తరలిరాద తనే వసంతం...

28 May, 2017 00:19 IST|Sakshi
తరలిరాద తనే వసంతం...

రుద్రవీణ చిత్రంలోని ఒక అభ్యుదయ గీతం ఇది. సంగీత విద్వాంసుడి కుమారుడు... అడవిలో కట్టెలు కొట్టుకునే వారి దగ్గరకు వచ్చినప్పుడు, ‘మీ నాన్నగారి సంగీతం  వినలేకపోయాం, మీరైనా మాకు పాట వినిపించండి...’ అని కోరినప్పుడు, శ్రామిక ప్రజల కోసం పాడే పాట ఇది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వసంతాన్ని తెలుగు ముంగిళ్లలోకి తెచ్చిన పాట. సహజంగా అభ్యుదయ గీతాల్లో కాస్తంత అలజడిని రేపే లక్షణముంటుంది. కాని అభ్యుదయాన్ని అందమైన వనకన్యలా మలచిన పాట. ఆ పాటలో అభ్యుదయం ఉంటుంది, ఆశలు ఉంటాయి, వికాసం ఉంటుంది. కళ్లు మూసుకుని ఒకసారి వింటే కళ్లు తెరిపించే పాట.

జీవితంలోనే శ్రుతిలయలుంటాయి. బ్రతుకు శ్రుతిలో ఉంటే, గుండె చప్పుడులో లయ ఉంటుంది. జీవితమే ఒక నాటకరంగం, అందులో మనమంతా పాత్రధారులం అని వేదాంతం చెప్పిన అంశాన్ని ‘బ్రతుకున కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా...’ అని చెప్పారు. ప్రపంచంలో ఎవరి పనులు వారు చేసినా చేయకపోయినా కాలం ఆగదు. కోయిల పాడినా పాడకపోయినా వసంత కాలం వస్తుంది, తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది.

 వసంతం వస్తే కోయిల కూస్తుంది. కోయిల కూసింది కదా అని వసంతం రాదు. వెదురుతో రూపొందిన మురళి పెదవికి తగిలితేనే స్వరాలు పలుకుతాయి. ఎత్తుగడే చాలా అందంగా ప్రారంభించారు సిరివెన్నెల... ‘తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాల కోసం...’ అంటూ. వసంతం ప్రవేశిస్తేనే వనాలు సౌరభాలు విరజిమ్ముతాయి. వనాల సౌరభాన్ని చూడడానికి వసంతం స్వయంగా వస్తుంది. శ్రామికుల కష్టాన్ని, వారి శ్రమసౌందర్యాన్ని చూడడానికే తాను వచ్చాననే అంతరార్థాన్ని ఇందులో ఎంతో అందంగా వివరించారు.

‘గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా...’ సముద్రాలలో నీరు ఆవిరి రూపంగా మారి ఆకాశం చేరి, మేఘాలుగా మారకపోతే, వర్షాలు పడవు. శ్రామికుడు కష్టపడి పండించకపోయినా, ఏ పని చేయకపోయినా మానవ మనుగడ సాగదు అనే విషయాన్ని భావకవిత్వంలో పండించారు సిరివెన్నెల.
 –సంభాషణ: డాక్టర్‌ వైజయంతి

మరిన్ని వార్తలు