వివరం: వికసించేది వేసవిలోనే!

20 Apr, 2014 02:27 IST|Sakshi
వివరం: వికసించేది వేసవిలోనే!

మొక్కలకు సూర్యరశ్మి ఎలాగో... చిన్నారులకు వేసవి సెలవులు అలాగ! సూర్యరశ్మి మొక్కలకు బలాన్ని, జీవాన్ని, పచ్చటి మెరుపును ఇస్తుంది. వేసవి సెలవులు చిన్నారులకు వికాసాన్ని, వినోదాన్ని, మానసిక ఎదుగుదలను ఇస్తాయి!  ఏడాదంతా కష్టపడి చదివిన ఫలితం... మార్కుల లిస్టులో ప్రతిబింబిస్తే, ఈ ఒకటిన్నర నెల సెలవుల్లో నేర్చుకున్నది... స్కూళ్లు తెరిచాక పిల్లల ముఖంలో ప్రతిఫలిస్తుంది! పిల్లలంతా వేసవి సెలవుల తర్వాత సడెన్‌గా ఎదిగినట్లు, ఏ కొత్త ప్రపంచం నుంచో వచ్చినట్లు మెరిసిపోతూ కనిపిస్తారు! అంతా... ఆడిన ఆట మహిమ, పాడిన పాట మహిమ, చేసిన అల్లరి మహిమ. చూసిన ప్రపంచం మహిమ! మరి మీరు మీ పిల్లల్ని ఈ సెలవుల్లో సరదా సరదాగా ఎలా సాన పట్టబోతున్నారు? ఈవారం ‘వివరం’ చదవండి.
 
లేలేత సూర్యకిరణాలు ముఖం మీద పడుతుంటే కళ్లు నులుముకుంటూ నిద్రలేచే బాల్యం ఇప్పుడు ఎక్కడికెళ్లిందో తెలియడం లేదు. అలారం పెట్టుకుని అమ్మ నిద్ర లేచి ఇంటి పనులు చేసుకుంటూ ఓ కంట గోడగడియారాన్ని గమనిస్తూ వంటగదిలో నుంచి ‘ఏడవుతోంది, ఆటో అంకుల్ వచ్చేస్తారు’ అంటుంటే విసుగ్గా నిద్రలేచే బాల్యమే ఈ తరానికి మిగిలింది. ఏడాదంతా ఇలా గడిచిపోతే... వాళ్లు పెద్దయిన తర్వాత ‘మా చిన్నప్పుడు...’ అని వాళ్ల పిల్లలకు చెప్పుకోవడానికి ఏం మిగులుతాయి? ఒక కోతికొమ్మచ్చి లేదు, ఒక వైకుంఠపాళీ లేదు. మరెలా? మరిచిపోయిన మన ఆటలను గుర్తు చేసుకుని మరీ నేర్పించాలి. అలమరల్లో దాగిన పంచతంత్రం పుస్తకాన్ని తీసిచ్చి చదవడం అలవాటు చేయాలి. చదివిన కథను తిరిగి చెప్పడమూ అలవాటు చేయాలి. బొమ్మ గీయడానికి ప్రయత్నించమని ఒక సూచన చేసి వాళ్లు చేసే హడావిడిని చూస్తూ ఊరుకోవాలి. ఇలా చేస్తే పిల్లలకు ఈ వేసవి సెలవులు అందమైన బహుమతి అవుతాయి. అందమైన జ్ఞాపకాలే కాదు వారిలో దాగిన సృజనాత్మకత బయటకు వస్తుంది. ఆ సృజనాత్మకతే రేపటి రోజున వాళ్లు కళల్లో రాణించడానికి నాంది కావచ్చు. వృత్తిని నిర్ణయించుకునే మాధ్యమం కావచ్చు.
 
