స్వర్ణ సదనం

6 Oct, 2019 09:49 IST|Sakshi

కథా ప్రపంచం

బిష్ణుప్రియ మణిపురి కథ

ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. అస్సాం కొండల మధ్యలోని ఆ పచ్చని పల్లె, చిక్కని పొగ మంచు చీకటిలో గాఢంగా నిద్రపోతున్నది. ఆకాశంలో తూర్పున ఇంకా ధ్రువనక్షత్రం కాంతి వంతంగా మెరుస్తున్నది. ఎటు చూసినా నిశ్శబ్దం, ప్రశాంతత రాజ్యమేలుతున్నాయి. దక్షిణ దిశ నుంచి సాధారణంగా వేకువను వీచే మంద్రమైన గాలి జాడ ఈ రోజు ఎందుకో లేదు.
తొంభై సంవత్సరాల వడ్రంగి ధ్వజ ఒంటరిగా ఇంటి కంచె వద్ద నిల్చున్నాడు. కుడి చేత్తో ఒక కొయ్యను పట్టుకుని కొంచెం ముందుకు వంగాడు సంతృప్తి నిండిన కళ్లతో తన ఇంటి వైపు అదే పనిగా చూసుకుంటున్నాడు. వదులుగా ఉన్న కుర్తా పైన వేసుకున్న శాలువా, జంధ్యమూ ఏ మాత్రమూ చలించడం లేదు.  అతడి జుత్తు, కనుబొమలు, గెడ్డం, మీసాలు పూర్తిగా నెరిసి పోయివున్నాయి. కళ్లకు వచ్చిన కాటరాక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నది. ఆ కలప ఇంటిలో దూలాలకూ స్తంభాలకూ అతడు స్వయంగా చేత్తో కొట్టిన మేకులు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ ఇంటిలో ప్రతి అంగుళంలోనూ ధ్వజ ఆత్మ జీవిస్తున్నది.

కానీ ఈ రోజు ఆ పాత కలప ఇంటి స్థానంలో కొత్త సిమ్మెంట్‌ నిర్మాణాన్ని అతని కుమారులు ప్రతిపాదిస్తున్నారు. శంకుస్థాపన జరగవలసి ఉన్నది. అతడు వారిని నివారించనూ లేడు. పాత ఇంటిని పడగొట్టడం చూడనూ లేదు. అతనిది విచిత్రమైన స్థితి. వడ్రంగి ధ్వజ.. ఆ ఇంటిని తనూ, తన భార్యా చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు. ఒకనాడు సొంత ఇంటి కోసం అహర్నిశలూ తపించాడు. అందులోనే సుదీర్ఘకాలం జీవించాలనే కలలుకన్నాడు. కలలు సాకారమై అతడింకా జీవించే ఉన్నాడు.
కానీ ఆ ఇంటి ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. అందుకే చివరిసారిగా చూసుకొంటున్నాడు.

ఆ క్రమంలోనే ఆ ఇంటికీ అతడి జీవితానికీ అనుబంధమైన ప్రతి చిన్న సన్నివేశం సూక్ష్మ వివరాలతో గుర్తు కొస్తున్నాయి. ధ్వజ చిన్న వయసులోనే తల్లిదండ్రులనీ, ఆత్మీయులనీ, బంధుమిత్రులనీ పోగొట్టుకుని అనాథలా మిగిలాడు. ఇంటిని కట్టుకోవడానికి సంక్రమించిన చిన్న స్థలాన్నీ అమ్ముకున్నాడు. అప్పటికి అతడి వయసు పదమూడు సంవత్సరాలు. బికారిగా తిరిగాడు. క్రమేణా ఒకనాటి నూనూగు మీసాలతో ధ్వజ మంచి కండపుష్టి గల యువకుడిగా ఎదిగాడు. స్వతంత్రమైన ఆలోచనలు వచ్చాయి. ఆ దశలో చిన్న చిన్న ఇంటి పనులు చేసుకొని మనుగడ సాగించలేక పోయాడు. ఒక గురువారం శుభముహూర్తాన అతడు ధాబాల్‌ అనే అత్యంత నేర్పరి అయిన ముసలి వడ్రంగి ముందర మోకరిల్లాడు. ధాబాల్‌ ఆ ఊరి ఆస్థాన వడ్రంగి. ధ్వజ తనని శిష్యుడిగా స్వీకరించమని అర్థించాడు. ఆచార పూర్వకంగా చిన్న వేడుక ద్వారా గురువు గారికి ఒక జత దుస్తుల్ని, ఒక అరటి పళ్ల గెల.. గురు దక్షిణగా ఒక పావలా నాణేన్నీ సమర్పించుకున్నాడు.

తొమ్మిది సంవత్సరాల పాటు గురువుగారి వద్ద వడ్రంగి విద్యలోని మెలకువల్ని అభ్యసించాడు. గురువు ధాబాల్‌ కూడా అద్భుతమైన వృత్తి రహాస్యాలన్నీ శిష్యుడికి బోధించాడు. కలపతో భవనాల్నీ, మందిరాల్నీ, ఇళ్లనీ, చిన్న కుటీరాలనీ అతి సుందరంగా మలచడం నేర్చుకున్నాడు. ఇక ధ్వజను.. తనదైన జీవితాన్ని ప్రారంభించమని గురువుగారు అదేశించారు. శిష్యుడు ధ్వజని ఆశీర్వదించి కన్నీటి వీడ్కోలు పలికాడు. సొంతంగా వడ్రంగి వృత్తిని స్వీకరించాడు. బాగా శ్రమించి సంపాదించడంలో ఒక సంవత్సరం గడిచింది. ఒక అర భీగా నేలని కొనుక్కున్నాడు. ఒక పూరి పాకని నిర్మించుకుని సొంత గూటిలో నివాసం మొదలుపెట్టాడు. చేతి సంచి నిండా పరికరాలతో ఊరూరా తిరిగి నీతిగా, నిజాయితీగా కష్టపడి ఆర్జన సాగించాడు. మరో భీగా నేలని కూడా సంపాదించాడు.

ఆ దశలోనే ప్రక్క ఊర్లో గంభీర్‌ సింగ్‌ అనే సంపన్నుడికి కలప ఇంటిని నిర్మించాడు. అతని కుమార్తె సాబీ, ధ్వజకు ఇష్టమైన మణిపురి వంటకాల్ని చేసి పెట్టేది. భోజనం తర్వాత తాంబూలం అందించేంది. ధ్వజ మరింత శ్రద్ధాసక్తులతో ఆ ఇంటి పనిని చేసేవాడు. ఇద్దరి మధ్యా అనురాగం అంకురించింది. వడ్డన సమయంలో వరోలికా పౌర్ణమి వర్ణాలు అద్దుకున్న ఆమె మైనపు చెక్కిళ్లని అతడు తదేకంగా చూసేవాడు. ధ్వజ కలప చెక్కల్ని రంపంతో కోస్తూ వాటిని నునుపుచేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో చెమట పట్టిన అతడి వీపు భాగంలో బలమైన కండరాలు నాట్యం చేస్తుండేవి. తాంబూలం అందివ్వడానికి వచ్చిన సాబీ అతడ్ని వెనుక నుంచి అచ్చెరువుతో సంతృప్తిగా చూస్తుండేది. ఆమె వెచ్చని నిశ్వాసాన్ని గుర్తించి అతడు వెనుకకు తిరిగేవాడు. ప్రేమ నిండిన చిరునవ్వుతో వణుకుతున్న ఆమె చేతుల్లోంచి తాంబూలాన్ని అందుకొని నమిలేవాడు. ఇద్దరి మధ్యా నిశ్శబ్ద ప్రణయం వికసించసాగింది.
ఒక రోజున ధ్వజ ఇంటి పైకప్పుగా ఒక దూలాన్ని అడ్డంగా స్థాపించబోతున్నాడు. తన ఎడమ చేతికి ఒక నార ముక్కని చుట్టుకున్నాడు. రెండు నిటారు స్తంభాలపైన తన కాళ్లని తులనాత్మకంగా ఆనించాడు. పళ్లతో నారముక్కని తీశాడు. అలా తీయ్యడంలో ధ్వజకు అమోఘమైన నేర్పరితనం ఉంది. ఇదంతా గంభీర్‌ సింగ్‌ గమనించాడు. ఎంతగానో సంతృప్తి చెందాడు. ఈ యువకుడు నా కుమార్తె సాబీకి తగిన భర్త కాగలడు‘ అని యోచించాడు.

ఆ వెంటనే పెళ్లి ప్రతిపాదన కూడా జరిగిపోయింది. ధ్వజ, సాబీల పెళ్లిబాజా మోగింది. కానీ ధ్వజ దృష్టిలో ఒక అందమైన భార్యా, శి«థిలావస్థకు చేరిన తన పూరి గుడిసె ఒక దానికొకటి జత కుదిరినట్లు అనిపించలేదు. ఏదో వెలితి చోటు చేసుకున్నది. దాంతో ఒక చక్కని ఇల్లు కట్టుకోవడానికి ప్రతిరూపాయినీ పొదుపు చెయ్యసాగాడు. ప్రతి రోజూ తన సంపాదనని సాబీ చేతికి అందజేస్తుండేవాడు. ఆ డబ్బులో కొంత భాగంతో ఇల్లు గడిపేది. మిగిలింది ఒక చోట చేర్చేది. తను కూడా దుస్తులు కుడుతూ మరికొంత సంపాదించేంది. లెక్కసరిగా ఖర్చుపెడుతూ సంతోషంగా జీవించేవారు. మిగిలించి కూడబెట్టిన డబ్బుని ఇంటిలో ఒక మూలగా నేలలో రహస్యంగా ఉంచిన మట్టి కుండలో దాచేది. కొంతకాలం తర్వాత ధ్వజ కొత్త కలప ఇంటిని నిర్మించుకున్నాడు. పైకప్పు వాటి దూలాలతో చేశాడు. కట్టెల్నీ గడ్డినీ పైకి చేర్చడానికి సాబీ సహాయపడేది. అలా ఇద్దరూ కలిసి ఆ ఇంటి పనిని పూర్తి చేశారు. దానిపైకి తమల పాకు తీగల్ని కూడా పాకించారు.

గృహప్రవేశ ఉత్సవం పూర్తి అయ్యింది. అతిథులకు భోజనాలు పెట్టారు. గురువుగా ధాబాల్‌ మనస్పూర్తిగా ఆశీర్వదించాడు. ‘‘శిష్యా!ధ్వజా! నాకు చాలా సంతోషంగా ఉందయ్యా.. ఇంటి నిర్మాణం కొత్తగానూ, ప్రత్యేకంగానూ ఉంది. ఎంతో నేర్పుతోనూ, కళాత్మకంగానూ కట్టావు. ఈ ఇంటిలో నువ్వు పిల్లా పాపలతో కలకాలం ఆనందంగా వర్ధిల్లాలని దీవిస్తున్నాను.’’
ఆ ఇంటి రూపకల్పన చూడటానికి ఇరుగు పొరుగు వాళ్లే కాదు.. పక్క ఊర్ల నుండి కూడా జనం వచ్చేవారు. అతిథులందరినీ సత్కరించడానికి ప్రతిరోజూ రెండు మూడు కట్టల తమలపాకులు అదనంగా కొనవలసి వచ్చేది. చూపరులు ధ్వజ నైపుణ్యాన్నీ, ఊహాపటిమనీ ఎంతో మెచ్చుకునేవారు. ‘‘చాలా బావుంది ధ్వజా! కిటికీలు, ద్వారాలూ పెద్దవిగా పెట్టావు. నిజంగా ఇది సామాన్యుడు నిర్మించుకున్న రాజ భవనంలా ఉంది’’ అనేవారు.

