ఖాళీ మనిషి

6 Oct, 2019 10:21 IST|Sakshi

కొత్త కథలోళ్లు

గుడిసె ముందు దిగాలుగా నిలబడ్డాడు సాంబయ్య. ఎందుకోగానీ...తాను లేని ఆ గుడిసె చీకటిగుహలా నోరు తెరుచుకొని అతడ్ని భయపెట్టసాగింది. నులకమంచం వేసుకొని తలపాగలో చెక్కిన సగం కాలిన బీడిముక్కను వెలిగించి ఆఖరిదమ్ము లాగి వదిలాడు, సాయమ్మ తాలూకు దట్టమైన జ్ఞాపకాల పొగ అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. తానెన్నో పనులు చేసి ఇల్లు చక్కబెట్టేది. మిరపచేన్లకు, పత్తిచేన్లకు కైకిలిపోయేది, వంచిన నడుం ఎత్తకుండా వరినాట్లు వేసేది. కలుపు తీసేది. కట్టెలు కొట్టేది. మామిడితోటంతా శుభ్రం చేసి పాదులు తవ్వి నీళ్లు మళ్లించేది.

కోడిపెట్టెలను సాకేది. మొన్న చేన్లకి వెళ్లినప్పుడు తెచ్చిన మిరప్పండ్లతో కారం నూరి కమ్మటి పచ్చడి చేసింది. లేతమామిడి సక్కును ఉప్పు వేసి ఊరవేసింది. తానుంటే...దండెంపై ఉతికి ఆరేసిన బట్టలు, నీళ్లు నింపిన తొట్టెలు, నవనవలాడే మొక్కలు, కళ్లాపి జల్లిన వాకిలిలో తీర్చిదిద్దిన ముగ్గులతో గుడిసె పచ్చటి కళతో వెలిగిపోయేది. తానిక ఏంకావాలన్నా అన్నీ క్షణాల్లో అమర్చిపెట్టేది. మొన్న ఎప్పుడో ఉలిశెలపులుసు తినాలని ఉందన్న గొంతెమ్మ కోర్కె కోరినప్పుడు, చీరకొంగులో మడతపెట్టుకున్న డబ్బులతో ఉలిశెలు కొనలేకున్నా ఎండినరొయ్యలు, ఎర్రటి గడ్డలతో కమ్మటి పులుసు చేసి తన నోటికి విందు చేసింది. బహుశా ఆ డబ్బు తనకు తెలియదునుకొని ఏ కోమటోల్ల దుకాణంలోనో పప్పుల, ఉప్పుల బాకీకై దాచి ఉంచింది కావచ్చు. అయినా తననేనాడు పల్లెత్తు మాటనేది కాదు. 

పెండ్లీడు  వచ్చిన బిడ్డకు పెళ్ళి చేసేదాకా ఇల్లు పట్టుకొని ఉందా? పెళ్ళి కాగానే తన బాధ్యత తిరిపోయిందని వెళ్లిపోయిందా?
ఎక్కడికి వెళ్లినా...సాయంత్రం అయ్యేసరికి తనింట్లో సంధ్యాదీపమై వెలిగిపోయేది. ఏనాడైనా తను తిన్నదా? లేదా? అని పట్టించుకునేవాడు కాదు. తనకు మాత్రం ఏది ఉంటే అది ఊడ్చి పెట్టి కడుపు నింపేది. ఏ రోగమో, నొప్పో వచ్చినా కషాయాలు, పసరుమందులతో తగ్గించుకునేది. కరెంటుబిల్లు కట్టమని తాను ఇచ్చిన డబ్బులని బిల్లు కట్టకుండా ఎగ్గొట్టి, సారా పొట్లంతో ఇంటికి వచ్చినప్పుడు... ఏవేవో లోపల ఇంకిన అసంతృప్తులతో చూసిన చూపును అర్థం చేసుకోలేక పోయాడు. బహుశా సాయమ్మ తనను చూడటం అదే చివరిదా? అలజడికి లోనైన ఆలోచనలతో సరిగా గుర్తుతెచ్చుకోలేక పోయాడు. తడిక తలుపును తొలగించుకొని లోనకు అడుగుపెట్టగానే...తన గుడిసె తనకి కొత్తగా, వింతగా అనిపించిందతనికి. తడుముకోకుండా వెళ్లి ఎక్కా దీపాన్ని వెలిగించాడు. పొగచూరిన దీపం గుడ్డివెలుగులో అప్పటిదాకా సందడి చేసిన ఎలుకలేవో కలుగులోకి దూరాయి. తన బట్టలతో వేలాడుతున్న దండెం తననే వెక్కిరిస్తున్నట్టుగా...ఖాళీ సామాన్లతో నిండిన గుడిసెలో ఖాళీ మనిషిగా సాంబయ్య.
వెల్లకిలా పడుకొని కంతలో నుండి కనిపిస్తున్న నక్షత్రాల వంక చూస్తూ ఉండిపోయాడు.
దీపం...చమురున్నంత సేపే వెలుగుతూ... ఓ రాత్రి కాగానే ఆరిపోయింది.
∙∙ 
తెల్లారగట్ల...గుడిసె పైకి ఎక్కి సందడి చేస్తున్న కోళ్ల చప్పుడికి మెలకువ వచ్చింది సాంబయ్యకి. తడిక తొలగించుకొని బయటకు వచ్చాడు.
రాత్రి గుల్ల కింద కమ్మడం మర్చిపోయిన కోడిపెట్టెలు ఎక్కడికి వెళ్లాయో ఏమోగానీ...సాయమ్మ టైముకు చల్లే నూకలకి అలవాటు పడి, అవి దొరకకపోగా పెరడంతా కెలుకుతూ మట్టి తవ్విపోయసాగాయి.
తెల్లారగానే తనకి వేపపుల్ల అందించి ఉడుకునీళ్ల కొప్పెర వేసేది.
పుల్ల విరుచుకొని పెరట్లో  ఉన్న పొయ్యి వంక చూశాడు.
పిల్లి...మెత్తని బూడిదలో హాయిగా ముడుచుకుంది. చాయ కొరకు నాలుక పీకసాగింది. పాత తువ్వాల దులుపుకొని ముఖం తుడుచుకొని టీకి డబ్బులున్నాయో లేదో చూసుకొని బయలుదేరాడు.

దూరంగా... బుడ్డోడి టీకొట్టు! ఉడుకు చాయ గాజుగ్లాసుల్లో అటూ ఇటూ పోస్తూ కనపడ్డాడు. సాయమ్మ మీద అలిగి తానెన్నోసార్లు డాబుసరిగా వీడి దగ్గర చాయ బాకీ పెట్టి తాగాడు...అవన్నీ ఇప్పుడు గుర్తుకు వచ్చాయి.
వెళ్తే  ఏమంటాడో? సాయమ్మ ఇంటి నుండి వెళ్లిపోయిన సంగతి వీళ్లకి తెల్సిపోయిందా?
ఎంత నమోషి తనకి. వెళ్లిన తనకేం కాదు కానీ...ఊర్లో నలుగురి మధ్య తిరగాల్సిన తనను చూసి జనం నవ్వుకోరూ?
సాయమ్మ ఉంటే తనకు ఎంత ధైర్యం...ఎంత ధీమా!
తనకేం మొగోడ్ని అని తలెత్తుకొని పంచె వేసుకొని, పొన్నుకర్రతో దర్పంగా ఊర్లోకెళ్లి బలాదూర్‌గా అడ్డమైన పెత్తనాలన్నీ చేసుకొని తిరిగితిరిగి వచ్చేవాడు. తానే టైమ్‌కి ఇంటికెళ్లినా తినడానికి ఏదైనా వండి ఉండేది.
ఇప్పుడు ఎవర్నైనా పలకరిద్దామన్నా ధైర్యం చాలటం లేదు. వాళ్లు పెదవి విప్పి ఒక్కమాట అనకపోయినా చూపులతో శల్యపరీక్ష చేస్తారు.
ఏమైనా... తను ఇలా వెళ్లిపోవటం సాంబయ్యకు మింగుడుపడడం లేదు.
∙∙ 
సాయమ్మ అందరితో కలుపుగోలుగా ఉండేది. ఇరుగుపొరుగు కూలీలతో పంటచేలకు వెళ్లేది. వచ్చేటప్పుడు కాయగూరలు, దినుసులు తెచ్చుకునేది. ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్లి ఏదో చెయ్యాడినప్పుడే సర్దుకొని చెయ్యాలని అనేది. ఇటు ఊర్లో తన అడ్డమైన బాకీలు వంతుల వారీగా తీర్చేది. తనలాగే తాగొచ్చి ఇల్లు పట్టించుకోకుండా గోల చేస్తూ పెళ్లాలను కొట్టి సాధించేవాళ్లు లేరా? ఇరుగుపొరుగున ఉన్న ఎల్లయ్య, కొమురయ్యల కంటే తానింకా నయమని సాంబయ్య నమ్మకం. మరి వాళ్ల భార్యలు ఇలా ఇల్లు వదిలేసి వెళ్లారా? కుటుంబజీవనంలో ఎలాంటి తర్కాలుండవనీ, కేవలం సర్దుకొని రాజీ పడిపోతూ ఎన్ని అసంతృప్తులున్నా... ఇద్దరొక చోట ఉంటేనే సమాజం మర్యాదగా చూస్తుందని తెలియకనా? తను వెళ్లిపోయింది. సాయమ్మ వస్తే ‘ఎందుకిలా చేశావ్‌?’ అని నిలదీసి అడిగి బావురుమనాలని ఉంది అతనికి. తాగిన టీకి డబ్బులిస్తూ  లోనకు వెళుతున్న బూబమ్మను చూశాడు.
బూబమ్మ భర్త దుబాయ్, మస్కట్ల లేబర్‌ పని చేస్తున్నడనీ, వస్తాడని చెప్తుంది కానీ... ఉన్నడో లేడో! తెలియదు. నల్గురూ ఆడపిల్లలే! ఊర్లో తెలిసినవాళ్ల బట్టలు కుట్టి కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. మనిషి ఎంత దిలాసాగా కనిపిస్తుంది.  బూబమ్మ, బుడ్డోడి పెళ్లాం నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు లోపల. మధ్యమధ్యలో తనను చూస్తూ నవ్వుకుంటున్నారు. సాంబయ్యకు చిన్నతనమనిపించింది. ఇక అక్కడ ఉండలేనట్టుగా లేచాడు. ఏదో కూర అడిగి గిన్నెలో వేయించుకొని ధీమాగా వెళ్లిపోతున్న బూబమ్మను చూశాడు. తనకు భర్త లేకున్నా హాయిగా జరుగుబాటు అవుతుంది.

భవిష్యత్తుపై ఏమాత్రం బెంగ లేకుండా పిల్లల్ని చదివిస్తూ, బతుకు  ఎలా బతకనిస్తే అలా బతికేయాలి అన్నట్టు నిశ్చింతగా ఉంది. తనలాగా భయం, దిగులుతో రేపెలా? అన్న సందేహబతుకుచిత్రం కాదు తనది.
ఇంట్లో ఎదిగిన పిల్ల ఉంది. ఆ తాగుడు స్నేహాలు మానేయమని, ఎవరైనా సంబంధాల వాళ్లు వస్తే పరువు పోతుందనీ, నలుగుర్లోకి అల్లరి అవుతామని ఎంతో ఇగురం చెప్పే సాయమ్మ...ఈరోజు తన మనసును ముక్కలు చేసి వెళ్లిపోతుందని అసలు ఊహించలేకపోయాడు.
∙∙ 
తానెన్నోసార్లు తాగివాగుతూ నులకమంచానికి అడ్డంగా పడిపోయి భళ్ళున వాంతులు చేసుకున్నా తెల్లారి ఏమీ ఎరుగనట్లుగా వాకిలంతా శుభ్రం చేసుకొని, లోటా నిండుగా నిమ్మరసం కలిపిన మజ్జిగనీళ్ళు తాగించేది.
పిల్లకు పెళ్లి చేసి పంపేరోజు సాయమ్మ ముఖంలో తృప్తితో కూడిన వెలుగు. పెండ్లికని ఒక్కత్తే రెక్కలుముక్కలు చేసుకున్నది. కొత్తబట్టలు కుట్టించింది, తనకూ కొత్త పొడుగు చేతుల చొక్కా, కండువా, ధోవతులు కొన్నది. మామిడాకులు కట్టి పిండివంటలు చేసి, సారె పోసి, గుళ్లోని పంతులుగారితో మాట్లాడి బిడ్డ పెండ్లి చేయించింది, తన పని పూర్తి అయిపోగానే ఈ తాగుడుగాడ్ని భరించాల్సిన అవసరం లేదనుకొని వెళ్లిపోయిందా?

ఈ ప్రపంచంలో చాలా ప్రశ్నలకు జవాబులు ఉండవని సాంబయ్యకు మొదటిసారిగా అర్థమయ్యింది. తానెన్నోసార్లు మాటలతో, చేతలతో హింసించినా నిశ్శబ్దంగా భరించింది.  తెల్లారి ఏమిపట్టించుకోనట్లుగా తన పనులు తాను చేసుకొని సద్ది మూటతో చేనుకు వెళ్లిపోయేది. చీకటి పడగానే తిరిగొచ్చి తొట్టిలో నీళ్లు నింపి, ముఖం కడుక్కొని ఎర్రబొట్టు దిద్దుకున్న సందమామలా గుడిసెలో వెన్నెదీపం వెలిగించేది. కట్టెల పొయ్యి ముట్టించి, నూకల అన్నం వండి తనకై ఎదురు చూసేది. తాను ఏనాడైనా సాయమ్మ మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడా?
ఏదైనా కోల్పోయిన తరువాతే విలువ తెలుస్తుంది.
సాయమ్మ లేని ఇంటిబాట పట్టాడు. 
చావలేక బతికినట్లుగా ఉన్న గుమ్మడి తీగ గుడిసెపై వేలాడుతూ కనిపించింది. చీడ పట్టిన కరివేప చెట్టుకింద పురుగులను కోళ్లు కెలుకుతూ తినసాగాయి. గుడిసె దగ్గరవుతుంటే...పట్టుకున్న పొన్నుకర్ర వెయ్యి టన్నుల బరువు అనిపిస్తుంది!
-బి.కళాగోపాల్‌

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా