రిలేషణం : ఆమె నీరు లాంటిది!

8 Mar, 2014 23:55 IST|Sakshi
వదిన సుమతో శ్రీలక్ష్మి

 ఒక మాటల ప్రవాహాన్ని అక్షరాల్లో బంధించవచ్చా? పరిగెత్తే పాదరసాన్ని పిడికిట్లో పట్టుకోవచ్చా? ఉరకలేసే జలపాతాన్ని అరచేత్తో అడ్డుకోవచ్చా? ఏమో కష్టమే... సుమ కూడా అంతే! ఆమె ఒక ప్రవాహం, ఒక ఉత్సాహం, ఒక విస్మయం. రెండు దశాబ్దాల ఆ సుమ సమ్మోహనంలో పడిపోని, పరవశులవని తెలుగువారు లేరు. బుల్లితెర అవధులు దాటి ఇంటింటా గుబాళించిన ఆ సుమ సౌగంధికా పరిమళాల పయాణంలో కొన్ని జ్ఞాపకాల్ని ఆమె ఆడపడుచు శ్రీలక్ష్మి గుర్తుచేసుకునే ప్రయత్నమే ఈ వారం రిలేషణం.
 
 తన గురించి ఎలా మొదలుపెట్టాలి, ఎక్కడ మొదలుపెట్టాలి.  మా పరిచయం ఒక సీరియల్ షూటింగ్‌లో మొదలైంది.   కొంతకాలమయ్యాక, అన్నయ్య, సుమ మధ్య స్నేహం మొదలైంది. అలా మా స్నేహం కూడా బలపడింది. అందుకే తనను వదినలా కాకుండా ఫ్రెండ్‌లాగే చూస్తాను.
 
 పెళ్లయిన కొత్తలో అన్నయ్య బాగా బిజీగా ఉండేవాడు. దాంతో మేమిద్దరమే షాపింగ్‌కు వెళ్లేవాళ్లం. తనను నా కోసమే పెళ్లి చేసుకున్నావని అన్నయ్యను ఆటపట్టించేదాన్ని.
 
 యాంకర్‌గా సుమ గురించి నాకంటే ప్రేక్షకులకే ఎక్కువ తెలుసు.  తను అన్ని రకాల క్యారెక్టర్స్ ఎలా చేయగలుగుతుందోనని ఆశ్చర్యపోతాను. ఒక టీవీ ప్రోగ్రామ్‌లో పంచావతారం చేసినప్పుడు అందులో క్రిటిక్‌రావు పాత్రను చూసి థ్రిల్లయ్యాను. ఎంతో అబ్జర్వేషన్ ఉంటే తప్ప, అలాంటి టిపికల్ పాత్ర చేయడం సాధ్యం కాదు. సాధారణంగా ఫ్యామిలీ ఫ్రెండ్ గెట్ టూ గెదర్ జరిగినప్పుడు, తను అందరినీ అబ్జర్వ్ చేస్తుంది. తను అబ్జర్వేషన్‌లోకి వచ్చిన కొత్త క్యారెక్టర్స్‌ను ఇమిటేట్ చేసి తెగ నవ్విస్తుంది.
 
 ఒకసారి మా పాప బర్త్‌డే జరుగుతోంది. అప్పుడు నేను బిజీగా ఉండటంతో, ఏమీ అరేంజ్‌మెంట్స్ లేకుండా పార్టీ అరేంజ్ చేశాను. పిల్లలు ఒకటే గొడవ చేస్తున్నారు. అప్పుడు తను అందరినీ కూర్చోపెట్టి వరుసగా పది రకాల ఆటలు ఆడించింది. తను ఏదైనా చాలా స్పాంటేనియస్‌గా చేస్తుంది.
 
 నా కెరీర్ విషయంలో తను చాలా సపోర్ట్‌గా నిలిచింది. ఒక సినిమా చేస్తుండగా, నాకు కొంచెం దెబ్బలు తగిలాయి. యూనిట్ అంతగా స్పందించలేదు. ఆ సందర్భంలో కొంచెం బాధగా అనిపించి, యాక్టింగ్ కెరీర్ వదిలేద్దామనుకున్నాను. అప్పుడు తనే నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చింది. మా కుటుంబానికే కాదు, ఎవరు అవసరంలో ఉన్నా తను ముందుంటుంది. మూడేళ్ల క్రితం ఒకసారి ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాం. మేము లోపల కూర్చున్నాం. అంతలో సుమ ఒక భారీ లగేజ్ మోసుకుని వస్తోంది. ఆ లగేజ్ ఎవరిదని అడిగితే, ఒక్క నిమిషం అంటూ ముందుకు వెళ్లి వేరే దగ్గర పెట్టి వచ్చి అప్పుడు చెప్పింది. ఎవరో పెద్దావిడ మోయలేక ఇబ్బంది పడుతుంటే కొంచెం సాయం చేశానని.
 
 మేము మా కెరీర్స్‌లో ఎంత బిజీగా ఉన్నా, చాలా సంతోషమేసినప్పుడు, బాధేసినప్పుడు వెంటనే మాట్లాడుకుంటాం. ఇంకా పిల్లల బర్త్‌డే పార్టీలకు కలుస్తుంటాం. ప్రతి చిన్న అకేషన్‌కు కలవడానికి ప్రయత్నిస్తాం. మగాళ్లు బిజీగా ఉంటే అపార్ట్‌మెంట్‌లో ఉన్న పిల్లలందరినీ వ్యాన్‌లో వేసుకుని, బయటకు తీసుకెళతాం. ఇంకా తన గురించి నా అబ్జర్వేషన్స్ చెప్పాలంటే, సుమ యాంకరింగ్ మాత్రమే కాకుండా ఇంకా మేనేజ్‌మెంట్, ఆర్గనైజింగ్ వంటివి బాగా హ్యాండిల్ చేయగలదు. సీఈవో లాంటి పదవిని తను చాలా సులువుగా మేనేజ్ చేయగలదు. ఇంకోమాట, తను క్లాసికల్ సాంగ్స్ కూడా పాడుతుంది. వీణ కూడా నేర్చుకుంది. సింగర్ అయ్యుంటే కూడా తను చాలా బాగా రాణించేది. ఫిజికల్‌గా, మెంటల్‌గా తనను తను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి యోగ, ప్రాణాయామం చేస్తుంది. తను నీరు లాంటిది. ఎందులోనైనా, ఎవరితోనైనా చాలా సులువుగా కలిసిపోతుంది.
 - కె.క్రాంతికుమార్‌రెడ్డి

మరిన్ని వార్తలు