ఈ రాశి వారు కళాభిమానులు

31 May, 2015 00:29 IST|Sakshi
ఈ రాశి వారు కళాభిమానులు

వృషభం: ఆస్ట్రోఫన్‌డా
రాశులలో రెండోది వృషభం. ఇది సరి రాశి, ముఖాన్ని సూచిస్తుంది. సౌమ్య స్వభావం, స్థిరరాశి, భూతత్వం, స్త్రీ రాశి, వైశ్యజాతి. దీని దిశ దక్షిణం. ఇందులో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం నాలుగు పాదాలూ, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. దీని అధిపతి శుక్రుడు. ఈ రాశి పర్షియా, హాలండ్, రష్యా పరిసర దేశాలను సూచిస్తుంది.


వృషభ రాశిలో జన్మించిన వారు సహజంగా సహనవంతులు. సహనం నశిస్తే మాత్రం వారిని అదుపు చేయడం అంత తేలిక కాదు. కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది. గొప్ప శారీరక దారుఢ్యం ఉంటుంది. తేలికగా అలసట చెందరు. నిదానంగా పనిచేస్తున్నట్లే కనిపిస్తారు గానీ ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికే పనులు పూర్తి చేస్తారు. వృథా కాలక్షేపాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. లలిత కళలపై, వస్త్రాలంకరణలు, సుగంధ ద్రవ్యాలపై బాగా మక్కువ కలిగి ఉంటారు. అసాధారణమైన తెలివితేటలు, గొప్ప సంయమనం వీరి సొత్తు.

ఆర్థిక వ్యవహారాలను లోపం లేకుండా బాధ్యతాయుతంగా నెరవేర్చడంలో నేర్పరులు. క్లిష్టమైన వ్యవహారాలను సైతం తేలికగా చక్కదిద్దగలరు. దౌత్యం నెరపడంలో సిద్ధహస్తులు. వృషభరాశి వారు విశ్వసనీయులుగా ఉంటారు. అవసరమైతే ఇతరుల భారాన్ని సైతం తామే భరించేందుకు సిద్ధపడతారు. నిర్భీతి, కారుణ్యం, ఓపిక సహజ లక్షణాలుగా గల వృషభరాశి జాతకులు నాయకత్వ పదవుల్లో రాణించగలరు. వాహన, వస్త్ర వ్యాపారాలు, సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు, అలంకరణలు, ప్లాస్టిక్, హోటల్, మద్యం వ్యాపారాలు వీరికి కలసి వస్తాయి.

సంగీతం, రంగస్థలం, సినీ రంగాల్లోనూ వృషభరాశి జాతకులు రాణించగలరు. గ్రహగతులు సానుకూలంగా లేకుంటే మాత్రం అసూయతో రగిలిపోతూ ఇతరులను ఇబ్బందిపెడతారు. మార్పును ఒకపట్టాన అంగీకరించలేరు. మొండి వైఖరితో చిక్కుల్లో పడతారు. అంతులేని ఐశ్వర్య లాలసతో సంపాదనే వ్యసనంగా మార్చుకొని ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తారు. బద్దకంతో నిర్ణయాలను తీసుకోవడంలో జాప్యం కారణంగా శ్రమకు తగ్గ ఫలితం పొందలేకపోతారు.
(వచ్చేవారం మిథునరాశి గురించి...)
- పన్యాల జగన్నాథ దాసు

మరిన్ని వార్తలు