అందెల రవమిది...

30 Apr, 2017 02:32 IST|Sakshi
అందెల రవమిది...

‘స్వర్ణకమలం’ సినిమాలో ‘అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా’ పాటతత్వం గురించి గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తన భావాలను ఇలా పంచుకున్నారు....  

భగవంతుడు ప్రతి ప్రాణికీ ఏదో ఒక కళ ప్రసాదిస్తాడు. అది గ్రహించి ఆనందం పొందగలిగితే అదే పరమానందం. అప్పుడు ఆ కళ ద్వారా జనం కూడా ఆనందిస్తారు. అయాచితంగా వచ్చిన విద్యను చులకనగా భావించకూడదని పెద్దలు చెబుతారు. ఇందులో కథానాయిక తనకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన నాట్యాన్ని తక్కువగా చూస్తుంది. ఏదో ఒక హోటల్‌లో టిప్‌టాప్‌గా డ్రెస్‌ చేసుకుని, అందరికీ సర్వ్‌ చేస్తూ ఉండాలనుకుంటుంది. నాట్యంలో ఎత్తుకు ఎదగాలనుకోదు. అటువంటి మనస్సు కలిగిన ఆ అమ్మాయి ఒకసారి, తన తండ్రి ఫొటోకి దండ వేసి నాట్యం చేస్తున్న శిష్యుడిని చూస్తుంది.

 మనసు  నాట్యం వైపుకు మళ్లుతుంది. ‘‘నీ నాట్యంలో ఆత్మ లేదు, ఎవరి కోసమో పని చేస్తుంటే ఆనందం, తృప్తి ప్రయోజనం ఏవీ ఉండవు. నీ కోసం నువ్వు చేయాలి...’’ అనే మాటలు మనసులో మెదలుతాయి.
‘నాట్యం దైవీయమైన విభూతి. నాట్యం చేయడమంటే శరీరాన్ని ఊపడం, కళ్లు కదపడం, పెదవుల ధ్వనులు... కాదు. మనసు లగ్నం చేసి నర్తించాలి. అప్పుడు నీ హృదయస్పందన నీకు తెలుస్తుంది’ అని సాటి నృత్యకారిణి అన్న మాటలు ఆమె మనస్సును తట్టి లేపుతాయి.

ఆమె వెంటనే ఎవ్వరూ లేని మైదాన ప్రదేశంలో తనను తాను మరచిపోయి పరవశంతో నర్తిస్తుంది. ప్రకృతితో మమేకమై నాట్యం చేస్తుంది.
అమ్మ చేసే నాట్యాన్ని లాస్యం, శివుడు చేసే నాట్యం తాండవం అంటారు. విశ్వమంతా ఆయన తాండవంలా ఉంటుంది. నాట్యం చేయడానికి కొంత సరంజామా కావాలి. ఎందరికో లభించని విద్య ఆమెకు వరంగా భగవంతుడు ప్రసాదించాడు. ఏ పనినీ తక్కువగా చూడకూడదు. ముఖే ముఖే సరస్వతి. స్వాత్మానందం కోసం నాట్యం చేయాలనేది ఈ పాటలో వివరించాను.

ఈ పాటలో కథక్, ఒడిస్సీ, మణిపురి, కూచిపూడి... అన్ని నాట్యరీతులూ కనిపిస్తాయి.
– సంభాషణ: డా. పురాణపండ వైజయంతి

మరిన్ని వార్తలు