 సంస్కృతి- సంప్రదాయం
 ఒకటి ఒకటి ఒప్పుల కుప్ప... రెండు రెండు రెక్కల పిట్ట మూడు మూడు ముక్కాలి పీట... నాలుగు నాలుగు మా ఆవు కాళ్లు... ఐదు ఐదు నా అరచేతి వేళ్లు!! ఐదు వాక్యాల బాలగేయంలో ఏమేమి నేర్చుకున్నామో ఒక్కసారి పరిశీలించండి. ఒప్పులన్నీ ఒక చోట రాశిపోస్తే ఆ మనిషి మంచిగుణాల సుమహారమని చెప్తోంది. పక్షికి రెండు రెక్కలుంటాయని, ఆవుకు నాలుగు కాళ్లుంటాయని పశుపక్ష్యాదులను పరిచయం చేస్తోంది. ముక్కాలి పీటకు మూడు కాళ్లుంటాయని రోజువారీ ఉపయోగించే వస్తువులనూ, చేతికి వేళ్లు ఐదని శరీర నిర్మాణాన్ని పరిచయం చేస్తూనే పిల్లలకు ఐదు అంకెలను నేర్పింది. ఇవన్నీ బడి గుమ్మం ఎక్కకముందే ఇంట్లో నేర్చుకునేవాళ్లు. అలాగే చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా!... ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికెడతావ్ ఊచ్!... చేతవెన్నముద్ద చెంగల్వపూదండ... ఈ గేయం నేర్చుకుంటే మనిషి ఆహారం, ఆహార్యం అర్థమయ్యేవి. ఇదంతా చదువు చెబుతున్నట్లు కాకుండా నేర్చుకోవడం. మన సంస్కృతీసంప్రదాయాలను తెలియచేయడానికి ఈ వేసవిలో ఒక ప్రయత్నం చేస్తే చాలు... వీటితో మరో ప్రయోజనం  తెలుగుభాషలో అనేక పదాలు తెలుస్తాయి. అన్ని అక్షరాలనూ చక్కగా పలకడం వస్తుంది.
 
 టెక్నాలజీ!
 సాంకేతిక పరిజ్ఞానం రోజుకోరకంగా కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే ఫేస్‌బుక్, ఆర్కుట్, గూగుల్‌ప్లస్ వంటి సామాజిక సంబంధాల వెబ్‌సైట్లలో అంతిమంగా చాటింగ్ తప్ప చిన్నారులకు మరో వినోదం ఉండదు. ఖాళీ సమయాల్లో ఇంటర్నెట్‌తో గడిపే అవకాశం, ఆసక్తి ఉన్న వారికి యూట్యూబ్ అంతులేని వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచుతోంది. తరచి చూడాలే కానీ వీడియోల రూపంలో ఉన్న అద్భుతమైన విజ్ఞానవాహిని ఈ వెబ్‌సైట్. చిన్నారులను ఈ ఛానల్స్‌తో కనెక్ట్ చేయగలిగితే అందులో విహారం మొదలుపెడతారు. యూట్యూబ్‌లో తెలుగు పాటలు, బాలగేయాల మొదలుకొని బీబీసీ డాక్యుమెంటరీల వరకూ వినోద విజ్ఞాన వీడియోలు అందుబాటులో ఉంటాయి. యానిమేషన్ బొమ్మలతో రూపొందించిన వీడియోలు ఉంటాయి. ఇక ఇంగ్లిష్ రైమ్స్‌కు లెక్కేలేదు!
 
 పెద్ద పిల్లలను యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఛానల్ వాళ్ల వీడియోలు సహజంగానే ఆకర్షిస్తాయి. ఇంగ్లిష్ గ్రామర్ పాఠాల వీడియోలు ఇంగ్లిష్ పై పట్టు సంపాదించడానికి  పనికి వస్తాయి. సమకాలీన అంశాలపై బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ రూపొందించిన డాక్యుమెంటరీలు కూడా యూట్యూబ్‌లో ఉంటాయి. చక్కటి విశ్లేషణలతో ఉండే విజువలైజ్‌డ్ డాక్యుమెంటరీలను వీక్షించడం అంటే ప్రపంచాన్ని అధ్యయనం చేయడమే.

