చరిత్ర మలచిన చరిత్రకారుడు

19 May, 2018 23:56 IST|Sakshi

చారిత్రక ఘటనల వెంట నడిచి వెళ్లినవారే చరిత్రకారులైతే! ఇలాంటి ఘటనలు చరిత్రలో అరుదు. తెలుగు ప్రాంతాలలో మాత్రం ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య అలా చరిత్రకు సాక్షిగా నిలిచి, అదే చరిత్రను నమోదు చేసి, విద్యార్థులకు బోధించే సదవకాశం పొందారు. కేఏ నీలకంఠశాస్త్రి, నేలటూరి వెంకటరమణయ్య, మల్లంపల్లి సోమశేఖరశర్మ, పీవీ పరబ్రహ్మశాస్త్రి వంటివారు దక్షిణ భారతంలోనే ఖ్యాతికెక్కిన చరిత్రకారులు, లేదా చరిత్ర కోసం శ్రమించినవారు. మామిడిపూడి వెంకటరంగయ్య గారు (జనవరి 8, 1889–జనవరి 13, 1982) అలాంటి ఉన్నత శ్రేణి చరిత్రకారుడు. కానీ చారిత్రక ఘటనలతో ప్రేరణ పొంది, ప్రత్యక్ష సాక్షిగా ఉండి ఆ క్రమంలో చరిత్రకారునిగా తనను తాను తీర్చిదిద్దుకున్నప్పటికీ, చరిత్రను సశాస్త్రీయంగా ఆవిష్కరించిన ఘనత ఆచార్య మామిడిపూడికి దక్కుతుంది.

వెంకటరంగయ్యగారు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామంలో పుట్టారు. వీరి పూర్వీకులది మామిడిపూడి అగ్రహారం. దీనికీ ఓ చరిత్ర ఉంది. మామిడిపూడిని విజయనగర పాలకుడు సదాశివరాయలు నీలమేఘాచార్యులకు బహూకరించినది. ఆయనే మామిడిపూడి వారి పూర్వులు. నీలమేఘాచార్యుల వైదిక జ్ఞాన సంపత్తికి మెచ్చిను సదాశివరాయలు అలా సత్కరించాడు. వీరి ఇంటి పేరు దానితోనే స్థిరపడింది. వెంకటరంగయ్యగారి ప్రాథమిక విద్య పురిణిలోనే సాగింది. సంప్రదాయం మేరకు మొదటి తండ్రిగారి వద్దనే వెంకటరంగయ్య వేదాధ్యయనం, సంస్కృతాధ్యయనం చేశారు. కానీ ఆయనకి కొడుకును ఇంగ్లిష్‌ చదువులు చదివించాలని అనిపించింది. కొద్దికాలం ఇంటిదగ్గరే ప్రైవేటు చెప్పించి, 1899లో మద్రాసులోని పచ్చయప్ప కళాశాలకు అనుబంధంగా ఉన్న ఒక పాఠశాలలో రెండవ ఫారంలో చేర్చారు. 1907 నాటికి పచ్చయప్ప కళాశాలలోనే బీఏ చదువుతున్నారు.

అప్పుడే వెంకటరంగయ్యగారి జీవితం మలుపు తిరిగింది. బెంగాల్‌ విభజన (1905) వ్యతిరేకోద్యమంలో భాగంగా బిపిన్‌చంద్ర పాల్‌ దక్షిణ భారతదేశంలో పర్యటించారు. ప్రస్తుత ఉత్తరాంధ్రలోని విజయనగరం మొదలుకొని, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, అక్కడ నుంచి మద్రాసు వరకు పాల్‌ పర్యటించారు. పాల్‌ ఉపన్యాసం అంటే దేశ ప్రజలు ఉరకలేసిన కాలం. రాజమండ్రి, కాకినాడలలో ఆయన ప్రసంగాలు మిగిల్చిన ప్రభావం కూడా పెద్ద చరిత్రకు కారణమైంది. కాకినాడలో అల్లర్లు జరిగాయి. రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో అల్లర్లు జరిగాయి. పాల్‌ వెంట నడిచినందుకు గాడిచర్ల హరిసర్వోత్తమరావును ఆ కళాశాల నుంచి బహిష్కరించారు. అక్కడ నుంచి పాల్‌ మద్రాస్‌ వెళ్లారు.

