తపాలా

20 Sep, 2014 23:30 IST|Sakshi

నుదుటి పలకరింపు

నేను ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో పనిచేస్తున్నాను. నా చిన్నతనంలో మా నాన్నగారు మిలిటరీలో జాబ్ చేసేవారు. అక్కడ క్వార్టర్స్‌లో ఉండగా జరిగిన ఒక సంఘటన తలుచుకుంటే, నాకు ఇప్పటికీ నవ్వు వస్తూంటుంది.ఒకరోజు స్కూల్ నుండి ఇంటికొచ్చాను. నుదుటిపై పడ్డ వెంట్రుకలు సవరించుకుంటూ లోపలికి అడుగుపెట్టాను. మా నాన్నగారితో ఒక అపరిచిత వ్యక్తి కూర్చుని ఉన్నారు.

అతను నన్ను చూసి నవ్వుతూ తలాడించాడు. అలా ఎందుకు చేశారో అర్థం కాలేదు. నేను లోపలికెళ్లిపోయాను. మా నాన్నగారు పిలిచి, ‘‘అంకుల్‌కి విష్ చేయడం తెలియదా?’’ అని నన్ను కోప్పడ్డారు. అందుకాయన, ‘‘మీవాడు వస్తూనే విష్ చేశాడు కదా’’ అని సర్దిచెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది. నేను నుదుటిపై వెంట్రుకలు సవరించుకోవటాన్ని ఆయన విష్ చేసినట్లుగా భావించి తలూపారని!
- ఎ.వెంకటరావు,విశాఖపట్నం
 
బావ లుంగీ
మాది గుంటూరు జిల్లా. ఈ సంఘటన జరిగి సుమారు 15 ఏళ్లు అవుతోంది.మా తోబుట్టువుకు వల్లభాపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించాం. పెళ్లి జరిగిన నెల తరువాత మా బావ గారింటికి వెళ్లాను. సాయంత్రానికి ఊరు చూద్దామని బయటికి వస్తుంటే, మా చెల్లెలు కట్టుకోమని నాకో లుంగీ ఇచ్చింది.

అలా ఊరు చూడాలని బయటికి వచ్చి, సెంటరులో నడుస్తుండగా, కొంతమంది ‘ఈ కుర్రాడు ఫలానా వాళ్ల ఇంటికి వచ్చా’డని మాట్లాడుకోవడం విన్నాను. మరొక బజారులో, మా బావ పేరు చెప్పి ‘ఆయన ఇంట్లో ఉన్నారా’ అని అడిగారు. ఇది ఎలా సాధ్యం? నేను వాళ్లకి తెలియదు కదా! జరిగినది ఇంట్లో చెప్తే, వాళ్లు నవ్వసాగారు. విషయం ఏమిటంటే,  ఆ లుంగీ డిజైను ఆ ఊరిలో మా బావకు తప్ప మరెవరికీ లేదట.

 - అన్నెం వెంకట కృష్ణారెడ్డి,సత్తెనపల్లి, గుంటూరు

మరిన్ని వార్తలు