ప్రయాణాలు - ఆరోగ్యం!
వేసవి సెలవుల్లో ప్రయాణాలు పెట్టుకోవడం సహజం. టూర్‌ప్లాన్‌లో ముందుగా ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది... వంటి వివరాలు తెలుసుకుని అందుకు అనువైన దుస్తులు పెట్టుకోవాలి. దీంతోపాటు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.   ప్రయాణానికి ముందే పూర్తి స్థాయి సాధారణ పరీక్షలు చేయించుకోవాలి.   మనం వెళ్లాలనుకున్న చోట ఏవైనా అంటువ్యాధులు ప్రబలి ఉంటే నివారణ చర్యగా వ్యాక్సిన్లు తీసుకోవాలి.     కొన్ని మందులు మీరు వెళ్లే ప్రదేశాల్లో దొరకకపోవచ్చు. పైగా కొత్తచోట మెడికల్ షాపులు వెతుక్కోవడం కొంచెం కష్టం. అందుకే వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు, జ్వరం వంటి ప్రదేశం మారితే వచ్చే కొన్ని సాధారణ జబ్బులకు మందులు దగ్గర ఉంటే మంచిది.  డయాబెటిస్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల మందులు వాడేవారు వాటిని టూర్ వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే వరకు సరిపడినన్ని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి.     విమాన ప్రయాణాలు చేసేవారు నీరు ఎక్కువగా తాగాలి.  రైల్లో దూర ప్రాంతాల ప్రయాణంలో అదేపనిగా సీట్‌లో కూర్చోకుండా అప్పుడప్పుడూ లేచి అటూ ఇటూ నడవాలి. ప్రయాణం ముందు రోజు కంటి నిండా నిద్రపోవాలి.

 మర్యాద - మన్నన
ఎంత చదువుకున్నా, ఎన్ని నేర్చుకున్నా సరే... మర్యాద-మన్నన నేర్చుకోకపోతే కష్టమే కాదు నష్టం కూడ. అలాంటి వారిని సమాజం గౌరవించదు. అందుకే చిన్నప్పుడే పద్ధతులు నేర్పించాలి. ఇవి చిన్నవే అయినా పెద్ద ఫలితాన్నిస్తాయి.
-  అకస్మాత్తుగా తలుపులు తోసుకొని వెళ్లకుండా ‘లోపలికి రావచ్చా’ అని అనుమతి తీసుకోవాలి.
-  బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లినప్పుడు దుస్తులు, పుస్తకాలు తిరిగి శుభ్రంగా సర్దుకోవడం, ఎక్కడి వస్తువులు అక్కడ ఉంచడం అలవాటు చేయాలి.
-     ఇంటికి వచ్చిన వారిని పలకరించి వారికి ఏం కావాలో చూడడం నేర్పించాలి. అతిథులకు భోజనాలు వడ్డించకముందే  తమకు ముందుగా పెట్టమని మారాం చేయకూడదని చెప్పాలి. అతిథిని గౌరవించడం, ఆదరించడం నేర్పాలి.
     మన దగ్గర లేని పుస్తకం మరొకరి దగ్గర తీసుకుని చదవడం తప్పుకాదు, అయితే వీలయినంత త్వరగా చదివి ఆ పుస్తకాన్ని తిరిగి అదే స్థితిలో ఇవ్వడం చాలా ముఖ్యమని చెప్పాలి.
 -    ఇతరుల ఇంటికి వెళ్లినప్పుడు అల్మారాలు, ర్యాక్‌లలో ఏమేమి ఉన్నాయోనని వెతకడం భావ్యం కాదని చెప్పాలి.
 -    అతిథులు వెళ్లేటప్పుడు గుమ్మం వరకు వచ్చి సాగనంపాలి.  వీటిని చిన్నప్పుడు అలవాటు చేయకపోతే పెద్దయ్యాక ఒంటపట్టడం కష్టం.
 