వందేమాతరం నినాదం దేశమంతటా ప్రతిధ్వనించిన కాలమది. మద్రాసు మహా నగరంలోకి ప్రవేశించే ముందు కనిపించే బేసిన్‌ బ్రిడ్జ్‌ స్టేషన్‌లోనే పాల్‌ దిగుతారని జనానికి తెలిసింది. మొత్తం నగరమే అక్కడికి కదిలి వచ్చిందా అన్నంతగా ప్రజలు వచ్చారు. రాయపురం ఆసుపత్రి మీదుగా, అశేష జనవాహిని వెంటరాగా తిరువల్లిక్కణి వరకు ఉరేగింపుగా వెళ్లారు.  అయితే పాల్‌ ప్రసంగించడానికి ఎవరూ హాలు ఇవ్వలేదు. ‘‘సముద్రుడు ప్రసాదించిన స్థలమే ఉంది, దిగులెందుకు?’’ అన్నారట పాల్‌. మేరీనా బీచ్‌లో ఐదు రోజుల పాటు ప్రసంగాలు చేశారు. టీఎన్‌ వెంకటసుబ్బయ్యర్‌ అనే జాతీయవాది ఆ సభలకు అధ్యక్షత వహించారు. బెంగాల్‌ విభజన వెనుక కుట్ర, స్వదేశీ, జాతీయత వంటి అంశాల గురించి పాల్‌ అద్భుతంగా ప్రసంగించేవారు. ఈ ఐదు రోజులు కూడా ఆయన ప్రసంగాలు విన్నవారిలో వెంకటరంగయ్య కూడా ఉన్నారు. అదే ఆయనలో కొత్త చింతనకు శ్రీకారం చుట్టింది.

శొంఠి రామమూర్తి మద్రాసులో వెంకటరంగయ్యగారి సహాధ్యాయులు. ఇంగ్లండ్‌ వెళ్లి ఐసీఎస్‌ చదవడానికి రామమూర్తిగారికి ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ విద్యార్థి వేతనం ఏర్పాటు చేసింది. అలాంటి అవకాశం వెంకటరంగయ్య గారికి కూడా వచ్చింది. అప్పుడే బిపిన్‌పాల్‌గారి ఉపన్యాసం విన్నారాయన. ఆ ప్రభావంతోనే ఐసీఎస్‌కు వెళ్లరాదన్న నిర్ణయానికి వచ్చారు. పచ్చయప్ప కళాశాలలోనే చరిత్ర ట్యూటర్‌గా చేరారు. ఈ ఉద్యోగంలో ఉంటూనే ఆయన ఎంఏ విడిగా చదివి ఉత్తీర్ణులయ్యారు. అటు తరువాతి మలుపు కాకినాడకు తిప్పింది. మరో చరిత్ర పురుషుని సాంగత్యం ఇచ్చింది. బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడిగారి ఆహ్వానం మేరకు వెంకటరంగయ్య పీఆర్‌ విద్యా సంస్థలో 1910లో చరిత్రోపన్యాసకులుగా చేరారు. ఆ తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో బీఏ తరగతులు ప్రారంభించారు. వారి ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లి 1927 వరకు పనిచేశారు.

అక్కడ ఉండగానే మరొక ఘటన. 1921లో గాంధీజీ విజయనగరం వచ్చారు. అవి సహాయ నిరాకరణోద్యమం రోజులు. వెంకటరంగయ్య కుటుంబంతో సహా వెళ్లి గాంధీగారిని కలుసుకున్నారు. ఆయన సతీమణి వెంకమ్మగారు తన బంగారుగాజులు గాంధీజీ నిధికి ఇచ్చారు కూడా. దీనితో సంస్థానంలో ఆయన పట్ల కొంచెం వ్యతిరేకత వచ్చి, స్థానచలనం తప్పలేదు. 1925లో మహారాజా ఇంగ్లండ్‌ యాత్రకు వెళ్లారు. ఆ సమయంలో వెంకటరంగయ్య సెలవు పెట్టి మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన ఆరంభించారు. 1928తో ఆయనకు విజయనగరం బంధం తెగిపోయింది. విజయనగరం సంస్థానం నుంచి  వెంకటగిరి సంస్థానం చేరారు. అక్కడ వెంకటగిరి మహారాజా కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఖద్దరు దుస్తులలో, తలపాగతో వెంకటరంగయ్యగారు ఉండేవారు. అది దండి సత్యాగ్రహ ఉద్యమకాలం. స్వదేశీ పారిశ్రామిక ప్రదర్శన కూడా ఆయన ఏర్పాటు చేశారు.

