ఆదిశ్రీరంగ క్షేత్రం శ్రీరంగపట్నం

4 Aug, 2019 12:35 IST|Sakshi

పవిత్ర కావేరీ తీరంలో వెలసిన మూడు శ్రీరంగనాథ క్షేత్రాలలో మొదటిది శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథ ఆలయం. కావేరీ నది మొదట్లో వెలసిన శ్రీరంగపట్నం క్షేత్రాన్ని ఆది శ్రీరంగంగా, కావేరీ ప్రవాహానికి కాస్త ముందుకు వెళితే శివసముద్రం వద్ద వెలసినది మధ్య శ్రీరంగ క్షేత్రంగా, తమిళనాడులోని శ్రీరంగంలో వెలసినది అంత్య శ్రీరంగ క్షేత్రంగా విరాజిల్లుతున్నాయి. ఇవి వేటికవే ప్రత్యేకం, పురాతనం.

శ్రీరంగపట్నంలో వెలసిన క్షేత్రం ఏనాటికి చెందినదో తెలిపే కచ్చితమైన ఆధారాలేవీ లేవు. అయితే, అంబ అనే భక్తురాలు క్రీస్తుపూర్వం 3600 సంవత్సరంలో ఇక్కడ శ్రీరంగనాథునికి చిన్న గుడి కట్టించినట్లు ప్రతీతి. తర్వాతి కాలంలో గంగ, హొయసల, విజయనగర రాజుల కాలంలో ఆలయం వివిధ కళారీతుల్లో విస్తరించింది. తొలుత చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని తొమ్మిదో శతాబ్దిలో గంగ వంశపు రాజులు భారీ స్థాయిలో పునర్నిర్మించారు. తర్వాత హొయసల, విజయనగర రాజులు అభివృద్ధిపరచారు. ఇక్కడి గర్భగుడి గంగవంశీయుల నాటి శిల్పశైలిలోను, ఆలయ అంతర్నిర్మాణాలు హొయసల శైలిలోను, ఆలయంలోని రంగమండపం, గోపురం విజయనగర శైలిలోను కనువిందు చేస్తాయి.

మరిన్ని వార్తలు