బీకాంలో ఫిజిక్సు పెట్టించేస్తా..

19 Mar, 2017 01:21 IST|Sakshi
బీకాంలో ఫిజిక్సు పెట్టించేస్తా..

పార్టీ మీటింగ్‌లో బిజీగా ఉన్నాడు చంద్రబాబు. లోకేష్‌ వచ్చి గుసగుసగా చంద్రబాబు చెవిలో చెప్పాడు. ‘నాన్నగారూ.. మీరు చెప్పినట్టే అంతా రెడీ చేశాను. పక్క రూంలో ఇద్దరు ఎమ్మెల్యేలు వెయిటింగ్‌..’‘వస్తున్నా, పద..’ అన్నాడు చంద్రబాబు.చంద్రబాబు ఏం చెప్పాడు? ఎమ్మెల్యేలు ఎందుకు వెయిట్‌ చేస్తున్నారు? ఇది తెలియాలంటే ఓ రోజు వెనక్కి వెళ్లాలి.ముందురోజు సాయింత్రం.. మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి కూర్చున్నాడు లోకేష్‌ బాబు. అతడి గెడ్డం పుచ్చుకుని బతిమాలుతున్నాడు చంద్రబాబు. ‘చూడు నాన్నా.. నువ్వలా మూతి బిగించుకు కూర్చుంటే ఎలా చెప్పు.. ఫేసు మరీ దరిద్రంగా ఉంటుంది.. సమయం చూసుకుని నిన్ను మినిస్టర్‌ని చేస్తానుగా.. కాస్త ఓపిక పట్టు ..‘గంయ్‌ మన్నాడు లోకేష్‌.

 ‘ఏంటి ఇంకా ఓపిక పట్టేది .. ఏడాది నించి అడుగుతూనే ఉన్నా.. అదుగో, ఇదిగో అంటూ నానబెడుతున్నారు. అవతల పుణ్యకాలం మించిపోతోంది. అటుచూస్తే, కేటిఆర్‌ మంత్రయిపోయి, బుగ్గ కారులో ఝామ్మని తిరిగేస్తూ, కాబోయే సీఎమ్‌గా పేరు తెచ్చేసుకుంటున్నాడు. నేనిక్కడ పార్టీ మీటింగుల్లో తిరుగుతూ ఇలా అఘోరిస్తున్నాను. మీరు చూస్తే మంత్రివర్గ విస్తరణకి రెడీ అయిపోతున్నారు. నా ఊసే ఎత్తరాయే..’ వెక్కుతూ అన్నాడు లోకేష్‌.చంద్రబాబు పితృ హృదయం పగిలి ముక్కలైంది. ఏరుకుని అతికించుకుంటూ లాలనగా చెప్పాడు.

