మహారాజు

22 Sep, 2019 08:39 IST|Sakshi

ఈవారం కథ

‘‘ఈ సారైనా మనం ఐదుగురం కలిస్తే బాగుండు.’’  అన్నాడు రామచంద్ర.  
‘‘అవును,  మనం ఏదో విధంగా నలుగురం కలుస్తూనే ఉన్నాం కానీ శంకరం కలవటం లేదు. ఎన్నాళ్ళయింది వాడిని చూసి’’ అన్నాడు ముకుంద్‌.
‘‘కనీసం ఫోన్‌ చేద్దామన్నా వాడి నంబర్‌ లేదు మనదగ్గర.’’ అన్నాడు రామచంద్ర.
వాళ్ళు నలుగురు ఫలాని రోజున కలుసుకుందామని అనుకున్నారు.
అనుకున్నట్లు గానే కలుసుకున్నారు.
‘‘మీకో గుడ్‌ న్యూస్‌. నాకు శంకరం ఫోన్‌ నంబర్‌ దొరికింది.’’ అన్నాడు రమేష్‌.
అందరూ సరదా పడ్డారు.
 ‘‘వాడికి ఫోన్‌ చేశావా?’’అని అడిగాడు శరత్‌ .
‘‘చేశాను.’’
‘‘ఎలా వున్నాడు వాడు?’’
‘‘వాళ్ళ వూళ్లోనే   గుళ్ళో పూజారిగా వున్నాడు’’ చెప్పాడు రమేశ్‌.
‘‘మనం ఇక్కడికి వచ్చాం అని చెప్పి వాడినీ రమ్మనక పోయావా!’’ అన్నాడు శరత్‌.
‘‘రమ్మన్నాను. నాకు  ఎలా కుదురుతుంది రా కష్టం  అన్నాడు.’’  చెప్పాడు రమేష్‌.

‘‘మనందరం బాగానే సెటిల్‌ అయిపోయాం. ఇల్లు కట్టుకున్నాం. డబ్బు సంపాదించుకున్నాం. పాపం శంకరం జీవితమే పాడైపోయింది. చదువు లేదు. జీవితంలో స్థిరపడలేదు. ఎలా ఉన్నాడో ఏమిటో. చాలా మంచివాడు. నిజం చెప్పాలంటే అందరిలోకి వాడే ఇంటెలిజెంట్‌. అదృష్టం కలిసి రాలేదు.’’ అని బాధపడ్డాడు రామచంద్రం.
అందరూ భారంగా నిట్టూర్చారు.
వాళ్ళు ఐదుగురు ఓకే సారి గుంటూరులో ఇంటర్‌లో జాయిన్‌ అయ్యారు.
ఆ సమయంలోనే శంకరం తండ్రి ఎడ్ల బండి మీద నుంచి కింద పడిపోయాడు. బలమైన దెబ్బలు తగిలాయి.  దాంతో పెద్దకొడుకైన శంకరం అర్ధాంతరంగా చదువు వదిలిపెట్టి  వాళ్ళ పల్లెటూరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు.
మిగిలిన నలుగురు మంచి చదువులు చదివారు అందరూ విదేశాలకు వెళ్లి పోయారు.
రామచంద్ర జర్మనీలో ఉంటాడు. ముకుంద్, శరత్‌ యుఎస్‌.లో వుంటారు. రమేష్‌ ఆస్ట్రేలియాలో వుంటాడు. అందరూ ఆయా దేశాల్లో సెటిల్‌ అయిపోయారు. చుట్టపు చూపుగా మన దేశానికి వచ్చి వెళ్తుంటారు. వేసవికాలంలో  శుభకార్యాలు  చాలా ఉంటాయి. రెండుమూడేళ్లకు ఒక్కసారైనా ఎండాకాలంలో  వస్తూనే ఉంటారు. అందరూ హైదరాబాద్‌ వాళ్ళే అవటం    వల్ల మూడు నాలుగు సార్లు కాకతాళీయంగా నలుగురు కలిశారు. ఏ హోటల్‌కో వెళ్లి సరదాగా సాయంత్రం పూట కబుర్లు చెప్పుకోవడం అలవాటు.ఈసారి కూడా అలాగే కలిశారు.
నలుగురు ఉన్నప్పుడు శంకరం లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చాలా ఏళ్లయిపోయింది వాడిని చూసి. అని బాధపడ్డారు. ‘‘వాడికి  రావడం వీలు కావట్లేదు. వాడి పరిస్థితి ఏమిటో!  ఆర్థికంగా ఎలా ఉన్నా డో? అది పైకి చెప్పలేక వీలు కాలేదు  అంటున్నాడేమో!’’ సందేహం వెలిబుచ్చాడు రమేష్‌.

‘‘నాకో ఐడియా వచ్చింది. వాడికి వీలుకాకపోతే మనం వెళ్లి చూసి వద్దాం.’’  అన్నాడు ముకుంద్‌.
‘‘ఎలా వెళ్తాం. వీలవద్దా’’ అని ముగ్గురూ వెనక్కి తగ్గారు.
‘‘వీలు చేసుకుందాం. అంతదూరం నుండి వచ్చిన  వాళ్ళం ఈ ప్రోగ్రాం పెట్టుకోలేమూ!
ఎంత ఇవాళ రాత్రి బయలుదేరితే ఎల్లుండి  పొద్దునకి వచ్చేయొచ్చు. ఎన్నాళ్ళయింది వాడిని చూసి.’’ అన్నాడు ముకుంద్‌.
ముందు కాస్త వెనకాడినా వెళ్లాలని అనిపించింది వాళ్ళకి. వాడు ఉన్నాడో లేదో కనుక్కుని అప్పుడు ప్లాన్‌ చేద్దాం అన్నాడు రామచంద్ర. ‘‘ఇప్పుడే ఫోన్‌ చేస్తాను’’ అన్నాడు రమేష్‌. వెంటనే  శంకరంకి ఫోన్‌ చేశారు.
‘‘వద్దామనుకుంటున్నాం’’ అనగానే శంకరం ఆనందం అంతా ఇంతా కాదు .
‘‘రండిరా ఎన్నాళ్ళయిందో  కలుసుకుని!’’ అన్నాడు సంబరపడిపోతూ.
‘‘ప్రోగ్రాం సెటిల్‌ చేసుకుని  నీతో చెప్తాం.’’ అన్నాడు రమేష్‌.
రైలు బస్సు అంటే టికెట్లు దొరకొచ్చు  దొరక్కపోవచ్చు...అందుకని కారులో వెళ్దాం అనుకున్నారు. ఫలాని రోజున వస్తున్నట్లు ఫోన్‌ చేయగానే శంకరం పరమానంద పడిపోయాడు. ఒక్క రోజే ఉంటారు అని తెలిసి నీరుగారిపోయాడు.

‘‘అదేమిట్రా రాకరాక వస్తున్నారు నాలుగు రోజులు ఉండచ్చు కదా’’ అన్నాడు.
‘‘కాదులేరా ఈ ప్రయాణమే బ్రహ్మ ప్రళయం. నిన్ను చూడాలి  అని అతి కష్టం మీద బయలు దేరుతున్నాం’’ అన్నాడు రమేష్‌.
‘‘అవున్లే అదీ నిజమే. వస్తున్నారు అదే పదివేలు’’ అన్నాడు శంకరం.
ప్రయాణానికి సిద్ధమయ్యాక మిత్రులు నలుగురు కలిసి  ఓ విషయం చర్చించుకున్నారు.
‘‘వాడు సరిగ్గా చదువుకో లేదు ఎలా ఉన్నాడో ఏమిటో. మనం బాగానే ఉన్నాము  కదా వాడికి తలా కొద్దిగా డబ్బు ఇద్దాం. అవసరానికి వాడుకుంటాడు.’’ అన్నాడు శరత్‌.
‘‘తీసుకుంటాడా! ఏమీ అనుకోడు కదా!’’ అన్నాడు రమేష్‌.
‘‘పిల్లలకి ఏదైనా కొనమని చేతిలో పెడదాం.’’ సలహా ఇచ్చాడు రామచంద్ర.

తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరారు. మంచి కారు. రోడ్లు బాగున్నాయి కాబట్టి పది గంటలకి పావు గంట ముందే గమ్యం చేరారు. శంకరం  వాళ్ల ఊరు గణపతిపాలెం. పల్లెటూరు. మెయిన్‌ రోడ్డు మీద నుంచి నాలుగు కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. మెయిన్‌ రోడ్డు మీదనే వేచి ఉన్నాడు శంకరం. పంచె, పైన చొక్కా, నుదుట విభూది పట్టెలు. బొట్టు. నువ్వులు బియ్యం కలిపినట్లు వున్న కురచ జుట్టు. చిన్న పిలక. అదీ అతని అవతారం. ఖరీదైన బట్టలు వాచీ,అందమైన కళ్ళజోడు, ఘుమ ఘుమలాడే పెర్ఫ్యూమ్‌ పరిమళాలు వెదజల్లుతూ దర్జాగా వున్న ఆ నలుగురి ముందు దిష్టి బొమ్మలా వున్నాడు. అంతకాలం తర్వాత కలిసిన మిత్రులు  ఆనందంలో మునిగి  పోయారు. తన మోపెడ్‌ మీద వాళ్ళకు దారి చూపించాడు. ఇంటి ముందు ఆగారు. విశాలమయిన పెంకుటిల్లు. ఇంటి చుట్టూ కొబ్బరి మామిడి, వగైరా చెట్లు. ఇంటిముందు పెద్ద వేప చెట్టు. గేటు దాటి లోపలికి వెళ్ళగానే ఒక అమ్మాయి..
‘‘కాళ్ళు కడుక్కొండి’’ అని నీళ్ళు అందించింది.
ఆ  పద్ధతి పాటించి ఎన్నో ఏళ్ళు అయింది. షూస్‌ విప్పి కాళ్ళు కడుక్కున్నారు.
‘‘రాండిరా’’ అంటూ హాల్లోకి తీసుకు వెళ్ళాడు.

క్షణంలో కొబ్బరి నీళ్ళు ఇచ్చింది ఇంకో అమ్మాయి. పెద్ద హాలు. కిటికీ బయట కూలర్‌ పెట్టారేమో చల్లగా వుంది. ముందు వరండా, మూడు గదులు, హాలు, విశాలమైన భోజనాల గది, వంటిల్లు, కొట్టు గది, పూజగది, దొడ్లో పెద్ద  పూరిల్లు. ఇంటికి తగ్గట్టు మనుషులు. శంకరం తల్లి తండ్రి, భార్య, ఇద్దరు కొడుకులు పెద్ద కోడలు, ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ కుటుంబాలు. అందరినీ పేరు పేరునా పరిచయం చేశాడు. ఆ వూరి శివాలయం అర్చకత్వం వీళ్లది. తండ్రికి యాక్సిడెంట్స్‌ అవటంతో ఆ బాధ్యత శంకరం తీసుకున్నాడు.  ఆయనకు అర్చకత్వం మాత్రమే కాకుండా జ్యోతిష్యంలోనూ ప్రవేశం వుంది. పెద్ద తమ్ముడు పక్క వూరి స్కూల్లో టీచర్‌. అతని భార్య గృహిణి. రెండో వాడు దగ్గరి వూళ్ళో గుళ్ళో ఆర్చకత్వం. అతని భార్య పోస్టల్‌ డిపార్ట్‌ మెంట్‌లో పని చేస్తోంది. శంకరం పెద్ద కొడుకు అతని భార్య పక్క టౌన్‌లో కంప్యూటర్‌ సెంటర్‌ నడుపుతున్నారు. రెండో కొడుకు రైల్వేలో అసిస్టెంట్‌  స్టేషన్‌ మాష్టర్‌.  భార్య గృహిణి.

తమ్ముళ్ళ పిల్లలు చదువు కుంటున్నారు.
అందరూ కలిసి ఆ ఇంట్లోనే వుంటారు.  
ఇంట్లో వున్న వాళ్లంతా  వీళ్ళని ఆప్యాయంగా పలకరించారు.. భోజనాల వేళ అయింది. వీళ్ళు కింద కూర్చోలేరు  అని బల్ల మీద అరిటాకులు వేసి వడ్డించారు. కోడళ్ళు సాయం చేస్తుంటే శంకరం తల్లి స్వయంగా వడ్డించింది. వంకాయ కూర, కొబ్బరి మామిడి పచ్చడి, పప్పు, ధప్పలం, కొత్త ఆవకాయ,పూర్ణం బూరెలు,పులిహోర, తినేసరికి భుక్తాయసం వచ్చింది. హాల్లో మంచాలు వేసి పక్కలు వేశారు. కబుర్లు చెప్పుకుంటూ నిద్ర పోయారు. లేచే సరికి నాలుగు అయింది. తాటి ముంజలు రెడీగా ఉన్నాయి. సాయంత్రం గుడికి తీసుకు వెళ్ళి అర్చన చేయించాడు శంకరం. తరువాత వూరు చూపించాడు. వూళ్ళో అందరూ శంకరాన్ని ఆదరంగా పలకరిస్తూనే వున్నారు.
తమ పొలాలు చూపించాడు. 
‘‘అప్పట్లో నాలుగు ఎకరాలు వుండేది. ఇంకో నాలుగు ఎకరాలు కొన్నాం.

చవకలో కొన్నాం. రాష్ట్రం విడిపోయాక ఇప్పుడు ఎకరం నలభై లక్షలు వుంది’’ అన్నాడు. ఇంకా తాటి తోపు, జీడి మామిడి తోట కూడా వున్నాయి. అందరూ ఇంటికి చేరారు. బయటికి వెళ్ళిన ఆ ఇంట్లోని   వాళ్ళు అందరూ గూటికి చేరారు. అప్పటి దాకా వున్న సందడి రెట్టింపు అయింది. ఆ ఇంటి వాతావరణం చూస్తూ వుంటే టైమ్‌మెషిన్‌లో ఎక్కడికో వెళ్లిపోయినట్లు అనిపించింది. ఇంటి యజమాని దర్జాగా వున్నాడు. కొడుకులు పెద్ద వాళ్ళై సంపాదనపరులు అయినా నాన్న గారూ అంటూ అన్నీ ఆయనకి చెప్తున్నారు. ఇంటిల్లపాదీ ఆయన్ని గౌరవిస్తోంది. కొడళ్ళకి ఓ మాట చెప్పటానికి అత్తగారు అగ్గగ్గ లాడటం లేదు. ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్లు, చెయ్యని ఆడవాళ్లు ఒకే విధమైన గౌరవాన్ని పొందుతున్నారు, ఎవరి స్థానం వారిది. ఎవరి విలువ వారిది. ఐకమత్యంగా వున్నారు.

ఏదైనా తినమని చేతికి ఇవ్వగానే ‘‘అన్నయ్యకి ఇచ్చారా’’ అని తమ్ముళ్ళు, ‘‘వాడు తిన్నాడా’’ అని అన్నయ్య ధైర్యంగా భార్యని అడుగుతున్నారు.
ఇక పిల్లలు ఎవరి పిల్లలు ఎవరో కనుక్కోటం పెద్ద నాన్నా, బాబాయ్‌ అంటూ చుట్టుకు చుట్టుకు తిరుగుతున్నారు. ఇదంతా కృతకంగా లేదు సహజంగా వుంది. ప్రేమ అనురాగం అనే దారంలో గుచ్చిన ముత్యాలహారంలా వుంది ఆ కుటుంబం.
‘‘మా శంకరం  పాపం ఇల్లు దాటి ఎక్కడికీ వెళ్ళడు. ఈయన వ్యవహారం ఏం చెప్పమంటారు నాయనా! బొత్తిగా పసిపిల్లాడికి మల్లే పెద్ద కొడుకుని ఎక్కడికీ వెళ్లనివ్వరు.’’అని తల్లి అంటే ‘‘నాదేముంది గానీ అదే వాడిని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు.’’ అన్నాడు ఆయన.
‘‘అదేమీ కాదు. నాన్న గారిని, గుళ్ళో దేవుడినీ వదిలి నేను ఉండలేను. అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నా అమ్మ చేతి భోజనం తింటున్నాను. నా అదృష్టం రా’’ అన్నాడు శంకరం. 
వాళ్ళని చూసి చెప్పలేనంత తృప్తిగా అనిపించింది వీళ్ళకి. రాత్రి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు మిత్రులు అయిదుగురు. తెల్లవారగానే తిరుగు ప్రయాణం. వీళ్ళకు పంచెల చాపు, భార్యకు జరీ చీరె పెట్టారు. వీళ్ళు వెళ్తుంటే కళ్ళ నీళ్ళు తిరిగాయి శంకరానికి.
‘‘నా పరిస్థితి చూశారుగా. గుడిని, అమ్మా నాన్న గారి నీ వదిలి రావటం కష్టం.
మీరే వచ్చారు నాకు పరమానందం గా వుంది’’ అన్నాడు.

ఇంట్లోని వాళ్లంతా గేటు బయటికి వచ్చి ఆదరంగా సాగనంపారు. కారు వూళ్ళో నుంచి వెళ్లి రోడ్‌ ఎక్కింది. నలుగురూ మౌనంగా ఉండిపోయారు. శంకరం ఇల్లు ఆ వాతావరణం వాళ్ళను వెంటాడుతోంది. ఏదో చెప్పలేని ఆవేదన  కలుగుతోంది. వాళ్ళకు కూడా తల్లితండ్రులు, అన్నదమ్ములు వున్నారు. కాకపోతే ఎవరికి వారే అన్నట్లు వున్నారు. ఎప్పుడో మూడెళ్లకో నాలుగేళ్లకో ఒకసారి కలుస్తారు. ఒకరి పట్ల మరొకరికి ఆపేక్షలు, ప్రేమలు వున్నాయి. రమేష్‌ అమ్మ, నాన్న, వృద్ధాశ్రమంలో వుంటున్నారు. అన్ని వసతులు వున్నాయి. రామచంద్ర అమ్మ నాన్న ఇంట్లోనే వున్నారు. తండ్రికి ఆరోగ్యం బాగాలేదు.పెద్ద వాళ్లిద్దరే. ఏ మాత్రం తేడా చేసినా ఆవిడే పరుగులు పెట్టాలి పాపం. ముకుంద్‌ అమ్మా నాన్నా బాగానే ఉన్నారు. ఇంకా ప్రయాణం చెయ్యగల ఓపిక వుంది. కానీ అతని భార్యకు వాళ్ళంటే పడదు. శరత్‌ తల్లిదండ్రులు ‘‘ఆ ప్రయాణాలు మేము చెయ్యలేం. 
మాకు అక్కడ కాలక్షేపం కాదు. తీరా అక్కడికి వచ్చి అడ్డం పడితే కష్టం’’ అని చెప్పేశారు.
తోడ బుట్టిన వాళ్ళు  ఎవరికి వారే యమునా తీరే. పిల్లలు కాస్త పెద్దయ్యాక ఇండియా రావటానికి ఆసక్తి చూపించరు.

అందరినీ చూద్దాం అని వీళ్ళు పోరి తీసుకు వచ్చినా వాతావరణం మార్పు వల్ల అనారోగ్యాలు, వూరి ప్రయాణాలు. మొక్కులు చెల్లించుకోటాలు ఆ  హడావిడితోనే సరిపోతుంది. మళ్లీ ఎవరి గూటికి వారు చేరటం. వాళ్లేం కష్టాలు పడటం లేదు. సంపన్న దేశాల్లో నివాసం.వున్న చోట మిత్రులు  వున్నారు. అందరూ కలిసి మెలిసి వుంటారు. కానీ రక్త సంబంధం వున్న వాళ్లంతా దూరం గానే వున్నారు.
‘జేబులో వున్నదే రూపాయి. దగ్గర ఉన్నవాడే కొడుకు’ అని సామెత చెప్పినట్లు అమ్మ నాన్న దగ్గర వుండే అదృష్టం మాత్రం లేదు. అదీ అలవాటైపోయింది. పరిస్థితులతో రాజీ పడి సుఖంగానే వున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఆ వూరు వెళ్లి  శంక రాన్ని చూసేసరికి మనసులో ఏదో పోగొట్టుకున్న భావన. ఎంత కోరుకున్నా అటువంటి అవకాశం తమకు లేదు కదా అనే నిర్లిప్తత.
కాసేపటి తర్వాత  నోరు విప్పాడు రామచంద్ర.
‘‘ వాడు తక్కువగా ఉన్నాడేమో అనుకున్నాం. నిజం చెప్పాలంటే మనకంటే సుఖంగా వున్నాడు వాడు.’’  అన్నాడు.
‘‘అవును. సమయానికి వాడి ఫోన్‌ దొరకటం ఇట్లా వెళ్ళిరావటం మంచిదే అయింది. వాడిని చూశాక తృప్తిగా వుంది’’ అన్నాడు రమేష్‌.
‘‘వాడు ఏదో కష్టాలు పడుతున్నాడు. సాయం చేద్దాం అనుకున్నాం. వాడికేం. మహారాజు’’ అనుకున్నారు. 
- పొత్తూరి విజయలక్ష్మీ

మరిన్ని వార్తలు