క్రిస్మస్‌ అద్భుతం!

24 Dec, 2017 01:25 IST|Sakshi

ఈవారం కథ

‘దూత పాటపాడుడీ.. రక్షకున్‌ స్తుతించుడి’క్వయర్‌ పాటక బృందం చర్చిలో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. మరి కొందరు యువకులు చర్చిని అలంకరించే పనిలో ఉంటే, అమ్మాయిలు చర్చిని శుభ్రం చేస్తున్నారు. మాదేమంత చెప్పుకోదగ్గ చర్చి కట్టడం కాదు. సిమెంట్‌ రేకులు ఒక వైపు గోడనుంచి వాల్చారు. నిజానికి గుడిసె లాంటి చర్చి. మూడువైపులా గోడలు లేవు. ఖాళీ పాలిథిన్‌ బియ్యం బస్తాలను కుట్టి, వేలాడదీశారు గోడల్లాగ. అది ఒక చర్చి అనడానికి గుర్తుగా ముఖద్వారం పైన చెక్కతో చేసిన సిలువను బిగించడం! అంతా కలిసి ఒక బీదవాని చర్చి.ఖర్చు ఏమీ చేయలేదు. ఉన్నదానిలోనే తృప్తిపడాలి అని మా ఆయన.. అదే పాస్టర్‌ జోసెఫ్‌గారు చెప్పిన మాటలు ఎవరు వింటారు? పండుగ ఉత్సాహం యువకులది. వారు ఊరంతా తిరిగి, చందాలు వసూలు చేశారు. వీధుల్లో అక్కడక్కడ గుడిసెల మీద కాంతులీడుతున్న స్టారులను బట్టి ఇవి క్రైస్తవుల ఇళ్లు అని తెలుసుకోవచ్చు. నాలుగు రోడ్ల కూడలిలో పెద్ద స్టారును ఏర్పాటు చేశారు.‘‘మమ్మీ.. మనమెప్పుడు షాపింగ్‌కు వెళ్తాం’’ అని ఆశగా అడుగుతున్న కూతురు రూతు, చిన్నవాడైన జేమ్స్‌లను చూసి, ఏమి చెప్పాలి బాధగా ఉంది. నాకు, మా ఆయనకు కొత్త బట్టలు లేకపోయినా ఫరవాలేదు. సర్దుకుంటాం. పిల్లలెలా సర్దుకుంటారు? అందునా మా చర్చి ఆడవారైన మెంబర్లు వారి కుటుంబానికి కొత్త దుస్తులు కొనుక్కుని, నాకు చూపించి, ఎలా ఉన్నాయి అమ్మగారు అంటుంటే.. బాగున్నాయి అనక తప్పలేదు. ఈ పండుగకు మా పిల్లలకేమి లేవు..?
మేమున్నది నల్లగొండ జిల్లాలోని నెల్లికల్లు తండాలో. అంతా ఆటవిక ప్రాంతం! ఉన్న కొద్దిమంది విశ్వాసులు రైతుకూలీలు. 