అక్కడ నుంచే వెంకటరంగయ్యగారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఎన్నో నిరసనల మధ్య వైస్‌చాన్స్‌లర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వెంకట రంగయ్యగారిని చరిత్ర, రాజనీతి శాఖలో రీడర్‌గా నియమించారు. ఆ తరువాత అక్కడే ఆయన ప్రొఫెసర్‌ కూడా అయ్యారు. మధ్యలో అంటే 1949లో బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగం అధిపతిగా పనిచేశారు. మూడేళ్లే అయినా ఆచార్య వెంకటరంగయ్య గౌరవార్ధం ఆ విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేక సంచికను ప్రచురించింది. 1908లో వెంకటరంగయ్య ‘శశిరేఖ’ అన్న పత్రికలో తొలి వ్యాసం ప్రచురించారు. అది ఇటలీ స్వాతంత్య్రోద్యమం గురించిన వ్యాసం. పదవీ విరమణ చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచన మేరకు చరిత్ర రచన ప్రారంభించారు. అందుకు ఆయన సేకరించిన సమాచారమే పదివేల పుటలు.

ఇంగ్లిష్‌తో పాటు, తెలుగులో కూడా చక్కని వచనం రాయగల శక్తి వెంకటరంగయ్యగారికి ఉంది. ఆంధ్రలో స్వాతంత్య్రోద్యమం పేరుతో వెలువరించిన నాలుగు సంపుటాలు చరిత్రకారునిగా ఆయన ప్రతిభను వెల్లడిస్తాయి. కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని ఆయన తెలుగులోకి అనువదించారు. తెలుగులో ఆయన రాసిన పుస్తకాలే 25 వరకు ఉన్నాయి. 20కి పైగా పుస్తకాలు ఇంగ్లిష్‌లో రాశారు. భారత స్వాతంత్య్రం సమరగాథను మూడు సంపుటాలలో ఆయన తెలుగులో కూడా రచించారు. చరిత్ర రచనతో పాటు రాజ్యాంగం మీద విశ్లేషణ, పంచాయతీరాజ్‌ గురించి పుస్తకాలు రాశారు. విజ్ఞాన సర్వస్వం సంకలనాలకు కూడా ఆయన పనిచేశారు.

ఆయన పుస్తకాల జాబితాయే విస్మయం గొలిపే రీతిలో ఉంటుంది. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్, మన పరిపాలకులు, మన శాసనసభలు, పారిశ్రామిక విప్లవం, విద్యారంగం నాడు–నేడు – ఆయన రాసిన తెలుగు పుస్తకాలలో కొన్ని. ఆంగ్లంలో కూడా ది వెల్ఫేర్‌ స్టేట్‌ అండ్‌ సోషలిస్ట్‌ స్టేట్, సమ్‌ థియరీస్‌ ఆఫ్‌ ఫెడరలిజమ్, సమ్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ డెమొక్రాటిక్‌ పాలిటిక్స్‌ ఇన్‌ ఇండియా, ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎలక్షన్స్, ఫండమెంటల్‌ రైట్స్‌ ఆఫ్‌ మ్యాన్‌ ఇన్‌ థియరీ అండ్‌ ప్రాక్టీస్, లోకల్‌ గవర్నమెంట్స్‌ ఇన్‌ ఇండియా వంటి వైవిధ్య భరితమైన రచనలు కనిపిస్తాయి.

జీవితంలో ఎక్కువ భాగం విద్యా బోధనకీ, చరిత్ర రచనకీ అంకితం చేసిన వెంకటరంగయ్య గారికి ఆయన చివరి రోజుల నాటి విద్యా విధానం అంత సంతృప్తికరంగా కనిపించలేదు. అందుకే ఒక మాట అన్నారు. కానీ అది నేటికీ వర్తిస్తుంది. ‘ఇప్పుడు చదువులలో శిష్యులకు, గురువులకు శ్రద్ధ కనిపించదు. నేను (ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తప్ప) పన్నెండు విశ్వవిద్యాలయాలకు పరీక్షకుడిగా ఉన్నాను. విద్యా ప్రమాణం తగ్గిందనే నా నమ్మకం. ప్రభుత్వం బాధ్యత వహించాలి. మేమంతా ఈ దుస్థితి మారాలని అంటూనే ఉన్నాము. పూర్వం ఇప్పుడున్నన్ని వినోదాలు లేవు. కనుక అప్పటివారి దృష్టి ఏకాగ్రంగా ఉండేదనుకుంటాను.’

మరిన్ని వార్తలు