దొమ్మరాట

15 Mar, 2020 09:59 IST|Sakshi

రాజుగాడు వచ్చేది సూసి కుక్కలు కూడా ఎదురొచ్చినాయి. ఒక కుక్క రాజుగాని సొక్కాపట్టుకోని గుడిసె కాడికి లాక్క పోయినాది. రాజుగాడు గుడిసె లోపల్కి పోయి సూసేసరికి, వాళ్ళమ్మ రక్తమ్మడుగులో పడుండాది.
‘యాడ కనిగిరి యాడ భూతూరు. ఊరూరా తిరుగుతా ఇక్కడికొచ్చినామియ్యాల! కోడల్ని సూచ్చే గుబులయితాంది. నెలలు నిండిపాయె. కడుపు కిందికి జారిందిరా అబ్బీ! ఈ ఊరైనాంక ఇంగ యా ఊర్లో  ఆట వద్దు. నేరుగా జమ్మడక్కకు పోదాం! ఆడా పెద్దాసుపత్రి ఉందంట. కోడలు కాన్పయ్యే వరకు ఆ ఊర్లోనే ఉందామురా అబ్బీ!
ఆటలో తగిలిన దెబ్బలకైతే పసరు ముందు కట్తాండా గానీ, కాన్పు చెయ్యలేను రా అబ్బీ! తొందరగా పోయి ఊర్లో పెద్ద మనుషులని అడిగి రాపో! రెండు రోజుల కన్నా ఇక్కడ ఎక్కువ  ఆట ఆడేది లేదు’ అన్యాది పెంచలమ్మ  కొడుకు భైరవసామితో.
 ‘అట్టనే అమ్మా! పొయ్యడిగొచ్చా’  అని బయలుదేరినాడు భైరవసామి.

‘ఊర్లోకి కరువొచ్చి నాలుగేండ్లయితాంది. ఎట్ట సెయ్యాల్రా అని ఆలోచిచ్చాండాం. ఇంతలో మీరే వచ్చినారు. ఆ దేవుడే పంపించినట్టుండాడు. సంతోషం రా అబ్బీ. అయితే ఒక షరతు. మీ ఆట మా ఊరి పొలాల్లో పెట్టిస్సాము. మీ ఆడపడుచు గడ ఎక్కి మా పొలాల్లో బియ్యం సల్లాల. అట్లయితేనే మా ఊర్లో ఆట ఆడనిచ్చాం’ అన్యాడు పెద్ద రెడ్డి.
 ‘అట్టాగే నయ్యా...దండాలయ్యా సామీ! మీ మనిషిని పంపిచ్చే, మా సామాన్ల లెక్క సెప్తామయ్యా!’ అన్యాడు భైరవసామి.
 ‘రే బుజుగబ్బా! నువ్వు బోయి ఆ లెక్కేందో సూడు’ అన్యాడు పెద్ద రెడ్డి. బుజుగబ్బా, భైరవసామి ఇద్దరు ఊరి పొలిమేర వైపు దారి పట్టినారు.
అలుగోగు వంకకాడ పెంచలమ్మతో పాటు ఇద్దరు ఆడోళ్ళు, ముగ్గరు మగపిల్లకాయలు, ఒక ముసలోడు ఎదురు సూచ్చాండారు. వాళ్ళతో పాటు, వాళ్ళ సామాన్లు మోసే గాడిదలు, వాళ్లు పెంచుకునే మ్యాకలు, కుక్కలు కూడా ఉండాయి. ఆడికి వచ్చిన భైరవసామిని ‘ఏమైందయ్యా? పెద్ద రెడ్డి ఒప్పుకున్యాడా?’ అని అడిగింది ఆడి పెండ్లాం లచ్చిమి.
 ‘ఆ ఒప్పుకున్యాడు మే! మన సామాన్లన్నీ బయటికి తీ. లెక్క సెప్పాల’  అన్యాడు భైరవసామి. యెంటనే లచ్చిమీ, పెంచలమ్మ, పెంచలమ్మ బిడ్డ పార్వతి ఒక్కొక్క సామాన్లు బయటపెట్టినారు. వాళ్ళ దగ్గరుండే కత్తుల కాడ్నుంచి, డోళ్ళు, ఇనుప రింగులు, గడలు, తాళ్ళు, యేరే సామాన్లు, జంతువులు, బిందెలు, సెంబులు, తపేళాలతో సహా అన్ని లెక్క పెట్టుకొని ఆడ్నుంచి బయలుదేరి నాడు బుజుగబ్బ.

ఆ మనిసట్టా పోతానే  యెదురుదబ్బలను వొంచి, వాటిపైన కాసెగడ్డి పర్సి, సూచ్చాండంగానే రెండు గుడిసెలేసేసినారు. ఆ గుడిసెలు ఎట్టా ఉండాయంటే, ఎంత పెద్ద వానొచ్చినా సుక్కగూడా కిందికి దిగదు. అట్టా ఉండాయ్‌. ఒక గుడిసెలోకి భైరవ స్వామి, లచ్చిమీ, వాళ్ళ కొడుకు రాజుగాడు దూరిన్యారు. మిగిలినోళ్ళు ఇంగొక గుడిసెలోకి పొయినారు. మధ్యాహ్నం సేసుకున్న సద్ది మూట యిప్పి తిని పండుకున్యారు. పొద్దన్నే లేసి, వాళ్ళాడే దొమ్మరాట కత్తుల నుండి గడలు, తాళ్ళ వరకు అన్నిట్నీ ముక్కిగుడిసెల్లో నుంచి బయటికి వచ్చినారు. ఇత్తడి బిందెలు ఎత్తుకుని ఊరబాయి కాడికి పోయి నీళ్ళు తెచ్చుకున్యారు. సక్కగా స్నానం చేసి పనుల్లోకి యెళ్ళడానికి  సిద్ధమయినారు. ముందు భైరవసామి, వాళ్ళ నాయన నర్సయ్య ఇద్దరూ కలిసి, ఎనుముల కొమ్ములు కోయనీకి ఊర్లోకి పోయినారు. వాళ్లతో చాలా మంది రైతులు వాళ్ళ ఎనుములకు పదునుగా పెరిగిన కొమ్ములను  కొయించుకున్యారు. పెంచలమ్మ, పెంచలమ్మ కూతురు పార్వతి ఇద్దరూ కలిసి ఊర్లో వాళ్ళకు సవ్రాలు అల్లనీకి పోయినారు. పెంచలమ్మ ఇద్దరు సిన్న కొడుకులు చెక్క దువ్యాన్లు, ఈరమాన్లు అమ్మనీకి పోయినారు.

లచ్చిమి తన ఏడేండ్ల కొడుకు రాజుగాన్తో కలిసి గుడిసెలకాడ్నే ఉండి పోయినాది. నేలమీద కాళ్ళుముడ్సుకోని పండుకున్నే లచ్చిమి కళ్ళల్లో నీళ్ళు ఏరులై పార్తాండాయి. అది రాజుగాడు చూసినాడు. 
‘ఎందుకమ్మా ఏడుచ్చాండావు?’  అని పొయ్యి కండ్ల నీళ్ళు  తుర్సి, వాడు కూడా ఏడ్సినాడు. వాడు అలా సేసేసరికి లచ్చిమికి ఏడుపు ఆగలేదు. వాడ్ని గట్టిగా గుండెలకు హత్తుకున్యాది.
 ‘ఏందో నాయనా! మన బతుకులు నాకు అర్థం కాడంల్యా. పసి పిల్లోడివి. నిన్ను చూడు ఊరూరా తిప్పుతాండాం. ఇయ్యాల్కు బడికి పొవ్వాల్సినోనివి. నీ పరిస్థితే ఇట్టాగుందే! నీకు తోడు రేపో మన్నాడో ఇంగొకరు పుడ్తారు. స్యానా దిగులయితాందిరా!’ అంటూ ఎక్కిళ్ళు పెట్టి యేడ్సింది. రాజుగాడు పరిగెత్తుకుంటూ పొయ్యి, లోటాతో నీళ్ళు తెచ్చి ‘నేను గూడా చాన్నాళ్ళ నుంచీ నిన్ను అడుగుదామనుకుంటాండామ్మా. అందరికీ ఊరు ఉంది. మనమేందిమా! రోజుకొక ఊరు తిరుగుతాండాం. మనకు ఒక ఊరనేది  లేదామ్మా?’ అని అడిగినాడు. 
‘అదే కదురా మన ఖర్మ. నేకు కాన్పు కానీ! ఏదో ఒకటి తేల్చుకుంటా. మీ బతుకులు పాడు చేయనీయను’ అంది లచ్చిమి. 
‘నడ్సీ నడ్సీ కాళ్ళన్నీ పీకుతాండాయ్మా. నేను నిద్ర పోతా’ అన్యాడు రాజుగాడు. 

‘అట్టనే. బజ్జుకో నాన్నా’  అంది లచ్చిమి. లచ్చిమి కూడా నిద్ర పోయింది. సాయంత్రమయ్యింది. ‘ఇంగ లెయ్‌ లచ్చిమీ ఆటకు పోవాలా’ అన్నాడు భైరవసామి.
‘ఒంట్లో బాగలేదయ్యా! ఈ రోజు నేను రాలేను. ఈరోజుటికి నన్ను ఇడిసిపెట్టు’ అంది లచ్చిమి. ‘అది ఎట్టా కుదురుతాది? ఆట ఆడాలంటే ఎనిమిది మంది కావాల్నే. నీతో కలిపితేనే ఎనిమిది మంది అయ్తారు. నువ్వు రాకపోతే ఆట ఆడలేమ్మే! లెయ్‌ మే! లెయ్‌ ఇంగ! రేపు రాకుంటేమన్లే’ అన్నాడు నర్సయ్య. లచ్చమి లేసి రాజుగాడ్ని కూడా లేపింది. అందరూ కల్సి సేన్లోకి ఆటాడేకాడికి పోయినారు.
 పదడుగులెత్తులో  సన్నతాడు మీద నడసి రాజుగాడు అందరినీ అబ్బురపర్సినాడు. లచ్చిమీ ఏమో దాని తలమీద బిందె పెట్టుకోని, ఆ బిందె మీద బిందెలు పెట్టి, దానిమీద భైరవసామి పెద్ద తమ్ముడ్ని  ఎక్కించుకున్యాది. ఆడ నిలబడి వాడు  రకరకాల ఇద్దెలు సేసినాడు.

ఇంగ పార్వతేమో గడ ఎక్కడం, దూకటం, రింగులతో తమాషాలు చెయ్యడం లాంటివి సేసినాది. భైరవసామి రకరకాలుగా పల్టీలు కొట్టినాడు. భైరవసామి సిన్న తమ్ముడు, రాజుగాన్తో కల్సి అగ్గితో ఒళ్లు జలదరిచే విద్దెలు సూపించినాడు...ఇయన్నీ సూసిన ఊర్లో వాళ్ళు ఈలలు, క్యాకల్తో హోరెత్తించ్చినారు. దాంతో మొదటిరోజు ఆట పూర్తయిపోయినాది. మళ్ళీ ఎనిమిది మందీ వంక కాడ గుడిసెలకు చేరుకున్యారు. మర్సట్రోజు ఉదయాన్నే, ఆట సామాన్లకు పూజ సేసుకొని, ఊరబాయి నీళ్ళతో స్నానాలు చేసి, లచ్చిమీ నొక్కదాన్ని గుడిసెల కాడ ఇడ్సిపెట్టి సేన్లల్లోకి గడ తీసుకొని పోయినారు. యాపాకు, పసుపు,బియ్యం కలిపినే మూటను, నడుముకు కట్టుకోని పార్వతి గడ ఎక్కినాది. దగ్గరదగ్గర నలభై అడుగులెత్తుండే ఆ గడమీద యిన్యాసాలు సేచ్చా, వడిలో ఉండే బియ్యాన్ని సేలపై ఇసిరింది పార్వతి. ఆ తర్వాత సేలల్లో, ఊర్లో ఉండే అన్ని బాయిల కాడికి పోయి ఆయమ్మీ  వడి బియ్యాన్ని సల్లింది. ఆ తర్వాత ఏడుమందీ ఊర్లో ఉండే అన్నిండ్ల కాడికి పోయినారు. రైతులంతా కరువు పోతాదిలేనని నమ్మకంతో, సంతోషంగా ఇచ్చిన జొన్నలు, కొర్రలు, ఆర్కెలు, సొద్దలు, కందిబ్యాళ్ళు, అంతో ఇంతో లెక్కను తీసుకోని ఆనందంగా గుడిసెల కాడికి బయలుదేరినారు. దారిలో పెంచలమ్మ– ‘ఇంగ పారా భైరవా! జమ్మడక్కకు పోదాం. కోడలు కాన్పయ్యే వరకు ఆడనే ఉందాం’ అని వడివడిగా అడుగులేసినాది.

 ‘ఏందిరా గుడిసెలకాడ కుక్కలు ఆమైన అడుచ్చాండాయ్‌. ఈ లచ్చిమీ మొద్దునిద్ర పోతాంద్యా ఏంది? ఒరేయ్‌ రాజుగా! నువ్వు లగెత్తురా’  అని భైరవసామి అనగానే, రాజుగాడు గుడిసెల వైపు పరిగెత్తినాడు.
 రాజుగాడు వచ్చేది సూసి కుక్కలు కూడా ఎదురొచ్చినాయి. ఒక కుక్క రాజుగాని సొక్కాపట్టుకోని గుడిసె కాడికి లాక్క పోయినాది. రాజుగాడు గుడిసె లోపల్కి పోయి సూసేసరికి, వాళ్ళమ్మ రక్తమ్మడుగులో పడుండాది.
 ‘అమ్మ ఏమైందే నీకు? అమ్మా లేయ్‌! అమ్మా లేయ్మా!  అమ్మా లేయ్మా!’ అని ఎన్నిసార్లు రాజుగాడు పిలిచినా వాళ్ళమ్మలో ఉలుకూ పలుకూ లేదు. ఇంతలో గుడిసెలోకి పెంచలమ్మ వచ్చినాది. 
‘అయ్యో ఏమైనాదే లచ్చిమీ? ఒరేయ్‌ భైరవా! ఇట్రారా. వచ్చి పిల్లదాన్ని సూడు. మనం లేనప్పుడు నొప్పులొచ్చినట్టుండాయిరా. బిడ్డ అడ్డంతిరిగినాడో ఏమో! పిల్లలో ఉలుకూ లేదు. పలుకూ లేదు. నాకైతే కాళ్ళూ సేతులూ ఆడడంల్యారాబ్బీ. నువ్వొచ్చి ఏమైనాదో సూజ్జువు రారా!’  అని ఏడుచ్చాంది. 

‘అమ్మా ! పాణం పోయినట్టుండాదే. ఇట్లా చేసిందేందే ఇది! రాజుగాడు న్యాదర పిల్లోడే! ఇప్పుడేం జెయ్యాలే?’   అని భైరవసామి కూడా ఏడవడం మొదలు పెట్టినాడు. ఇంతలో సామాన్లు లెక్కసూన్నీకి వచ్చిన బుజుగబ్బ ఊర్లోకెళ్ళి పోయి మంత్రసానిని పిల్సుకోనొచ్చినాడు.  ఊర్లో వాళ్ళంతా వచ్చి గుమిగూన్యారు. మంత్రసాని కూడా పాణం లేదని సెప్పేసరికి, వాళ్ళందరి ఏడుపులు ఓరెత్తినాయి. రాజుగాడయితే వాళ్ళమ్మను కర్సుకున్యాడు. ఇడ్సల్యా. 
రోంసేపటికి ‘ఇట్టా ఎంతసేపని ఏడుచ్చాం? చేయాల్సిన పనేదో చెయ్యండి. పొదుబూకుతాంది’ అన్యాడు నరసయ్య.
 ‘కడుపుతో ఉండేది సచ్చిపోతే కాల్సగుడ్దూ, బూడ్సగుడ్దూ అంటారే! ఎంత ఖర్మ సేసుకున్యాదయ్యా కోడల్పిల్లా! బంగారట్టాడ్ది. నిన్న ఒంట్లో బాగలేదన్యా రావాల్సిందెనని సెప్పి ఆటాడిచ్చినాం. అయినా ఈ పాపం నీదేరా సచ్చినోడా! నీ నోట్లో మన్నుబొయ్య’  అని మొగున్నితిట్టి ఇంగా గెట్టిగా ఏడ్సబట్టె పెంచలమ్మ. ఇదంతా సూసి తట్టుకోల్యాక ఊర్లోవాళ్ళంతా తోచినంత రాజు గాని సేతిలో బెట్టి ఇండ్లకు పోయినారు.

ఊర్లో వాళ్ళందరూ యెళ్ళిపోయినాంక, లచ్చిమీకి పసుపు నీళ్ళతో స్నానం సేయిచ్చి, మొగానికి పసుపు రుద్ది, నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు పెట్టినారు. వంకకు దగ్గర్లో ఉండే యాపసెట్టు కాడికి తీసుకోని  పోయినారు. అట్టా  తీసుకోనిపోతాన్నెంతసేపూ రాజుగాడు వాళ్ళ అమ్మ సేయి పట్టుకొనే నడ్సినాడు. యాపసెట్టుకాడికి పొయినాంక, దాని  మొదలుకాడ కాలు సాంపుకొని కూకున్నట్లు లచ్చిమీని  కూకోబెట్టినారు. యాలబడకుండా ఉండేదానికి  సెట్టుకు కట్టేసి, ఆన్నుండి బయలుదేరి గుడిసెల కాడికి పోతాంటే రాజుగాడు ‘నేనమ్మకాడ్నే ఉంటా. నేను మీ యెంట రాను’ అని మొండికేసినాడు.

కానీ పార్వతీ వాన్ని  ఎత్తుకోని బలవంతంగా గుడిసెల కాడికి పిల్సుకొని పోయినాది. అంతలో  జోరువాన మొదలయినాది.
 ‘నాయనా! అమ్మని ఆడెందుకు కట్టేసినారు? వాన పడ్తాంది  నాయనా!’ అని పిల్లోడు ఏడుచ్చాంటే భైరవసామి కూడా ఎక్కిఎక్కి ఏడ్సినాడు. 
‘ఊరోళ్ళ కరువు తీరింది గానీ, నీకు మాత్రం అమ్మే కరువైంది కాదురా రాజుగా!’ అని పెంచలమ్మ కూడా ఎక్కిఎక్కి ఏడ్సినాది. ఆ వానలోనే సామాన్లన్నీ సర్దుకోని గాడిదలమీద యేసుకోని ఇంగో ఊరికి పైనమైనారు. దారెంటా రాజుగాడు ‘అమ్మ వానలో తడుచ్చాంది. అమ్మను కూడా మనతో పాటు తీసుకుపోదాం నాయనా!’ అని ఏడుచ్చానే ఉండాడు. కానీ వాని కండ్లనీళ్ళు వానలో కలిసిపోయినాయి.
                  

మరిన్ని వార్తలు