‘‘ఇక్కడే సేవ చేయాలని ప్రభువు నాకు చూపారు’’ అంటారు పాస్టర్‌ జోసెఫ్‌. అదే... మా ఆయన! ‘‘క్రైస్తవ వేదాంత విద్య చదివి, ఈ తండాలో సేవ ఎందుకు? హాయిగా మనకు దగ్గరగా ఉన్న నాగార్జున సాగర్‌లోనో, హాలియాలోనో సేవ చేస్తే బాగుంటుంది కదా’’ అని నేనంటే, ‘‘చూడు పూజా! ప్రభువు చూపిన స్థలంలోనే మనముండాలి’’ అంటారాయన. ఆదివారాలు చర్చికి వచ్చేవారే తక్కువ. వారు వేసే కానుకలు అంతంత మాత్రమే. ఒక్కోసారి ఐదురూపాయలు కానుకగా రావడం కష్టం. మా ఆయనకు కొంచెం వైద్యం తెలుసు కాబట్టి, సేవలోని భాగంగా పాత మోపెడ్‌ వేసుకుని పక్క తండాల్లో చిన్న చిన్న రోగాలకు మందులు, సూది వేయడంతో కొంచెం అదనపు డబ్బు.. బియ్యం, కూరగాయలు వస్తాయి. రాత్రి ప్రార్థనకు కూర్చున్నాం.‘‘పిల్లలు క్రిస్మస్‌కు కొత్త బట్టలంటున్నారు’’ అన్నాను ఆయనతో.
‘‘నీకు తెలుసుకదా! మనకు డబ్బులు రావు. ఏదో అద్భుతం జరిగితే తప్ప!! అయినా కొత్త బట్టలుంటేనే పండుగా? ఇప్పటి నుండే పిల్లలకు నేర్పాలి.. ప్రభువు సేవలో ఎన్ని కష్టాలుంటాయో! మనం భోజనం లేనప్పుడూ – ప్రభువు కోసం ఉపవాసాలున్నవి మరిచావా?’’ అన్నాడు పాస్టర్‌ జోసెఫ్‌గారు.‘‘అయినా..!’’ అన్నాను. పిల్లలు ఆతృతగా చూస్తున్నారు.‘‘రూతు.. నీవైనా అర్థం చేసుకో.. తమ్ముడు జేమ్స్‌ చిన్నవాడుగా.. అర్థం అయ్యేలా చెప్పు..’’ అన్నారాయన!‘‘అలాగే’’ అంది కూతురు రూతు మౌనంగా. జేమ్స్‌ మాత్రం రాజీపడ లేకపోతున్నాడు. ఎదురు తిరిగి గొడవ చేయాలని ఉంది. ఆ కళ్లలో నిరాశ స్పష్టంగా అగుపడుతుంది.

‘‘పిల్లలూ.. మీకు ఓ సంఘటన చెప్పనా? నీవు కూడా విను పూజా’’ అన్నారాయన మమ్మల్ని చూస్తూ...‘‘లేమన్‌ ఎలాంజిలికల్‌ ఫెలోషిప్‌ అనే సంస్థ వ్యవస్థాపకుడు జాషువా డానియేలు గారు. ఆయన తండ్రికూడా దేవుని సేవ చేసేవారు. ఆయనలో గొప్ప లక్షణం నేను ఈ రోజుకీ అమలు చేస్తున్నాను’’ అన్నారు పాస్టర్‌గారు.నేను నవ్వి, ‘‘చేతిలో ఎంత డబ్బు ఉంటే అంత బీదవిశ్వాసులకో, సేవ చేస్తున్న సంస్థలకో మనీ ఆర్డర్‌ చేయడమేనా?’’ అన్నాను.‘‘అవును పాస్టరమ్మగారు! అదే నా పద్దతి అని నీకూ తెలుసు. కాసేపు ఆగి, అసలు ఏమయిందో చెప్పలేదు కదా’’ అని పిల్లల వైపు చూశారు. ‘‘చెప్పండి నాన్నా’’ అన్నారు వాళ్లు. నాన్న అని పిలిపించుకోవడమే ఆయనకు ఇష్టం.‘‘జాషువా గారు ఇలా తన పుస్తకంలో రాశాడు. ‘పిల్లలమైన మాకు.. మా నాన్న ఏనాడూ ఏదీ కొనిపెట్టేవారు కాదు. అమ్మకూ, మాకు పండుగకైనా బట్టలు కొనాలనే ధ్యాసే ఆయనలో ఉండేది కాదు. అంత డబ్బు కూడా ఉండేది కాదు. మా అమ్మానాన్నలు ప్రార్థన కూడికకు క్రిస్మస్‌ పండుగ సమీపిస్తుండటంతో.. పక్క ఊరు వెళ్లారు. పిల్లలం మేమే ఇంట్లో ఉన్నాం ఆడుకుంటూ. మా ఇంటికి డాడీ, మమ్మీ లేరా? అంటూ వచ్చింది ఒక డాక్టరమ్మ. ఆమె మా ఇంటికి తరచు ప్రార్థన కోసం వచ్చేది. తాను ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా, ఇంట్లో అన్నీ ఇబ్బందులు – చికాకులు– అనారోగ్యం! అనేకమైన సమస్యలు. మా డాడీ మంచి ప్రార్థనా పరులు. ఆయన ఈ డాక్టరమ్మ గూర్చి – చాలా సార్లు క్రమంగా ప్రార్థించేవారు. అలా ఆమె సమస్యలు కొద్దిగా మెరుగవసాగాయి. ఇది చూసి, ఆవిడ తరఫు బంధువులు, యేసయ్యను విశ్వసించి, చర్చికి వస్తున్నారు. ఏమిటన్నట్లుగా ఆమె వైపు చూశాం.. మా డాడీ, మమ్మీ పక్క ఊరికి ప్రార్థన కూటానికి వెళ్లారని చెప్పి. 