ఆ ఊరి విదూషకుడు దేవతా పూజలలోనూ, శుభకార్యాలలోనూ నాట్యం చేస్తూ పాడుతూ ఉంటాడు. ఆ పాటల్లో భాగంగా ఇలా చేరుస్తూ ఉంటాడు. నేను బృందావనం నుండి తిరిగి వస్తూ ఆగ్రాలో తాజ్‌మహల్‌ చూశాను. బరామునీలో ధ్వజగారి ‘శానామహల్‌’(బంగారు భవంతి) చూశాను’’ ఇలా సాగుతుంది పాట.
ఆ తర్వాత ఆ ఇంటితో మొదటి పసి ఏడుపు వినపడింది. ధ్వజ మహదానందంతో గంతులు వేస్తూ వరండాలోనికి వచ్చాడు. ప్రధాన ద్వారం దాటబోతూ ఉండగా మంత్రసాని అరుపు వినపడింది. ‘‘మగ పిల్లావాడు.. మగ పిల్లాడు పుట్టాడు‘‘ అని.

ఆ క్రమంలో ముగ్గురూ అబ్బాయిలే పుట్టారు. దంపతులు ఎంతో సంతోషించారు. వార్ని పెంచి పెద్దవాళ్లను చేశారు. విద్యాబుద్ధులు చెప్పించారు. పెద్దవాడు సుకుమార్‌ ఇంటి దేవతకు నమస్కారం చేసి సైన్యంలో చేరిపోయాడు. రెండో వాడు పరిమల్‌ కూడా అన్నబాటలోనే నడిచాడు. అందరికన్నా చిన్నవాడు బిమల్‌ కాలేజీకి వెళ్లడానికి సిద్ధపడుతున్నాడు. తర్వాత మార్పులు త్వరత్వరగా జరిగిపోయాయి.

పెద్దకోడల్ని ‘నిరంతరే..’ శ్లోకంతో దీవిస్తూ పురోహితుడు ఆహ్వానించాడు. ధ్వజ, సాబీ నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు ‘దీర్ఘసుమంగళీభవ..’ అని.
ధ్వజ గత జ్ఞాపకాల స్రవంతి కాకుల కరకు అరుపులతో ఆగింది. సూర్యోదయమైంది. అతడి గుండె మరింత తీవ్రంగా కొట్టుకుంది. ఇప్పుడతనికి అత్యంత ప్రీతిపాత్రురాలైన అర్ధాంగి సాబీ లేదు. కొద్ది సంవత్సరాల క్రితమే చనిపోయింది. ఆనాడే అతడు ఒంటరి వాడైపోయాడు. అలనాటి తీయని కలలు రేపటి గురించి ఆశావహమైన ఊహలూ ఇప్పుడు లేవు. వయసుతో పాటూ అన్నీ ఆవిరైపోయాయి. ఒకనాడు స్వప్నాలే పునాదులుగా భార్య సహకారంతో నిర్మించుకున్న ఇల్లు కూడా మరికొద్ది క్షణాల్లో...

ధ్వజ ఉప్పొంగుతున్న ఉద్వేగంతో శాలువా అంచుతో కళ్లుతుడుచుకున్నాడు. చేతులెత్తి స్వర్గంలో ఉన్న తన విద్యాదాత ధాబాల్‌ని ధ్యానించుకున్నాడు. ఎన్నో దశాబ్దాల తన సహచరి సాబీనీ స్మరించుకుని నెమ్మదిగా అక్కడి నుంచి ముందుకు నడిచాడు. ఈ మధ్యనే ఋతుపవనాలు ప్రవేశించాయి. వాటిని ధ్వజ తన ఇంటి గుమ్మంలోనికి స్వాగతించాడు.. కాని ఇంతలోనే... యువకుడైన తాపీ మేస్త్రీ వచ్చి.. ధ్వజకు నమస్కరించాడు. ధ్వజ అతడ్ని దీవించి.. ‘‘రా! నాయనా! ఇలా కూర్చో’’ అంటూ అతడి ముందరకు ఒక కర్ర బల్లని నెట్టాడు. తర్వాత తను నెమ్మదిగా ఇంటి వెనుకనున్న పశువుల శాలవైపు నడిచాడు.

