వన్ఇయర్‌ ఇండస్ట్రీ ఇక్కడ

16 Dec, 2018 08:50 IST|Sakshi

ఈ ఏడాది విడుదలైన సినిమాల జయాపజయాలను బేరీజు వేసుకుంటే, తెలుగు ప్రేక్షకులు కొత్తదనానికి బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువైంది. ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘గీత గోవిందం’ చిత్రాల ఘనవిజయం కొత్తదనంపై తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అద్దంపట్టాయి. ‘భరత్‌ అనే నేను’, ‘అరవింద సమేత..’ వంటి మాస్‌ సినిమాలు ఎటూ హిట్లు కొట్టాయి. అలాగని తెలుగు ప్రేక్షకులు కొత్తదనానికి పట్టం కట్టకుండా ఉండలేదనడానికి ఈ ఏడాది బాక్సాఫీస్‌ ఫలితాలే నిరూపిస్తున్నాయి.

ఈ ఏడాది తెలుగు సినిమా పరిశ్రమకు మిశ్రమ ఫలితాలు ఇచ్చిందనే చెప్పాలి. సగటున ప్రతినెలా ఓ సినిమా విజృంభించింది. ఇప్పటి వరకు 120కి పైగా తెలుగు సినిమాలు విడుదలైతే, వాటిలో విజయవంతమైనవి దాదాపు 20 లోపే. గతంలో పోలిస్తే డబ్బింగ్‌ సినిమాల హవా తగ్గిన ట్లే. డబ్బింగ్‌ సినిమాలకు ప్రేక్షకాదరణ కొరవడటంతో ఈసారి దాదాపు 30 నుంచి 35 సినిమాలు మాత్రమే తెలుగులోకి దిగుమతి అయ్యాయి. గతంలో ఆ సంఖ్య దాదాపు రెండు రెట్లు ఎక్కువగానే ఉండేది.


భాగమతితో హిట్‌ల బోణీ

జనవరి నెల అనగానే కొత్త సంవత్సరం హడావిడి మొదలవుతుంది ఏ పరిశ్రమకైనా. సినిమా అభిమానులకైతే మరీను. సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైనా ఫరవాలేదు అన్నీ ఆడేస్తాయి అనే ధోరణిలో ఉంటారు సినీ పరిశ్రమ వర్గాలు. కానీ ఈ జనవరి కొంచెం ట్రేడ్‌ని నిరాశపరచిందనే చెప్పాలి. ఈ నెలలో మొత్తం 6 సినిమాలు విడుదలయ్యాయి. ప్రధానంగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన పవన్‌ కల్యాణ్‌ చిత్రం ‘అజ్ఞాతవాసి’, తమిళ దర్శకుడు కె.యస్‌.రవికమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘జై సింహా’ సినిమాలతో పాటు రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన ‘రంగులరాట్నం’ కూడా పండక్కి విడుదలయ్యాయి. ఈసారి జనవరి చాలా నిరాశ కలిగింది అనుకునే లోపు నెలాఖరున వచ్చిన ఆఖరు శుక్రవారం  అనుష్క నటించిన ‘భాగమతి’ విడుదలై మంచి ఫలితాన్నే రాబట్టింది. ఈ చిత్రాన్ని ‘పిల్ల జమీందారు’ ఫేమ్‌ అశోక్‌ తెరకెక్కించారు. ఇవికాక నెల మొదటి వారంలో ‘చిలుకూరి బాలాజీ’ మూడవ వారంలో ‘త్రిముఖి’ విడుదలయ్యాయి. ఇవి ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. మొత్తానికి మొదటి నెల ఓ మంచి హిట్‌తో ముగిసింది.

‘తొలిప్రేమ’కు ప్రేక్షకులు ‘ఛలో’
ఈ నెలలో మొత్తం 16 సినిమాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి నెల రెండో రోజే రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘టచ్‌ చేసి చూడు’. ఈ చిత్రానికి విక్రమ్‌ సిరికొండ దర్శకత్వం వహించారు. రెండో చిత్రం హీరో నాగశౌర్య నటించిన ‘ఛలో’. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ప్రేక్షకులు ఈ చిత్రానికి ‘ఛలో’ అన్నారు. సినిమా కొన్న బయ్యర్లు భలే అన్నారు. తర్వాత రోజే ‘హౌరా బ్రిడ్జి’ అంటూ ప్రేక్షకుల ముందు కొచ్చారు రాహుల్‌ రవీంద్రన్‌. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మరుసటి వారం మరో రెండు సినిమాలు విడుదలయ్యాయి. 

మదన్‌ దర్శకత్వంలో విడుదలైన ‘గాయత్రి’ ఓ సినిమా అయితే, మరో చిత్రం వినాయక్‌ దర్శకత్వంలో తయారైన ‘ఇంటిలిజెంట్‌’. ‘గాయత్రి’ చిత్రంలో గాయత్రి పటేల్, దాసరి శివాజీ రెండు పాత్రలను మోహన్‌బాబు పోషిస్తే, ఆయన యువకునిగా (దాసరి శివాజీ) ఉన్నప్పటి పాత్రను మంచు విష్ణు పోషించారు. ‘గాయత్రి’ మంచి ప్రయత్నంగా మాత్రమే మిగిలి పోయింది. ఇక ‘ఇంటిలిజెంట్‌’ విషయానికొస్తే సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించారు. ఆయన ఆ సినిమా చేయటం ‘ఇంటిలిజెంట్‌’ కాదని జనం తేల్చేశారు. ఆ మరుసటి రోజు మరో ప్రేమకథా చిత్రం ‘తొలిప్రేమ’తో హిట్‌ ఎంట్రీ ఇచ్చారు వరుణ్‌తేజ్‌. వెంకీ అట్లూరికి దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే తన సత్తా చాటుకున్నాడు. 

ఫిబ్రవరి మూడో వారంలో ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. తరుణ్‌ చాలాకాలం తర్వాత ఓ లవ్‌ స్టోరీలో నటించారు. నాని మొదటిసారి ప్రొడ్యూసర్‌గా పరిచయం అయిన చిత్రం ‘అ!’. ఈ చిత్రంతో ప్రశాంత్‌ వర్మను దర్శకునిగా పరిచయం చేశారు నాని.  సినిమా కమర్షియల్‌ హిట్‌ కాకపోయినా క్రిటిక్స్‌ దగ్గర శభాష్‌ అనిపించుకుంది. ఇండస్ట్రీకి కొత్త జోనర్‌ను ‘అ!’ చిత్రం ద్వారా పరిచయం చేశారు నిర్మాత, దర్శకులు. సందీప్‌ కిషన్‌ హీరోగా నటించగా, మహేశ్‌ బాబు సోదరి మంజుల మొదటిసారిగా మెగా ఫోన్‌ పట్టిన చిత్రం ‘మనసుకు నచ్చింది’ ప్రేక్షకులకు నచ్చలేదు.   


రంగస్థలం కలెక్షన్ల ‘మార్చి’oగ్‌

మార్చి నెల అనగానే అందరికీ పరీక్షలు గుర్తొస్తాయి. పిల్లలు పరీక్షల హడావిడిలో ఉంటే ప్రతి ఇల్లు బిజీగా ఉన్నట్లే. అందుకే చాలామటుకు సినిమాలను విడుదల చేయరు. అయిన అంతకుముందు రిలీజు డేట్‌లు దొరక్కుండా ఉన్న సినిమాలు ఈ నెలలో విడుదలకు నోచుకున్నాయి. మొత్తం 13 సినిమాలు విడుదలయ్యాయి. మార్చి 9న ‘ఏం మంత్రం వేశావే’, 16న ‘ఐతే 2.0’, దండుపాళ్యం–3తో పాటు మరో మూడు సినిమాలు వచ్చాయి. 17న మరో సినిమా విడుదలైంది. 

వాటి గురించి ప్రస్తావించాల్సిన పని లేదు. 23న నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన ‘యంఎల్‌ఏ’, శ్రీవిష్ణు నటించిన ‘ నీదీ నాది ఒకే కథ’ చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలు వచ్చాయి. అన్నింటిలోకి ‘నీది నాది ఒకే కథ’కు మాత్రమే ప్రేక్షకలు ఓకే అన్నారు. చివరి శుక్రవారం రిలీజైంది ‘రంగస్థలం’. రామ్‌ చరణ్‌ కెరీర్‌ మొత్తం ఒక ఎత్తు, ఈ సినిమాలోని రామ్‌చరణ్‌ నటన ఒక ఎత్తు అన్నట్టుగా ప్రేక్షకులు ఫిక్సయ్యారు.  అబ్బురపరచే కలెక్షన్‌లతో బాక్సాఫీస్‌ షేక్‌ అయిందనేంతగా కలెక్షన్‌లతో విరుచుకుపడింది. 

బాహుబలి తర్వాత టాప్‌ కలెక్షన్ల లిస్ట్‌లో మొదటిస్థానంలో ఈ సినిమా నిలిచింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు సుకుమార్‌ తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. రామలక్ష్మి పాత్రలో సమంత, రంగమ్మత్తగా అనసూయ, కుమార్‌ పాత్రలో నటించిన ఆది పినిశెట్టికి మంచి పేరు వచ్చింది. పాటలు ఇప్పటికీ టాప్‌ లిస్ట్‌లోనే ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా డీఎస్పీ మంచి ఫోక్‌ సింగర్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేశారు. ‘ఆ గట్టునుంటావా నాగన్నా.. ఈ గట్టుకొస్తావా..’ పాట ద్వారా శివనాగులును, ‘జిల్‌ జిల్‌ జిగేల్‌ రాణి..’ పాట ద్వారా రేలా కుమార్, వెంకటలక్ష్మిలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మొదటి మూడు నెలలు ముగిసే సరికి ‘రంగస్థలం’ పెద్ద హిట్‌గా మిగిలిపోయింది. 

ఏప్రిల్‌ అనే నేను...
ఏప్రిల్‌ నెలలో సినిమా పరిశ్రమకు పండగ వాతావరణం ఉంటుంది. పిల్లలు పరీక్షలు ముగించుకుని సినిమా థియేటర్ల వైపు చూస్తుంటారు. ఈ నెలలో మొత్తం పది సినిమాలు విడుదలయ్యాయి. మొదటివారం ఏప్రిల్‌ 5న త్రివిక్రమ్, పవన్‌ కళ్యాణ్‌ నిర్మాతలుగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ఛల్‌ మోహన రంగ’. నితిన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌తో ప్రారంభమైనా, పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఆ తర్వాత రోజు ‘సత్యాగ్యాంగ్‌’ రిలీజై వెళ్లిపోయింది. రెండో వారంలో రిలీజైన పెద్ద సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. అప్పటి వరకు వరుస విజయాలతో జైత్రయాత్ర చేసిన హీరో నానికి చిన్న స్పీడ్‌ బ్రేకర్‌ పడిందనే చెప్పాలి. 

తను ఎంతో కష్టపడి ద్విపాత్రాభినయం చేశారు. పూర్తిగా రాయలసీమ యాసలో మాట్లాడే పాత్ర ఒకటి, రాక్‌స్టార్‌ పాత్ర మరొకటి. ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర దెబ్బతింది. ఏప్రిల్‌ మూడో వారంలో ‘భరత్‌ అనే నేను’ అంటూ వచ్చిన సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు భారీ హిట్‌ కొట్టారు. కొరటాల శివ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించారు. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మహేశ్‌బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ నటి కియరా అద్వాణీ తెలుగు తెరకు దిగుమతి అయ్యారు. ఏప్రిల్‌ నాలుగో వారంలో ‘ఆచారి ఆమెరికా యాత్ర’తో మంచు విష్ణు వచ్చినా, పెద్దగా సందడి చేయలేదు. మార్చిలో రామ్‌ చరణ్‌ సందడి చేస్తే ఏప్రిల్‌లో ఆ బాధ్యతను మహేశ్‌ కంటిన్యూ చేశారు. 

‘మహానటి’ని ‘కీర్తి’ంచడ‘మే’
రామ్‌చరణ్, మహేశ్‌బాబుల తర్వాత నేను వస్తున్నానంటూ మే మొదటివారంలో వచ్చారు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఆయన నటించిన ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. చాలా మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం మొదటిరోజు అల్లు అర్జున్‌ కెరీర్‌ బెస్ట్‌ ఓపెనింగ్‌తో ప్రారంభమైనా, కలెక్షన్ల జోరును నిలుపుకోలేకపోయింది. ఈ చిత్రంతో తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన మాటల రచయిత వక్కంతం వంశీ తన పనితనాన్ని నిరూపించుకోలేకపోయారు. ఈ ఏడాది విడుదలైన గొప్ప చిత్రాల్లో ఒకటైన ‘మహానటి’ 9న వచ్చింది. తెలుగువారి ఆరాధ్యనటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మళ్లీ సావిత్రే నటించిందా అన్నంత గొప్పగా నటించారు చిత్ర కథానాయిక కీర్తి సురేశ్‌.

 ఈ చిత్రం ద్వారా ఎనలేని కీర్తి సంపాదించారు నిర్మాత స్వప్నాదత్, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ‘నా పేరు నిలబెట్టింది నా కూతురు’ అని మురిసిపోయారు వైజయంతీ మూవీస్‌ నిర్మాత అశ్వనీదత్‌. సినిమాపై ఎన్నో రకాల విమర్శలు వినిపించినా, అవేవీ ప్రేక్షకులను థియోటర్లకు రప్పించకుండా ఆపలేక పోయాయి. ఈ నెల అంతా ఆ సినిమా పేరు మార్మోగిపోయింది. ఈ సినిమా రిలీజైన రెండు రోజులకు అంటే మే 11న దర్శక–నిర్మాత పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని పూర్తి స్థాయి హీరోగా పరిచయం చేస్తూ తీసిన చిత్రం ‘మెహబూబా’ విడుదలైంది.

 పూరి గారబ్బాయి ఫరవాలేదనిపించినా, కథలో ఉన్న కంటెంట్‌తో జనం కన్‌ ఫ్యూజ్‌ అయ్యారు. గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా ఎన్నో రోజులు నిలవలేక పోయింది. తర్వాత వారం ఎర్రసూర్యుడు ఆర్‌.నారాయణమూర్తి రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల అమలు ఆవశ్యకతను తెలుపుతూ తీసిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’ మే 18న విడుదలై, ఫరవాలేదనిపించుకుంది. మే చివరి వారంలో మరో రెండు సినిమాలు రిలీజయ్యాయి. హీరో రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు’, నాగశౌర్య హీరోగా నటించిన ‘అమ్మమ్మగారిల్లు’. ఈ రెండూ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద నిలవలేకపోయాయి.

‘సమ్మోహనం’ తొలకరింత
జూన్‌ నెలలో మొత్తం తొమ్మిది చిత్రాలు విడుదలయ్యాయి. నెల మొదటిరోజు రెండు చిత్రాలు విడుదలయ్యాయి. నాగార్జున హీరోగా రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆఫీసర్‌’. చాలా సంవత్సరాల తర్వాత వాళ్లిద్దరి కలయికలో వచ్చిన చిత్రమిది. అనుకున్నంతగా సినిమా ఆడలేదు. నాగ్‌ ఫ్యాన్స్‌ ఆర్జీవీతో చేసిన సినిమా చూడనవసరం లేదనుకున్నారు. అదేరోజు రాజ్‌తరుణ్‌ నటించిన ‘రాజుగాడు’ విడుదలైంది. జర్నలిస్ట్‌ సంజనారెడ్డి ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆశించిన ఫలితం రాలేదు. మరుసటి వారం పెద్ద సినిమా ఏదీ రాలేదు.

 ఈ నెల 14న కళ్యాణ్‌రామ్, తమన్నా జంటగా  నటించిన చిత్రం ‘నా నువ్వే’ ఇలా వచ్చి, అలా వెళ్లిపోయింది. ఆ మర్నాడే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ‘సమ్మోహనం’ విడుదలైంది. సుధీర్‌ బాబు. అదితీరావు హైదరీ జంటగా నటించిన ఈ చిత్రం చక్కటి కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల మన్నన లు పొందింది. ఈ చిత్రంతో సుధీర్‌బాబు ఖాతాలో మరో హిట్‌ చేరింది. మే 21న కమేడియన్‌ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘జంబలకిడి పంబ’ విడుదలైంది. ఇది పెద్దగా హడావిడి చేయలేదు. చివరి వారం మరో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. ‘పెళ్ళిచూపులు’ చిత్రంతో ట్రేడ్‌లో హల్‌చల్‌ చేసిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తన రెండో ప్రయత్నంగా తీసిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. మంచి సినిమాగా క్రిటిక్స్‌ మార్కులు వేసినా, యావరేజ్‌ అనిపించుకుంది. 


మాన్‌సూన్‌ ప్రిస్క్రిప్షన్‌ ఆర్‌ఎక్స్‌–100

జూలై నెలలో మొత్తం పదకొండు చిత్రాలు రిలీజయ్యాయి. గోపీచంద్‌ హీరోగా నటించిన ‘పంతం’ 5న విడుదలైంది. ఆ మర్నాడే మరో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో సాయిధరమ్‌ తేజ్, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘తేజ్‌ ఐ లవ్యూ’. కరుణాకరన్‌ దర్శకత్వంలో కె.యస్‌ రామారావు నిర్మించారు. ఇవేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. మరుసటి వారం 12న విడుదలైన చిత్రాలు ‘ఆర్‌ఎక్స్‌–100’, ‘విజేత’. వీటి ద్వారా ఇద్దరు కొత్త హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు. అందులో ఓ హీరో మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబం నుండి వచ్చారు.

 చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌దేవ్‌ ‘విజేత’ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. కంటెంట్‌ పరంగా బావున్నా ఇంకా ఏదో కావాలనిపించింది ప్రేక్షకులకి. మరో సినిమా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ద్వారా నటుడు కార్తికేయ పరిచయమయ్యాడు. యదార్థ సంఘటన ఆధారంగా లె రకెక్కిన ఈ చిత్రాన్ని పేక్షకులు ఆదరించారు. ఈ సినిమా ద్వారా మంచి విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు అజయ్‌ భూపతికి చక్కటి అవకాశాలు వస్తున్నాయి. మూడో వారంలో విడుదలైన సినిమాలు ‘ఆట గదరా శివ’, ‘లవర్‌’, ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ చిత్రాలు వచ్చాయి.

 ‘ఆ న లుగురు’ చిత్ర దర్శకుడు చంద్రసిద్ధార్థ చాలా కాలం తర్వాత ‘ఆట గదరా శివ’ చిత్రంతో బరిలోకి దిగాడు. ‘లవర్‌’ చిత్రం ద్వారా రాజ్‌తరుణ్‌ విజయం కోసం మరో ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం రాలేదు. మంచు లక్ష్మి నటించిన ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ సినిమా ఫరవాలేదనిపించింది. జూలై చివరి వారంలో ‘సాక్ష్యం’ చిత్రంతో పలకరించాడు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. శ్రీవాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ప్రకృతి తలచుకుంటే ఎంతటి వినాశమైనా జరుగుతుంది అనే కాన్సెప్ట్‌తో పంచభూతాల సాక్షిగా శత్రు సంహారమే లక్ష్యంగా యాక్షన్‌ రివెంజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం ఇది. 

‘రా’సిపెట్టిన ‘గీత’
ఆగస్టు 3న ఐదు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రెండు చిత్రాల గురించి చెప్పుకోవాలి. అందులో ఓ చిత్రానికి ‘అందాల రాక్షసి’ ఫేమ్‌ రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం పేరు ‘చి.ల.సౌ’. సుశాంత్‌ హీరోగా నటించారు. చాలా కాలం తర్వాత హీరో సుశాంత్‌ మంచి కథను ఎన్నుకున్నాడనే చెప్పాలి. 24 గంటల వ్యవధిలో జరిగే సంఘటనలతో అల్లుకున్న చిత్రం ‘చి.ల.సౌ’. ఈ చిత్ర దర్శకునిగా మంచి మార్కులు కొట్టేసిన రాహుల్‌ రవీంద్రకు లడ్డూ లాంటి ఆఫర్‌ వచ్చింది. ఈ చిత్ర విజయంతో హీరో నాగార్జున తన తదుపరి చిత్రానికి దర్శకుడిగా రాహుల్‌ రవీంద్రన్‌కు అవకాశం ఇచ్చారు.

 అదేరోజు విడుదలైన మరో చిత్రం ‘గూఢచారి’. అడివి శేష్‌ హీరోగా నటిస్తూ తను సొంతంగా రాసుకున్న కథతో ఈ సినిమా చేశారు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడమే కాకుండా, క్రిటిక్స్‌ దగ్గర మంచి పేరు సంపాదించింది. ‘గూఢచారి’ చిత్రంతో అడివి శేషు ‘రా’ ఏజంట్‌గా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున మేనకోడలు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ హీరోయిన్‌ సుప్రియ 22 సంవత్సరాల తర్వాత ‘గూఢచారి’లో నటించటం విశేషం. 

ఈ చిత్రం ద్వారా శోభిత దూళిపాళ్ల హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఈ నెల రెండో వారం 9న విడుదలైన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. నితిన్, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వేగేశ్న సతీష్‌ దర్శకుడు. ‘దిల్‌’ రాజు నిర్మించారు. ఈ దర్శక, నిర్మాతల కాంబినేషన్‌లో గత ఏడాది విడుదలైన ‘శతమానం భవతి’ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. తమ కాంబినేషన్‌లో మరోసారి ఈ ఫీట్‌ను రిపీట్‌ చేద్దామనుకున్నా, అది సాధ్యం కాలేదనే చెప్పాలి.  మంచి నిర్మాణాత్మక విలువలతో రిలీజైన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా యావరేజ్‌గా నిలిచింది. తర్వాత వారం ఆగస్టు 15న రిలీజైంది విజయ్‌ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’. ఏ అంచనాలు లేకుండా విడుదలైనా ట్రేడ్‌లో సంచలనంగా నిలిచింది.

 గీతా ఆర్ట్స్‌ పతాకంపై పరశురాం (బుజ్జి) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి...’ పాట శ్రోతలను ఉర్రూతలూగించింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు గోపీ సుందర్‌కు మరచిపోలేని విజయాన్ని మిగిల్చింది ‘గీత గోవిందం’. ఈ చిత్రం ద్వారా ‘ఛలో’ ఫేమ్‌ రష్మికా మండన్నా తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. మరుసటి వారం 24న మరో మూడు చిత్రాలు వచ్చాయి. వాటిలో చెప్పుకోదగ్గ చిత్రం ‘నీవెవరో’. తాప్సీ లీడ్‌ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటించారు. కోన వెంకట్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘లవర్స్‌’ ఫేమ్‌ హరి దర్శకత్వం వహించారు. సినిమా మంచి ప్రయత్నంగా మిగిలింది. చివరి వారంలో మరో నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అవి: ‘సూపర్‌ స్కెచ్, ఃనర్తనశాల, పేపర్‌ బాయ్, సమీరం’ చిత్రాలు. వీటిలో నాగశౌర్య నటించిన ‘ఃనర్తనశాల’ మంచి హోప్‌తో విడుదలైనా, అంతగా ఆకట్టుకోలేకపోయింది. సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన ‘పేపర్‌ బాయ్‌’ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సంపత్‌ నంది నిర్మాణ బాధ్యతలు చేయటంతో ఆ చిత్రం మీద కొంత పాజిటివ్‌గానే ఓపెనింగ్స్‌ సాధించినా, యావరేజ్‌గా నిలిచింది. 

సక్సెస్‌ కేరాఫ్‌ రానా
సెప్టెంబర్‌ మొదటివారం 7న ఐదు చిత్రాలు వచ్చాయి. వీటిలో ‘కేరాఫ్‌ కంచెరపాలెం’తో పాటు ‘అల్లరి’ నరేశ్, సునీల్‌ నటించిన ‘సిల్లీ ఫెలోస్‌’ మంచి పబ్లిసిటీతో విడుదలయ్యాయి. మిగతా సినిమాల గురించి పెద్దగా చర్చ అక్కరలేదు. ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ సినిమా విషయానికొస్తే ఒక మనిషి జీవితంలోని నాలుగు దశలను ఎంతో అద్భుతంగా దర్శకుడు వెంకటేశ్‌ మహా ఆవిష్కరించారని చెప్పొచ్చు. ఈ సినిమా చూసిన హీరో రానా గొప్పగా అనిపించడంతో ఈ సినిమాను తన భుజాలపై మోశాడనే చెప్పాలి. ఆ చిత్రంలో నటించిన ఒక్క నటుడూ ప్రపంచానికి తెలియకపోయినా ఆ సినిమాకి అంత గొప్ప మైలేజీ వచ్చిందంటే దానికి కారణం రానానే. మిగతా చిత్రాలు పెద్దగా ఆడలేదు.

 తరువాత శుక్రవారం మరో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో భార్య భర్తలు నాగచైతన్య, సమంతలు వారిద్దరి పెళ్లయ్యాక మొదటిసారి పోటీ పడ్డారు. ఈ ఇద్దరూ విడివిడిగా నటించిన చిత్రాలు ఒకేరోజు విడుదలై పోటీ పడ్డాయి. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా విడుదలయ్యింది. సమంత నటించిన కన్నడ రీమేక్‌ మూవీ ‘యూటర్న్‌’ థ్రిల్లర్‌గా విడుదలై మంచి పేరు సంపాదించింది. కానీ రెండో వారంలో కలెక్షన్‌లు డ్రాప్‌ అయ్యాయి. నాగచైతన్య సినిమా కమర్షియల్‌గా ఫరవాలేదనిపించినా, కంటెంట్‌ పరంగా మంచి విజయాన్ని నమోదు చేయలేకపోయింది. మూడో వారంలో మరో మూడు సినిమాలు వచ్చాయి. 

వాటిల్లో ఓ చిత్రం ఎన్నో చిత్రాలకు ఫైట్‌ మాస్టర్‌గా వ్యవహరించిన విజయ్‌ మాస్టర్‌ తన కొడుకు రాహుల్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’ ప్రేక్షకులను మాయ చేయలేకపోయింది. సుధీర్‌బాబు నటించిన ‘నన్ను దోచుకుందువటే’ మంచి ఎంటర్‌టైనర్‌ అనిపించుకున్నా, బాక్సాఫీస్‌ వసూళ్లను కొల్లగొట్టలేకపోయింది. ఈ నెల చివరి వారంలో నాగార్జున, నాని నటించిన మల్టీస్టారర్‌ ‘దేవదాస్‌’ 27న విడుదలైంది. విడుదలైన అన్నిచోట్ల మంచి రిపోర్ట్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మించారు. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ చిత్రాల దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తన మూడవ ప్రయత్నంగా తీసిన చిత్రంతో ఫుల్‌ హ్యాపీ. ఈ సినిమాలో నాని సరసన నటించిన ‘రష్మికా మండన్నా’ ‘దేవదాస్‌’ చిత్ర విజయం ద్వారా హ్యాట్రిక్‌ నమోదు చేసుకుంది. 

‘విజయ’దశమి సమేత..
అక్టోబర్‌లో పది సినిమాలు విడుదలయ్యాయి. ఈ నెల మొదటివారంలో మూడు చిత్రాలు వచ్చాయి. విజయ్‌ దేవరకొండ నటించిన మొదటి ద్విభాషా చిత్రం ‘నోటా’ తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. రెండు చోట్ల వ్యాపరపరంగా మంచి బిజినెస్‌ చేసిన ఈ చిత్రం నిరాశపరచింది. ఈ చిత్రం ద్వారా నిర్మాతలు బాగానే లాభాలు సంపాదించారు. కానీ సినిమా కొన్న బయ్యర్లు నష్టపోయారు. పబ్లిసిటీ పరంగా ఈ చిత్రం మార్మోగిపోయింది. ఈ చిత్రం విడుదలైన ఆరు రోజులకు దసరా సందర్భంగా విడుదలైంది ‘అరవింద సమేత వీర రాఘవ’. యన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. 

ఈ సినిమా ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే మొదటివారం బెస్ట్‌ కలెక్షన్లను రాబట్టింది. యుద్ధం వల్ల వచ్చే నష్టాలను, యుద్ధం జరిగిన తరవాత పరిస్థితులను, యుద్ధంతో ఆరంభించి తన స్టైల్‌ ఆఫ్‌ విజన్‌ను కొత్తగా స్క్రీన్‌పై ప్రెజెంట్‌ చేశారు త్రివిక్రమ్‌. ఈ సినిమాలోని యన్టీఆర్‌ నటన పరిణతి చెందినట్లు కనపడింది. ఈ సినిమాలోని సంగీతాన్ని, నేపథ్య సంగీతాన్ని, తన అనుభవాన్నంతా జోడించి, టాలెంట్‌తో ఒడిసిపట్టి ప్రేక్షకులకు వీనుల విందైన సంగీతాన్ని అందించారు తమన్‌. నెల మూడో వారంలో ‘హలో గురూ ప్రేమ కోసమే’ అంటూ వచ్చారు హీరో రామ్‌. క్యూట్‌ లవ్‌ స్టోరీస్‌ను చక్కగా తెరకెక్కించే ‘దిల్‌’ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించగా, నానీతో ‘నేను లోకల్‌’ తీసిన దర్శకుడు నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి ఫలితాన్నే సాధించింది. రామ్, ప్రకాశ్‌రాజ్, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత సుభాష్‌ నటనను అందరూ ప్రశంసించారు. చివరి వారంలో మరో నాలుగు చిత్రాలు విడుదలైనా, అవేవీ ఏమాత్రం రాణించలేదు. 


చక్రం తిప్పిన ట్యాక్సీవాలా

నవంబర్‌ 2న మూడు చిత్రాలు వచ్చాయి. వాటిలో నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంటగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీమూవీస్‌ నిర్మించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా తమిళ హీరో మాధవన్‌ను విలన్‌గా పరిచయం చేశారు. ఒక మనిషి రెండు చేతుల్లో రెండు రకాలైన స్పందనలు ఉంటే ఆ మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందో, తన రెండు చేతుల్లో రెండు రకాలైన మనుషులు, రెండు చేతులకు రెండు రకాలైన ఆలోచనలు ఉండే మనిషి ఏ విధంగా ఉంటాడో నాగచైతన్య క్యారెక్టర్‌ ద్వారా చెప్పటానికి ప్రయత్నించారు దర్శకుడు చందూ. 

అయితే, ఈ సినిమా వర్కవుట్‌ కాలేదనే చెప్పాలి. మంచి హిట్‌ మూవీస్‌తో ముందుకెళ్తున్న మైత్రీమూవీస్‌ సంస్థకు ఈ చిత్రంతో తన మొదటి ఫ్లాప్‌ను మూటకట్టుకుంది. ఈ నెల 7న నటుడు, దర్శకుడు రవిబాబు పందిపిల్లతో చేసిన ఎక్స్‌పెరిమెంటల్‌ మూవీ ‘అదుగో’ విడుదలైందని జనాలకు తెలిసే లోపే వెళ్లిపోయింది. 8న ‘కర్త కర్మ క్రియ’ అనే చిన్న సినిమాను కోటి రూపాయల ఖర్చుతో తీసుకొచ్చారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. నాగు గవర దర్శకత్వం వహించిన ఈ సినిమాను క్రిటిక్స్‌ మంచి ప్రయత్నం అన్నారు గానీ ప్రేక్షకులు ఆదరించలేదు. తర్వాత వారం రవితేజ, ఇలియానా జంటగా నటించగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌ నిర్మాణంలో విడుదలైన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.

 తర్వాత రోజు విడుదలైంది ‘టాక్సీవాలా’. విజయ్‌ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌ నటించిన ఈ చిత్రానికి జీఏ2, యూవీ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌కెఎన్‌ నిర్మించారు. రాహుల్‌ సంకృత్యాయన్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హవాతో మొదటిరోజు వచ్చిన కలెక్షన్‌తో సినిమాకి పెట్టిన ఖర్చంతా వచ్చేసిందని చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్‌ అన్నారు. ఈ సినిమాతో 2018లో విజయ్‌ దేవరకొండవి ముచ్చటగా మూడు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ నెల 22న ‘శరభ’ చిత్రం విడుదలయ్యింది. కత్తి కథ నాదంటూ తమిళ నిర్మాతలపై  కేసు వేసి గెలిచిన నరసింహారావు ఈ చిత్రంతో మొదటిసారి దర్శకునిగా పరిచయమయ్యారు. ప్రముఖ నటి జయప్రద ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అంతగా రాణించలేదు. 
నవంబర్‌ 23న ఐదు చిత్రాలు వచ్చాయి. వాటిలో హెబ్బా పటేల్, అదిత్‌ జంటగా నటించిన బోల్డ్‌ సినిమా ‘24 కిస్సెస్‌’ ఒకటి. సినిమా బోల్డ్‌గా ఉన్నా ప్రేక్షకులు అంత బోల్డ్‌నెస్‌ని ఒప్పుకోలేదు. 

కొత్త దర్శకుల హవా
ఈ ఇయర్‌ కొత్త దర్శకులు టాలీవుడ్‌లో మోత మోగించారు. ‘ఛలో’ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ఆ చిత్రవిజయంతో ఇమ్మిడియేట్‌గా హీరో నితిన్‌ సినిమాను పట్టాలెక్కించారు. ‘తొలిప్రేమ’ ఇచ్చిన కిక్‌తో దర్శకుడు వెంకీ అట్లూరి రెండో ప్రయత్నంగా ‘మిస్టర్‌ మజ్ను’ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌ హీరోగా నటిస్తున్నారు. ‘అ!’ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తన మొదటి ప్రయత్నంతోనే శభాష్‌ అనిపించుకున్నారు. ఇప్పుడు హీరో రాజశేఖర్‌తో సినిమా రూపొందిస్తున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ కిక్‌ తో మంచి హిట్‌ కొట్టిన అజయ్‌ భూపతి మల్టీస్టారర్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ ఇచ్చిన హిట్‌తో వెంకటేశ్‌ మహా మరో సినిమా బిజీలో ఉన్నారు. ‘టాక్సీవాలా’తో హిట్‌ కొట్టిన మరో దర్శకుడు రాహుల్‌ సంకృత్యాయన్‌ హిట్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. 2018లో సీనియర్‌ దర్శకులు గడ్డుకాలాన్నే ఎదుర్కొన్నారు.

 సీనియర్‌ దర్శకుల్లో వీవీ వినాయక్‌ ‘ఇంటిలిజెంట్‌’, పూరీ జగన్నాథ్‌ ‘మెహబూబా’ కరుణాకరన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘తేజ్‌ ఐ లవ్యూ’లతో పాటు శ్రీను వైట్ల ‘అమర్‌ అక్బర్‌ అంటోని’తో నిరాశపరచారు. ‘రంగస్థలంతో’ ఫెయిర్‌ íß ట్‌ను అందుకున్నారు సుకుమార్‌. త్రివిక్రమ్‌ 50–50 మార్కులతో ఓ పెద్ద ఫ్లాప్‌ ‘అజ్ఞాతవాసి’కి, ‘అరవింద సమేత’ లాంటి  మంచి హిట్‌తో లెక్క సరిచేశారు. 2019ని హ్యాపీగా ప్రారంభించటానికి రెడీ అయ్యారు. కొరటాల శివ ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో నాలుగో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తన రెండవ సినిమా ‘మహానటి’తో సంచలనం సృష్టించారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న సినిమా ఇండస్ట్రీలోని అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘గీత గోవిందం’తో విజయ్‌ దేవరకొండకు కెరీర్‌లోనే భారీ బ్లాక్‌బస్టర్‌ను ఇవ్వడం ద్వారా దర్శకుడు పరశురాం (బుజ్జి) తన సత్తా నిరూపించుకున్నారు.


‘గీత’ తారుమారు

అనూ ఇమ్మన్యుయేల్‌ ఈ సంవత్సరం అన్నీ టాప్‌ హీరోల సినిమాల్లోనే నటించింది. పవన్‌కళ్యాణ్‌ సరసన జనవరిలో విడుదలైన ‘అజ్ఞాతవాసి’, మేలో విడుదలైన అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’చిత్రంలోను, ‘శైలజారెడ్డి అల్లుడు’లో నాగచైతన్య సరసన నటించారామె. మామూలుగా అయితే ఈ ఇయర్‌ టాప్‌ హీరోయిన్‌ ఆమె అనుకోవాలి. కానీ ఫలితాలు తారుమారవడంతో ఆమెకి అవకాశాలు తగ్గాయనే అనుకోవాలి. కంటితుడుపు ఏంటంటే 2018 బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ ‘గీత గోవిందం’ చిత్రంలో అతిథి పాత్రలో నటించారామె. 

 ‘ట్వంటీ ప్లస్‌’ డిసెంబర్‌
ఏడాది చివరి నెల అయిన ఈ డిసెంబర్‌లో దాదాపు ఇరవైకి పైగా చిత్రాలు విడుదల కానున్నాయి. డిసెంబర్‌ 7న నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నటించిన ‘కవచం’ ఒకటి.  ఇదివరకటి సినిమాల కంటే ఈ చిత్రంలో హీరో శ్రీనివాస్‌ నటనలో పరిణతి కనిపించింది. కాజల్, మెహరీన్‌ హీరోయిన్‌లుగా నటించారు. నూతన దర్శకుడు మామిళ్ల శ్రీనివాస్‌ ఈ థ్రిల్లర్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో సుమంత్‌ ప్రధాన పాత్రలో విడుదలైన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. నూతన దర్శకుడు సంతోశ్‌ జాగర్లమూడి దర్శకత్వంలో, నూతన నిర్మాత బీరం సుధాకర రెడ్డి నిర్మించారు. తమన్నా ప్రధాన పాత్రలో సందీప్‌ కిషన్, నవదీప్‌ , శరత్‌ బాబు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘నెక్ట్స్‌ ఏంటి’ బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కునాల్‌ కోహ్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

 7న విడుదలైన మరో చిత్రం ‘శుభలేఖ+లు’. ఈ చిత్రాన్ని నూతన నటీనటులు, నూతన దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ఇవికాకుండా ఈ నెలలో రెండో శుక్రవారం రామ్‌ గోపాల్‌ వర్మ సమర్పిస్తున్న ‘భైరవగీత’ విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అదేరోజు ‘హుషారు’, ‘అనగనగా ఓ ప్రేమకథ’, మరుసటి వారం వరుణ్‌ తేజ్‌ హీరోగా వస్తున్న ‘అంతరిక్షం’, శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘పడిపడిలేచె మనసు’లు విడుదలవుతున్నాయి. ఇవికాక చివరి వారంలో సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్లఫ్‌మాస్టర్‌’, నిఖిల్‌ నటించిన ‘ముద్ర’తో పాటు ఈ నెలలో డబ్బింగ్‌ వాటితో కలుపుకొని మరో పది చిత్రాల దాకా విడుదల కానున్నట్లు సమాచారం. 

డబ్బింగ్‌ చిత్రాలకు ఆదరణ అంతంతే!
2018లో మొత్తం 34 డబ్బింగ్‌ చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో 26 తమిళ చిత్రాలు, 4 మలయాళ చిత్రాలు, 2 కన్నడ, 2 హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. పేరుకి డబ్బింగ్‌ చిత్రాలే కానీ, సినిమా బాగుంటే తెలుగు వారికి భాషాబేధం ఉండదు అనే విషయం చాలాసార్లు రుజువయ్యింది. గత ఏడాది రిలీజైన ‘బిచ్చగాడు’ చిత్రమే ఉదాహరణ. గతంతో పోలిస్తే ఈ సంఖ్య బాగా తగ్గినట్లే. క్వాలిటీ చిత్రాలు ఏ భాషలో అయినా 15 నుంచి 20 శాతం మాత్రమే. ఈ సంవత్సరం తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘కాలా’ అంటూ జూన్‌ 7న, ‘2.ఓ’తో నవంబర్‌ 29న రెండుసార్లు దర్శనమిచ్చారు. ‘కాలా’ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయకపోయినా, ‘2.ఓ’ భారీ బిజినెస్‌ చేసింది. ఒక ఫ్లాప్, ఒక హిట్‌తో లెక్క సరిచేశారు రజనీకాంత్‌. ఆయన దారిలోనే హీరో విక్రమ్‌ నటించిన ‘స్కెచ్‌’ ఫిబ్రవరి 23న, ‘సామి’ సెప్టెంబర్‌ 21న విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరచాయి. తమిళ మాస్‌ హీరో విశాల్‌ ఈ ఏడాది రెండు చిత్రాలతో సందడి చేశారు.

 జూన్‌ 1న వచ్చిన ‘అభిమన్యుడు’ కలెక్షన్ల పరంగా దుమ్ము రేపింది. అలాగే తనని మాస్‌ హీరోగా తెలుగు తెరపై సెటిల్‌ చేసిన చిత్రం ‘పందెంకోడి’. 2005లో వచ్చిన ఈ చిత్ర సీక్వెల్‌ పదమూడేళ్ల తర్వాత ఈ ఏడాది ‘పందెంకోడి–2’గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ‘బిచ్చగాడు’ ఫేమ్‌ విజయ్‌ ఆంటోనీ కూడా 2018లో రెండుసార్లు తెలుగు తెరపై సందడి చేశారు. ఈసారి ఆయన చిత్రాల్లో ఒకటి ‘కాశి’, మరోటి ‘రోషగాడు’. రెండు చిత్రాలూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ హీరోలే కాకుండా కమల్‌ హాసన్,  సూర్య, కార్తీ, ప్రభుదేవా చిత్రాలు కూడా విడుదలైనా, అవేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. 

‘జయం’రవి నటించిన ‘టిక్‌ టిక్‌ టిక్‌’ చిత్రం మంచి ప్రయత్నం అన్నారు ప్రేక్షకులు. విజయ్‌ నటించిన ‘సర్కార్‌’ చిత్రం ట్రేడ్‌లో క్యూరియాసిటీని క్రియేట్‌ చేసింది. మలయాళం నుండి 4 చిత్రాలు విడుదలైతే అందులో మమ్ముట్టి ఓ చిత్రం (ది ట్రైన్‌), ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌వి రెండు చిత్రాలు ‘అతడే’, ‘జనతా హోటల్‌’ విడుదలయ్యాయి. వీటిని ప్రేక్షకులు పట్టించుకోలేదు. హిందీ చిత్ర సీమ నుంచి రెండు చిత్రాలు ‘పద్మావత్‌’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ వచ్చాయి. దీపికా పదుకొనే పద్మావతిగా మురిపిస్తే, ఆమిర్‌ ఖాన్‌ తన హిట్‌ ఫార్ములా చార్మ్‌ను నిలుపుకోలేకపోయాడు. 


లక్కీ రష్మికా

ఫిబ్రవరిలో విడుదలైన ‘ఛలో’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు కన్నడ నటి రష్మికా మండన్నా.  ఆ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్న ఆమె తన తదుపరి చిత్రం ‘గీత గోవిందం’ పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘దేవదాస్‌’ చిత్రంలో నాని సరసన నటించిన ఆమె ముచ్చటగా మూడు విజయాలను సొంతం చేసుకున్నారామె.

– శివ మల్లాల

మరిన్ని వార్తలు