‘నీకన్నా నాకెవరు ఉన్నారు లోకేష్‌ బాబూ.. కొంచెం ఓపిక పట్టు , అంతే..! నిన్ను కేటిఆర్‌ బాబు లెవెల్‌కి తీసుకుపోతా.. అంతకన్నా ప్రత్యేక హోదా కల్పిస్తా..!’ ప్రత్యేక హోదా మాట వినగానే పుచ్చిపోయిన పల్లీ నమిలిన వాడిలా మొహం పెట్టాడు లోకేష్‌. ‘ఆ ఒక్క మాట అనకండి నాన్నా.. మీకు పుణ్యం ఉంటుంది..’ చేతులు జోడించాడు.‘చిలిపి..’ కిసుక్కున నవ్వాడు చంద్రబాబు.‘అయినా మీకు నా సత్తా ఇంకా అర్థం కావడం లేదు నాన్నగారూ.. నన్నింకా ఎన్నేళ్లు ఓపిక పట్టమంటారు చెప్పండి..’‘ సరే.. ఒక పని చేస్తా.. నువ్వొక ఇద్దరు ఎమ్మెల్యేలని పట్టుకు రా.. అచ్చంగా నీ మనుషుల్నే తీసుకు రా.. ఆ ఇద్దర్నీ మంత్రులుగా తీసేసుకుంటాను.. వాళ్లెవరైనా నాకు ఓకే.. ’ రాజీ మార్గం సూచించాడు చంద్రబాబు. ‘చావుకి పెడితే లంఖనాలకి దిగొచ్చింది’ అని మనసులో అనుకుంటూ, ‘ రేపు సాయింత్రం కల్లా రెడీ చేస్తాను నాన్నగారూ’ అన్నాడు లోకేష్‌.‘ముందు వాళ్లిద్దరితో విడివిడిగా మాట్లాడతా.. కేవలం ఫార్మాలిటి..అంతే ..’ చెప్పాడు చంద్రబాబు.తలూపి వెళ్లిపోయాడు లోకేష్‌. మీటింగ్‌లోంచి లేచి వెళ్లి తన రూంలో కూర్చున్నాడు చంద్రబాబు.లోకేష్‌ ఒక ఎమ్మెల్యేని లోపలికి పంపాడు.ఆ ఎమ్మెల్యే వస్తూనే బాబు కాళ్ల మీద పడిపోయే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు పరేంగితజ్ఞుడు.

చటుక్కున కాళ్లు వెనక్కి లాక్కున్నాడు. వచ్చిన ఎమ్మెల్యే మరింత పరేంగితజ్ఞుడు. రుద్ద కంఠంతో చెప్పాడు.‘ సార్‌.. సార్‌.. మీరు పొరబాటు పడుతున్నారు. నేను మీ కాళ్లు పట్టుకుని మిమ్మల్ని కుర్చీలోంచి లాగేస్తాననుకుంటున్నారేమో.. నా ఉద్దేశం అది కాదు సార్‌.. తనివితీరా మీ కాళ్లకు దండం పెట్టుకుందామని.. అంతే..అంతే..’చంద్రబాబు మొహం గంటు పెట్టుకుని ఆ ఎమ్మెల్యేని కూర్చోమన్నట్టు గంభీరంగా సైగ చేశాడు. ఎమ్మెల్యే కిక్కురుమనకుండా కూర్చున్నాడు. ‘సరే .. పాయింటుకి వచ్చేద్దాం.. నీకు మినిస్టర్‌ పోస్టు ఇవ్వాలని మా లోకేషు రికమెండ్‌ చేశాడు’ అన్నాడు చంద్రబాబు.

ఎమ్మెల్యే మెలికలు తిరిగిపోతూ ‘చిత్తం .. చిత్తం’ అన్నాడు. చంద్రబాబు చిరాగ్గా చూసి చెప్పాడు. ‘ముందా మెలికల్ని స్ట్రెయిట్‌ చేసి తిన్నగా కూర్చుని నేను అడిగిందానికి స్టెయ్రిట్‌ గా సమాధానం చెప్పు’.ఎమ్మెల్యే బిక్క మొహం పెట్టి ‘అలాగే సార్‌’ అన్నాడు.చంద్రబాబు గొంతు సవరించుకుని అన్నాడు.. ‘ఇప్పుడు మన కేబినెట్‌ ఎలాంటి కేబినెట్‌ అనుకున్నావు? మన మంత్రులందరూ మేలిమి ముత్యాలు.. కోహినూర్‌ వజ్రాలు అనుకో.. నిన్ను తీసుకుంటే నువ్వు వాళ్లతో సరి సమానంగానయినా ఉండాలి.. లేదా ఓ మెట్టు ఎక్కువైనా ఉండాలి.. ఇప్పుడు చెప్పు’ఎమ్మెల్యే వినయంగా చేతులు కట్టుకుని ‘మన మంత్రులకి నేను ఏమాత్రం తీసిపోను గానండి .. మీరేం అనుకోకపోతే ఒక్క మాటండి..’‘చెప్పవోయ్‌ పర్వాలేదు ..’ భరోసా ఇచ్చాడు చంద్రబాబు.

‘మన మంత్రుల్ని విమర్శించడం  కాదు గాని పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు వాళ్లెవరూ సరిగ్గా స్పందించడం లేదని నాకనిపిస్తోందండి ..’చంద్రబాబు గెడ్డం గోక్కుంటూ ‘ఏంటా కష్ట కాలం? చెప్పు’ అన్నాడు.ఎమ్మెల్యే  అటూ ఇటూ చూసి గొంతు తగ్గించి చెప్పాడు – ‘మన ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ గారు ఈమధ్య ఒక ఇంటర్వూ్యలో మాట్లాడుతూ బీకాంలో ఫిజిక్సు ఉంటుందని పొరపాటున అనేశారు సార్‌..’‘అవును.. ఆయన పాపం పొరపాటున నోరు జారితే దాని మీద యాగీ చేసి మన పార్టీ ఇమేజీని కాస్తా డ్యామేజి చేశారు’ విచారంగా అన్నాడు చంద్రబాబు.‘ఆయన పాపం ఏదో అన్నాడే అనుకోండి.. మన మంత్రులు దాన్ని ఏదో రకంగా కవర్‌ చేయొచ్చుగా’ అన్నాడు ఎమ్మెల్యే. ‘ఆయన అలా అడ్డంగా దొరికిపోయాక ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు’ అన్నాడు చంద్రబాబు.ఎమ్మెల్యే కిసుక్కున నవ్వాడు. ‘సార్‌.. నేనే గనక మీ కేబినెట్‌లో  విద్యాశాఖగా మంత్రిగా ఉండి ఉంటే పార్టీకి జరిగిన డ్యామేజిని ఇట్టే పూడ్చేసి ఉండేవాణ్ణి’ అన్నాడు.‘అదెలా?’ ఆసక్తిగా అడిగాడు చంద్రబాబు.ఎమ్మెల్యే విజృంభించాడు.

‘సింపుల్‌ సార్‌.. జలీల్‌ ఖాన్‌ గారు అన్న మాటే నిజం చేస్తా .. ఇమ్మీడియట్‌గా బీకాంలో ఫిజిక్సు పెట్టించేస్తా.. ఆమాటకొస్తే నర్సరీ నుంచి పీజీ దాకా అన్ని క్లాసుల్లో ఫిజిక్సుని సబ్జెక్టుగా పెట్టించేస్తా.. ఆఖరికి మ్యూజిక్‌ కాలేజీల్లో, వేద పాఠశాలలో కూడా ఫిజిక్సు కంపల్సరీగా చెప్పేటట్టు సిలబస్‌ తయారు చేయిస్తా.. మన తెలుగుదేశం ప్రభుత్వం ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక శాస్త్రానికి ఎంత ఇంపార్టెన్సు ఇస్తుందో ప్రపంచానికి చాటి చెబుతా.. ఆ రకంగా ఆ డ్యామేజిని రిపేరు చేసి మన ప్రిస్టేజీని నిలబెడతా ..’ ఆయాసపడుతూ గుక్క తిప్పుకోకుండా చెప్పాడు ఎమ్మెల్యే. చంద్రబాబు కళ్ళు ఆనందంతో చెమర్చాయి. కళ్ళు తుడుచుకుని అన్నాడు.‘బ్రదర్‌ .. ఇక నువ్వెళ్ళు.. బయట  ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన్ని లోపలికి పంపించు..’రెండో ఎమ్మెల్యే లోపలికి గంతులేసుకుంటూ వచ్చాడు. ‘సార్‌.. మీరేం అడుగుతారో నాకు తెలిసిపోయిందోచ్‌.. మావాడు కొశ్చెను పేపరు లీక్‌ చేశాడోచ్‌..’వెంటనే చంద్రబాబు అందుకున్నాడు.