తాత్కాలిక నివాసంగా పశువుల శాలనే ఎంపిక చేశారు. అంతకు ముందురోజే ఇంటిలోని సరంజామాను తరలించారు. ధ్వజ కోడలు అతనికి కావలసిన ఉదయపు పొగాకుని అందిచ్చి తన పనుల్లో మునిగిపోయింది. ఒక నూతన గృహనిర్మాణాన్ని ప్రారంభించడం ఆ ఊర్లో ఒక పండగతో సమానం. గ్రామస్తులంతా పోగయ్యారు. ఇద్దరు ముల్తైదువలు అరటి ఆకులూ, తమలపాకులూ, పోక చెక్కలూ మొదలైన శంకుస్థాపన పూజా సామాగ్రిని ఏర్పాటు చేశారు. వరండాలో సుకుమార్, పరిమల్, బిమల్‌ పని వారితోనూ, ఇతర గ్రామస్తులతోనూ చర్చిస్తున్నారు. సుకుమార్‌ సూచనలు ఇస్తున్నాడు. పరిమల్‌ అందర్నీ పోగు చేస్తున్నాడు. బిమల్‌ చిన్నవాడు, దిక్కులు చూస్తున్నాడు. ధ్వజ ఆ ఇంటిలోనే ఒక మూలన ఒంటరిగా దిగులుగా కూర్చున్నాడు. నూతన భవనానికి సంబంధించి పనివారూ, కుమారులూ కలిసి వేసుకొంటున్న పథకాల్నీ రూపకల్పనల్నీ నిశబ్దంగా వినసాగాడు. అతడి చేతిలో పొగాకు గొట్టం నుంచి బూడిద నేల రాలుతోంది.

‘ఇంటి వైశాల్యం రెండు వందల చదరపు గజాలుండాలి. ముందు రెండు గదులూ చెరో వైపున ఉండాలి. వరండా పెద్దదిగా విశాలంగా ఉండాలి’ అని మిలటరీ సుకుమార్‌ తన హిందీ యాసలో చెప్పుకొనిపోతున్నాడు. పాత చెక్క నిర్మాణాన్ని పూర్తిగా తీసివేస్తాం. అయితే ఆ కలపని అమ్మినా కొనేవారెవరూ ఇప్పుడు లేరు. నాలుగు వైపులా ఆరంగుళాల గోడని కట్టాలి. మొత్తం పని కేవలం రెండు నెలల్లో పూర్తి కావాలి. నేను రెండు నెలల సెలవు మీదనే వచ్చాను. 
మరి కిటికీల మాటేమిటి? అవి ఇప్పుడున్న పరిమాణంలోనే ఉండాలా?’
‘వద్దు వద్దు.. ఇవి పాత కాలం నాటివి. ఇప్పుడు నాలుగు భాగాల గాజు కిటికీలని నేల నుంచి రెండున్నర అడుగుల ఎత్తులో ఉంచుదాం’ అన్నాడు సుకుమార్‌.
‘అంత కిందుగానా?’ గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. 
‘ఇదే ఇప్పటి ఫ్యాషన్‌. నేను జబల్‌పూర్‌లో చూస్తున్నవి ఇంకా కిందికి ఉంటాయి‘ అన్నాడు సుకుమార్‌.
‘మరి వంట గది మాటేమిటి?’
’అది విడిగా ఉంటుంది. ఇంటి వెనుక వరండా తర్వాత ఒక పొయ్యి దానిపైన పొగ గొట్టం ఉంటాయి. ఏ విధంగానూ పొగ ఇంటిలోనికి రాకూడదు’ అన్నాడు సుకుమార్‌.
‘గతంలో ఉన్న సాంప్రదాయకమైన పొయ్యి మాటేమిటి? కొత్త ప్లాన్‌లో దానికి మరి అవకాశమే లేదు..?’
‘ఖచ్చితంగా ఉండదు. ఉండకూడదు’

ఇంత సేపూ ధ్వజ నిశబ్దంగా వింటూ ఉన్నాడు. అతడు మాట్లాడలేదు. అతడి సూచనల్ని ఎవరూ అడగనూ లేదు. కానీ ఇప్పుడు అప్రయత్నంగా కలుగజేసుకున్నాడు.
‘పాత పొయ్యిని ప్రధానంగా విడిచి పెట్టేస్తే మంచిది. ఈ ఇంటికి అది స్మృతి లేఖనం వంటిది’ అన్నాడు.
తండ్రి ప్రతిపాదనని సుకుమార్‌ తిరస్కరించాడు. ‘నీకు తెలియదు నాన్నా.. రోజంతా మండే పొయ్యి ఇంటిని పొగతో నింపుతుంది. గోడలు కూడా పాడవుతాయి’ అంటూ ఇలా వివరించ సాగాడు. ‘ఒక నాడు అగ్గిపెట్టెలు లేని కాలంలో నిరంతరం వెలిగే పొయ్యి అవసరమయ్యేది. ఇప్పుడా అవసరం లేదు. కావాలంటే స్టవ్‌ కొనుక్కుందాం’ అన్నాడు.
‘పెద్దవారనీ అనుభవజ్ఞులనీ మెచ్చుకుంటారే గానీ ఎవరూ వారి సూచనలని గ్రహించరు’ అనుకున్నాడు ధ్వజ. ఆ తర్వాత మౌనం వహించాడు. ఇది ఇప్పుడు పిల్లల ఇల్లు. వారి ఇష్టప్రకారమే కట్టాలి మనసులో తీర్మానించుకున్నాడు. ‘అబ్బాయీ! జీవిత చరమాంకంలో పొయ్యి ప్రాముఖ్యత తెలుస్తుంది. మాఘమాసపు వణికించే చలి వచ్చేస్తున్నది. నేను పొయ్యి వద్ద కూర్చుని చలి కాచుకోవడం ఎలా మరి?’ తనలో తనే గొణుకున్నాడు. పల్లె పూజారి నుదుటి మీద ముక్కు మీద చందనం పూసుకుని కొంచెం ఆలస్యంగా హడావిడిగా వచ్చాడు.

సుకుమార్‌! ఏం చేస్తున్నారయ్యా ఇంకా! ముందుగా పాత ఇంటిని పడగొట్టాలి. ఆ తర్వాత మాత్రమే మనం కొత్త ఇంటికి శంకుస్థాపన చెయ్యాలి. ముహూర్తం మించిపోతుంది’ అన్నాడు.
‘పాత ఇంట్లో ఏం లేదు. బాగా పాడుపడిన నిర్మాణం. అది కూడా కేవలం కలప మాత్రమే. దాన్ని కూలదొయ్యడానికి ఎక్కువ సమయం పట్టనే పట్టదు’ అన్నాడు తంఫా. ఇతడు పక్క ఊరి నివాసి. చోద్యం చూడ్డానికే వచ్చాడు. ఈ మాటలు ధ్వజ చెవిలో పడ్డాయి. అతడి మనసు ఆక్రోశించింది. ‘అయ్యో ఇది మా భార్యభర్తల శ్రమ. ఎన్నో జన్మల కల..’ 
‘భూమిపూజ మొదలు పెడదాం రండి.. ఆకులూ చెక్కలూ ఎక్కడ?’ పూజారి అసహనంతో తొందర చేశాడు.

పల్లెజనం నడుం కట్టారు. సుకుమార్, పరిమల్‌ ఇతర గ్రామస్థులతో కలిసి గొడ్డళ్లూ, పలుగులూ పట్టుకుని ఇంటిపైకి ఎక్కారు. కొందరు గునపాలతో భూమి నుంచి పెకలించడం మొదలుపెట్టారు. తాపీ మేస్త్రీ అతని అనుయాయులూ మరోవైపున ఇసుకా సిమ్మెంటూ కలుపుతున్నారు.
ఇదంతా చూస్తున్న ధ్వజ గుండెల్లో తీవ్రమైన పోటు మొదలైంది. ‘నేను ఈ ఇంటిని నా స్వహస్తాలతో చెమటోడ్చి నిర్మించాను. మీ అమ్మ కూడా తనవంతు సహాయం చేసింది’ ధ్వజలో ఉప్పొంగిన భావోద్వేగాలు మెదడులో ఒక సంక్షోభానికి తెరలేపాయి. అతడు వడ్రంగి వృత్తిలో మంచి ఉచ్ఛస్థితిలో ఉండగా గొప్పనైపుణ్యంతో ఈ పల్లెలో ఎన్నో ఇళ్లు కట్టాడు. నిజానికి అవి తరతరాలు నిలబడగలవు. కానీ రోజులు మారిపోయాయి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పడగొట్టబడుతున్నాయి. వాటి స్థానంలో నూతన సిమ్మెంటు, కట్టడాలు వెలుస్తున్నాయి. అతడి జీవితకాలంలోనే అతడి సమక్షంలోనే ఈ పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ దృశ్యాలన్నీ చూడటానికే తనింకా బతికి ఉన్నాడా?’ ఈ ప్రశ్న అతడ్ని వేధిస్తున్నది.

చివరికి గురువు ధాబాల్‌ ప్రసాదించిన నైపుణ్యరహస్యాల రూపకల్పనతో నిర్మించిన తన ‘సునా మహాల్‌’ ఒక్కటే మిగిలింది. దాన్ని కూడా తన రక్తం పంచుకొచి పుట్టిన బిడ్డలే కూలదోసేస్తున్నారు. ఆ ఇల్లే అతడి సర్వస్వం. అంతరాత్మ ఆవాసం.. అనుభూతుల కాణాచి. అదిపోతే అతనికి తనదిగా మిగిలిందేముంది? గతమంతా సమాధి అయినట్టేనా?
పై కప్పు గడ్డిని తొలగిస్తున్నారు. ధ్వజ మనసు వికలమైంది. ‘ఒరే అబ్బాయిలూ! ఈపై కప్పు ఏర్పాటు చేసేటప్పుడు మీ తల్లి ఆ గడ్డిని పైకి విసిరి నాకు అందించేది. సుకుమార్‌! నువ్వు ఈ గడ్డి పైకప్పు కిందనే పుట్టావు. పరిమల్‌! నువ్వు ఈ చెక్క గోడ పక్కనే పసితనంలో ఆడుకునేవాడివి. బిమల్‌! నువ్వు ఈ నేల మీదనే నడవటం నేర్చుకున్నావు. ఈ ఇంటిలోనే మీ తల్లి తుదిశ్వాస విడిచింది. అటు వంటి ఇంటిని మధురస్మృతుల మందిరాన్నీ కూల్చడానికి మీ మనసు ఎలా అంగీకరిస్తుంది? అపరాధభావం కలగడం లేదా? ఇంత తొందరగా అన్నీ మరిచిపోయారా?’

కొడుతూ ఉన్న సుత్తులూ, గొడ్డళ్లు, గునపాల శబ్దం ధ్వజ మీద ప్రభావం చూపుతున్నాయి. ఆ ధ్వనులు అతడి చెవుల కన్నా హృదయానికే తగులుతున్నాయి. అతడు ఇంటిని పడగొట్టటాన్నే చూస్తున్నాడు. అంతరంగం నుండి పెల్లుబుకుతున్న వేడి కన్నీళ్లని చూసి అరిచింది. ‘నాన్నా! తాతయ్య ఏడుస్తున్నాడు’
’లేదమ్మా! నేనెందుకు ఏడ్వాలి?’ అంటూ ధ్వజ కళ్లు తుడుచుకున్నాడు. చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించాడు. మనుమరాలికీ, అక్కడ పోగయివున్న ఇతర్లకీ కళ్లు కప్పబోయాడు. ఒక సిమ్మెంటు కట్టడంలో తను నివసించబోయే అవకాశం వస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు నటించసాగాడు. తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో ఒకదానికొకటి సంబంధం లేని ప్రేలాపన సాగించాడు.

‘ఒరేయ్‌ తంఫా! జాగ్రత్త! దూలం పడిపోవచ్చు. దూరంగా ఉండు. ఓయ్‌ పంతులూ! ప్రధాన స్తంభానికి స్థలం తరువాత ఎంపిక చేసుకోవచ్చు. పై కప్పు వదులైపోయింది. దుంగలు ఎవరి మీదైనా పడగలవు చూసుకోండి. ఆ.. ఆ కర్రస్తంభం వాలిపోతున్నది. పట్టుకోండి’ ఇలా అరవసాగాడు.
ఇల్లు కట్టడానికి నెలలు పట్టింది. కానీ కూల్చడానికి గంటలు కూడా పట్టలేదు. ఇంతే జీవితం. నిర్మాణం కష్టం. నాశనం సులభం. 
ఇంటి ముందరి కట్టెగోడ పెద్ద శబ్దంతో కూలిపోయింది. చివరికి నాలుగువైపుల గోడలూ పడిపోయాయి. కలప నిర్మాణానికి ప్రారంభంలో వేసిన అస్థిపంజరం మాత్రం మిగిలి ఉంది. ఇప్పటికీ అది అద్భుతమైన కళ్లు చెదిరిపోయే నైపుణ్యానికి అనవాలుగా ఉంది. ముందరి ద్వారానికి ఇరువైపులా తిరిగిన నిలువెత్తు స్తంభాలు ఆ అస్థిపంజరానికి కాళ్లలాగా వికారంగా కనపడుతున్నాయి. ఆ జుగుప్సాకరమైన దృశ్యం ధ్వజ కళ్లకు మూలు కోల వలె తగిలింది. మనసు చెదిరింది. భార్య సాబీæ మధుర జ్ఞాపకాల నిలయం.. అనుబంధాల ఆలయం నేలమట్టమౌతుంది..! 

కుడి చేత్తో ఒక దూలాన్ని పట్టుకుని ఎడమ చేతిని పైకెత్తి ఉచ్ఛస్వరంలో ‘ఓరి భగవంతుడా?’ అని అరిచాడు. కానీ అతడి చివరి కేక ఫెళపెళా విరిగి పడుతున్న కలప శబ్దాలలో ఎవరికీ వినపడలేదు. కూలిపోతున్న ఇంటితో పాటే ధ్వజ కూడా కుప్పకూలిపోయాడు.
బహుశా ఈ సరికే ఊర్ధ్వ లోకాల్లో ఉన్న గురువు ధాబాల్, భార్య సాబీ, అత్యంత ఆత్మీయులూ బంధువులూ అతడి పంచప్రాణాల్ని వారి చేరువకు తీసుకొనిపోయారు. 
మంగళతోరణాలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించిన నూతన పునాది ఇనుప చువ్వలపైన ధ్వజ నేత్రాలు స్థిరంగా నిర్జీవంగా నిలిచిపోయాయి.
-మూలం : స్మృతికుమార్‌ సిన్హా
-అనువాదం: టి. షణ్ముఖ రావు

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా