండు రోజులాగి కొనుక్కో. ధరలు తగ్గిపోతాయి.’’ పార్వతిమేడమ్‌ సలహా ఇచ్చారు.
‘‘మేడమ్‌ అటు చూడండి, అక్కడ ఫైనలియర్‌ ఎమ్పీసి హనుమంతు కదూ, గరిక, పత్రి అమ్ముతున్నది.’’ ‘‘అవునమ్మా. పద చూద్దాం.’’ సెకండియర్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు హనుమంతు. ఇటీవల తండ్రి అప్పుల బాధతో, పంటలు రాక ఆత్మహత్య చేసుకున్నాడు. చేనుకు పోవాలంటూ అడపాదడపా క్లాసులు ఎగరగొడుతుంటాడు.

‘‘హనుమంతూ!’’ మమ్మల్ని చూసి తడబడ్డాడు హనుమంతు. 
‘‘మేడమ్మీరా? నమస్తే మేడమ్‌. మా అమ్మకు ప్యానం బాగాలేదు మేడమ్‌. అందుకే నేను పెట్టినాను.’’ సంజాయిషీ ఇస్తున్నట్లుగా చెప్పాడు.
‘‘పోనీలే హనుమంతూ, అమ్మకు సాయం చేస్తున్నావు. మంచిదేగా. ఎక్కడ్నుంచి తెచ్చావు ఈ సామగ్రంతా?’’
‘‘మా ఊరవతల గుట్టల్లో పీక్కోనొచ్చినా మేడమ్‌. ఇంగరోన్ని మా చేని గట్ల మింద ఉండాయి.’’ దాదాపు 10–12 రకాల పత్రి, ఆకులతో పాటు మామిడాకులు, అరిటాకులు కూడా పెట్టుకొని అమ్ముతున్నాడు. ‘‘ఎలా సాగుతోంది వ్యాపారం?’’ పార్వతి మేడమ్‌ అడిగారు.
‘‘ఏం జరుగుతాది మేడమ్‌? ఇయ్యన్నీ ఏరుకోచ్చిండేయే గదాని ఉద్దరగ్గావాలంటారు. అయి పీక్కొచ్చేకి దినమంతా గుట్టల్లో తిరిగి, కంపలు గీసుకొని ఎన్నెన్ని తిప్పలు బడినామని. ఏందో పున్న్యానికి ఇచ్చిపోయినట్లు పదో పరకో చేతిలో పెడతారు. ఇంగ బజార్లో గనపతిని నిలబెట్టేకయితే దవుర్జన్నెంగా తీసకపోయే నాకొడుకులే.’’ బాధ, కోపం కలిపి చెప్పాడు. 
‘‘మొత్తం అన్ని రకాలూ కలిపి ఎంతవుతుంది?’’ నా ప్రశ్నకు ఇబ్బంది పడుతూ, ‘‘మీకేం గావాల్నో తీసుకోండి మేడమ్‌.’’ చెప్పాడు. 
‘‘నేను కొనటానికి కాదురా, వివరం కోసం అడుగుతున్నాను.’’ పార్వతి మేడమ్నవ్వుతూ, ‘‘మీ మేడమ్‌ ఇంటర్వ్యూ చేస్తున్నారు లేరా, చెప్పు.’’ అన్నారు.

‘‘అరిటాకు, మామిడాకులు అన్నీ కలిసి యాబై రూపాయలు మేడమ్‌. అయినా ఎవరూ అన్నీ కొనక్క పోరు. ఏవో అగ్గవకు సిక్కేవి తీసక పోతారంతే.’’
‘‘సరే, నాకు రకానికింత అన్నీ ఇవ్వు.’’ నా మాటలకు హనుమంతు ఆశ్చర్యంగా చూశాడు.
‘‘ఇవ్వు నాయనా, మీ మేడమ్‌ మొదటి సారి వినాయక చవితి చేసుకోబోతోంది.’’ పార్వతి మేడమ్‌ మాటలతో వాడు మరింత అయోమయంలో పడ్డాడు.
‘‘ఇవ్వు హనుమంతూ,’’ నా మాటలతో అన్నీ ఓ కవర్లో సర్ది అరిటాకు మాత్రం చుట్టి చేతికిచ్చాడు. ఐదొందల నోటు తీసి హనుమంతు చేతిలో పెట్టాను.
‘‘వొద్దు మేడమ్, మీ తాన తీసుకోరాదు.’’ తిరిగి కవర్లో పెట్టాడు. 
‘‘గురువుల మాట కాదనరాదు, తీసుకో.’’ భయపెట్టి చేతిలో ఉంచి ఆటో పిలిచాను.
‘‘మేడమ్‌ చిల్లర.’’ 
‘‘రేపు మీ వినాయకుడికి కుడుములు చేసి నైవేద్యంగా పెట్టు.’’ అంటూ వెనక్కి చూడకుండా ఆటో ఎక్కేశాము.
- ఎం.ప్రగతి 

మరిన్ని వార్తలు