‘మన ప్రభుత్వంలో ఇది మామూలేనోచ్‌.. నీ జవాబేదో నువ్వు ఏడువ్వోచ్‌..’రెండో ఎమ్మెల్యే కూర్చుని స్తిమితపడి అన్నాడు. ‘సార్‌.. మేలైన జాతి రత్నాల్లాంటి మేధావులతో కిటకిటలాడిపోతున్న మన మంత్రివర్గంలో నాకెందుకు చోటివ్వాలీ అన్నదే కదూ మీ ప్రశ్న? నేను చెప్పేది వింటే మీరు డంగై పోయి ఇప్పటికిప్పుడే ప్రమాణ స్వీకారం చెయ్యమంటారు.. నేను రెడీ అనుకోండి..’‘వెధవ సొద ఆపి పాయింటుకి రా మహాప్రభో..’ విసుగ్గా అన్నాడు చంద్రబాబు.రెండో ఎమ్మెల్యే గొంతు సద్దుకుని ప్రారంభించాడు – ‘సార్‌.. మన పెద్దాయన, స్పీకర్‌ కోడెల శివప్రసాదు గారు ఆడవాళ్ల మీద ఏదో ఉపన్యాసం ఇస్తే దాని మీద గొడవైంది కదా సార్‌..’‘అవునయ్యా.. పెద్దాయన మంచి ఉద్దేశంతోనే ఏదో చెబితే దాన్ని రకరకాలుగా వక్రీకరించారని విన్నాను’ అన్నాడు చంద్రబాబు.

‘పేపర్లలో కన్నా సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా  రచ్చ రచ్చ అయింది సార్‌.. అయినా మనకేం పర్వాలేదు సార్‌.. ఆ సోషల్‌ మీడియాని ఎంతమంది చూస్తారు లెండి..’‘‘కరెక్టు.. అందుకే నేను దాన్ని‘కంఠ శోషల్‌ మీడియా’ అంటాను’’ కసిగా అన్నాడు చంద్రబాబు.‘ఏదైనా మన మంత్రులు సరిగ్గా పట్టించుకోలేదు గాని .. అదే నేనే గనక మంత్రినై ఉంటే ఆ పరిస్థితిని మనకి అనుకూలంగా మార్చేసి .. మన ప్రతిష్ట రెండింతలు పెరిగేలా చేస్తాను సార్‌..’చంద్రబాబుకి ఇంట్రస్టు కలిగింది. ముందుకి వంగి ‘నువ్వు అతడి కంటె ఘనుడిలా ఉన్నావే.. ఏం చేస్తావో చెప్పు..’ అన్నాడు. బాబు ఆసక్తి చూసి రెండో ఎమ్మెల్యే రెచ్చిపోయాడు.

‘ఆడవాళ్లు వాహనాల్లాంటివాళ్ళనీ, షెడ్డు్డల్లోనే ఉంచితే యాక్సిడెంట్లు అవవని కోడెల గారు అన్నారని కదా ఆ గొడవంతా.. మీరు నన్ను మంత్రిని చేస్తే నేనూ ఆ విషయమే మరోలా చెబుతా .. మనం మన వాహనాల్ని పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్టే మహిళల్ని కూడా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం .. వాహనాలకి యాక్సిడెంట్‌ ఇన్సూరెన్సు ఉన్నట్టే మహిళలకి కూడా యాక్సిడెంట్‌ .. అంటే మాన భంగం  అనుకోండి .. అలాంటిదేదయినా జరిగితే పరిహారం చెల్లిస్తాం.. వాహనాల బీమాకి ప్రీమియం కట్టాలి గాని ఈ పథకంలో మహిళలు దమ్మిడీ ప్రీమియం కట్టక్కర్లేదు. ప్రభుత్వమే కడుతుంది. ఆడపిల్ల పుట్టినప్పటినుంచే బీమా అమలవుతుంది.

ఎటొచ్చీ, వయసు బట్టి పరిహారం రేటు మారుతూ ఉంటుంది. ఆ విధంగా కోడెల గారి మాటని మహిళలకు బంగారు బాటగా మార్చేద్దాం.. ఇంకా చాలా డిటైల్సు వర్కవుట్‌ చెయ్యాలి సార్‌.. ప్రమాణ స్వీకారం కాగానే ఆ పనిలోనే ఉంటా..’చంద్రబాబు కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు.ఎమ్మెల్యే కంటిన్యూ చేశాడు. ‘సార్‌.. ఈ పథకానికి మంచి పేరు కూడా పెట్టాను సార్‌..’చంద్రబాబు తేరుకుని ‘ఏమిటది’ అని అడిగాడు.‘భామ–బీమా పథకం’ తడుముకోకుండా చెప్పాడు ఎమ్మెల్యే ’చంద్రబాబు గుండె ఆనందంతో ఉరకలు వేసింది. తన సంతోషాన్ని మొహం మీద కనబడనివ్వకుండా దాచుకుంటూ, ‘ఇక నువ్వెళ్ళు .. మా లోకేష్‌ మాట్లాడతాడు’ అన్నాడు.

ఎమ్మెల్యేలు వెళ్లగానే లోకేష్‌ లోపలికి వచ్చాడు. లోకేషుని చూస్తూనే అన్నాడు చంద్రబాబు. ‘వీళ్లలో ఇంత టాలెంటు ఉందని నేనెప్పుడూ అనుకోలేదు.. నువ్వెలా పసిగట్టావో కాని లోకేష్‌ గుంభనగా నవ్వి ‘నాన్నగారూ .. మీకు అసలు విషయం చెప్పమంటారా?’ అన్నాడు.‘ఏమిటా అసలు విషయం?’ అనుమానంగా అడిగాడు చంద్రబాబు.‘వీళ్ళకి ఈ ఆన్సర్లు చెప్పింది నేనే’ కూల్‌ గా చెప్పాడు లోకేష్‌. షాక్‌ తిన్నట్టు చూశాడు చంద్రబాబు. లోకేష్‌ తాపీగా చెప్పాడు. ‘అవును నాన్నగారూ.. మీరేం అడుగుతారో నాకు తెలుసు .. ఆన్సర్లు రాసిచ్చి రాత్రంతా వీళ్ళకి ట్రయినింగ్‌ ఇచ్చా.. కావాలంటే ఇదిగో ఆన్సర్‌ పేపర్లు.. చూడండి..’ కాగితాలు బయటికి తీశాడు.

చంద్రబాబు ఆ ఆన్సర్‌ షీట్లని, లోకేష్‌ని మార్చి మార్చి చూశాడు. ఆ క్షణంలో చంద్రబాబు కళ్ళకి లోకేష్‌ కురుక్షేత్రంలో కర్తవ్య బోధ చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడిలా కనిపించాడు.చంద్రబాబు లోకేష్‌ భుజాలు పట్టుకు ఊపుతూ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘నాన్నా, లోకేష్‌ బాబూ.. చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా గాలించాన్రా .. నీలో ఇంత టాలెంట్‌ ఉందని గ్రహించక వేరే మంత్రుల కోసం వెతికి పెద్ద పొరపాటే చేశాను. ఇప్పటికైనా నా పొరపాటు దిద్దుకోకపోతే చరిత్రకి తీరని ద్రోహం చేసినవాడిని అవుతాను. వెంటనే నిన్నే మంత్రిగా చేసి నీ సత్తా దశదిశలా చాటుతాను’ పూడుకు పోయిన కంఠంతో చెప్పాడు చంద్రబాబు.

– మంగు రాజగోపాల్‌
mangurajagopal@gmail.com

మరిన్ని వార్తలు