అనుబంధం

10 Nov, 2019 03:53 IST|Sakshi

రోజలీనా ఆ మూడు కొబ్బరిచెట్లకూ తన పిల్లల పేర్లు పెట్టుకుంది: ఏంజిలా, ఆంథోనీ, ఏబెల్‌. ఇప్పుడు మొదటి రెండు చెట్లకు నీరు పొయ్యడం పూర్తయింది. పైపు పట్టుకుని మూడో చెట్టు వద్దకు వచ్చింది. ఏబెల్‌ ఇంకా చిన్న చెట్టే. ఇప్పుడిప్పుడే కాపుకొస్తోంది. అంతలో ఇంటి ముందు కంచెకు ఆవల సైకిలు బెల్‌ మోత వినపడింది. రోజలీనా నీటిపైపును ఏబెల్‌ చెట్టు మొదట్లో పడవేసి గేటు వద్దకు పరుగు తీసింది. 
పోస్ట్‌మేన్‌ వాసు వచ్చాడు.
 ‘‘అమ్మా! మధ్యాహ్నం కావస్తోంది. నువ్వింకా చెట్లకు నీరు పెట్టడం పూర్తి కాలేదా?’’ అంటూ ప్రవేశించాడు. సైకిలును కంచె వెలుపల విడిచిపెట్టాడు. 
‘‘రాత్రి నిద్ర పట్టలేదు నాయనా! వేకువనే కునుకు పట్టేసింది. తీరా లేచే సరికి బాగా పొద్దెక్కిపోయింది’’ అంది రోజలీనా. వాసు ఆ ఉత్తరాన్ని చేతికి అందివ్వకుండానే అది ఆంథోనీ నుంచేనని ఆమె గ్రహించింది. దాని కోసమే ఆమె కొద్ది రోజులుగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. 
ఆ భూసేకరణ తాఖీదును అందుకున్నప్పటి నుంచి రోజలీనా ఎంతో ఆందోళన చెందుతోంది. 
‘‘అబ్బాయి ఆ ఉత్తరంలో ఏం రాశాడో? నా ఉత్తరం వాడికి అందే ఉంటుంది. రావాలని నిర్ణయించుకున్నాడో లేక రాలేనని చెప్పబోతున్నాడో?’’
ఇలా ఆలోచిస్తూ ఉత్తరం చదవడానికి ఆత్రపడుతోంది. కాని వయసు ప్రభావం వల్ల ఈ మధ్య ఆమె దృష్టి మందగించింది. తన భర్త ఉన్నంతకాలమూ ఇతరుల సహాయం అవసరమయ్యేది కాదు. కాని రెండేళ్ల కిందట అతడు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడామె ఒంటరిదైపోయింది. ఉత్తరం చదవడానికి బయటివారి మీద ఆధారపడటం తప్పనిసరి అవుతోంది.
ఒక పెద్ద గ్లాసుతో పోస్ట్‌మేన్‌కు మంచినీరు అందించింది. ‘ఇతడినే ఉత్తరం చదివి పెట్టమని ఎందుకు అడక్కూడదు?’ అనుకుంది. 
‘‘ఈ ఉత్తరం చదివి అందులో ఏముందో చెప్పు..’’ అని అడిగింది.
‘‘తప్పకుండా! రహస్యాలేమీ ఉండవు కదా!’’ ఛలోక్తిగా అంటూ కవరు అందుకుని తెరిచాడు.
ఈ మధ్య ఆంథోనీ తను చదవడానికి వీలుగా ఉత్తరాన్ని టైప్‌ చేసి పంపుతున్నాడు. కాని భర్త చనిపోయిన తర్వాత ఆమె బాగా కుంగిపోయింది. ఆరోగ్యం కూడా క్షీణించసాగింది.  ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది.  ఒక చిన్న ఉత్తరం చదవడానికి చాలాసేపు పడుతోంది. అయినప్పటికీ ఉత్తరంలోని అంశాలను నిర్ధారించుకోవడానికి పొరుగింటామెపై ఆధారపడక తప్పడంలేదు.