పిల్లలూ.. మీకు పండుగ బట్టలు తెచ్చాను. టైలర్‌ వస్తే, మీ కొలతలు ఇవ్వండి. రెండ్రోజుల్లో కుట్టి ఇస్తాడు. అతనికి డబ్బు ఇచ్చేశాను కుట్టడానికి అంది. మేమెంతో సంతోషించాం. ఈ పండుగకు మాకు కొత్త బట్టలు వచ్చాయని! మా డాడీ నిస్వార్థసేవ వల్ల పరలోకం నుండే దేవుడు ఇలా మాకు బహుమతి పంపారని ప్రభువుకు స్తోత్రం చెప్పాము.’ ఇదే ఆయన సాక్ష్యం.’’ ముగించారు పాస్టర్‌ గారు.అప్పటికే పిల్లలు నిద్రపోయారు సాంతం ఇది వినకుండానే! ‘‘నేను పొద్దున్నే పక్క తండాలో ఒక వ్యక్తికి ఇంజక్షన్‌ ఇవ్వాలి. జ్ఞాపకం చెయ్యి. నేను రేపటికి ప్రభువు వర్తమానం కొరకు సిద్ధపడతాను’’ అన్నారు నిద్రవస్తే, పడుకోమని!నిద్రరావడం లేదు. జాషువాగారి సాక్ష్యం విన్నాక ఎంతో ధైర్యం వచ్చింది. పాస్టరమ్మను అయినా– ఏదో విశ్వాసలోపం. జాషువా గారంటే, పెద్ద విశ్వాసుల కుటుంబం. యేసయ్య అలాంటి వారికి ఏది చేసినా యిస్తారు. మేము సామాన్యమైన సేవకులం! మా ఆయనది నిస్వార్థ సేవ. లోకం కన్నా ప్రభువునే అధికంగా ప్రేమిస్తారు. ఎన్నోసార్లు మేము పస్తులుండి, పిల్లలకు భోజనం పెట్టాం. యేసయ్యకు మేము గుర్తుకురామా? ‘ఆశీర్వాదాలన్నీ పెద్ద దైవజనులకే కాబోలు...’ నాలో కొంచెం అవిశ్వాసం. 

‘నాకూ, మా ఆయనకు లేకున్న ఫరవాలేదు ప్రభూ – నా పిల్లలకు.. పండుగకు కొత్త బట్టలు ఇవ్వు తండ్రీ!’ ప్రార్థించాను. రూతు కొంచెం పెద్దది కాబట్టి అర్థం చేసుకుంటుంది. జేమ్స్‌ చిన్నవాడు – ఎలా నచ్చజెప్పాలి. నిద్రపోతున్న ఇద్దరినీ చూశాను. ప్రశాంతంగా ఉన్నాయి ముఖాలు. ఆ ప్రశాంతత నాకు ఎప్పుడొస్తుంది ప్రభువా?తెల్లవారక ముందే పాస్టర్‌ గారు పక్క ఊరు వెళ్లారు పాత మోపెడ్‌ మీద. అది చేసే శబ్దం యింకా వినబడుతూనే ఉంది మూల మలుపు వరకూ. మా ఆయన దగ్గర వైద్యం చేయించుకున్నవారు కొంచెం కొంచెంగానైనా డబ్బు సర్దితే సరి. పండుగ ఆనందంగా గడుస్తుంది అనుకున్నాను.
సంఘపెద్ద మరియమ్మ వచ్చింది హడావుడిగా.‘‘పాస్టరమ్మగారూ! మేము పట్నం బోతున్నాం. మొన్న పెళ్లయింది చూడు.. రత్న, అల్లుడూ వచ్చారు. ముందు పండుగకు రమ్మంటే రానన్నారు. రాత్రే వచ్చిండ్రు. బట్టలు అవీ కొనాలి. పైకం ఎక్కడుంది? పదిరూపాయల వడ్డీతో షావుకారు దగ్గర రెండువేలు తీసుకున్నాం. మా ఆయన పత్తి ఏరడానికి పోయిండు’’ అంది గాబరాగా!‘‘మంచి పనేగా.. మిగతా పిల్లలకు కూడా కొను..’’ అన్నాను.‘‘చూస్తా.. ఎంతవుతుందో..’’ అంది లెక్కలు వేసుకుంటూ. ఇక్కడ బీదల పరిస్థితి అంతే. చేతిలో డబ్బు ఉండదు. అధిక వడ్డీకి జలగల్లా పీడించుకునే దళారులు. అవసరం వీరిది. అవకాశం వారిది.‘‘సర్లే! వెళ్లి త్వరగా రా.. చర్చి పనులన్నీ అలాగే ఉన్నయి’’ అన్నాను. ‘‘అలాగే సాయంత్రం మనోళ్లందరినీ రమ్మను. తలోపని జేస్తారు.’’ అన్నాను.‘‘నిర్మలమ్మకు, ఎస్తేరమ్మకు చెప్పా. వాళ్లు చూసుకుంటారులేమ్మ’’ అంది మరియమ్మ.మెల్లిగా నా వైపు తిరిగి, ‘‘పిల్లలకైనా బట్టలు కొన్నారా?’’ అంది.నేనేమి చెప్పలా– విశ్వాసం.. బాగుంది. ‘‘నిజానికి మన చర్చివాళ్లే పండుగకు మీ యింటివాళ్లకు కొత్త బట్టలు బెట్టాలా! అసలే కరువు. ఏం బెట్టి కొంటాం? వచ్చే పండుగకు చూత్తామమ్మా’’ అంది ఓదార్పుగా!కళ్లలో కన్నీరు తిరిగింది. దాచుకుందామనుకున్నాను. ‘‘బాధపడకమ్మా – మన ప్రభువు గొప్పోడు...’’ అంది దుఃఖంతో.నేను తేరుకుని.. ‘‘సర్లే.. నీవు వెళ్లు..’’ అన్నాను ఆమెను సాగనంపి. 
 
క్రిస్మస్‌ ముందు రోజు
స్వస్థతా ప్రార్థనంటూ పక్క ఊరు వారు పాస్టర్‌ గారిని పిలిస్తే వెళ్లారు.. త్వరగానే వస్తానని! ఆయనకు తెలుసు చర్చిలోని పనులన్నీ నేనే చూసుకుంటానని!ఆయన బయటకు వెళ్లాక.. పాత మోపెడు శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఏమి జరుగదు. పండుగ వస్తుంది. వెళ్లిపోతుంది. అలాగే అనుకున్నాను. ఏం జరుగుతుంది. ఏమీ జరుగదు– అలా మనస్సు నిబ్బర పరచుకున్నాను.‘‘అమ్మా..!’’ అంటూ వచ్చింది రూతు. ‘‘తమ్ముడెక్కడా?’’ అన్నాను. ‘‘చర్చిలో ఉన్నాడు’’ అంది. ‘‘నీకో విషయం చెప్పాలి అమ్మా’’ అంది. ‘‘ఏమిటో అది!’’ అడిగాను. ఎక్కడ కొత్త బట్టలు అంటుందేమోనని!‘‘అమ్మా! నాకు.. నాకు లేకున్నా పరవాలేదు. తమ్ముడికైనా కొనండి..’’ అంది రూతు ఏడ్చేస్తూ.బిత్తరబోయాను. పిల్లను దగ్గరకు తీసుకొని ఏడ్చేశాను తనివితీరా! సిగ్గనిపించింది. నా భర్త మంచి విశ్వాసి. నేను ఇంత అపనమ్మకస్తురాలినా?ఎంత సామాన్య స్త్రీనైనా.. పాస్టరమ్మను. ‘‘లేదు రూతు.. మనకు కొత్త బట్టలు వస్తాయి.’’ అన్నాను ధైర్యంగా. అదీ ఒక అబద్ధం అని తెలిసీ. ఎలా వస్తాయి?

సాయంకాలం...
మోపెడ్‌ శబ్దం వస్తూంది. ఆయన వస్తున్నారు అనుకున్నాను, చదువుతున్న బైబిల్‌ పక్కన బెట్టి. ఆయన స్నానం చేసి, వచ్చాక భోజనం పెట్టాను. ఆయన ఏమీ మాట్లాడలేదు. నేను మౌనంగా ఉండిపోయాను. భోజనం అయ్యాక చర్చిపనులు ఎంత వరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. పిల్లల గూర్చి అడిగితే చర్చిలో ఉన్నారన్నాను. ‘‘సరే నేను చర్చిపనులు చూస్తాను..’’ అని చర్చిలోకి వెళ్లిపోయారు. చీకటిపడుతుండగా.. ఏదో వాహన శబ్దం. మా మోపెడ్‌ది కాదు. అది శబ్దం చేస్తూ చర్చి ముందే ఆగింది.‘‘జోసెఫ్‌ అయ్యగారు..’’ అంటూ వచ్చాడు టౌన్‌ చర్చిమెంబర్‌ మోషేగారు.
చర్చిలోకి వెళ్లాను. మోషే చేతిలో పెద్ద పార్సిల్‌ ఉంది. ‘‘అయ్యా.. పొద్దున్నే వచ్చింది పార్సిల్‌ మీ పేరున. మా పాస్టర్‌గారు వెంటనే ఇచ్చిరమ్మంటే తెచ్చాను’’ అని పార్సిల్‌ టేబుల్‌ మీద పెట్టి, ‘‘నేను వెళ్తాను..చర్చిలో పనులున్నాయి’’ అన్నాడు వెళ్లిపోతూ.‘‘టీ అయినా తాగి వెళ్లవోయ్‌’’ అన్నారు జోసెఫ్‌గారు, నా వైపు టీ చెయ్యమని సైగ చేస్తూ.‘‘వద్దొద్దు.. వెళ్లాలి. అయ్యగారు, అమ్మగారు.. మీకూ, పిల్లలకు, సంఘానికి క్రిస్మస్‌ శుభాకాంక్షలు’’ అని అందరికీ కరచాలనం చేసి వెళ్లిపోయాడు. మిగిలింది మేమే.

పార్సెల్‌ వైపే చూస్తున్నామంతా. నేను, రూతు, జేమ్స్‌ ఆత్రంగా చూస్తున్నాం. జోసెఫ్‌గారు చాలా నిబ్బరంగా ఉన్నారు. ‘‘క్రిస్మస్‌కు ఏమైనా బైబిల్స్‌ పంపించి ఉంటారు ఎవరో’’ అంటూ పార్సిల్‌ కత్తిరించారు. అందులో ఓ తెల్ల కాగితం. గట్టిగా చదివారు పాస్టర్‌ గారు...‘‘జోసెఫ్‌ అ య్యగారు.. పాస్టరమ్మగారూ.. మీ పిల్లలు, సంఘానికి క్రిస్మస్‌ శుభములు. ఇవి క్రిస్మస్‌ బహుమతిగా స్వీకరించండి.’’ పాస్టర్‌ సునీల్‌ అని ఉంది. పాస్టర్‌ సునీల్‌ అంటే.. మా ఆయనతో బాటు థియాలజికల్‌ కాలేజీలో చదువుకొని, హైదరాబాద్‌లో పెద్ద చర్చికి పాస్టర్‌గా ఉన్నారు. కాలేజీలో అతనికి మా ఆయన చాలా సహాయం చేశారు. వేదాంత విద్య అభ్యాసంలో..!పార్సిల్‌ తెరిచారు.. అందరి కుతూహలం గమనించి!అందమైన బ్లూ కలర్‌ ఫ్రాక్‌ ప్యాకెట్‌ – పైన రూతుకు అని రాసి ఉంది. ఎగిరి గంతేసింది రూతు. జేమ్స్‌కు మరో ప్యాకెట్‌– అందులో అందమైన సూట్‌. సరిగ్గా సరిపోయాయి ఇద్దరికీ!మా యిద్దరికీ కొత్త బట్టలు– నాకు శారీ, ఆయనకు తెల్లరంగు ప్యాంటు, షర్టు!లోన పెద్ద అక్షరాలతో ప్రింటైన కొత్త బైబిల్‌ సేవకి!నా ముఖం చేతులతోకప్పుకొని ఏడ్చేశాను నా అవిశ్వాసానికి...!‘‘నన్ను క్షమించు ప్రభూ’’ అన్నాను.‘‘ఎందుకు? కొత్త బట్టలు వచ్చాయనా?’’ అన్నారు జోసెఫ్‌ గారు.‘‘కాదు. ప్రభువు మనలను జ్ఞాపకం ఉంచుకున్నందుకు’’ అన్నాను. 

మరిన్ని వార్తలు