అంకెల పొంకం

5 Oct, 2014 00:18 IST|Sakshi
అంకెల పొంకం

వివరం: మన దగ్గర ముగ్గురు కలిసి వెళ్లకూడదంటారు. అదే స్వీడన్లో మూడు శుభానికి సంకేతం. ‘మంచివన్నీ మూడింటి బృందంగా వస్తాయి’ అని అక్కడి సామెత. ఇంగ్లీషు భాష ఇంతగా ఆదరణ పొందడానికి కారణం, అందులోని 26 అక్షరాలట! 2+6=8. ఎనిమిది పాశ్చాత్యులకు అదృష్టసంఖ్య. ఇంతకీ ఈ ‘ఎనిమిది’ అంటే ఏమిటి? కుక్కల్లాగా, పిల్లుల్లాగా అవి కనబడతాయా? నిజానికి, ఎనిమిదిగా దానికి ఏ విలువా లేదు. కానీ ‘ఎనిమిదింటిని’ చూపడానికి ఒక సంకేతంగా నిలబడుతోంది కాబట్టి, ఒక విలువను సంతరించుకుంది. మనుషులు అంకెలను ఎప్పుడు తమ జీవితంలో భాగంగా చేసుకున్నారో అప్పుడే కొన్నింటి మీద ఇష్టమూ, కొన్నింటి మీద అయిష్టమూ పెంచుకున్నారు. వాటిల్లోని అర్థం, పరమార్థం ‘దేవుడికే’ తెలియాలి. ఎందుకు దేవుడికే తెలియాలి అంటే అంకెల్ని కూడా దేవుడే సృష్టించాడని కూడా ఒక నమ్మకం ఉండటం వల్ల! మనిషిది మొదటినుంచీ, అంకెలతో ప్రేమ-ద్వేష సంబంధమే. అంకెలకు ఉనికిని ఇచ్చినప్పటినుంచీ ఇది కొనసాగుతూనే ఉంది. కొన్నింటిని నమ్ముతాడు. కొన్నింటిని భయంగా చూస్తాడు. ఆ చొక్కా వేసుకుంటే మంచి జరగదని విశ్వసించడానికి, ‘మరింత కాకతాళీయత’ లాంటిదేదో కారణం అయ్యుండాలి. అయినా ‘రిస్కు’ తీసుకోవడం ఎందుకు? అన్న ధోరణిలో వీటిల్లో విశ్వాసాన్ని పెంచుకున్నాడు.
 
 అంకెల్లో జీవితం
 మానవ జీవితం అంకెలతో ముడిపడి ఉంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇంటి చిరునామా, వాహనం నెంబరు, ఫోన్ నెంబరు... అన్నింటా మనకి సంఖ్యలతో సంబంధం ఉంది. ఈ అంకెలు మనిషి మీద చూపగల ప్రభావాన్ని తెలియపరిచేదే న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం). ఇందులో కబాలా, పైథాగరస్, చాల్దియన్ అనే మూడు రకాలున్నాయి. అన్నింట్లోకీ చాల్దియన్ పద్ధతి పురాతనమైంది. అయితే, గ్రీకు శాస్త్రజ్ఞుడు పైథాగరస్ న్యూమరాలజీని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన పేరుమీదున్నదే ఎక్కువగా వాడుతున్నాం. న్యూమరాలజీ భారతదేశంలో కంటే, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి పాశ్చాత్య దేశాలు, ఆసియా దేశాలైన చైనా, మలేషియాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. దైనందిన జీవితంలో వారు   దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
 
 బైబిల్లోనూ పేర్ల మార్పు
 వర్ణమాలలో (ముఖ్యంగా ఆంగ్ల వర్ణమాల) ఉన్న అక్షరాలకు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఖ్య ఇవ్వటం జరిగింది. ఎ=1, బి=2, సి=3, వై=25, జడ్=26. అక్షరాలకు ఉన్న అంకెల వల్ల పేర్లకు కూడా సంఖ్య వస్తుంది. దానినే నామ సంఖ్య అంటారు. మానవ జీవితంపై ప్రధానంగా నామ సంఖ్య, జన దిన సంఖ్యల ప్రభావం ఎక్కువ. జన్మ తేదీకి, నామ సంఖ్యకు సఖ్యత ఉన్నట్లయితే, ఆ వ్యక్తి భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుంది. జన్మ తేదీని మార్పు చేసుకోలేం కాబట్టి, దానికి అనుకూలంగా నామ సంఖ్యను మార్పుచేసినట్లయితే, మంచి ఫలితాలు వస్తాయని ఈ శాస్త్రం చెబుతుంది. ఇది పురాతనమైన శాస్త్రం. పవిత్ర గ్రంథమైన బైబిల్‌లో కూడా పేరు మార్పు వలన కలిగే ప్రయోజనం గురించి తెలియజేయటం జరిగింది. దైవ సందేశానుసారంగా అబ్బరం తన పేరును అబ్రహాంగా, సారా (Sara) తన పేరును సారాః (Sarah)గా, జాకబ్ తన పేరును ఇజ్రాయెల్‌గా మార్పు చేసుకోవటం లాంటి ఉదంతాలు వివరింపబడ్డాయి.
 
 అంకెలు- దేశాలు
 ప్రాచీన కాలం నుంచీ వివిధ దేశాల్లో అంకెల గురించిన బలమైన విశ్వాసాలున్నాయి. ఒకటి నుంచే ప్రతీ అంకె పుడుతుంది కాబట్టి, ఇది అన్ని అంకెలకీ మూలంగా భావిస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పదిగా పరిగణిస్తారు. 1+1=2, 1+2=3. అందుకే, ఒకటిని దేవుడిగానూ, సృష్టిగానూ చూస్తారు. అదే చైనాలో సున్న పూర్ణ సంఖ్య కాబట్టి, దాన్ని గొప్పదిగా చూస్తారు. డబ్బును సంఖ్యాపరంగా తెలియజేసినప్పుడు అది ప్రధానంగా సున్నాతోనే ముగుస్తుంది. రూ. 10, 20, 50, 100, 500, 1000.
 చైనీయులు 2ను మంచి సంఖ్యగా భావిస్తారు. ‘మంచి విషయాలు జంటగా వస్తాయి’ అనేది చైనావాళ్ల సామెత. అదే స్వీడన్ వాళ్లకు మంచి విషయాలు మూడింటిగా వస్తాయి. ఇటలీ వాళ్లకు కూడా 3 అదృష్ట సంఖ్య. తక్కువ భుజాలతో త్రిభుజాన్ని, అంటే ఒక పర్ఫెక్ట్ షేప్‌ని ఏర్పరుస్తుంది కాబట్టి మూడు వాళ్లకు ప్రత్యేకమైన అంకె. చైనా భాషలో 3 ఉచ్ఛారణ ‘పుట్టుక’ అనే శబ్దానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్లకూ ఇది మంచి అంకెనే!
 
 4ను చైనీయులు, జపనీయులు, కొరియన్లు చాలా చెడు సంఖ్యగా భావిస్తారు. దీని ఉచ్ఛారణ వారి భాషలో ‘మరణం’ అనే శబ్దానికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ సంఖ్యను వారు వాడరు. నోకియా సెల్‌ఫోన్లు 4 సంఖ్యతో ప్రారంభం కావు. కొన్ని తూర్పు ఆసియా దేశాల్లోని భవనాలలో 4వ అంతస్తు ఉండదు. 14, 24, 34 కూడా ఉండవు. 50 అంతస్తుల భవనం అంటే అందులో నిజంగా 35 అంతస్తులు మాత్రమే ఉంటాయి. విచిత్రంగా, జర్మనీలో 4 లక్కీ నంబర్. దీనికి వాళ్లు చెప్పే ప్రధాన కారణం క్లోవర్‌కు నాలుగు ఆకులుంటాయి! స్వర్గంలోంచి ఈవ్ వెంట తెచ్చుకున్నది క్లోవర్‌నే! అయితే, మూడు ఆకుల క్లోవర్లు కూడా ఉంటాయిగానీ వాటిని లెక్కలోకి తీసుకోరు.
 
 చాలా దేశాల్లో 2ని స్త్రీగానూ, 3ను పురుషుడిగానూ రెండూ కలిపితే వచ్చే 5ని వివాహానికి ప్రతీకగానూ భావించడం ఉంది. ఇంకో నమ్మకం ప్రకారం 3ని పురుషుడికీ, 4ను స్త్రీకీ ప్రతీకగా చూస్తారు. అన్ని సరిసంఖ్యల్నీ స్త్రీగానూ, అన్ని బేసి సంఖ్యల్నీ పురుషుడిగానూ చూడటమూ ఉంది. ఇందులో మంచిదేది? చెడ్డదేది? రష్యావాళ్లు బేసివన్నీ అదృష్టాన్నీ, సరివన్నీ దురదృష్టాన్నీ తెస్తాయని నమ్ముతారు. చైనీయుల నమ్మకం ప్రకారం, ఐదు పంచభూతాలకు ప్రతీక (భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి). దాన్ని సర్వ నామమైన ‘ఐ (ఐ)’లా ఉచ్ఛరిస్తారు. కాబట్టి మంచి సంఖ్యగా భావిస్తారు. అలాగే, 6 వాళ్లకు సంపదను సూచిస్తుంది. దాని ఉచ్ఛారణ ‘ప్రవాహం’ శబ్దానికి దగ్గరగా ఉంటుంది. అందువలన ఇది వ్యాపారానికి మంచిదిగా భావిస్తారు.
 
 అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో 7 అదృష్ట సంఖ్య. దేవుడు ఏడు రోజుల్లో ఈ సృష్టిని చేశాడని దాన్ని శుభసంకేతంగా భావిస్తారు. చైనీయులు కూడా ఈ సంఖ్యను బంధానికి చిహ్నంగా భావిస్తారు. చైనాభాషలో దీని ఉచ్ఛారణ ‘లేచుట’, ‘జీవితం’ అనే శబ్దాలకు దగ్గరగా ఉంటుంది. చైనాలోనూ పాశ్చాత్య దేశాలలోనూ అదృష్ట సంఖ్యగా భావింపబడే ఏకైక సంఖ్య 7. కొరియా, జపాన్, చైనాలో 8 చాలా శుభప్రదమైనది! తిరగేసినా ఈ అంకె రూపు మారదు, అన్ని అంకెలూ కిందికి అంతమవుతే, ఎనిమిది మాత్రం ఊర్ధ్వముఖంగా ముగుస్తుంది. అందుకే, వారికి దీని మీద వారికి ఎక్కువ గురి. అయితే, హిందువులు జ్యోతిష పరంగా 8, 9 (1+8 = 9) సంఖ్యలను శుభ సంఖ్యలుగా పరిగణించరు (మినహాయింపుల్తో). అష్టమి, నవమి దినాలలో ప్రయాణం చేయరు. ఇక్కడ 8 శనికి చిహ్నం. 9 నార్వే వాళ్లకు మంచిది. జపాన్ వాళ్లకు మంచిది కాదు. ఒక మనిషిని తొమ్మిది మంది నిందిస్తున్నారంటే అది సరైన నిందే అయ్యుంటుందట!
 
 12ను దైవ సంబంధమైనదిగా అన్ని మతాలవారు భావిస్తారు. 12 నెలలు, 12 గంటలు (పగలు, రాత్రి వేరుగా), ఒలంపస్‌లో 12 మంది దేవతలు, ఇజ్రాయెల్‌లో 12 తెగలు, క్రీస్తు 12 మంది శిష్యులు, మహమ్మద్ ప్రవక్త 12 మంది వారసులు, 12 రాశులు, పుష్కరం (12 సంవత్సరాలు) మొదలైనవి దీనికి కారణం. 13, శుక్రవారం పాశ్చాత్యుల సెంటిమెంటు ప్రకారం, 13 అతి ప్రమాదకరమైనది. గ్రెగెరియన్ క్యాలెండర్‌లో 13వ రోజు మంచిది కాదు. ఈ నమ్మకం ఏసుక్రీస్తు కాలంలో ప్రారంభం అయ్యిందంటారు. ద లాస్ట్ సప్పర్ జరిగినప్పుడు మొత్తం 13 మంది ఆ విందులో పాల్గొన్నారు. ఇది గుడ్ ఫ్రైడే ముందురోజు రాత్రి జరిగింది. మరుసటిరోజు ఏసుక్రీస్తుని శిలువ వేయటం జరిగింది. అయితే, 19వ శతాబ్దానికి ముందు ఈ నమ్మకం ఉన్నట్టుగా ఎలాంటి ఆధారం లేదని కొందరి వాదన. ఇటాలియన్ సంగీత విద్వాంసుడు గియాచినో రోసినీ, 1868 నవంబర్ 13, శుక్రవారం నాడు చనిపోయిన తరువాత ఈ నమ్మకం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ నమ్మకం ప్రబలడానికి కారణం, 13 మంచి సంఖ్య కాదు.
 
 శుక్రవారం చెడు దినం (క్రీస్తు చనిపోయిన దినం). అందుకే పాశ్చాత్య దేశాల్లోని కొన్ని భవనాలలో 13వ అంతస్తు ఉండదు. ఫార్ములా వన్ కార్ల రేసుల్లో కూడా కార్లకు 13 లేకుండా జాగ్రత్తపడతారు. అయితే, మన దేశంలో 13 (త్రయోదశి) ను మంచి తిథిగా భావిస్తారు. వైద్య పరిభాషలో 13వ తేదీ శుక్రవారం పట్ల భయాన్ని PARASKAVEDEKATRIAPHOBIA అంటారు. గ్రీకు భాషలో ‘PARASKEVI’ అంటే శుక్రవారం, ‘ఈఉఓఅఖీఖఐఅ’ అంటే 13. స్పానిష్ భాష మాట్లాడే దేశాల్లో 13వ తేదీ మంగళవారం చెడు దినంగా భావిస్తారు. గ్రీకులు కూడా దీన్ని చెడు దినంగా పరిగణిస్తారు. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మంగళవారం మంచిరోజు కాదంటారు. ఇటలీ వాళ్లకు 17వ తేదీ శుక్రవారం చెడు దినం. 1993లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన పరిశోధనా పత్రం ప్రకారం, శుక్రవారం 13వ తేదీ నాడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగాయి.
 
పాశ్చాత్య దేశాల్లోని కొన్ని భవనాలలో 13వ అంతస్
తు ఉండదు. ఫార్ములా వన్ రేసుల్లో కూడా కార్లకు 13 సంఖ్య లేకుండా జాగ్రత్తపడతారు. బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది 35వ ఏట. 3+5=8. శ్రీకృష్ణుడు జన్మించింది అష్టమి నాడు. అందువల్ల 8ని అదృష్టసంఖ్యగా భావించేవాళ్లు కొందరుంటే, మరోవైపు 8ని శనికి చిహ్నంగా చూసేవాళ్లూ ఉన్నారు.చైనాలో 2003 లో అన్నీ ‘8’లు ఉన్న ఫోన్ నంబర్ 2,80,000 డాలర్లకు అమ్ముడుపోయింది. 2008లో బీజింగ్‌లో ఒలింపిక్స్ 8/8/8 తేదీన ఉదయం 8 గంటల, 8 నిమిషాల, 8 సెకెన్లకి ప్రారంభం అయ్యాయి. అక్కడ హోటళ్లు, షాపుల్లోని ధరల పట్టికలో 8 ఎక్కువగా కనిపిస్తుంది (38, 58, 88). మలేషియాలో ఉన్న పెట్రినాస్ ట్విన్ టవర్స్ 88 అంతస్తులు కలిగి ఉంది.కొన్ని తూర్పు ఆసియా దేశాల్లో భవనాలలో 4వ అంతస్తు ఉండదు. 14, 24, 34 కూడా ఉండవు. విచిత్రంగా, జర్మనీలో 4 లక్కీ నంబర్.
 