 అనుబంధం- ఆత్మీయత
 మేనత్త, మేనమామ పిల్లలు, బాబాయ్ కొడుకు, పెద్దనాన్న కూతురును ఏమని పిలవాలో తెలియని తరం ఇది. ఆ తప్పు ఈ బాల తరానిది కాకపోవచ్చు, అంతలా దూరం పెంచిన పెద్దతరానిదే. ఈ వేసవితో ఆ దూరాన్ని చెరిపేసి అనుబంధాలు- ఆత్మీయతలను పటిష్టం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది? సెలవులలో పిల్లలు బంధువుల ఇళ్లకు వెళ్లడం, బంధువుల పిల్లలు మన ఇంటికి వచ్చి కొన్ని రోజులపాటు ఉండడాన్ని ప్రోత్సహించాలి. బంధుత్వం కలకాలం నిలవాలంటే బంధువుల మధ్య చుట్టరికాన్ని మించిన బంధం ఏదో ఉండాలి, అదే స్నేహం.
-     బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి రావడంలో పిల్లల్లో టీమ్ స్పిరిట్ పెరుగుతుంది. శారీరక, మానసిక స్థైర్యం కలుగుతుంది.
 -    బంధువుల ఇంటికి వెళ్లేటప్పుడు చిన్న చిన్న కానుకలు (స్వయంగా చేసిన పెయింటింగ్, పువ్వుల వంటి క్రాఫ్ట్స్) తీసుకెళ్తే, వాటిని అందుకున్నవారు ఎంతో సంతోషిస్తారు.
-     బంధువులను పిన్నీ, బాబాయి, అత్తమామ, అన్న, అక్క, వదిన, బావ... ఇలా వరసలు పెట్టి పిలిస్తే ఆప్యాయతపెరుగుతుంది. ఆర్థికపరమైన అసమానతలు  దూరం అవుతాయి. వారు-నేను అనే తేడా పోయి ‘మనం’ అనే భావన కలుగుతుంది.
 
 ఆధ్యాత్మికం - వ్యక్తిత్వవికాసం
 మన పురాణాలను, ఇతిహాసాలలోని ప్రతి పాత్ర కూడా పరిణతి చెందిన వ్యక్తిత్వంతో వ్యవహరిస్తుంది. పురాణాలు చదవడం ఆధ్యాత్మిక చింతనతోపాటు వ్యక్తిత్వాన్ని నేర్చుకోవడానికి కూడ. దేవతలను పూజించడం అంటే వారు ప్రదర్శించిన దైవత్వాన్ని అర్థం చేసుకోవడమే. నిశితంగా గమనిస్తే పూజా విధానాలలో ఉన్న ప్రతి క్రతువు వెనుకా మేధోవికాస ప్రయత్నమే ఉంటుంది. రాముని పరిణతిని తెలుసుకోవడానికి రామాయణాన్ని తెలుసుకోవాలి. పాండవులు- కౌరవులు వ్యవహరించి వ్యూహాత్మకత ద్వారా రాజనీతి తెలుస్తుంది. వీరంతా కృష్ణుడుని కొలవడం... చూస్తే ఎంతటి అధికారమైనా సరే దైవత్వం ముందు తలవంచుతుందనే సత్యాన్ని తెలియచేస్తుంది.

ప్రతి పురాణ పాత్రా... తల్లిదండ్రులకు బిడ్డగా, భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, రాజ్యానికి రాజుగా, గురువుకు శిష్యునిగా... అనేక బంధాలను, బాంధవ్యాలను కలిగి ఉంటుంది. ఈ బంధాలను, కర్తవ్యాలను సమతూకంగా నిర్వహించాలంటే గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. పరిణతి చెందిన మేధాసంపత్తితోనే అది సాధ్యం. పిల్లలకు ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తూ అందులోని సూకా్ష్మలను వివరించాలి. అప్పుడు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.  
 
 నానమ్మకు కథ చెబుదాం!
 మీకు తాబేలు-కుందేలు కథ తెలుసా? పులుసురాయి కథ తెలుసా? భలే ఉంటుందిలే. ఘుమఘుమలాడే కుండెడు పులుసు చేస్తాడు ఒకాయన, ఉత్తి రాయితోనే! పోనీ ఉల్లిగడ్డ పొట్టోడి గురించి విన్నారా? వాడు వానింటికి తాటికాయంత తాళం వేస్తాడు. కనీసం ఇవైనా చెప్పండి. బాగా తిన్నాక గాడిద ఏం చేస్తుంది? బడాయికి పోయిన నక్కకు ఏం జరుగుతుంది? రెండు కోతుల తగువును పిల్లి ఎలా తీర్చింది? పావురం కథ? ఒంటె కథ? రాకుమారి కథ?... ప్చ్! మీరు అర్జెంటుగా ఈ వేసవి సెలవుల్లో ఇలాంటి బోల్డన్ని కథలు తెలుసుకోవాలి. కానీ ఎలా? అమ్మ నాన్ననడగుమంటుంది. నాన్నేమో అమ్మనడగమంటాడు.

ఒక అనుమానం: వీళ్లిద్దరికీ కథలు వచ్చా. ఊళ్లో ఉన్న నానమ్మేనా మనకు ఆధారం!  ఒక పనిచేద్దాం. పాతకాలంలో దేశదేశాల్లోని తాతయ్యలు ఆరుబయట వెన్నెల్లో కూర్చుని పిల్లల కోసం కథలల్లిపెట్టారు. ఇంకా, పంచతంత్రం, అరేబియన్ నైట్స్, ఈసప్ కథలు, చిట్టిరాజా, బుడుగు... ఇలా మంచిమంచి కథలు రాసిపెట్టారు. ఇవన్నీ పుస్తకాలుగా దొరుకుతున్నాయి. ఎంచక్కా మనమే చదువుకుంటే! అప్పుడు మనమే నానమ్మకు కథ చెప్పొచ్చు. నానమ్మ ఎంత సంబరపడుతుందో! ఎలా ఉంది ఐడియా!
 
 సేవాదృక్పథం
 పిల్లలకు ఇవ్వడంలో ఉన్న ఆనందం అనుభవంలోకి రావాలంటే ‘వాళ్లతోనే ఇప్పించాలి’. ఇంటి ముందుకు వచ్చిన భిక్షగాడికి దోసెడు బియ్యం వేయడం, ఆకలితో ఉన్న వారికి ఒక పండు ఇవ్వడం నుంచి తనకు చిన్నవైన దుస్తులను పేద పిల్లలకు ఇవ్వడం, క్లాసు అయిపోయిన పుస్తకాలను చిన్నపిల్లలకు ఇవ్వడం వంటివన్నీ అలవాటు చేయాలి. వేసవి సెలవుల్లో ఒక ఆదివారం అనాథాశ్రమానికి తీసుకెళ్లి అక్కడి పిల్లల అవసరాలను తెలియచేస్తే వాళ్లలో ఆలోచన మొదలవుతుంది. ఇంటికి వచ్చి తన పాత బొమ్మలు, దుస్తులను జమచేసి మరో ఆదివారం వెళ్లడానికి సిద్ధమైపోతారు. అలాగే వాళ్లు దాచుకున్న డబ్బుతో అనాథాశ్రమంలో పిల్లలకు ఒక పూట భోజనం లేదా కనీసం ఒక స్వీట్ అయినా ఇప్పిస్తే... అవసరంలో ఉన్న వారికి చేయూతనివ్వడం నేర్చుకుంటారు. ప్రమాదంలో ఉన్న వారిని కాపాడడం నేర్పితే సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటూ తమవంతు సామాజిక బాధ్యత నిర్వహించడంలో ముందుంటారు. సమాజానికి సేవ చేసే రెడ్‌క్రాస్, రోటరీ క్లబ్ వంటి సంస్థల వివరాలను పరిచయం చేసి, అవి నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను తెలియచేస్తే చాలు. ఇవన్నీ చిన్ని మెదళ్లలో ఒక పక్కన నిక్షిప్తమైపోతాయి. అవసరమైనప్పుడు వెంటనే ‘నేనూ చేస్తా’నంటూ ముందడుగు వేస్తారు.

ఆటలు...ఆనందం...
సెలవుల్లో పిల్లల అల్లరికి అంతుండదు. ఎంత సేపూ ఈ గోల ఏమిటి...బయటికి వెళ్లి ఆడుకోండర్రా...అనే మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఆడుకోమని చెప్పి వదిలేస్తే ఎలా? ఎక్కడ ఆడుకోవాలో, ఎలా ఆడుకోవాలో చెప్తే ఈ వేసవిలో కొత్త క్రీడాకారులు తయారవుతారు.
 వేసవి సెలవుల్లో క్రీడల కోసం....
  నగరాలు, పట్టణాల్లో ప్రైవేట్ అకాడమీల్లో సమ్మర్ కోచింగ్ లభిస్తుంది. స్విమ్మింగ్‌కి ప్రవేశం పొందే ముందు పరిశుభ్రత, భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఏటా వేసవిలో నామమాత్రపు ఫీజులో ప్రతి జిల్లాలో సమ్మర్ క్యాంప్‌లు నిర్వహిస్తుంది. దాదాపు 30కు పైగా క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. ప్రతి జిల్లాలో ఉండే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీఎస్‌డీఏ)కార్యాలయం నుంచి మరిన్ని వివరాలు పొందవచ్చు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం ఫోన్ నంబరు : 040 - 23240247.
  హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 40 రకాల క్రీడాంశాల్లో వందకు పైగా మైదానాల్లో సమ్మర్ స్పెషల్ కోచింగ్ క్యాంప్‌లు జరుగుతాయి. ఆటలు, వాటి కేంద్రాల వివరాలు పత్రికలో కూడా అందుబాటులో ఉంటాయి. మనకు ఇష్టమైన ఆటను, అనువైన కేంద్రాన్ని ఎంచుకొని చేరవచ్చు.  
 
 సరదాగా... నేర్చుకుందాం!
పుస్తకాలు, పాఠాలు, బ్లాక్‌బోర్డు, నోట్‌పుస్తకాల ఊసే లేకుండా నేర్చుకునేవి ఏముంటాయి? సమ్మర్ క్యాంపులకెళ్తే చాలా కనిపిస్తాయి. పిల్లలకు మట్టితో కుండలు చేసి రంగులేయడం, మొక్కలు నాటి నీరు పోసి పాదులు చేయడం, కథలు చెప్పడం, చెప్పించడం, సంగీతం పాడడం, అడుగులు కదిపి నాట్యం చేయడం వంటివన్నీ నేర్చుకోవచ్చు. ఇంట్లో ఇవన్నీ నేర్పించే సమయం లేని తల్లిదండ్రులు పిల్లలను ఈ క్యాంపుల్లో చేర్చడం సౌకర్యమే. వీటితోపాటు...పూలకుండీ కొనిపెట్టి మొక్క నాటించి రోజూ నీరుపోయడం నేర్పిస్తే ప్రకృతిని ప్రేమించడం అలవాటవుతుంది. అలాగే మంచి సినిమాలను ఎంపిక చేసి చూడమని చెప్తే చాలు... ఒద్దిగ్గా చెప్పినమాట వింటారు.


 ఈ సందర్భంగా పెద్దలకో మాట...  ఆధునిక విద్యావంతులైన తల్లిదండ్రులు ఏడు తాటిచెట్ల ఎత్తుండే రాక్షసుడు అని కథలో రాగానే ఇది తర్క విరుద్ధం అనుకోకూడదు. దేన్నయినా ప్రతీకగా చెప్పడం సాహిత్యం లక్షణం! వినోదంలోనూ అంతే. రాకుమారుడు ఒక్కగెంతులో నదులు దూకడానికీ, చిలకలో ప్రాణం పెట్టడానికీ మంచి ఊహలు ఉండాలి. ఇవన్నీ పిల్లలకు బాల్యంలో ఇవ్వగలిగే అపురూపమైన కానుకలు.
 - వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు