బ్రతుకు అంటే గెలుపు

8 May, 2016 00:06 IST|Sakshi
బ్రతుకు అంటే గెలుపు

‘‘శ్రీహరి పాత్ర  బాక్సింగ్ పోటీల కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సాంగ్ కావాలి. అది ఆ ఒక్క సందర్భం కోసమే కాదు...మొత్తం యూత్‌కూ కనెక్ట్ కావాలి’’ ఇది  దర్శకుడు ఎన్.శంకర్  ‘భద్రాచలం’ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్న టైంలో చెప్పిన మాటలు. ట్యూన్ క్యాచీగా, లిరిక్స్ కూడా అందుకు తగ్గట్టే ఉండాలనేది మరో సూచన. అప్పుడే నేను నా ఇంటర్మీడియేట్ రోజుల్లోకి వెళిపోయా. అప్పట్లో కాలేజీలో చదువుకుంటూనే రోజుకు ఏడు రూపాయాల జీతం కోసం బిల్డింగ్  కన్‌స్ట్రక్టర్ వర్కర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసేవాడిని. అంత ఎండలో బతుకు పోరాటం చేస్తున్న ఆ కూలీల కోసం నాలుగు లైన్లను ట్యూన్‌తో
 
 ‘‘రాయి సల్లాయి ఇసుక ఇటుక
 తాపి తట్ట సిమెంటు చెమట
 గోడ మీద గోడ మేడ మీద మేడ
 కట్టిపోరా కూలోడ పట్టణాల్లో మేడ’’
 ఇలా నేను ట్యూన్‌తో సహా వినిపించేసరికి సంగీత దర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్, ఎన్.శంకర్‌లకు తెగ నచ్చేసింది. అప్పుడిక ఈ పాట రాయడం మొదలుపెట్టా. ఏ పని చేసే వాళ్లలోనైనా స్ఫూర్తి రగిలించాలి.
 
 అందుకోసం నేను మొదట రాసిన లైన్లు
 ‘‘గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
 బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు ’’
 ఇక దానికి లింక్‌గా అప్పుడు
 ‘‘ఒకటే జననం ఒకటే మరణం
 ఒకటే గమనం ఒకటే గమ్యం’’ అని రాశా.  
 ‘‘కష్టాలు రానీ కన్నీళ్లు రానీ ఏమైనా గానీ ఎదురేది గానీ
 ఓడిపోవ ద్దు  రాజీపడొద్దు నిద్దే నీకొద్దు నీకేది హద్దు’’
 మనం ఎంచుకునే బాటలో పూలూ ఉంటాయి, ముళ్లూ ఉంటాయి. అన్నిటినీ తట్టుకోవాలి. ఎవరికీ భయపడకూడదు. శ్రమించడం మాత్రం ఆపకూడదు. విజయానికి హద్దులుండవు.
 
 ‘‘రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి
 ఆ గెలుపు చప్పట్లే గుండెల్లో మోగాలి’’
 చిన్నప్పుడు  అమ్మ ఓ విషయం చెప్పేది. మన మనసుకు నచ్చిన మాట ఎవరైనా చెబితే వాళ్లకు చప్పట్లు కొట్టాలి. ఇంకో అయిదేళ్లకో, పదేళ్లకో మనం కూడా స్టేజ్ మీద ఉండాలి.  మనమూ అలా చప్పట్లు కొట్టించుకునే స్థాయిలో ఉండాలి. గెలుపు చప్పట్లు గుండెల్లో మారుమోగాలి.
 
 ‘‘నీ నుదిటి రేఖలపై సంతకమే చేస్తున్నా
 ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా
 నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం’’
 మన కష్టాలనే తమవిగా భావించే వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి నేస్తం తోడుంటే జీవితంలో ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. అప్పుడు ఓటమిని కూడా ఒక విజయంగా భావిస్తాం.
 
 ‘‘నమ్మకమే మనకున్న బలం
 నీలికళ్లలో మెరుపే నిలవాలి
 కారు చీకట్లో దారి వెతకాలి
 గాలి వానల్లో ఉరుమై సాగాలి తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి’’
 ఇక్కడ మీకో విషయం చెప్పాలి.  నేను సినిమాల్లోకి కొత్తగా వస్తున్న రోజులవి. అప్పుడే కృష్ణవంశీగారితో పరిచయమైంది. నేను అప్పుడేదో సందర్భంలో మాట అన్నా. ‘‘ఏదో మీరు ఉన్నారని  సినిమాల్లోకి వచ్చేశాను’’ అని నేనెంటే అప్పుడాయన ‘‘ఇక్కడ ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు. నీ మీద నమ్మకముంటేనే  సినిమాల్లోకి రా. లేకపోతే వద్దు’’ అని చెప్పిన మాట ఇప్పటికీ నా మనసులో బలంగా నాటుకుపోయింది. ఈ పాట రాసేటప్పుడు ఆయన  మాటలు బాగా ప్రభావం చూపించాయి. ఎంత మంది ఎదురొచ్చినా గెలుపు వైపు పరుగు ఆపకూడదు.
 
 ‘‘నిద రోక నిలుచుంటా వెన్నెలలో చెట్టువలె
 నీకోసం వేచుంటా కన్నీటి బొట్టు వలె
 అడుగడుగు నీ గుండె గడియారం నేనవుతా
 నువు నడిచే దారులలో ఎదురొచ్చి శుభమవుతా
 రాశిగా పోసిన కలలన్నీ దోసిలి నిండా నింపిస్తా
 చేతులు చాచిన స్నేహంలా
 ముట్టుకున్నావా మువ్వ అవుతుంది
 పట్టుకున్నావా పాటే అవుతుంది
 అల్లుకున్నావా జల్లే అవుతుంది
 హత్తుకున్నావా పాటే అవుతుంది
 మనకు తోడుగా ఉండే ఆత్మీయుల మనోభావాలను ఈ వాక్యాల్లో ఆవిష్కరించాను. మన అనుకునే వాళ్లు మన గమ్యం కోసం తోడునీడగా ఉంటారు.‘ నిదరోక నిలుచుంటా వెన్నెలలో చెట్టువలె’ అనేది చాలా కొత్తగా రాశాను. అప్పటికది కొత్త ఎక్స్‌ప్రెషన్.
 
 అనకాపల్లిలో మీటింగ్‌కు వెళ్లినప్పుడు డీఎస్పీగా సెలెక్ట్ అయిన ఒక అమ్మాయి  నా దగ్గరకు వచ్చి నా పాటను ప్రింట్ తీయించుకుని గోడ మీద అతికించుకున్న విషయాన్ని చెప్పింది. రోజూ ఉదయాన్నే లేచి ఆ పాటను చూసి స్ఫూర్తి పొందానని చెప్పడం నాకు చాలా సంతోషం కలిగించింది.  ఇప్పటివరకూ 1200 సినిమాల్లో రెండు వేలకు పైగా పాటలు రాశాను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ధ్వజస్తంభంలా నిలిచే పాటల్లో ఇదొకటి.       

మరిన్ని వార్తలు