ఉత్తరం చూస్తూ వాసు ఇలా చెప్పాడు: ‘‘అమ్మా! ఇది ఆంథోనీ నుంచి వచ్చింది. ఈ నెలాఖర్లో భార్యా పిల్లలతో ఇక్కడకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు రాశాడు. ఏబెల్‌ అతడికి ఉత్తరం రాశాడట. ఏబెల్‌ ఒక ఆస్ట్రేలియన్‌ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడట. అందుకోసం కువైట్‌ నుంచి ఆంథోనీ, బహ్రెయిన్‌ నుంచి అక్క ఏంజిలా ఆస్ట్రేలియా వెళుతున్నారట. వివాహం డిసెంబరులో జరుగుతుంది. ఆంథోనీ తిరిగి వచ్చి వివరాలన్నీ ఉత్తరం రాస్తాడట. ఇక పైకి చదవనా అమ్మా!’’
ఈ వార్తలను ఒకేసారి అవగాహన చేసుకునే స్థితిలో రోజలీనా లేదు. ఆమె మనస్సు పరిపరివిధాలుగా పోతోంది. ఒక్కసారిగా వర్తమానంలోకి వచ్చి ‘‘అవసరం లేదు నాయనా! విషయం అర్థమైపోయింది. సరే! దేవుడు నిన్ను దీవిస్తాడు. వెళ్లిరా!’’
వాసు తన సైకిలు తీసుకుని వెళ్లిపోయాడు. రోజలీనా వరండాలోనే ఒక కుర్చీలో కూలబడిపోయింది. 
‘‘సరి.. ఇక చివరి పక్షి ఏబెల్‌ కూడా తన గూడు నిర్మించుకుంటున్నాడు. నిజానికి వాడు ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు. అక్కడ స్థిరపడిపోతాడు. భార్యను తీసుకుని గోవా వస్తాడు. వస్తాడా? రాడా? తప్పకుండా వస్తాడు. తండ్రి చనిపోయినప్పుడూ అందరూ వచ్చి వెళ్లారు. అలాగే తల్లి చనిపోయినప్పుడూ అందరూ వస్తారు. అందరికన్నా చిన్నవాడు గోవాలోనే స్థిరపడి తనకు ఆసరాగా ఉంటాడనుకుంది. ఆ ఆశలు అడియాసలవుతున్నాయి. తను ఒంటరిగానే జీవిస్తుంది. ఒంటరిగానే కాలం చేస్తుంది.’’
ఇంతలో బయటి నుంచి ఎవరో పిలిచారు. ‘‘అమ్మా! ఇంట్లోనే ఉన్నారా? కుళాయి విప్పే ఉంది. కట్టడం మర్చిపోయినట్లున్నారు’’ తన ఆలోచనలను ఆపి పరుగెత్తుకుంటూ వెళ్లి కుళాయిని కట్టింది. చెట్లకు నీరు పోసే పైపుని వేరు చేసి దాన్ని చుట్టగా చుట్టి ఒక స్తంభానికి వేలాడదీసింది. ఇంటి లోపలికి వెళ్లింది. 
పొయ్యి మీద గంజి ఉడుకుతోంది. ఆమెకు ఇప్పుడు ఆకలిగా లేదు. తినాలనీ లేదు. మరింత దగ్గరగా మరిగించాలని నిర్ణయించుకుంది. అప్పుడు మరి కూర చేసే శ్రమ ఉండదు. కేవలం ఒక ఆవకాయ ముక్క ఉంటే చాలు. భర్త చనిపోయిన తర్వాత కూర అరుదుగా వండుతోంది. కొద్ది రోజుల కిందట భూసేకరణ తాఖీదు అందిన తర్వాత ఆకలి పూర్తిగా చచ్చిపోయింది. తన భర్త చనిపోయినప్పుడు అందరు పిల్లలూ ఇంటికి పరుగెత్తుకుని వచ్చారు. అందరికన్నా పెద్దది ఏంజిలా బహ్రెయిన్‌ నుంచి వచ్చింది. రెండోవాడు ఆంథోనీ కువైట్‌ నుంచి వచ్చాడు. ఏబెల్‌ చిన్నవాడు. అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినా, ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. ఏంజిలా ఒక నెలరోజుల పాటు ఉంది. కాని అబ్బాయిలు ఇద్దరూ కార్యక్రమాలు పూర్తయిన రెండు వారాల లోపే తిరిగి వెళ్లిపోయారు. 
కువైట్‌ బయలుదేరుతూ ఆంథోనీ ఇలా అన్నాడు: ‘‘అమ్మా! మన ఇంటి పక్క నుంచి ఒక కొత్త రైల్వేలైను పడబోతోంది. మనకు చాలా సౌకర్యంగా ఉంటుంది. నువ్వు ఇక్కడ ఇంటి వద్ద ఉదయం రైలు ఎక్కితే సాయంత్రానికి బొంబాయి చేరుకుంటావు.’’
ఈ ఆలోచన ఏంజిలాకూ సంతోషం కలిగించింది. ఇంటికి తాకుతూనే రైల్వేలైను ప్రతిపాదన అందరిలోనూ ఒక ఉత్సాహాన్నీ  ఉద్వేగాన్నీ నింపింది. కాని ఈ రైల్వే భూతం నేరుగా తమ ఇంటి కంచె లోనికే ప్రవేశిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. భూసేకరణ ఆఫీసు నుంచి గుమస్తా తాఖీదు అందజెయ్యడానికి వచ్చినప్పుడు ఆ కాగితాన్ని అందుకోవడానికి రోజలీనా సందేహించింది. భర్త బతికి ఉండగా ఆమె ఏ అంశంలోనూ తలదూర్చి నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉండేది కాదు. అన్నీ ఆయనే చూసుకునేవాడు. నోటీసు వచ్చినప్పుడు తన సంతానంలో ఒక్కరైనా ఉండి ఉంటే బావుండేదని భావించింది. ఆమె వైఖరిని చూసి ఆ గుమస్తా ధైర్యం చెప్పాడు.
‘‘ఇటువంటి నోటీసులు మన ఊళ్లో చాలామందికి వచ్చాయి. మీరొక్కరే బాధపడనక్కర్లేదు. నిజానికి మీది చాలా చిన్న ముక్క. ఎంతోమంది తమ విశాలమైన పొలాలనూ తోటలనూ వదులుకోవలసి వస్తుంది’’ అన్నాడు.
‘‘మరి ఇంత భూమి వాళ్లేం చేస్తారు?’’ రోజలీనా అమాయకంగా ప్రశ్నించింది.
‘‘అమ్మా! అది వారి విధానం. ప్రతిపాదించిన రైల్వేలైనుకు ఇరువైపులా భూమిని సేకరిస్తున్నారు. అంతే.. మీకెందుకు విచారం? ఇక్కడ సంతకం పెట్టండి చాలు..’’ అన్నాడతను.
సందేహిస్తూనే రోజలీనా సంతకం చేసింది. అప్పటికి ఆమెకు వివరాలేవీ తెలీవు. ఒకసారి పోస్ట్‌మేన్‌ అన్నాడు: ‘‘బహుశా మీ కంచెలో కొంత భాగం, దాంతోపాటు మరికొన్ని చెట్లు కూడా పోవచ్చు.’’
‘‘సరిగ్గా కంచెలో ఎంత భాగం, ఏ చెట్లు పోతాయో చెప్పగలవా?’’ ఆమె ఆత్రంగా అడిగింది.
‘‘మా పంట పొలంతో కలసి ఉన్న భాగం పోవచ్చు. మావి ఇరవైనాలుగు కొబ్బరిచెట్లు, ఒక మామిడిచెట్టు, మర్రిచెట్టు, మా పశువులశాల కూడా పోతున్నాయి. కాబట్టి మీ కంచె ముందు భాగం దాంతో పాటు ఆ గేటూ, కొబ్బరిచెట్లూ, ఆ బోగన్‌విల్లా పొద పోవచ్చు.’’ పోస్ట్‌మేన్‌ కచ్చితంగా అంచనా వేసి చెప్పాడు.
ఈ మాటతో రోజలీనా మనసు చెదిరిపోయింది. ముఖ్యంగా కొబ్బరిచెట్లు పోతాయనే విషయం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ఆ రోజు ఆమెకు పీడకల వంటిది. ఆమె ముగ్గురు పిల్లల పేరున నాటిన మూడు కొబ్బరి మొక్కలూ ఆరోగ్యవంతమైన చెట్లుగా ఎదిగాయి. ఆమె తల్లిప్రేమ సముద్రాలకావల ఉన్న వారికి నేరుగా చేరలేకున్నా ఈ కొబ్బరిచెట్లపై ప్రసరిస్తోంది. ఆమె ఒక విధమైన సంతోషాన్నీ, సాంత్వననీ పొందుతోంది. ఆమె దృష్టిలో అవి చెట్లు కావు. కడుపున పుట్టిన బిడ్డలే. వారి పేర్లతోనే ఆ చెట్లను పిలుస్తుంది.
ఆమె భర్త అంటూ ఉండేవాడు: ‘‘ఆ చెట్లపైన అంత మమకారం పెంచుకోవద్దు సుమా! ఎందుకంటే అవి కేవలం చెట్లు మాత్రమే. రేప్పొద్దున్న గాలికీ తుఫానుకీ ఏ చెట్టయినా కూలిపోతే నీ గుండె బద్దలవుతుంది.’’
ఆ మాటకు రోజలీనాకు కోపం వచ్చేది. ‘‘ఇవి ఎందుకు పడిపోతాయి? పడితే నా మీదనే పడాలి. ఏ ఒక్కటైనా విరిగితే దాంతో పాటు నేను కూడా కూలిపోవాలి...’’
‘‘నేనన్నదీ అదే!’’
పదహారేళ్ల కిందట ముగ్గురిలో పెద్దది ఏంజిలా బడి నుంచి ఒక కొబ్బరి మొక్కను తెచ్చింది: ‘‘అమ్మా! మన ఎమ్మెల్యేగారు కొబ్బరి మొక్కలను పెంచుతున్నారు. నేను కూడా ఒకటి తెచ్చాను. మన ఇంటి ఆవరణలో నాటుదాం...’’ అంది.
అప్పటికి భర్త కువైట్‌లో పనిచేస్తూ సెలవు మీద వచ్చి ఉన్నాడు. రోజలీనా అతనితో అంది: ‘‘ఈ మొక్కను వాకిట్లో నాటుదాం. ఏంజిలా పెద్దదయి అత్తవారింటికి పోతుంది. కాని ఈ మొక్క ఇక్కడే ఉండి దాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది.’’
ఆ మాట అనగానే భర్త ఆ మొక్కని తన చేతుల్తో నాటి పెట్టాడు. చెట్టు పెరిగి కాయలు కాయక ముందే ఏంజిలా పెళ్లి చేసుకుని బహ్రెయిన్‌ వెళ్లిపోయింది. భర్త కువైట్‌ నుంచి ఆంథోనీకి వీసా పంపాడు. అప్పటికి వాడు కాలేజీలో చదువుతున్నాడు. అయినా వెళ్లిపోయాడు. ఈ మార్పులన్నీ త్వరగా జరిగిపోయాయి. ఏబెల్‌ ఇంకా బడిలోనే ఉన్నాడు. ఆంథోనీ అందుబాటులో లేకపోయినా చిన్నవాడు ఏబెల్‌ గోవాలోనే ఉంటాడనీ తనకు తోడుగా ఉంటాడనీ భావించింది. ఆంథోనీకి ఆమె భర్త పోలికలు ఉంటాయి. కచ్చితంగా వాడు ఇంటి బాధ్యతలను నెత్తికి ఎత్తుకుంటాడనీ తలచింది.
ఆంథోనీ వెళ్లే ముందు అతడితో ఇలా అంది: ‘‘నాయనా! నువ్వు వెళ్లిపోతే నా జీవితంలో వెలితి ఏర్పడుతుంది. కానీ కేవలం నీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని నిన్ను నేను ఆపదలచుకోలేదు. కాని ఒక కొబ్బరిమొక్కను తెచ్చి ఈ అక్క మొక్క పక్కనే నాటు. అది నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది.’’
ఆ ప్రకారమే ఆంథోనీ బెనాలియా నర్సరీకి వెళ్లి ఒక కొబ్బరి మొక్కను తెచ్చాడు. దాన్ని రోజలీనా అతడి చేతనే నాటించింది. ఈరోజు అది బాగా పెద్దదయి కాయలు కాస్తోంది. భర్త రిటైరై కువైట్‌ నుంచి ఇంటికి రావడం, ఏబెల్‌కు ఉద్యోగం వచ్చి ఆస్ట్రేలియా వెళ్లిపోవడం ఒకేసారి జరిగాయి. ఈ రెండు మార్పులూ రోజలీనాలో మిశ్రమానుభూతులు కలిగించాయి. 
ఏబెల్‌ బయలుదేరే ముందురోజే ఎవరూ చెప్పకుండానే నర్సరీకి వెళ్లి ఒక కొబ్బరి మొక్కను తెచ్చి గత రెండింటి పక్కనే చేత్తో నాటాడు. తల్లి పట్ల కుమారుడికి గల తపనకూ బాధ్యతకూ రోజలీనా ఎంతో ముచ్చటపడింది. వార్ధక్యంలో భర్త ఇంటి వద్దనే ఉండటం ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. కానీ తన ముగ్గురు పిల్లల గురించి మాత్రం ఆందోళన చెందడం మానలేదు. భర్త సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్లేవాడు. ఆ సమయంలో రోజలీనా ఒంటరిగా ఇంటి వద్ద మిగిలిపోయేది. పిల్లలను తలచుకుని దిగులుపడేది. నూతి వద్దకు వెళ్లి ఒక డజను బకెట్ల నీరు తెచ్చి పిల్లల పేర్లు గల చెట్ల మొదళ్లలో పోసేది.
‘‘ఇలా పెంచుకున్న చెట్లను ఇప్పుడు నరికివేస్తారా? ఇక నేను మాత్రం బతికి ప్రయోజనమేమిటి?’’ ఆమెకు కోపం వచ్చింది. భయమూ వేసింది. ఆ నిద్రలేని రాత్రి తర్వాత వేకువనే త్వరగా లేచింది. పొరుగామె ఇంటికి వెళ్లింది.
 ‘‘జాక్విమ్‌! అయితే నా కొబ్బరిచెట్లను కొట్టేస్తారంటావా?’’
‘‘నేనూ ఆ మాటే విన్నాను. వచ్చి నష్టపరిహారం డబ్బు కూడా తీసుకొమ్మని కబురు చేస్తున్నారు. మన నేలను వారు ఉచితంగా తీసుకోవడం లేదు. పరిహారం కూడా బాగానే ఉందనిపిస్తోంది.’’
రోజలీనా చాలా చికాకుపడిపోయింది.
‘‘నాకు వారిచ్చే డబ్బు అవసరం లేదు. నా బాధ వారికేం తెలుసు? నా చెట్లకు ధర కట్టడానికి వారెవరు?’’ అంటూ భూసేకరణ చేసేవారిని తిట్టుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది. 
చాలామంది నష్టపరిహారం డబ్బు తీసుకున్నారు. కొంతమంది మరింత ధర కోరుతూ అప్పీలు చేసుకున్నారు. పొరుగామె తండ్రి కూడా తన మొత్తాన్ని అందుకున్నాడు. కాని రోజలీనా మాత్రం తీసుకోలేదు. ఆమె అసలు ఆ ఆఫీసుకే వెళ్లలేదు. కాని ఒక్క పని మాత్రం చేసింది. వెంటనే ఇంటికి రమ్మని ఆంథోనీకి ఉత్తరం రాసింది. అయినా వాడొస్తాడని ఆమెకు పూర్తి నమ్మకం కలగడంలేదు. ఈ మధ్య వారికి గోవా రావాలనే కోరిక తగ్గింద. ఎవరి జీవితాల్లో వారు మునిగిపోయారు.
పెద్దది ఏంజిలా తన కుటుంబ వ్యవహారాల్లో తలమునకలై ఉంది. ఆంథోనీ కూడా దూరమైపోతున్నాడు. గతంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి తప్పనిసరిగా వచ్చేవాడు. ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతటితో అతడు ఇంటికి రావడం తగ్గిపోయింది. అతడా అమ్మాయిని కువైట్‌లోనే కలుసుకున్నాడు. ఆమె కూడా అక్కడే పనిచేస్తోంది. ఆమె కుటుంబమంతా బొంబాయిలోనే ఉంటారు. కాబట్టి వివాహం అక్కడే జరిగింది. తన భర్తకు సెలవు దొరక్క రాలేకపోయాడు. కాని ఆంథోనీ తల్లిని పెళ్లికి బొంబాయి తీసుకువెళ్లాడు.
పెళ్లి తర్వాత ఆంథోనీ మూడేళ్లకు గోవా వచ్చాడు. అది కూడా భార్యనీ కుమారుడ్నీ తీసుకొచ్చాడు. ఆ తర్వాత తండ్రి అంత్యక్రియలకు వచ్చాడు. ఈసారి కుమార్తెనూ తీసుకొచ్చాడు. తన భార్యా ఇద్దరు పిల్లలతో పడితేనే అతడికి సరిపోయింది. తల్లిని ఓదారుస్తూ కూర్చోవడానికి సమయాన్ని కేటాయించలేకపోయాడు.
ఇప్పుడు ఆంథోనీ నుంచి ఉత్తరం వచ్చింది. తప్పకుండా రాగలడని రోజలీనా నమ్ముతోంది. దాంతో కొంత ఉపశమనం కలిగింది. ఆంథోనీకి తండ్రి పోలికలు ఎక్కువ. ఏ విషయంలోనైనా కచ్చితంగా ఉంటాడు. ఒకసారి ఇంటికి వస్తే అన్ని వ్యవహారాలనూ చక్కబెట్టగలడు.
 భర్త మరణం వల్ల ఏర్పడిన శూన్యం, ఒంటరితనం ఆమెకు చాలా బాధాకరంగా ఉన్నాయి. మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఎవరూ లేరు. ఆ చెట్లను చూస్తూ గంటల తరబడి కూర్చుండిపోతుంది. ఎదురుగా లేని పిల్లలతో సంభాషిస్తుంది.
‘‘ఏంజిలా! మీ నాన్న నీ పెళ్లి ఘనంగా చేశాడు. డ్రింకులు వరదనీటిలా ప్రవహించాయి. గుర్తుందా!’’
‘‘నాన్నా! ఆంథోనీ! మీ కోసమే మీ నాన్న ఈ ఇంటిని చెమటోడ్చి కట్టారు. మీ అమ్మను మరచిపోవద్దు.’’
‘‘నాన్నా! ఏబెల్‌! అందరికన్నా చిన్నవాడివి. నువ్వే నాకు అత్యంత ప్రీతిపాత్రుడివని గుర్తుపెట్టుకో!’’
ఆమె ఇలా ఉండగా పైపునీరు వృథా కావచ్చు. లేక పొయ్యి మీద వంటకం మాడిపోవచ్చు. మరో వారం తర్వాత ఏబెల్‌ నుంచి ఉత్తరం వచ్చింది. తన కాబోయే భార్య వివరాలు రాశాడు. పెళ్లికి రాగలవా అని రాశాడు. ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది. ఏదో ఒకరోజు ఏబెల్‌ యాత్రికుడిలాగా తన భార్యాపిల్లలతో గోవా సందర్శిస్తాడు. ఆ దృశ్యం ఆమె కళ్లకు కట్టినట్టుగా ఉంది. 
‘‘ఇది బేసిలికా చర్చి.. ఇది ప్రఖ్యాతమైన కాలంగూట్‌ బీచ్‌.. ఇది డోనా పౌలా.. ఇది మాండొవీ నది.. ఇది నా చిన్నప్పటి ఇల్లు.. ఈమె నా తల్లి..’’ ఇక్కడ ఫొటోలు తీసి తన ఆల్బమ్‌ కోసం ఆస్ట్రేలియా తీసుకెళ్తాడు. అంతే! మళ్లీ ఎన్నాళ్లకో! ఈలోగా తన జీవితమే ముగిసిపోవచ్చు.
ఆరోజు ఆమె ఏబెల్‌ చెట్టు వద్ద సుమారు నాలుగు గంటల పాటు తన దిగులంతా ఒలకబోసుకుని వెక్కివెక్కి ఏడ్చింది. ఒక అభద్రతాభావంతో కుంగిపోయింది. ఆంథోనీ ఉత్తరం వచ్చి సుమారు నెల గడిచింది. అతడు బొంబాయి చేరుకున్నాడని, ఒక వారంలోగా గోవా రానున్నాడని ఎవరో సమాచారం ఇచ్చారు. అతడికి ఇష్టమైన పదార్థాలన్నీ చేస్తూ ఆ వారమంతా ఎదురు చూడసాగింది. ఆమె ఆలోచనలను భంగం చేస్తూ ఇరుగు పొరుగు పిల్లలు రోజలీనాను పిలిచారు.
 ‘‘అమ్మా! అమ్మా! బయటకు రా! మీ చెట్లు కొట్టడానికి వచ్చారు..’’
ఆమె ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. ఎవరో తన తలపైకి గొడ్డలి ఎక్కుపెట్టినట్టుగా అనిపించింది. మరుక్షణం ఇంటి బయటకు పరుగెత్తింది. కొందరు కూలీలు గొడ్డళ్లతో సిద్ధంగా ఉన్నారు. గేటు వద్ద ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. ఒకతను చేతిలోని ఫైలును చూస్తూ.. 
‘‘అమ్మా! మీరు రోజలీనా ఫెర్నాండెజ్‌ ఔనా?’’ అని అడిగాడు. ఆమె తల ఊపింది.
‘‘మేం మీ కంచె, ముందు భాగమూ తొలగించడానికి వచ్చాం. ఇక్కడున్న పొదలూ ఆ మూడు కొబ్బరిచెట్లూ తెగిపోతాయి. మీరింకా నష్టపరిహారపు మొత్తం తీసుకున్నట్లుగా లేదు.’’
రోజలీనా కోపంతో వణికింది. ‘‘ఆ కొబ్బరిచెట్లను తాకడానికి వీల్లేదు.’’
‘‘అమ్మా! వినండి. మేం ప్రభుత్వోద్యోగులం. మా చేతిలో ఏమీ లేదు. మీవి మాత్రమే కాదు. చాలామంది చెట్లను ఈరోజు కొట్టాల్సి ఉంది. దయచేసి మా పనిని ఆపి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. కూలీలారా! రండి ముందు కంచె తొలగించండి’’ అధికారపూర్వకమైన అతడి స్వరానికి రోజలీనా జంకింది.
‘‘ఆ నేల తీసుకోండి. నాకేమీ అభ్యంతరం లేదు. కాని చెట్లను మాత్రం కొట్టకండి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.’’ ఆమె ఉద్యోగి ముందు మోకరిల్లింది.
‘‘అమ్మా! మీ చెట్లు బాగానే ఉన్నాయి. వాటికి ఎక్కువ మొత్తమే మీరు పరిహారం కోరవచ్చు. కంచెను కూడా తిరిగి నిర్మించే మొత్తాన్నీ ఇస్తారు’’ అన్నాడతను.
‘‘అయ్యా! నా చెట్లకు వెలకట్టడానికి మీరెవరు? మీరు నా పిల్లల తలలకూ ధర నిర్ణయిస్తారా? రెండు రోజుల్లో అబ్బాయి వస్తున్నాడు. మాట్లాడతాడు. ఉద్యోగికి కోపం వచ్చింది.
 ‘‘మీ అబ్బాయి వచ్చే వరకు పని ఆపి కూర్చోవాలా? మాది కాలంతో ముడిపడిన కార్యక్రమం. మమ్మల్ని ఆపే హక్కు మీకు లేదు.’’
ఈలోగా పనివారు కంచెను తొలగలించి ఆంథోనీ చెట్టు వద్ద గొడ్డళ్లతో నిల్చున్నారు. రోజలీనా కోపంతో రెచ్చిపోయింది. మెరుపువేగంతో ఆ పనివారిపైన పడింది. ఈ హఠాత్పరిణామానికి వారు గొడ్డళ్లతో సహా కింద పడిపోయారు. ఆమె ఆంథోనీ చెట్టును ఆలింగనం చేసుకుంది. 
‘‘రండి. ముందు నన్ను చంపి, ఆ తర్వాతే నా బిడ్డను నరకండి.’’
ఈ గొడవకు చుట్టుపక్కల జనం పోగయ్యారు.
‘‘అమ్మా! మీరు ప్రభుత్వం పనికి ఆటంకం కలిగిస్తున్నారు. ఇది నేరం. దయచేసి దూరంగా వెళ్లండి. మా పనిని మేం చేసుకోనివ్వండి.’’ అన్నాడు ఉద్యోగి. రోజలీనాకు కోపం తారస్థాయికి చేరింది.
‘‘నాకు మీ డబ్బు అవసరం లేదు. నా చెట్లను మీరు ముట్టడానికి వీల్లేదు.’’
కూలీలు రెండో చెట్టు వద్దకు చేరారు. రోజలీనా అక్కడకూ చేరింది.  ఉద్యోగి పరుగెత్తుకొచ్చాడు. ‘‘అమ్మా! మీరు హద్దు మీరుతున్నారు’’ అన్నాడు. రోజలీనా ఉద్యోగి పైకి ఉరికింది. అతడ్ని నేలపై పడవేసింది. అతడి చేతిలోని కాగితాలు చెల్లాచెదురయ్యాయి.
 ‘‘మీరు నా బిడ్డల్ని చంపుతున్నారు’’ అంటూ తిట్లు మొదలుపెట్టింది. సరిగ్గా పొరుగింటామె తండ్రి సమయానికి వచ్చి కలగజేసుకున్నాడు. రోజలీనాను పట్టుకున్నాడు. సర్దిచెప్పబోయాడు. విపరీతమైన కోపంతో ఉద్యోగి చెదిరిపోయిన తన కాగితాలను పోగు చేసుకున్నాడు. 
‘‘ఈమెకు గుణపాఠం చెబుతాను’’ అంటూ బయల్దేరాడు. జీపు స్టార్టయి వెళ్లిపోయిన శబ్దం వారికి వినపడింది.
‘‘నువ్వలా చెయ్యి చేసుకోకుండా ఉండాల్సింది. ఎంతయినా ప్రభుత్వోద్యోగి’’ పొరుగింటామె తండ్రి శాంతింపజేయబోయాడు.
‘‘అయితే మాత్రం ప్రభుత్వానికి నా బిడ్డలను చంపే హక్కుందా?’’ కావాలంటే ఆ నేలనీ నా ఇంటినీ తీసుకోనివ్వండి. నా చెట్లను మాత్రం తాకవద్దని చెప్పండి..’’ అంది రోజలీనా వగరుస్తూ.
ఒక అరగంటలో ఒక పోలీసు వ్యాను వచ్చింది. ఇందాక వచ్చిన ఉద్యోగికి తోడుగా ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు పోలీసులూ వచ్చారు. చుట్టూ ఉన్న జనవాహినిని చూసి ఇన్‌స్పెక్టర్‌ కాస్త మృదువైన స్వరంతో అన్నాడు: ‘‘చూడమ్మా! మీరు ప్రభుత్వోద్యోగిపై చెయ్యి చేసుకుని నేరం చేశారు. నీ మీద అభియోగాన్ని వెనక్కు తీసుకొమ్మని నేను వారికి నచ్చచెబుతాను. వారి పనిని వారు చేసుకోనివ్వండి...’’
రోజలీనాకు పరిస్థితి అర్థమైంది. ఇదే ఆమెకు చివరి అవకాశంగా భావించింది. ఆంథోనీ చెట్టు వద్దకు పరుగెత్తి దాన్ని కౌగలించుకుంది.
 ‘‘నేను నా చెట్లను కొట్టనివ్వను. ఇవి నా బిడ్డలు. నన్ను ముక్కలు చెయ్యండి. ఆ తర్వాతే చెట్ల జోలికి వెళ్లండి’’ అంది.
ఆమె వెర్రి ఆవేశం జనసమూహం మధ్య గందరగోళానికి దారితీస్తుందని ఇన్‌స్పెక్టర్‌ గ్రహించాడు. తన కానిస్టేబుళ్లకు సంజ్ఞ చేశాడు. వారు చెట్టుకు చుట్టి ఉన్న ఆమె చేతులను జాగ్రత్తగా విడిపించారు. ఆమెను మోసుకుని వెళ్లి పోలీసు వ్యానులోకి ఎక్కించారు. పొరుగామె తండ్రి, మరికొందరు పెద్దలు ఇన్‌స్పెక్టరుతో వాదించబోయారు. కాని వారిని పట్టించుకోకుండా పోలీసు వ్యాను ముందుకెళ్లింది.  చాలా దూరం వరకు వ్యానులోంచి ఆమె అరుపులు వినిపించసాగాయి. ఆ రోజే ఏంజెలా, ఆంథోనీ, ఏబెల్‌ పేర్లు గల కొబ్బరిచెట్లు నేల కూలిపోయాయి. ఆ ఊరి హెడ్‌మెన్‌తో కలసి ఒక యాభై మంది గ్రామపెద్దలు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. రోజలీనాను విడిపించమని అభ్యర్థించారు. మధ్యాహ్నానికల్లా ఆమెను విడిచిపెట్టి ఇంటికి పంపించారు. తిరిగి రాగానే కిందపడి ముక్కలైన చెట్లను చూసి రోజలీనా గుండెలు బాదుకుంది. అపస్మారక స్థితిలోకి పోయింది. ఇరుగు పొరుగులూ, వైద్యుల ప్రయత్నంతో మూడు రోజుల తర్వాత రోజలీనా ఈ లోకంలోకి వచ్చింది. ఆ రోజు ఆమె ఆంథోనీ నుంచి ఒక ఉత్తరాన్ని అందుకుంది.
‘‘అమ్మా! నేను గత వారమంతా వేర్వేరు పనులతో బొంబాయిలో చిక్కుకున్నాను. గోవా వచ్చి నిన్ను చూడాలనుకున్నాను. అంతలోనే మా ఆఫీసు నుంచి వెంటనే రమ్మని టెలెక్స్‌ వచ్చింది. తిరిగి కువైట్‌ వెళ్లిపోతున్నాను. వచ్చే సంవత్సరం వస్తాను. నువ్వేమీ దిగులుపడకు. భూసేకరణ గురించి, ఆ చెట్ల గురించి పట్టించుకుని ఆందోళన చెందవద్దు. నీకు కావలసిన డబ్బు పంపిస్తాను. ఆరోగ్యం జాగ్రత్త!’’
ఇట్లు
నీ ప్రియమైన కుమారుడు
ఆంథోనీ

మరిన్ని వార్తలు