 రష్యావాళ్లు అన్ని సరిసంఖ్యల్నీ స్త్రీగానూ, అన్ని బేసి సంఖ్యల్నీ పురుషుడిగానూ విశ్వసిస్తారు. బేసివన్నీ అదృష్టాన్నీ, సరివన్నీ దురదృష్టాన్నీ తెస్తాయంటారు. 7 వర్గం 49 (7ఁ7). ఈ సంఖ్యను చైనా జానపదాల్లోనూ, బౌద్ధుల కర్మకాండలోనూ ఎక్కువగా నమ్ముతారు. వ్యక్తి మరణించినా అతని ఆత్మ 49 రోజులు ఆ పరిసరాల్లోనే ఉంటుందని వీరి విశ్వాసం. అందుకే చైనీయులు వ్యక్తి మరణించిన 49 రోజులకి మరలా కర్మకాండ నిర్వహిస్తారు. ఈజిప్టువాళ్లకు 2, 3, 4, 7 అదృష్టసంఖ్యలు. ఆఖరికి వీటిని కలుపగా, గుణించగా వచ్చినవి కూడా శుభాన్నిచ్చేవే.
 
 19కీ ఖురాన్‌కీ సంబంధం
 పవిత్ర ఖురాన్‌కు, న్యూమరాలజీకి అవినాభావ సంబంధం ఉంది. ఉదాహరణకు పవిత్ర ఖురాన్‌లో 114 అధ్యాయాలు (19ఁ6) ఉన్నాయి. అందులోని మొదటి పవిత్ర వాక్యం ‘బిస్మిల్లా’లో 19 అక్షరాలు ఉంటాయి (అరబిక్). గ్రంథంలోని మొత్తం పంక్తుల సంఖ్య 6346 (19ఁ334). బిస్మిల్లా అనే పదం 114 సార్లు (19ఁ6) వస్తుంది. మొదటి ప్రకటనలో 19 పదాలు ఉంటాయి. దానిలో 76 అక్షరాలు ఉంటాయి (19ఁ4). అల్లా నామం 2,698 సార్లు వినిపిస్తుంది (19ఁ142). అలాగే, ‘అల్లా హో అక్బర్’ నామ సంఖ్య 289 (2+8+9 = 19). ఈ విధంగా పవిత్ర ఖురాన్‌కు 19 సంఖ్యకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి, ఇస్లాం మతస్థులు 19ని అదృష్ట సంఖ్యగా భావిస్తారు.
 
 విశ్వాసమే బలం
 గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సెంటిమెంటు ఏర్పడుతుంది. భారతదేశంలో కూడా సెంటిమెంట్లు ఉన్నాయి. కానీ అవి న్యూమరాలజీ కన్నా శకున శాస్త్ర పరంగా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ఎక్కడికైనా బయల్దేరేముందు, ఎవరైనా తుమ్మితే ఆగిపోతాం. నిండు కుండ ఎదురుగా వస్తే శుభ పరిణామమని భావిస్తాం. సంఖ్యల యొక్క ప్రభావం, కేవలం మనుషులపై మాత్రమే కాదు. అన్ని జీవుల మీద, సంస్థల మీద, స్థలాల మీద, రాష్ట్రాల మీద, దేశాల మీద కూడా ఉంటుంది. ఆ దేశం ఆవిష్కరణ దినం, ఆ దేశం పేరు, దాని నామ సంఖ్య ప్రకారం, ప్రభావం మారుతూ ఉంటుంది. 13 సంఖ్య పాశ్చాత్య దేశాల్లో చెడు ప్రభావం చూపినా మనదేశంలో మంచి ప్రభావం చూపుతుంది. ఇలాంటి విశ్వాసాల గురించిన హేతుబద్ధత గురించి చర్చించటంలో ప్రయోజనం లేదు. ఎందుకంటే సెంటిమెంటు అనేది మనసుకీ, వ్యక్తిగత అనుభవాలకీ సంబంధించినది. కంటికి కనపడనిది, భావోద్వేగానికి సంబంధించినది!
 - మొహమ్మద్ దావూద్

మరిన్ని వార్తలు