తాబేలు

30 Oct, 2019 12:56 IST|Sakshi

 ∙కథా ప్రపంచం

మత్స్యకారుడు వాసు పల్లెలో అడుగుపెట్టగానే పిల్లలు అతడి చుట్టూ పోగయ్యారు. ‘‘తాబేలు! తాబేలు! వాసు బాబాయ్‌ తాబేలు తెచ్చాడు. తాబేలు!’’ అంటూ సందడి చెయ్యసాగారు. సాధారణంగా పిల్లల మాటల్నీ, అరుపుల్నీ పెద్దలెవరూ అంతగా పట్టించుకోరు. కాని తాబేలు అనే మాట అందరి చెవుల్లోకీ స్పష్టంగా చొచ్చుకుపోయింది.

ఎండుచేపల తలలను తొలగిస్తున్న గాద్‌మౌసీ వంగి చూస్తూ ముందుకొచ్చింది. శాంతాబాయిగారి కొత్త కోడలు కుట్టు మిషన్‌ మీద కాలు కదిలించబోయి ఆగి కిటికీలోంచి వీధిలోనికి తొంగి చూసింది. రమాకాంత్‌గారి మనవరాలు పుస్తకాల ముందు నుంచి లేచి వచ్చింది. జనాలు ద్వారాల గుండా కిటికీల గుండా ఆసక్తిగా చూడటం మొదలుపెట్టారు. వీ«ధిగుమ్మాలపైన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న వృద్ధులు కొందరు లేచి ముందుకు వచ్చారు. జనం ఉత్సాహాన్ని ఆపుకోలేక వాసు చుట్టూ పోగయి అతడి చేతిలోని తాబేలును చిత్రంగా చూశారు. కొందరు దాన్ని నెమ్మదిగా తాకారు. దాని పైపెంకు వారికి చల్లగానూ నునుపుగానూ తగిలింది. 
‘‘మన ఖార్వార్డ గ్రామంలోని ఎవరైనా తాబేలును తీసుకొచ్చి చాలా సంవత్సరాలైంది’’ అన్నారు కొందరు.

వాసు చుట్టూ చేరుతున్న జనం రకరకాల ప్రశ్నలు వేశారు.
‘‘ఎక్కడ దొరికింది?’’
‘‘ఎలా దొరికింది?’’
‘‘వలలోనే పట్టావా?’’
‘‘ఎంత పెద్దదో?’’
అందరికీ తలో జవాబు చెబుతూ వాసు నేరుగా తన ఇంటివైపు నడిచాడు. అప్పటికే అతడి భార్య వీధిగుమ్మంలో ఎదురుచూస్తోంది.
వాసు తన చేతుల్లో ఉన్న తాబేలును నెమ్మదిగా నేలమీద పెట్టాడు. వెంటనే అది తన చలనాంగాన్ని లోనికి తీసుకుంది. ఒక కీటకం తన రంధ్రంలోనికి వెనక్కు పోతున్నట్లుగా తలను కూడా లోపలికి లాక్కుంది. పిల్లలతో పాటు జనమంతా దాని చుట్టూ మూగారు. శాంతాబాయిగారి కొత్త కోడలు పిల్లల్ని నెట్టుకుంటూ తాబేలును దగ్గరగా చూసేందుకు ముందుకొచ్చింది. అక్కడి పిల్లల్లో చాలామంది పుస్తకాల్లో తాబేలు బొమ్మని చూశారు కాని బతికి ఉన్న తాబేలుని ఇంతవరకు చూడలేదు. కొందరు దాని పరిమాణాన్ని చూసి వెనక్కు తగ్గారు. మరికొందరు దాన్ని తాకి మెత్తగా ఉందో గట్టిగా ఉందో చూశారు. చాలామంది తాబేలును చూసిన ఉత్సహాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇంతసేపూ ఆ బూడిదరంగు ప్రాణి నేలమీద చలనం లేకుండానే పడి ఉంది.

ఇంతసేపూ తాబేలును ఎత్తిపట్టుకుని మోసిన వాసు చెయ్యి నొప్పెడుతోంది. గోడకు చేరబడి ఆ చేతిని నులుముకున్నాడు. ఆ రోజు వాసు చేపల వేటకు వేకువనే బయల్దేరాడు. వెళ్లేముందు ఇంటి దేవతను పూజించడం మరచిపోలేదు. సముద్రంలోనికి వలను విసిరి ఓర్పుగా ఎదుచు చూశాడు. రోజంతా వేచినా ఒక్క చేప కూడా తగల్లేదు. మధ్యాహ్నపు ఎండ మండిపోతోంది. విసిగి వేసారిపోయాడు. ఇక వలను తీసుకుని వెళ్లిపోదామనుకున్నాడు. అంతలో ఏదో బరువుగా తగిలింది. ఆశ్చర్యపోయాడు. ఏదో పెద్ద చేప తగిలి ఉంటుందనుకున్నాడు. వలను వెనక్కు తీసుకుని పడిన చేపను పడవలో వేసుకోవాలనుకున్నాడు. వలలో పడిన ప్రాణి చాలా బలంగా సముద్రంలోనికి లాగనారంభించింది. దాంతో చెయ్యి నొప్పి పెట్టింది. 

నిజానికి వాసు ఆ ఊరి చేపలు పట్టేవారిలో మంచి నేర్పరి. వివిధ రకాల చేపలను అవలీలగా పట్టగలడు. అతని పూర్వీకులందరూ ఈ వృత్తిలో మంచి నిష్ణాతులు. చేపల ప్రవర్తనలోని వైవిధ్యాలతో అతడికి బాగా పరిచయముంది. కాని ఈ రోజు ఈ జలచరం ప్రవర్తన భిన్నంగా ఉంది. వలకు ఏమాత్రం అనుకూలంగా లేదు. తాడును బలంగా లాగాడు. కొంత పెనుగులాట జరిగింది. ఆ ప్రాణి నీటిలోనికి దుముకుతోంది. వాసు వలను తనవైపు తీస్తున్నాడు. అతి ప్రయాస మీద చిట్టచివరకు దగ్గరగా లాగేసరికి అది ప్రమాదకరంగా తిరగబడి ఒక్కసారిగా పడవలో పడింది. 

అంత పెద్ద తాబేలును చూసి వాసు నిర్ఘాంతపోయాడు. ఈ లాగులాటలో అతడి చేతికి ఏదో తగిలి గాయమైంది. రక్తం స్రవించసాగింది. దాన్ని నీటితో కడుకున్నాడు. నుదుటికి పట్టిన చెమటను కూడా తుడుచుకున్నాడు. వాసు ఇంతకన్నా పెద్ద పరిమాణంలోని చేపలను చూశాడు. కాని ఇంత పెద్ద తాబేలును తానుగాని, తన సహచరులుగాని ఇంతవరకు పట్టుకున్న గుర్తులేదు. వాసు తండ్రి వలలో ఒకసారి ఒక తాబేలు పడింది. దాన్నతడు ఇంటికి తెచ్చాడు. ఆ రోజు ఖార్వర్డ పల్లెలో అందరూ ఎంతో సంబరపడిపోయారు. చవితినాడు వినాయక విగ్రహాలను చూడటానికి వచ్చినట్టే ఆ తాబేలును చూడటానికి కూడా జనం తండోపతండాలుగా వచ్చారు. ఒక పండుగ కోసం అలంకరించినట్టే ఇంటిని అందంగా తీర్చిదిద్దారు. ఆ ఊరి పూజారిని పిలిచారు. అతడు వేదమంత్రాలు చదివాడు. అందరూ కలసి తాబేలును పూజించారు. భజనలు చేశారు. చివరికి దాన్ని మేళతాళాలతో తీసుకెళ్లి సముద్రంలోనికి విడిచిపెట్టారు.

వాసుకి ఈ సంబరమంతా లీలగా గుర్తుంది. కాని ఈ కథను వాసు తండ్రి పదేపదే వల్లె వేస్తూ ఉండేవాడు. ఆ సన్నివేశం తర్వాతే అతడు ఎలా అభివృద్ధి చెందిందీ వివరించేవాడు. ఆ తర్వాతే గ్రామ చెరువులో చేపలు పట్టే హక్కులను ఎలా సంపాదించుకున్నదీ చెబుతుండేవాడు. ఆ తర్వాతే చేపల వేట బాగా ఫలవంతంగా ఉండి డబ్బు పుష్కలంగా చేతిలో మెదులుతుండేదని గుర్తు చేస్తుండేవాడు.
ఇంచుమించుగా ఆ రోజుల్లోనే అతడు వాసు పెళ్లి చేశాడు. అది కూడా వైభవోపేతంగా చేశాడు. అయినా ఆ తర్వాత తండ్రి ఎక్కువకాలం జీవించలేదు.
రకరకాల కారణాల వల్ల ఆనాటి సంపన్నత క్రమంగా క్షీణించింది. పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు వాసు జీవనమే కష్టంగా ఉంది. భార్యా రెండేళ్ల కుమారుడితో పాటు రోజు గడవడమే కష్టంగా ఉంది.
తాబేలుని చూడగానే వాసు భార్య అతడిని ఇంటి లోపలికి తీసుకుపోయింది. చేపలు తేకుండా ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. ఆమె ఏమడుగుతుందో ఆమెకేం జవాబు చెప్పాలో అతడికి తోచడం లేదు.

‘‘ఇప్పుడు నేనేం వండాలి? నువ్వేమో రూపాయి తేకుండా వచ్చావు’’ అంది.
‘‘ఏం చెయ్యను మరి? ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా చిక్కలేదు. చివరకు ఈ తాబేలు మాత్రమే వలలో పడింది. చేపలు దొరికితే అవి డబ్బుగా మారేవి. నిజానికి ఈరోజు చేపలు తెచ్చి ఇస్తానని దంబాల్‌కు మాట కూడా ఇచ్చాను. ఇప్పుడతనికి ఏం సమాధానం చెప్పాలో తెలీడం లేదు’’ అని వివరణ ఇచ్చుకున్నాడు.
‘‘చివరికి ఈ పనికిమాలిన తాబేలు తెచ్చావు’’ ఆమె ఈసడింపుగా అంది.
‘‘తాబేలును పనికిమాలినదనకు. అది దైవస్వరూపం’’ అన్నాడు. 

‘‘కాదనను. కాని దాన్ని అక్కడే ఎవరికైనా అమ్మేయాల్సింది. తాబేలు మాంసానికి అర్రులు చాచేవారుంటారు. ఎవరైనా నాలుగైదు రూపాయలు ఇచ్చేవారు. వాటితో మనకి ఒకటి రెండు రోజులు ఇబ్బంది లేకుండా గడిచేది..’’ తాబేలు అమ్మకం అంటే వాసుకి కోపం వచ్చింది. ఏదో చెప్పాడు. కాని అతడి భార్య అతడి ధోరణిని పట్టించుకోలేదు. డబ్బు తేనందుకు సణగడం ప్రారంభించింది. భార్య సతాయింపుతో వాసు చిరాకుపడిపోయాడు.

‘‘ఈరోజు నీకేమైంది? ఒక తాబేలంటే మన మత్స్యకారులకు చాలా పవిత్రమైన ప్రాణి. దైవంతో సమానం. వృత్తి పట్ల గౌరవం ఉన్న చేపలు పట్టేవాడెవడూ తాబేలును అమ్మి సొమ్ము చేసుకోడు. అటువంటిది ఎప్పుడైనా విన్నావా?’’ అన్నాడు.
కాని ఆమెకు అతడి సమర్థన ఏమీ నచ్చలేదు. పొయ్యి మీద పెట్టిన ఖాళీ పాత్ర ఆమెను బాధిస్తోంది. పిల్లవాడు పాలులేక ఆకలితో అలమటిస్తున్నాడు. అందుకే ఆమె ఆత్రంగా వాసు కోసం ఎదురు చూసింది.
మనిషైతే వచ్చాడు. అమ్ముకోవలసిన చేపలు తేలేదు. ఒక తాబేలు తెచ్చాడు. దాన్నీ అమ్మనంటున్నాడు.
‘‘నువ్వసలు మనిషివేనా? ఎంతసేపూ డబ్బు డబ్బంటావేంటి? నీకు ఆచారాలంటే కాస్తంత గౌరవం లేకుండా పోయింది. అసలు మన ఊర్లో ఎవరైనా తాబేలును పట్టుకుని ఎన్ని సంవత్సరాలైంది? అప్పుడెప్పుడో మా నాన్నకి తాబేలు దొరికింది. నిజానికి ఇది రాబోయే సంపదకు మంచి సూచనే కదా! ఈ రోజు నన్ను చూసి ఎంతోమంది అసూయపడుతున్నారు. మా నాన్నకు మల్లే నాకూ అదృష్టం కలసి రావచ్చు. మన చేతిలోకి డబ్బు వచ్చి పడవచ్చు. మనకు కూడా మంచి బట్టలు వేసుకుని మంచి తిండి తినే దశ పట్టవచ్చు. ఇది మనకు రాబోయే అదృష్టానికి సంకేతం కావచ్చు...’’ ఇలా వాదించాడు. ఇంకా ఇలా అన్నాడు: ‘‘నువ్వసలు మత్స్యకారుడి భార్యగా అసలు తగనే తగవు. పవిత్రమైన తాబేలును అమ్ముకోమంటావా? అంత నీచమైన పని మత్స్యకారుడిగా నేను చెయ్యాలా?’’

అతడి ఈ వాదనంతా ఆమె తీవ్రత ముందు నీరుకారిపోయింది. చివరకు అతడు సంయమనం కోల్పోయాడు. విసిగిపోయాడు. అసహాయురాలైన భార్య మీద చెయ్యి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటిలో ఇద్దరూ చెరో మూలకూ చేరుకున్నారు. వాసుకి హఠాత్తుగా ఒక అంశం గుర్తు వచ్చింది. ఇందాక తను చేతిలో తాబేలుతో నడిచి వస్తున్నాడు. ఆ రావడం దంబాబ్‌గారి తోట పక్క నుంచే వచ్చాడు. 
అక్కడ కొందరు వడ్రంగులు పనసకర్రను కోస్తున్నారు. వాళ్లు తననూ తాబేలునూ చూడగానే చేస్తున్న పని ఆపేసి తనవైపు ఆత్రంగా వచ్చారు.
‘‘దాన్ని అమ్మేస్తావా?’’ అని అడిగారు.

‘‘అది చేప కాదయ్యా! తాబేలు!’’ అన్నాడు. ఇంకా ఇలా అనాలనుకున్నాడు: ‘‘ఒక మత్స్యకారుడు తాబేలును అమ్మడం మీరు ఎక్కడైనా విన్నారా? చూశారా? మనం పూజించుకునే దేవుళ్లను అమ్ముకుంటామా?’’ కాని పైకి ఏమీ అనలేదు. నోటిని అదుపులో పెట్టుకుని తమాయించుకున్నాడు. నిశ్శబ్దంగా నడవసాగాడు. 
కొంతదూరం వడ్రంగులు వెంటబడుతూ అరిచారు ‘‘చూడు.. నీకు ఐదు రూపాయలిస్తాం.. మాకిచ్చెయ్యి’’ బహుశా తాబేలు మాంసం వారికి నోరూరించి ఉంటుంది.
కాని వాసు వెనక్కు చూడలేదు. ముందుకే నడిచాడు. వడ్రంగులు మాత్రం ఆశ వదలకుండా తాబేలును అమ్మమని పదే పదే పిలవసాగారు. ధర కూడా పెంచుతూ అరిచారు.మధ్యాహ్నం ఎండ వేడిమితో పాటు అతడిలో కోపం కూడా పెరిగింది. కాలిపోతున్న నేల మీద అతడి పాదాలు మండిపోతున్నాయి. ఆ స్థితిలో వారి కేకలు అతణ్ణి చిరాకుపరచాయి. మాట్లాడకుండా ఇంటివైపు నడిచాడు. తీరా ఇంటికి చేరే సరికి జరిగిందిదీ... ఇంటి బయట పిల్లల కోలాహలం వినబడసాగింది. దాంతో ఈ లోకంలోకి వచ్చాడు. ‘‘వాసూ! పూజ పూర్తయిందా!’’ అంటూ ఇద్దరు వృద్ధులు ఇంటి అరుగు మీదకు వచ్చారు.

‘‘ఇంకా లేదు బాబాయ్‌!’’ అంటూ వాసు వారిని చేరుకున్నాడు.
అందరూ కలసి తాబేలును ఒక పీఠం మీద ఉంచారు. దాన్ని పసుపు కుంకుమలతో అలంకరించారు. పువ్వులను తెమ్మని పిల్లలకు పురమాయించారు. ఈలోగా వాసు బావి వద్దకు వెళ్లి స్నానం చేసి వచ్చాడు. తల తుడుచుకుంటూ తాబేలు పూజకు ఏర్పాట్లు చెయ్యమని భార్యకు చెప్పాడు. ఆమె ఇంకా ముభావంగానే ఉంది. కాని ఏమైనా అంటుందేమోనని సందేహిస్తూనే ఉన్నాడు. ఆమె ఏమీ అనలేదు.
కొంతసేపటికి పూజకు అంతా సిద్ధమైందని ఆమె చెప్పింది.
‘‘మరి ప్రసాదం సంగతేం చేద్దాం?’’ అడిగిందామె.
‘‘మొన్నటి కొబ్బరికాయతో ఏదైనా చేసిపెట్టు’’ అన్నాడు.
ఆ తర్వాత ఇంటి లోపలి భాగంలోకి అందరూ చేరి చాలాసేపు అన్ని అవసరమైన లాంఛనాలూ ఏర్పాటు చేశారు. 
ఈలోగా ఒక పెద్దాయన గ్రామ పూజారిని తీసుకొచ్చాడు. ఆ పూజారి ఆధ్వర్యంలో ఆచారయుక్తంగా తాబేలుకు పూజ చేశారు. ప్రసాదాన్ని పిల్లలకూ పెద్దలకూ పంచిపెట్టారు.
మరోసారి సాయంత్రం కలుసుకోవచ్చని తాబేలును చూడవచ్చని ఎవరిళ్లకు వాళ్లు తిరిగి వెళ్లిపోయారు.
చీకటి పడింది. కొందరు పిల్లలు ఇంకా అక్కడే ఉన్నారు. అంతవరకు తాబేలు పూజలో పాల్గొన్నవారు రాత్రి భోజనాల కోసం వారి వారి ఇళ్లలో పొయ్యిలు వెలిగించుకున్నారు.
కాని వాసు వంటగదిలో ఉదయం నుంచి నిప్పు జాడే లేదు. అతడి భార్య ఖిన్నవదనంతో గోడకు చేరగిల్లింది. చేపలు పట్టే వలను అల్లుకుంటూ కూర్చుంది. వాసు మళ్లీ ఆమెను కదిలించే ధైర్యం చెయ్యలేకపోయాడు.
పిల్లవాడు ఆ రోజంతా తాబేలును, అక్కడ చేరిన జనాన్నీ చూస్తూ కూర్చుండిపోయాడు.
వాసు తలపట్టుకున్నాడు. భార్య ఏమైనా మాట్లాడుతుందేమోనని ఎదురు చూశాడు. కాని ఉదయం గొడవ తర్వాత ఆమె నిరసన వ్రతం పట్టి మౌనం వహించింది. పూజకు ఏర్పాట్లు కూడా ముభావంగానే చేసింది.
అతనికీ ఆకలి దహించి వేస్తోంది. ఉదయం నుంచి పచ్చి మంచినీరు కూడా ముట్టుకోలేదు. ఆకలి... ఆకలి...
ఈలోగా ఆకలికి తట్టుకోలేక పిల్లవాడు ఏడుపు లంకించుకున్నాడు.
‘ఎంతో అనుకూలవతి అయిన భార్య ఎన్నడూ లేనిది తనతో గొడవ పడిందంటే అందుకు కారణం ఆకలి. పిల్లవాడి బాధ తనే చూడలేకపోతున్నాడు. ఒక తల్లిగా ఆమె మనసు ఎంత తల్లడిల్లిపోతుందో తను ఊహించగలడు. అనవసరంగా ఆవేశపడి ఆమెపై చెయ్యి చేసుకుని తప్పు చేశాడు. నేరం చేశాడు...
వాసు వంటగది వైపు నడిచాడు. పొయ్యి వైపు చూశాడు. పొయ్యి లోపలి చల్లని బూడిదలో నిద్రపోతున్న పిల్లి అతడి అసహాయతను చూసి వెక్కిరించింది. పొయ్యిపైన ఖాళీగా ఉన్న అన్నపు పాత్ర అతడి వైపు చూసి నవ్వింది.
వాసు మనసు వికలమైపోయింది. అతడి మెదడులో ఏదో రసాయన చర్య ప్రారంభమైంది.
ఒక్కసారిగా నడుముకు చుట్టుకున్న తువ్వాలును బిగించాడు. తాబేలు చుట్టూ ఉన్న పిల్లలను తోసుకుంటూ ముందుకెళ్లాడు. తాబేలుకు కట్టి ఉన్న తాడు విప్పాడు. దాన్ని పైకెత్తి పట్టుకున్నాడు.
‘‘వాసూ! తాబేలును ఎక్కడకు తీసుకెళుతున్నావు?’’ గుంపులోంచి ఎవరో ఆసక్తిగా ప్రశ్నించారు.
‘‘సముద్రానికి తీసుకెళుతున్నాను. దీన్ని నీటిలో విడిచిపెట్టేస్తా’’ అని బదులిచ్చాడు. తాబేలును చేత్తో పట్టుకుని వాసు చీకట్లో కలిసిపోయాడు.
వాసు త్వర త్వరగా అడుగులు వేశాడు. ఈసారి తాబేలు అతడికి భారమనిపించలేదు. దారి తడుముకుంటూ నడుస్తూ వడ్రంగుల ఆవాసం వద్దకు చేరుకున్నాడు. ఆ రోజు పని ముగించుకుని వారంతా అప్పుడే స్థిరపడుతున్నారు.
వారి ముందు తాబేలును ఉంచాడు. నిశ్శబ్దంగా తన కుడిచేతిని చాచి నిలుచున్నాడు.
వడ్రంగుల నల్లని ముఖాలపైన తెల్లని పళ్లు మెరిశాయి. వారు తమలో తాము ఏదో చర్చించుకున్నారు. వారి కన్నుల్లో ఆశా సంతృప్తీ మెదిలాయి.
వారిలో ఒకడు లేచాడు. దగ్గర్లోనే చెట్టు కొమ్మకు వేలాడుతున్న చొక్కావైపు వెళ్లాడు. దాని జేబులో చెయ్యి పెట్టి ఒక రెండు రూపాయల నోటు తీశాడు. మారు మాట్లాడకుండా వాసు చేతిలో పెట్టాడు. 
ఆ నోటు విలువ ఎంతో చూడకుండానే వాసు దాన్ని తన పిడికిట్లో బిగించి అక్కడి నుంచి బయలుదేరాడు.
ఎవరో చెంపమీద కొట్టినట్టు అతడి చిక్కిళ్లు మండసాగాయి. నిజానికి వడ్రంగుల రంపపు కోత ఎప్పుడో ఆగిపోయినప్పటికీ వాసు చేవుల్లో ఇప్పుడా మోత ప్రతిధ్వనిస్తోంది. చెవులను చిల్లులు పొడుస్తోంది.
చేతిలో నోటుతో బియ్యం దుకాణం వైపు పరుగు వంటి నడకతో బయల్దేరాడు.
ఆకలి ముందు ఆదర్శాలూ విశ్వాసాలూ మోకరిల్లాయి.

మరిన్ని వార్తలు